భావన
భావన
సీసమాలిక./
భావనా వనములో పరిమళించె నిదిగో
కవితా సుమ మిపుడు కలలు తీర్చ
మానస రాయంచ మత్తులో మునగంగ
విస్మరించితి భువిన్ విధులు మరచి
తనువులో నూతన తళుకులు విరజిమ్మ
కనులలో నిండార కాంతి యెగసె.
నూహల నూయల నూగుచు విహరించ
జ్ఞాపకాల తెరలు జారి పోయె.
కొరత లేవియు లేనట్టు కోర్కెలు తీరంగ
చిన్ననాటి వయసునా చెంత చేరె.
మందహాసమొకటి ముందుగా నుదయించి
మరిచిపోతివనుచు మాటకలిపె.
కూని రాగ మపుడు గొంతులో తారాడి
కుహుకుహు మని పాడె క్రొత్త పాట.
చిలిపి యల్లర్లు చెంగు చెంగున దూకి
ముసురు చుండ మనసు మూగదాయె
కనులలో నుబికింది కన్నీరు వెచ్చగా
బుగ్గపై జారగా పొద్దు పొడిచె.
తేటగీతి /
ఫలితకేశములబిగించి బట్టి లేచి
పగటి వెలుగును గాంచితి దిగులు మరచి
ముదిమి వయసులో బాల్యపు ముచ్చటలను
తల్చుకొన్నచో మదిలోని తాపముడుగు.//
