Rama Seshu Nandagiri

Drama

2  

Rama Seshu Nandagiri

Drama

వర్షాకాలంలో సాయంత్రం

వర్షాకాలంలో సాయంత్రం

2 mins
124


చిరు చిరు జల్లులు కురిసే వేళ

చల్లని గాలులు మెల్లగ వీచే వేళ

కరి మబ్బులు నింగిని తిరిగే వేళ

బాల్యం లో మది నడయాడే వేళ

హద్దులు లేని అల్లరి చేసిన రోజులు

మిత్రులతో వర్షం లో ఆడిన రోజులు

పెద్దలు పెట్టే ఆంక్షలు మీరిన రోజులు

తిరిగి రాని మన బంగారు రోజులు


        బైట వర్షం పడుతూంది. సాయంకాలం ఆహ్లాదంగా ఉంది. కానీ బైటికి వెళ్ళే అవకాశం లేక కాగితం మీద మనసుకు వచ్చిన పదాలు ఏవో గిలుకుతూండగా మా ఆవిడ మాటలు గట్టిగా వినపడ్డాయి. ఏమైందిరా బాబూ, అనుకుంటూ బైటికి వచ్చేసరికి ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ కోపంగా చూస్తున్న మా అబ్బాయి రాహుల్, అంతకు మించిన కోపాన్ని ప్రదర్శిస్తూ అరుస్తున్న మా ఆవిడ జయ హాల్ లో కనపడ్డారు.


"ఏమిటి జయా, ఏమైంది? వాడిపై ఎందుకు అరుస్తున్నావ్?" ఏం జరిగిందో తెలుసుకోవాలని అడిగాను.


"అడగండి, మీ సుపుత్రుడిని. నన్నెందుకు అడుగుతారు." ఏమాత్రం తగ్గని కోపంతో అంది.


"ఏమైంది నాన్నా, ఏం చేశావ్?" అనునయంగా అడిగాను మా అబ్బాయిని.


"అది కాదు డాడీ, మా టీచర్ మమ్మల్ని 'వర్షం తో మీ అనుభవం' అని ఒక వ్యాసం తెలుగు లో రాయమన్నారు. నేనింత వరకు వర్షంలో ‌తడవలేదంటే, ఇప్పుడు తడిసి తెలుసుకో, అన్నారు. వర్షం పడుతోందిగా ఒకసారి వర్షం లోకి వెళ్తానంటే మమ్మీ వద్దంటోంది." ఏడుపు‌ గొంతు తో అన్నాడు రాహుల్.


"ఏం, ఎప్పుడూ తడవ లేదూ. తడుస్తూనే ఉంటావు గా. కొత్తేముందీ, అదే రాయి." కోపంగానే అంది జయ.


"అప్పుడు ఎప్పుడూ నేను ఎంజాయ్ చేయ లేదు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ, ఫీల్ అవుతూ తడిసి రాయాలని డాడీ." రాహుల్ ‌రిక్వెస్టింగ్ గా అడిగాడు.


నాకు వాడి కోరిక సరైనదే అన్పించింది. జయ భుజం మీద చెయ్యి వేసి "చూడు జయా, వాడు అన్న మాటలో తప్పేముంది. వాడ్ని ఎంజాయ్ చేసి ఆ వ్యాసం రాయనీ." అనునయంగా చెప్పాను.


"మీకేం, మీరు అలాగే అంటారు. తర్వాత జ్వరం, జలుబు ‌అంటూ స్కూల్ ఎగవేస్తే‌ ఎవరికి నష్టం." జయ గొంతులో ఇంకా కోపం తొంగి చూస్తోంది.


"రాహుల్ నువ్వెళ్ళు, కానీ ఎక్కువ టైం వేస్ట్ చేయకు, సరేనా." అన్నాను రాహుల్ తో.


"ఓకే డాడీ, థాంక్యూ.' అంటూ బైటికి పరుగెత్తాడు.


జయ వైపు చూసాను. చాలా కోపంగా ఉంది.

"ఏమిటి జయా, ఇంత చిన్న విషయానికి అంత రాద్ధాంతం చేస్తున్నావ్." భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు లాక్కొని ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టాను.


గుండెలపై తలవాల్చి "ఆ మాత్రం హడావుడి చేయకపోతే వాడికి భయమే ముంటుంది" అంది నవ్వుతూ.


"అమ్మ దొంగా, ఆ కోపమంతా నాటకమా." అన్నాను ఆశ్చర్యంగా.


"మరి. నిజమనుకున్నారా. మనం చిన్నప్పుడు వానలో తడుస్తూ ఎంజాయ్ చేసిన వాళ్ళమేగా. ఆ రోజులు మర్చిపోగలమా." ఆ రోజుల్ని గుర్తు కు తెచ్చుకుంటూ ఆనందంగా కన్నుల్లో నీరు నింపుకుంది.


"పిచ్చి పిల్లా." అంటూ కళ్ళు తుడిచి తన చేతిలో నేను రాసిన కాగితం పెట్టాను.


అది చదువుతూనే నన్ను ఆనందంతో హత్తుకు పోయింది.

"ఎంత బాగా ఆ రోజుల్ని గుర్తు కు తెచ్చారు. ఏమన్నా రాశారా!" అంటూ నా నుదుటి పై ముద్దు పెట్టింది.


ఇంతలో రాహుల్ లోపలికి వచ్చి "డాడీ, నాకు

ఐడియా వచ్చింది. నేను వ్యాసం రాయగలను.

థాంక్యూ డాడ్ అండ్ మామ్." అంటూ తన రూం లోకి పరుగెత్తాడు.


"నాన్నా, బట్టలు మార్చుకో. లేకపోతే ‌జలుబు చేస్తుంది." అంది జయ వాడినుద్దేశించి.


"ఓకే మామ్." అన్నాడు రాహుల్ తల రూం లోంచి బైటికి పెట్టి నవ్వుతూ.


జయ, నేను మరోసారి చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకుని మనసారా నవ్వుకున్నాం.



Rate this content
Log in

Similar telugu story from Drama