Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Kanthi Sekhar

Drama


3.8  

Kanthi Sekhar

Drama


ఊపిరి

ఊపిరి

3 mins 424 3 mins 424

"దేవుడు ప్రతి ప్రాణి కి ఆయుష్షు ని తాను పీల్చి వదిలే శ్వాసల లెక్కలో ఇస్తాడట. ఆ లెక్క అయిపోతే ఆయువు తీరిపోయినట్టే. " టీవీ లో వచ్చే ప్రవచనం వింటూ వంట కి కూరలు తరుగుతున్నాను. పాలు పొంగిన వాసన వస్తుంటే ఓపిక లేకపోయినా కుదిరినంత వేగంగా వంటింట్లోకి వెళ్లి స్టవ్ కట్టేసి స్టవ్ కడగటంలో లీనం అయిపోయాను. 

"పొద్దున్నే ఆ ఉపన్యాసాలు ఏమిటి. ఇరవై లో అరవై లాగా... పనులు కూడా అంతే.. పాలు పొంగుతుంటే కట్టేయాలని కూడా తెలీదా... బెడ్ రూమ్ లోకి వాసన వచ్చింది. టీపాయ్ మీద కూరలు తరగకు అని ఎన్ని సార్లు చెప్పాలి.. కట్టర్ అలాగే వదిలేస్తావ్. కడిగి పెట్టాలని కూడా నేను చెప్పాలా.. మీ అమ్మ ఏమి నేర్పి పంపించింది..." శ్రీవారి అరుపులు విన్నా విననట్టు కాఫీ కలిపి టీపాయ్ దగ్గరకి తీసుకెళ్లి పెట్టాను. కట్టర్, తరిగిన కూరగాయలు అందుకుందామని.

" కాఫీ చేతికి ఇవ్వాలని కూడా తెలీదా" నా చేతులు వణకటం నన్ను ఉరిమి చూస్తున్న ఆయనకి తెలీదా??? తెలిసినా పట్టించుకోవట్లేదా..

"సారీ. జ్వరం తగిలినట్టు ఉంది. నిద్ర లేదు రాత్రి కూడా. టీవీ పెట్టుకుని పని చేసుకుందామని..." చిన్నబుచ్చుకుని సమాధానం చెప్పాను. అవేమీ ఆయనకు పట్టవు అని తెలిసినా.

"నేను వెళ్ళాక నీకు ఇంకా ఏమి పని ఉంటుంది... పడుకోవటమే కదా." ఇవన్నీ వింటూ నిల్చోవటానికి మనసు శరీరం రెండూ సహకరించట్లేదు. లంచ్ బాక్స్ సర్దడానికి అని మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయా. కడుపు ఖాళీగా ఉండటం తో తలనొప్పి నీరసం ఇంకా ఎక్కువ అయ్యాయి. ఆయనతో పాటు నాకు కూడా కలుపుకున్న కాఫీ కప్ నన్ను జాలిగా చూస్తున్నట్టు అనిపించింది, గ్యాస్ స్టవ్ ఉన్న గట్టు మీద.

"నా సాక్స్ ఎక్కడ పెట్టావు... కాఫీ తాగిన కప్ టీపాయ్ మీద అలాగే ఉంది.. కడిగి లోపల పెట్టచ్చు కదా... బ్రేక్ఫాస్ట్ బాక్స్ లో పెట్టేయి. వద్దులే. నేనే టేస్ట్ చూసి పెట్టుకుంటా నా అదృష్టం బాగుంటేనే అన్నీ సరిగ్గా పడతాయి లేకపోతే ఆఫీస్ లో షేర్ చేస్తే నా పరువు పోతుంది. పొద్దున్నే లేస్తావు కదా కాస్త స్నానం చేసి ఉండచ్చు కదా.. పొద్దునే జిడ్డు మొహం తో ఉంటావు రాత్రి కూడా అంతే... నేను వచ్చాక సింగారించుకుంటావ్. ఉద్యోగమా సద్యోగమా... ఏమి రాచకార్యాలు ఉంటాయి నేను వెళ్ళాకా..." విసుక్కుంటూనే ఆఫీస్ కి తయారై బయల్దేరారు.

టీవీ షోకేస్ దగ్గర తన బైక్ తాళాలు నన్ను వెక్కిరించాయి. తనకి రింగ్ ఇవ్వటానికి ఫోన్ తీసుకోవటానికి రూమ్ లోకి వెళ్లాలంటే లేట్ అవుతుంది అనుకుంటూ చకచకా లిఫ్ట్ దాకా నడిచా. .. కరెంటు లేనట్టుంది. "జనరేటర్ పని చేయట్లేదమ్మా. .. "వాచ్మాన్ నిన్న అన్న విషయం గుర్తొచ్చింది. రెండు ఫ్లోర్ లు దిగాలి. పది మెట్లు దిగానో లేదో అసహనంగా ఎదురయ్యారు తను. "నైటీ తో కిందకి రావద్దని ఎన్ని సార్లు చెప్పా.. పని మనుషులు నీట్ గా ఉంటారు నీ కంటే." బైక్ తాళాలు అందుకుని విసురుగా వెళ్లిపోయారు.

కాఫీ మళ్ళీ వేడి చేసుకున్నా కానీ తాగాలన్పించలేదు. ఇల్లు ఒక కొలిక్కి తెద్దాం అని ఓపిక తెచ్చుకుని లేచా నాలుగు ఇడ్లిలు తిన్నా అనిపించి. చదివి వదిలేసిన న్యూస్ పేపర్, మూత తీసి వదిలేసిన షూ పోలిష్ డబ్బా... తల తిరగటం ఎక్కువ అయింది. షో కేసు క్లీన్ చేసి ఫ్రెష్ అవుదాం అని అలాగే పని మొదలుపెట్టాను.పెళ్ళికి ముందు ఆఫీస్ క్యాంపు వెళ్ళినప్పుడు కలిసి దిగిన ఫోటోలు..తుడవడానికి చేతిలోకి తీసుకున్నా... .చేతిలో చేతులు కలిపి ...కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ. .అప్పుడు ఆయన కళ్ళలో ఉన్న ప్రేమ ఇప్పుడు? ?? నా వొళ్ళు నా కంట్రోల్ తప్పిపోయింది. సోఫా లో కూలబడ్డా. ఏవో ఆలోచనలు. బెస్ట్ ఎంప్లాయ్ మొమెంటో. ..రెండేళ్ల క్రితం నేను అందుకున్నది. .దుమ్ము పట్టినట్టు. .మా బంధం లాగేనా? ? ఏడాది క్రితం మొదటి సారి తిరుపతి వెళ్లిన ఫోటో. .అమ్మా నాన్నా నేను తను. .. తర్వాత కొన్నాళ్లకే ఒక ప్రమాదం లో నాన్నని నా కడుపులో బిడ్డని ఒకేసారి పోగొట్టుకున్నా. మళ్ళీ తల్లిని అయ్యే అవకాశాన్ని కూడా.

తనకి ఫోన్ చేద్దాం అన్నా ఓపిక రావట్లేదు రూమ్ దాకా నడవాలన్నా. అలాగే కళ్ళు మూతలు పడిపోయాయి. కడుపులో ఎదో తిప్పినట్టయి మెలకువ వచ్చింది. భళ్ళున వాంతి వచ్చేసింది. పట్టటానికి తన చేతులు కనపడేసరికి తెముల్చుకోబోయా. " ఫోన్ చేస్తే తీయట్లేదు. నా దగ్గర ఇల్లు డూప్లికేట్ కీ ఉంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు పనులు ఎవరు పెట్టుకోమన్నారు. లేవకులే కానివ్వు." మాటల్లో ఎప్పటిలాగే కోపం.ఈ సారి అందులో ప్రేమ కనపడింది. వొళ్ళు ఎందుకో తేలిక ఐంది. ఫ్రెష్ అవాలని లేచాను. రూమ్ లో ఫోన్ చూసుకుంటే తన మెసేజ్. " డల్గా ఉంటున్నావని నార్మల్ గా ఉండట్లేదని కోప్పడుతున్నా కానీ నువ్వంటే ఎప్పుడు నాకు ఇష్టమే రా. నువ్వే నా ఊపిరి. మీటింగ్ టెన్షన్ లో ఉన్నా పొద్దున్న. తిన్నావా ఏమైనా "

ప్రేమని వ్యక్తం చెయ్యటమే బంధానికి ఊపిరి. కొందరికి అది తెలియకే చాలా కుటుంబాలు విడిపోతున్నాయి. ఆలస్యంగా అయినా ఆయన అది అర్ధం చేసుకున్నందుకు మనసు కూడా తేలిక పడింది. 


Rate this content
Log in

More telugu story from Kanthi Sekhar

Similar telugu story from Drama