POLAVARAPU PUSHPAWATI

Drama Classics Inspirational

4  

POLAVARAPU PUSHPAWATI

Drama Classics Inspirational

నాణానికి మరోవైపు

నాణానికి మరోవైపు

7 mins
268


"అబ్బబ్బ ఈవిడ గారు ఎప్పటికి మారదు. ఇలాంటి వారిని వృద్ధాశ్రమంలో పడేస్తే తప్పేంటంట. కొడుకు కోడలు మంచివాళ్లు కావడమే ఈవిడ ఆటలు సాగుతున్నాయి సుమీ "అంటు ఎదురుగా కాఫీ కప్పుతో పాటు,సదరు నుగుడు గొనుక్కుంటూ వచ్చిన భార్య, వసుమతి వైపు ఆశ్చర్యపోతూ చూశారు రామారావు గారు.

"ఏమిటోయ్ ఎవరిమీద తెల్లవారగానే ఈ దండయాత్ర. అయినా నువ్వేంటి ఎవరినో వృధాశ్రమంలో పంపించేస్తే మంచిది అంటున్నావు. మొన్ననే కదా వృధాశ్రమానికి మనం వెళ్లేటప్పుడు అక్కడ ఉన్న తల్లుల్ని చూసి వాళ్ళ కొడుకుల్ని తెగ ఆడిపోసుకున్నావు. అంతలోనే ఏమయిందంట? నీ అభిప్రాయం మార్చుకున్నావు" అన్నారు కాస్త నవ్వుతూ రామారావు గారు.

      "అయ్యోఅయ్యో తప్పు తప్పు మీరు పొరపడుతున్నారు,నా అభిప్రాయం ఇప్పటికి మారలేదు. అమ్మని అనాధని చేయడం ఎట్టి పరిస్థితిలోనూ హర్షించదగ్గది కాదుకదా. కన్నవాళ్ళు అనే ఒకే ఒక్క కారణం చాలు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవడానికి. కానీ నాణానికి మరోవైపు కూడా ఉంటుంది కదా? తల్లితండ్రులు తన పిల్లలందరినీ సమానంగా చూడాలి కదా. అందరి అభివృద్ధి కోరుకోవాలి కదా? కానీ, మా పిన్ని ఏంటండీ, ఒకరి అభివృద్ధి కోసం మరొకరి జీవితాన్నె ఆహుతి చేసేసింది. ఇలాంటి వారి గురించి ఏమనాలి.

"ఓహో మీ పద్మ పిన్ని గారి గురించా? అయితే నువ్వు అలా అనడంలో తప్పేమీ లేదు. వెంటనే రామారావు గారు భార్య అభిప్రాయంపై సహమతి ముద్ర వేశారు. ఏదో అనబోతు స్టవ్ మీద పెట్టిన పాల గిన్నె గుర్తుకు వచ్చి వసమతి వంటగదివైపు పరుగు తీసింది.

రామారావు గారు మాత్రం ఆ కాఫీ తాగుతూ తన చిన్న అత్తగారు పద్మ ప్రవర్తనపై ఆలోచించకుండా ఉండలేకపోయారు.

ఒక్క పద్మే కాదు ఈ కలియుగంలో పద్మలాంటి వింత తల్లులు ఎంతోమంది. వాళ్లు మగ బిడ్డ పుట్టినప్పుడు చాలా ఆనంద పడతారు. మగ బిడ్డ తన సర్వం అనుకుంటారు. కానీ పెద్ద అయినాక వాళ్ళ ప్రేమాభిమానాలు పూర్తిగా కూతుర్ల వరకే పరిమితం అయిపో తున్నాయి. కోడళ్ళు వచ్చాక ఆ పిచ్చి పరాకాష్టకు చేరుకుంటుంది.

అహర్నిశలు కూతుళ్ళ సుఖసంతోషాల గురించి తపించిపోతూ కొడుకు కోడళ్ళ సంసారాలను వీధిపాలు చేసిన పద్మలాంటి అమ్మలు ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు మనకు.

అత్తగారిని అమ్మలా చూసుకోవాలి అనుకునే కోడళ్ళకి ఆ అవకాశమే ఇవ్వని పద్మ లాంటి అత్తగార్లు లేకపోలేదు. వాళ్ల గురించి ఏమనుకోవాలి? ఇది ఒక అర్థం కాని సవాల్.

రామారావుగారి ఆలోచనలన్నీ పద్మ కొడుకు రాఘవ చుట్టూ తిరగసాగాయి. ఎంతో తెలివితేటలతో చదువులో చురుగ్గా ఉండే రాఘవ ఆఖరికి ఒక కూలివాడిగా మిగిలిపోవడం ఆయనకు బాధ కలిగించింది. రాఘవ తండ్రి శ్రీను,అనగా పద్మ భర్త ఓ ప్రైవేటు కంపెనీలో చిరు ఉద్యోగి. రాఘవ ఇంటర్ సెకండియర్ లో ఉండగా దుర్ఘటనలో శ్రీను మృత్యువాత పడ్డాడు. కుటుంబ పెద్ద పోయేసరికి కుటుంబం చిక్కుల్లో పడింది. ప్రైవేటు కంపెనీ అయినప్పటికీ యూనియన్ వాళ్ల సహాయ సహకారాలతో తండ్రి యొక్క ఉద్యోగము రాఘవ కి ఇవ్వడానికి కంపెనీ ఒప్పుకుంది.

బాగా చదువుకొని కాలేజీ లెక్చరర్ అవ్వాలని తన లక్ష్యాన్ని పక్కన పెట్టి రాఘవ ఆ చిరు ఉద్యోగములో చేరాడు. అమ్మ పద్మ ,చెల్లెలు లత యొక్క బాధ్యత తన లేత భుజస్కంధాలపై తీసుకున్నాడు.

అలా తన చదువుకి స్వస్తి చెప్పి చెల్లిని డిగ్రీ వరకు చదివించాడు. చెల్లికి పై చదువులపై ఆసక్తి లేకపోవడంతో ఓ మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

అదే కంపెనీలలో పనిచేసే రమేష్ రాఘవకి స్నేహితుడు. సత్ప్రవర్తన గల రమేష్, అంటే రాఘవకి మంచి అభిప్రాయం. పైగా ఎటువంటి దురలవాటలు లేని అబ్బాయి. కట్న కానుకలకు కూడా ఆశపడనివాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రమేష్ కి కూడా రాఘవ చెల్లి, లత అంటే ఎంతో ఇష్టం. అది తెలుసుకున్న రాఘవ,అన్ని విధాలా రమేష్, లతకి ఈడైన వాడు. తన తాహాతకి తగిన వాడు గనక లతకి రమేష్ తో పెళ్లి చేయడం అన్ని విధాలా శ్రేష్కరం అనుకున్నాడు.

అదే మాట అమ్మ పద్మతో ప్రస్తావించాడు. వెంటనే పద్మ వంటి కాలు మీద లేచింది.""నీలాంటి అరాకురా జీతగాడికి ఇచ్చి దాని గొంతుకు కోసేస్తావా? ఇక్కడ మనింటిలో ఎలాగూ ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఉంది. కనీసం అత్తారింటిలోనైనా సుఖపడని. ఎలాగైనా దానికి ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాల్సింది", అని కరాకండిగా చెప్పింది. చెల్లి కూడా అమ్మ కోరుకున్నట్టే కావాలంది. రమేష్ మనసు చివక్కమంది. తను అరాకురా జీతగాడు అయినా పరవాలేదు ,అల్లుడు మాత్రం పెద్ద ఉద్యోగి అయి ఉండాలి, అమ్మ ఇలా పక్షపాతంగా ఎలా ఆలోచిస్తుంది అనుకున్నాడు.

అయితే వాళ్ళిద్దరూ కోరుకునే దాంట్లో తప్పేమీ లేదు కానీ తలకి మించిన బాగా చుట్టుకోవడం ఎలా. ఎటు పాలు పోలేదు రాఘవకి. ముందు నుంచి ఎంతొకొంత పొదుపు చేయాలన్నా వీలుపడలేదు. ఎందుకంటే అమ్మ ఎప్పుడు చెల్లి విషయంలో రాజీ పడలేదు. బట్టలు గాని నగలు గాని ఖరీదైనవి కొనాలిసిందే. రాఘవ కూడా ఎప్పుడూ వాళ్ళని తప్పు పట్టలేదు. కాని ఇప్పుడు కింకర్తవ్యం.

ప్రభుత్వ ఉద్యోగీ ని అల్లుడుగా తెచ్చుకోవాలంటే లక్షలతో కూడిన వ్యవహారం. తన సంపాదన, ఇల్లు గడవడానికే సరిపోతుంది. ఒకవేళ అప్పు చేయాలేమో.

రాఘవకి ఏం చేయాలో పాలు పడలేదు. ఆఖరికి ఏకైక ఆస్తి తన తాతల నాటి ఇంటిని కుదువ పెట్టి ఐదు లక్షలు అప్పు తెచ్చి చెల్లి పెళ్లి ఘనంగా జరిపించాడు.

      అంత అప్పు తీర్చడం సాధ్యమా? ఇల్లు చేజారి పోతుందేమో నిలువ నీడ లేకుండా అయిపోతామేమో అన్న భయం పట్టుకుంది రాఘవాకి. ఈ చిన్న ఉద్యోగంతో అంత డబ్బు సమకూర్చడం ఆకాశ కుసుమమే. అయినా ఆశ విడనాడలేదు. కొన్ని ఖర్చులైనా తగ్గించి డబ్బు వెనక వేయాలని అనుకున్నాడు. కానీ అతనికి ఆ అవకాశం కూడా దక్కలేదు.

చెల్లి వట్టి మనిషి కాదని కబురుంది. ఇంకా అంతే పద్మ ఒకటే హడావిడి. హడావిడి చేయడం తప్పు కాదు కాకపోతే ఖర్చులే తాహతకు తగ్గట్టు చేసుకోవాలి. కూతురికి మూడో నెల కలిసిన వెంటనే అత్తారింటిలో పనులు చేయబడతాయని తీసుకొచ్చేసింది పద్మ. అది మొదలు హాస్పిటల్స్ అని మందులని రకరకాల టానికులని ఒకటే ఖర్చులు. రాఘవకి అప్పు చేయక తప్పేది కాదు.

పోనీ అలా డెలివరీ వరకే ఉంటుందేమో కదా అనుకున్నాడు. కానీ అలా జరగలేదు ఏడవ నెల కలవగానే శ్రీమంతం చేయాలి, అంటూ చెల్లికి అత్తారింటిలో దిగబెట్టి రమ్మంది అమ్మ. ముందే అప్పుల్లో ఉన్నాము. శ్రీమంతం మన తాహాతకి తగ్గట్టు చేద్దామంటే అమ్మ మళ్ళీ విరుచుకుపడింది.

        "మన దరిద్రాన్ని దాని అత్తారింటిలో కూడా డప్పు కొట్టి చెప్పుకుంటామా? శ్రీమంతం ఘనంగా జరపాల్సిందే"అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది పద్మ.

        అప్పు ఇవ్వడానికి ఇంటిని అడ్డుపెట్టుకున్న సావుకారి ఉండనే ఉన్నాడు. అమ్మ కోరిక మేరకు ఘనంగానే జరిపించాడు శ్రీమంతం బంగారు గాజులతో.

        చెల్లికి బాబు పుట్టాడు. డెలివరీ ఖర్చులు బాలసార ఖర్చులు ఇలా ఎక్కడ పద్మ రాజీ పడలేదు. లతా కలవారి కోడలు, అన్ని వాళ్ళకి తాతకి తగ్గట్టే జరగాలి లేదంటే అత్తారింటిలో కూతురికి చిన్న చూపు చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకి ఆ అవకాశం ఇవ్వడానికి వీల్లేదు అనేది పద్మ తర్కం.

        రాఘవకి చాలా విచిత్రంగా అనిపించేది"అమ్మ పొరపాటున కూడా కొడుకు గురించి గానీ, అతని భవిష్యత్తు గురించి గానీ ప్రస్తావించదేంటి అని అప్పుడప్పుడు మనసులో బాధపడేవాడు. మేనల్లుడిని చూసి తన కష్టాలను కాస్త మరిచిపోయేవాడు.

        బాబుకి మూడోనెల రాంగానే లతా అత్తవారు లతని తీసుకువెళదామని వచ్చారు. కానీ పద్మ కూతురిని చంటి పిల్లాడి తో చేసుకోవడం కష్టం అని పంపలేదు.

        దానితో లతా అత్తగారు మనవడికి చూడకుండా ఉండలేను అంటూ రాఘవ ఇంటిలోనే తిష్ట వేసింది. లతా భర్త కూడా కొడుకును చూసుకునే వంకతో తరచూ అత్తారింట్లోనే ఉండడం మొదలుపెట్టాడు. వియ్యంకుల వారికి సాదాసీదా భోజనాలు పెట్టలేరు కదా. ప్రతిరోజు మర్యాదలకి రాఘవ సంపాదన చాలేది కాదు. అప్పు తేవటం తప్ప మరో మార్గం ఉండేది కాదు రాఘవకి.

        వాళ్ల మనవడికి వాళ్ళింటికి పంపించొచ్చు కదా అనుకుండేవాడు మనసులో కానీ పైకి అమ్మతో అనే ధైర్యం ఉండేది కాదు. ఆఖరికి 11వ నెల పూర్తి అవుతుందనగా, బాబు పుట్టినరోజు "మా ఇంటిలో జరుపుకుంటామని" బావగారు పట్టుపడితే ఇక తప్పదు అని ఉసూరమంటూ కూతుర్ని పంపించింది పద్మ. కూతుర్ని మనవడిని సాగనంపటానికి కూడా మామూలుగా ఖర్చు పెట్టించలేదు పద్మ.

        రాఘవ తల పైన పాగా హద్దులు దాటిపోయింది. ఇంతలోనే మరో గ్రహచారం. పద్మకి జబ్బు చేసింది. రాఘవకి అప్పే శరణ్యమయింది. కనీసం ప్రైవేటు గానైనా చదువు కొనసాగించి తన కళ నెరవేర్చుకుందామంటే, ఈ అప్పుల గోలలో ఆ కల కాస్త కనుమరుగైపోయింది.

        కూతురి మంచి గురించి అహర్నిశలు ఆలోచించే పద్మ తన కొడుకు పెళ్లి వయసు దాటి పోతుందని మాత్రం ఎన్నడూ ఆలోచించలేదు. కానీ మంచి కోరే స్నేహితులు ఉంటారుగా. అటువంటి స్నేహితుల బలవంతం పైన తనకి అన్ని విధాలా సరితూగిన స్నేహితుడు రాజా చెల్లెలు రమణిని పెళ్లి చేసుకున్నాడు.

       పెళ్లయిన ఏడాదికి రమణి ఓ పాప ని జన్మనిచ్చింది. కన్నకూతురు గర్భం దాల్చినప్పటి పద్మ దృష్టి కోణం కోడలు రమణి విషయంలో పూర్తిగా భిన్నంగా ఉండేది . నెలలు నిండే వరకు రమణికి కన్నవారింటికి పంపలేదు. కోడలు వెళ్లి అమ్మగారి ఇంటిలో కూర్చుంటే ఇక్కడ చాకిరి ఎవరు చేస్తారు అనేది. బిడ్డ పుట్టిన నెల్లాలకే మళ్లీ తీసుకొచ్చేసింది. పచ్చి బాలింతరాలైన రమణి చేతే అన్ని పనులు చేయించేది పద్మ.

          అంతలోనే లతా రెండో కాన్పుకి వచ్చింది. కూతురు నెల తప్పిందని తెలిసిన వెంటనే వెళ్లి తీసుకుని వచ్చేసింది పద్మ. మళ్లీ వ్యవహారం మొదటికే వచ్చింది. చెల్లి తిరిగి పాపతో తన అత్తారింటికి వెళ్లేసరికి ఇంటి పైన అప్పు 10 లక్షలు దాటేసింది. రాఘవ తల పైన పాగా కొండగా మారిపోయింది. ఇల్లు ఇక చేజారి పోయినట్టే అని తెగ కుమిలిపోయాడు రాఘవ.

       రాఘవ బాధ చూసి అతని మేలుకోరే బంధువులు కొంతమంది సలహా ఇచ్చారు"ఎలాగూ అంత అప్పు తీర్చడం నీవల్ల కాదు అందుకే ఈ పెద్దఇంటిని బేరం పెడితే అప్పు తీరగా మిగిలిన సొమ్ముతో ఏదైనా చిన్న ఇల్లు తీసుకుంటే కనీసం రోడ్డు మీద పడకుండా ఉంటావు," అని. అది కరెక్ట్ అనిపించింది రాఘవకి. ఇల్లు బేరం పెట్టాడు. అప్పు ఇచ్చిన షావుకారే 15 లక్షల కి బేరం కుదుర్చుకున్నాడు. బయటకు అమ్మితే ఇంకా ఎక్కువ సొమ్ము చేస్తుంది కానీ తప్పదు ముందే తన పిలక షావుకారి చేతిలో ఉంది గనక.ఎలాగైతేనే అప్పు తీరిపోతుంది కదా అనుకున్నాడు. మిగులు ఐదు లక్షలతో ఇల్లు కొనాలని ఓ చిన్న ఇల్లు కూడా వెతికి ఉంచుకున్నాడు. తన ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతే అప్పుడు కొత్త ఇంటికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనుకున్నాడు. కానీ దురదృష్ట దేవత అమ్మ రూపంలోనే రాఘవకి వెంటాడుతుంది.

       రేపు రిజిస్ట్రేషన్ అనగా ముందు రోజే పద్మ అడ్డు పుల్ల వేసింది. తాతల నాటి ఆస్తి కదా ఆడపిల్లకి వాటా ఇవ్వకపోతే ఎలా అని. రాఘవ నిర్గాంతపోయాడు,"అసలు ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో అమ్మకి తెలియదా? అమ్మేంటి ఇలా వ్యవహరిస్తుంది. ఇప్పుడు గనక తను ఆ చిన్న ఇల్లు తీసుకోలేకపోతే అరాకురా సంపాదనతో ఈ జన్మకి ఇల్లు కొనగలడా? అమ్మ అసలు నా గురించి ఆలోచించదా? అని మనసులోనే మదన పడ్డాడు.

       విషయం తెలిసిన ఇరుగుపొరుగు వాళ్ళు కూడా పద్మ పై కోపగించుకున్నారు."అమ్మాయి పెళ్లి వళ్ళనే కదా ఈ పరిస్థితి వచ్చింది. మళ్లీ అమ్మాయికి ఏంటి వాటా? అమ్మాయికి వాటా ఇస్తే మిగిలిన సొమ్ము ఎందుకు చాలదు కదా అని పద్మని నిలదీశారు. నచ్చజెప్ప బోయారు.

       పద్మ ఏమన్నా తక్కువ తిన్నదా--"అది వాడి బాధ్యత దానికి దీనికి ముడి పెడతారేంటి"అని వాళ్ళ మీదే కస్సుమంది. చేసేది లేక అమ్మ చెప్పింది వినక తప్పలేదు.

       చెల్లికి ఓ లక్షన్నర, అమ్మ పేరున ఓ లక్ష బ్యాంకులో వేయడానికి ఒప్పుకున్నాకే అమ్మ సంతకం పెట్టింది. ఎటుకి చాలని మిగిలిన రెండు లక్షలతో ఒక చిన్న ఇంటిని బావుబంధగా తీసుకున్నాడు. అంటే డబ్బుకి వడ్డీ లేదు ఇంటికి అద్దె లేదు అన్నమాట. పోనీలే నెలనెలా అద్దె డబ్బులు దేవుకోనక్కర లేదు అనుకున్నాడు. ఇది కూడా ఓ స్నేహితుని సలహా మేరకు చెయ్యగలిగాడు. లేకపోతే ఆ డబ్బు కూడా ఉంటే ఏదో విధంగా పద్మ ఖర్చు పెట్టించేసేదేమొ.

       ఉన్నదాంట్లోనే ఏదో విధంగా సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు రాఘవ మరో పాపకి తండ్రి కూడా అయ్యాడు. సహకారం లేకపోయినా భార్య సహకారం నిండుగా ఉండేది రాఘవకి. ఇంత జరిగినా రమణి, అత్తగారిని ఎప్పటిలాగే చూసుకోవడం సంభ్రాశ్చర్యం కలిగించేది రాఘవకి. తిరిగి పద్మ ఈ దుర్దినాలకి రమణీయె కారణం అన్నట్టు ఆడిపోసుకుంటూ ఉండేది.

       రాఘవకి భగవంతుడు పెట్టే పరీక్షలు ఇంకా పూర్తిగా కాలేదేమో, అందుకేనేమో మాయదారి మహమ్మారి కొరోనా వచ్చి పడింది. రాఘవ పనిచేసే కంపెనీ మూతపడింది. ఓ రెండు నెలలు ఏదో విధంగా నెట్టుకొచ్చాడు. ఇక లాభం లేదు భార్యకి తల్లికి పిల్లలకి కనీసం కడుపునిండా భోజనం పెట్ట లేకపోతే ఎలా అనుకున్నాడు. లాక్ డౌన్ రెండోవ రౌండ్ సడలింపుతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అక్కడక్కడ భావన నిర్మాణ పనులు,వడ్రంగి పనిలు, ఉపాధి హామీ పనులు ఆరంభించ బడ్డాయి. మరో మార్గము లేక చిన్ననాటి స్నేహితుడు సునీల్ తో పాటు వడ్రంగి పనికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఆ పని రాకపోయినా సహాయం చేసే ఉద్దేశ్యంతో తనని సునీల్ పని నేర్పుతూనే ఎంతో కొంత పైకం ఇచ్చేవాడు. ఎలాగో ఇల్లు గడవాలిగా మరి.

       ఉన్నత చదువులు చదువుకొని కాలేజీ లెక్చరర్ అవ్వాలనుకున్న రాఘవ సొంత ఇల్లును కూడా కోల్పోయి ఓ కూలివాడిగా మిగిలిపోయాడు.

" ఏంటండీ ఆ దీర్ఘాలోచన,"వంట గదిలో పని చెక్కపెట్టుకొని భర్త దగ్గరకు వచ్చి కూర్చుంటూ అన్నది వసుమతి.

"అదే మీ పద్మ పిన్ని చేసిన నిర్వాకము ,వల్ల రాఘవ కోల్పోయిన జీవితం గురించి ఆలోచిస్తున్నాను" అన్నారు రామారావు గారు

"మీకు ఇంకో విషయం తెలుసా ఆమె పేరిట ఉన్న లక్ష కొడుకుకి ఇవ్వాల్సి వస్తుందేమోనని , కూతురి ఇంటికి వెళ్లి కూర్చుంది, అక్కడ ఇంకేమి నిప్పు రాజేస్తుందో మా పిన్ని. అంది వసుమతి దిగులుగా.

       "నిజమే సుమీ,ఇప్పుడు అనిపిస్తుంది వృద్ధాశ్రమాలు తప్పయినప్పటికీ మీ పద్మ లాంటి వాళ్లకి అవే కరెక్ట్, అని సెలవిచ్చారు రామారావు గారు.

        ఏంటండి, మీరు మరీను,రాఘవ బాధలను తలుచుకుని వృద్ధాశ్రమాల గురించి ఏదొ వాగేను దానిని మీరు సపోర్ట్ చేస్తారేంటి,". వృద్ధాశ్రమాల గురించి ఎప్పుడైనా పాజిటివ్గా ఉండొచ్చా? మనం కూడా పిల్లలగలవాళ్ళమే. అసలు ఈ భూమ్మీద వృద్ధాశ్రమము అనేది లేకుండా ప్రతి తల్లి తండ్రి తన పిల్లలతో, మనవళ్ళతో గడిపేలా చూసుకోమని ఆ భగవంతుడిని వేడుకోవాలి మనం,అన్నది వసుమతి భర్తను ఉద్దేశించి.

               "శభాష్,వసుమతి నాకు తెలుసు నువ్వు ఎప్పుడూ సమాజానికి వ్యతిరేక విషయాల్ని సపోర్ట్ చేయవని. ఏదో మీ పద్మ పిన్ని మీద కోపంతో అలా అన్నావు. ఇప్పటికైనా మీ పద్మం పిన్నిలాంటి వాళ్ళు వాళ్ల తప్పులని తెలుసుకుంటే బాగున్ను, అంటూ తన,మామ గారిని కన్న తండ్రిలా సేవ చేసి,భార్య వసుమతి వైపు మెచ్చుకోలుగా చూశారు రామారావు గారు.

                     స్వస్తి 🙏🙏🙏


Rate this content
Log in

Similar telugu story from Drama