POLAVARAPU PUSHPAWATI

Romance Classics

4  

POLAVARAPU PUSHPAWATI

Romance Classics

మగువ మనసు

మగువ మనసు

8 mins
317


రాత్రి 12 దాట బోతుంది.ఊరంతా గాఢ నిద్రలో మనిగి ఉంది.నా కనులు మాత్రం ఆనందంతో నిద్రపోవడం మర్చిపోయినట్లున్నాయి.ఎట్టకేలకు నా ప్రియమైన అర్ధాంగి,వైదేహి మనసు గెలుచుకున్నానన ఆనందం నాకు నిదుర పొనివ్వట్లేదు.ఈ రోజు లంచ్ బాక్సులో లంచ్ తో పాటే వైదేహి రాసి పెట్టిన ప్రేమలేఖ,ఇప్పటికి ఎన్ని సార్లు,చదివుంటానో చెప్పలేను.మంచం పై ప్రశాంతంగా నిదుర పోతున్న వైదేహి వైపు చూశాను. దొంగ, ఎన్నిసార్లు చదివినా మళ్లీ మళ్లీ చదవాలని పించె, ఓ లేఖ నా మొహాన పడేసి తను మాత్రం ఎంత హాయిగా నిద్రపోతుందో. తనలో ఎన్నడూ చూడని ప్రశాంతత గోచరిస్తుంది.గత పదేళ్లుగా తనకు ఈ ప్రశాంతతని దూరం చేశానా నేను? అవుననే అంటుంది మనసు.

"అభివృద్ధి బాట.సంపాదన వేట"గత పదేళ్లుగా ఇదే నా స్లోగన్. నాదేనేంటి ఈ రోజుల్లో ప్రతి యువకులది ఇంచుమించు ఇదే స్లోగన్. ఈ స్లోగన్ని అనుసరిస్తూ వివాహ బంధాన్ని బలపరిచే అతి సున్నితమైన చిన్నచిన్న అంశాలను కూడా విడచెవిన పెట్టాను.

వివాహ బంధం ఒక అద్భుతమైన యోగం . మధురాతి మధురమైన అనుభూతుల కలయక. ఈ మధురమైన బంధం సమయానుకులంగా తన రూపాలను మార్చుకుంటుపోతుందే తప్ప పాతది అవ్వదు.ఏరూపంలోనైనా ఒక దృఢమైన బంధం గానే ఉంటుంది. అందుకేగా 70 సంవత్సరాల మా నాన్న 60 సంవత్సరాల అమ్మ ఒకరిని ఒకరు విడిచి ఉండడానికి అస్సలు ఇష్టపడరు. "పక్కనే మీ అమ్మ కూర్చుని, లోకాభిరామాయణమంతా చెబుతూ ఉంటే, ఆమే నోటి వెంట వెలువడిన మాటలు వింటూ ఉంటే నా బీపీ,షుగర్ అన్ని కంట్రోల్ లో ఉంటాయి రా అబ్బాయి"అంటూ చలోక్తులు వేయడం నాన్న కి సర్వసాధారణం. అలాగే "నేను మీ ఊరికి వస్తే మీ నాన్నగారికి టైం కి మందులు ఎవరు ఇస్తారమ్మాయి"అంటూ అమ్మ, అక్క వాళ్ళ ఇంటికి వెళ్లకుండా తప్పించుకుంటుంది. "పోనీలే, అక్క అంతలా రమ్మంటుంది నువ్వు వెళ్ళొచ్చు కదా అమ్మ, ఇక్కడ నాన్న గారికి మేము చూసుకుంటాం"కదా అంటే, వారికి మందులు టిఫిను భోజనం అన్ని టైముకి పెట్టక పోతే నాకు తోచదురా. నేను ఉన్నంతవరకు ఆ బాధ్యత నాదే"అని ఎంతో ప్రేమగా అంటుంది. ఎంత పటిష్టమైన బంధం.

కానీ మా తరం మాత్రం సంపాదన వేటలో పడి ఊరుకు-పరుగుల జీవితం నడుమ వివాహ బంధాన్ని ఒక అగ్రిమెంట్ గా ఎప్పుడు మార్చేస్తామొ మాకే తెలియదు. కొంతమంది ఓపిక ఉన్నవాళ్లు ఆ అగ్రిమెంట్తో అలాగా జీవితాంతం బ్రతికేస్తున్నారు. గాని ఓపిక లేని వాళ్ళు మాత్రం వెంటనే కోర్టు మెట్లు ఎక్కి విడాకులు తీసుకుని ఈ మధురమైన బంధము నుంచి విముక్తి అయిపోతున్నారు. కాకపోతే ఈలోపు పుట్టుకొచ్చిన పిల్లలని మాత్రం ఎటుకి కాకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే భార్యాభర్తలిద్దరూ ఆ బంధంలో ఉన్న సున్నితమైన అంశాలను తప్పక తెలుసుకోవాలి. భర్తల వరకు చూస్తే, భార్యల సంతోష కోసమే ప్రాకులాడుతూ ఉంటాము. వాళ్లకు కావలసినవన్నీ అమర్చడానికి సంపాదన వేటలో పరుగులు తీస్తూనే ఉంటాము.

       నేను కూడా అంతే. నా సాయి శక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నా. తను ఏది కోరినా, వద్దని చెప్పేది లేదు. పండగలు పబ్బాలకి నచ్చిన బట్టలు నగలు కొనుక్కోమని కావలసినంత డబ్బు తను అడగకముందే ఇచ్చేసే వాడిని.

      కన్నవారి ఇంటికి వెళ్తానంటే ఎప్పుడూ అడ్డు చెప్పేవాడిని కాదు. కాకపోతే తను లేనప్పుడు మాకు భోజనం కి ఇబ్బంది అని మాత్రం అనే వాడిని. అలా అన్నందుకేనేమో తను మాత్రం వెళ్ళిన పని అయిన వెంటనే వచ్చేసేది. ఒక ఇల్లాలు కోరుకునే సొంత ఇల్లు,నగలు, బట్టలు, దేనికి కొదవ చెయ్యలేదు నేను.

      అయినా తన కళ్ళలో నేను చూడాలనుకునే సంతోషం కనిపించకపోగా అప్పుడప్పుడు ఏదో నైరాస్యం కనిపించేసరికి మా చెడ్డ కోపం వచ్చేది నాకు. మగువల మనసు గెలుచుకోవడం అసంభవము.నిజం చెప్పాలంటే "ఆకాశకు సుమమే" అని తేల్చేసుకున్నాను.

అందుకే ఫ్రెండ్స్ తో గుమి గుడి ఆడిపోసుకునేవాడిని. ఫ్రెండ్స్ కూడా తందానా తాన అంటూ నాకు వంత పాడేవారు. కాకపోతే మాకు తెలియనిది ఏంటంటే మగువల కోరికలు అతి చిన్నవి , వాటిని అంచనా వెయ్యడం లోనే మేము తప్పుచేస్తాం. ఎందుకో ఆ చిన్న చిన్న విషయాలే మా అతి తెలివితేటలు గల బుర్రకు తట్టనే తట్టవు.

      అందుకే అయినదానికి కాని దానికి భార్యల మీద చిరుబుర్లాడటం ఓ గొప్ప కళ అనుకుంటాము.

కానీ ఎంతటి వాళ్ళకైనా తప్పులు తెలుసుకునే రోజంటూ ఒకటి వస్తుంది.నాకు కూడా వచ్చింది ఓ చక్కనైన, మధురమైన పాట రూపంలో.

ఓ పెళ్లిలో సంగీత కార్యక్రమంలో ఒకామే తెలుగు గేయ రచయిత శ్రీరసరాజు గారు రచించిన, డాక్టర్ సుధారాణి గారు తన స్వరం తో ఆలాపించిన, అతి మధురమైన ఓ గజల్ పాడింది. పాట ఎంత మధురంగా ఉంది అంటే పదేపదే జనాలు అడిగిమరీ పాడించుకున్నారు. పాటలో ఒక మగువా తన భర్తతో-

"నన్ను ఏ లోటు రాకుండా చూసుకుంటున్నావు గాని, అసలు నా మనసు ఏమి కోరుకుంటున్నాదో గుర్తించావా,"అని అడుగుతూ తన మనసులోని వ్యధను వ్యక్తపరుస్తుంది.ఆ పాట నాకు ఇట్టే ఆకర్షించింది. ఆకర్షించింది అనడం కంటే నిలదీసింది అన్నది కరెక్టేమో. పల్లవి ఇప్పటికీ నా చెవిలో మారుమ్రొగుతునే ఉంది.

      "తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా, నడుం వాల్చలేదేమని అడిగావా ఎప్పుడయినా.

వినగానే తృల్లి పడింది నా మనసు. నిజమే కదా. మూడు పూటలు ఆమె పెట్టేది తినడమే గాని. తిరిగి ఆమె ఏం తినిందో అడిగినట్టు గుర్తులేదు నాకు. బహుశా అందరికీ పెట్టాక ఎలాగూ తింటుంది అనే ధీమా ఏమో. పాట చరణం ముందుకు సాగుతోంది.

"చీర నీకు బాగుందని పొగిడావే గానీ, ఆ చీరకు నీవే సొగసని అన్నావా ఎప్పుడయినా.

ఓహో ఎంత సున్నితమైన అంశము నాకు తట్టనే లేదే అనుకుంటుండగానే మరో చరణం,

"సంధ్య వేళ చేతి వంట తిన్నావే గాని, నీ ప్రేమకింత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా.

రుచికరమైన భోజనాన్ని సృష్టిగా తినడమే కానీ ఆ భోజనంలో తను కలిపిన ప్రేమని చూడలేదే అని నొచ్చుకుంది నా మనసు.

ఇంకా ఏముందో అని చెవులు రిక్కరించి వింటున్న,

"జడలలో మల్లెల వాసన పీల్చావే కానీ, నా మనసులోని పరిమళాన్ని చూసావా ఎప్పుడైనా."

అమ్మో,ఇది మరీ సున్నితమైన అంశం. ఏదో తెలియని ఆవేదన నా మనసును కలవరపెడుతోంది. ఇంతలోని పాట మరో చరణం ముందుకు వెళ్ళింది.

"బండ చాకిరి నాదని భావించావే గాని. నా చెమటను తుడిచి,ముద్దు పెట్టావా ఎప్పుడైనా".

      చెంప ఛెల్లుమనిపించేలా అనిపించింది నాకు. తను ఇంటి చాకరి తో అష్ట కష్టాలు పడుతుంటే ,అది తన బాధ్యత అనుకున్నానే తప్ప ,ఇలా లాలించాలని తట్టనే లేదు నాకు. ఇంతలోనే మరో చరణం చెవులలో మధుర మృదంగం మోగిస్తుంది.

     "అర్ధాంగివి కావు నీవు ,అనురాగ దేవతవని, రసరాజువై ఈ నిజాన్ని రాస్తావా ఎప్పుడైనా?

నిజమే కదా.ఎంతో ముద్దుగా చూసుకునే కన్న వాళ్ళని, తోబుట్టువులని, భామ్మని ,తాతయ్యని, ఇలా తన వాళ్ళందరిని విడిచిపెట్టి, కేవలం పెళ్లి అనే ఒక బంధాన్ని నమ్ముకుని భర్త చేయ పట్టుకుని వచ్చేస్తుంది భార్య.

అటువంటి త్యాగమూర్తిని నేను నా సౌకర్యాల కోసం వచ్చిన ఒక మనిషిగానే చూసాను.

నాకు నచ్చినవి వండాలి. నాకు నచ్చినట్టు ఉండాలి.

     ప్రతిదీ నా కోసమే చెయ్యాలి. కొసమెరుపు ఏంటంటే నా సంతోషం లోనే తను సంతోషపడాలి ,తన సంతోషాలతో పని లేకుండా. ఎంత అన్యాయం.

     నా భార్య,మా అందరికీ అన్ని సమకూర్చడం కోసం పరుగు పరుగున రోజంతా బండి చక్రాల లా తిరిగి తిరిగి రాత్రి ఏ పదికో,పదకొండు కో పడకగదికి చేరి తన కాళ్ళను తానే వత్తుకుంటుంటే అలా చూసి ఊరుకున్నానే గాని ""అయ్యో కాలు నొప్పి పెడుతున్నాయా "అని ప్రేమగా అడిగిన పాపాన పోలేదు. నేనే గనుక అలా అడిగి ఉంటే అప్పుడు కనిపించును ఆమె కళ్ళలో నేను చూడాలనుకున్న సంతోషం.

     ఎప్పుడైనా తలనొప్పి అని తను అంటే టాబ్లెట్ వేసుకో అని ఒక ఉచిత సలహా ఇచ్చానే తప్ప"తల నొప్పిగా ఉందా, రా ఇలా కూర్చో, నేను బామ్ రాస్తా అని అనడం ఎన్నడూ ఎరుగను. అదే గనుక అని ఉంటే అప్పుడు కనిపించునేమొ ఆమె కళ్ళల్లో నేను చూడాలనుకునే సంతోషం

      ఆరోగ్యం బాగో లేకపోయినా మూలుగుతూ మా కోసం వంట చేస్తుంటే అలా చూసి ఊరుకున్నానే తప్ప"అయ్యో అంత బాధతో వంట చేయడం ఎందుకు వెళ్లి రెస్ట్ తీసుకో.ఈ రోజుకి నాకు చేతనైనటువంటి వంట చేస్తానని,అని ఉంటే అప్పుడు కనిపించును ఆమె కళ్ళలో నేను చూడాలనుకునే సంతోషం.

      షాపింగ్ కి వెళతానంటే డబ్బులు కుమ్మరించానే తప్ప, కాస్త సమయం తీసుకుని దగ్గరుండి షాపింగ్ కి తీసుకువెళ్లి, ఆమె సెలెక్ట్ చేసిన వాటిలో ఏది" ది బెస్టొ" సలహా ఇచ్చి ఉంటే అప్పుడు కనిపించునేమో ఆవిడ కళ్ళల్లో నేను చూడాలనుకునే సంతోషం.

      కన్నవారి ఇంటికి వెళ్తానంటే, వెళ్ళమన్నానే గాని ఓ నాలుగు రోజులు సెలవు పెట్టి ఆమెతో పాటు వెళ్ళి, కన్నవారింట తన ఆత్మాభిమానాన్ని కాపాడి ఉంటే, అప్పుడు కనిపించును ఆమె కళ్ళల్లో నేను చూడాలనుకునే సంతోషం.

ఇలా తప్పంతా నాలోనే పెట్టుకుని ఆమె సంతోషంగా ఉండదు. ఏడుపు మొఖం అని చిరాకు పడడంలో న్యాయం ఉందా?

ఏదైతేనేమి, ఇప్పటికైనా తెలిసి వచ్చింది. ఇకనుంచైనా ఆమెకి నిజమైన సంతోషాన్ని చెవి చూపాలి అనుకుంటూ వడివడిగా ఇంటి దారి పట్టాను.

నన్ను చూడగానే ఎప్పటిలాగే పరుగు, పరుగున గీజర్ ఆన్ చేసి, చేతికి టవల్ అందిస్తు, స్నానం చేసి రాగానే, కాఫీ కప్పుతో నుంచుని ఉన్నా వైదేహి ఈరోజు నా కళ్ళకు నిజంగా అనురాగ దేవతలా కనిపిస్తుంది. చెయ్య పట్టుకుని ప్రక్కనే కూర్చో పెట్టుకున్నా. పదేళ్ల కాపురంలో ఇదే మొదటిసారి అనుకుంటా అంత ఆప్యాయతగా ఆమె చెయ్య పట్టుకోవడం.

వైదేహి విచిత్రంగా చూస్తుంది. స్పర్శ లో ఉన్న ప్రేమని గుర్తిస్తుందనుకుంటా. అలాగే ఆమె చేయ పట్టుకుని చాలాసేపు ఉండిపోయా. సారీ చెప్పాలంటే కంఠం సహకరించటం లేదు. ఏదో అడ్డుపడుతుంది. బహుశా పశ్చాతాపం తో కళ్ళల్లో నుంచి రావలసిన కన్నీరు సిగ్గుతో కంఠంలోనే దాక్కుంటున్నాయి.

ఇన్నేళ్లు నాకోసం, నన్ను కన్నవాళ్ళ కోసం, నేను కన్న వాళ్ల కోసం, అహర్నిశలు కష్టపడిన చేతులు ఇవి. "ఏం చేసి తీర్చుకోగలను వీటి రుణం"అంటుంది మనసు.

అతి కష్టంగా అనగలిగా, "వైదేహి, ఈరోజు నీకు ఇష్టమైన వంటకం ఏంటో చెప్పు.ఎలా చేయాలో కూడా చెప్పు. నేర్చుకుని మరీ చేస్తా.

ఏం చెబుతుంది వైదేహి. గత పదేళ్లలో మాకు ఇష్టమైనవి చేసి చేసి తనకి ఇష్టమైనవి మర్చిపోయి ఉంటుంది. అందుకే నెమ్మదిగా నా భుజంపై తన తలవాల్చి మౌనంగా ఉండిపోయింది.

బహుశా గత పదేళ్లుగా ఈ క్షణం కోసం ఎదురు చూస్తుందేమొ.

******

నైట్ పెట్రోలింగ్ వాన్ యొక్క సైరన్ తో ఆలోచనల నుంచి బయటపడ్డాను. టైం ఒంటిగంట దాటేసింది. అయినా నిదుర పోవడం మానేసి , వైదేహి రాసిన ఉత్తరాన్ని మరోసారి చదవడానికి ఉపక్రమించాను.


"శ్రీవారికి తొలిప్రేమ లేఖ"అని పెద్ద అక్షరాలతో రాయబడిన ఆ కవర్ని తదేకంగా చూస్తుండి పోయా. ఎంత సొంపుగా ఉన్నాయో ఒక్కొక్క అక్షరం..

నా కళ్ళు ఆ అందమైన అక్షరాలతో నాట్యం చేస్తూ ముందుకు సాగుతున్నాయి.

ప్రియమైన శ్రీవారికి,

ఆనందంతో నాట్య మయూరినై, ఊహల పల్లకిలో విహరిస్తూ, మీకు కృతజ్ఞతలు తెలుపడానికి పదాల వేటలో పడింది.

పదేళ్ల క్రితం మీ చెయ్యి పట్టుకుని కన్నవారి గడప దాటి వచ్చిన క్షణం మనసులో ఎన్నో భయాలు.

ఎలా ఉంటుందో భావి జీవితం. తీయని కలలతో పాటే రకరకాల భయాలు కూడా ఉండేవి.

పేపర్లో వచ్చిన వరకట్నపు వేధింపులు, అత్తింటి వారి సాధింపులు గురించి చదివి పెళ్లంటేనే ఆ మడ దూరం పరిగెత్తేది మనసు. భర్తకి భార్యశీలాన్ని అనుమానించే రోగం ఉందంటే వేరే నరకం గురించి తెలుసుకోనవసరం లేదు అని అందరూ అంటుంటే అమ్మో ఆడపిల్ల వైవాహిక జీవితం ఒక లాటరీ అనిపించింది. మంచి భర్త లభిస్తే జీవితం స్వర్గం లేకపోతే నరకప్రాయం అనుకున్నా.

ఇలా రకరకాల భావోద్వేగాల నడుమ మీ అడుగుల్లో అడుగులు వేస్తూ కొత్త జీవితంలోకి ప్రవేశించాను.

"థ్యాంక్ గాడ్"! నేను భయపడిన విషయాలు ఏమీ లేవు మీలో. ఒక విధంగా నేను లాటరీ కొట్టేసినట్టే అనుకున్నాను.నన్ను ఏ లోటు లేకుండా చూసుకునే భర్తగా మీరు మంచి మార్కులు కూడా కొట్టేశారు.

       కానీ ఆశలు అనంతం. ఒక కోరిక తీరేలోపే మరో కొత్త కోరిక పుట్టుకొస్తుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. నన్ను బాగా చూసుకుంటే సరిపోదు, మీ ఆ ఆలోచన సామ్రాజ్యానికి నేనే మహారాణిని అవ్వాలి అనే కోరిక,నన్ను ఒంటరిగా ఇంటిలో వదిలేసి ఆఫీసుకు వెళ్లిన మొదటి రోజే పురుడు పోసుకుంది.

       ఇల్లు చక్కబెట్టుకుంటున్నానే గాని మనసంతా ఆఫీసులో మీ చుట్టే తిరుగుతోంది. నన్ను ఇలా ఇంటిలో ఒంటరిగా వదిలేసినందుకు మీరు బాధపడుతూంటారేమో అనుకున్నాను.

సాయంకాలం ఇంటికి రాగానే నన్ను గుండెలకు హత్తుకుని ఎలా ఉన్నావు రోజంతా ఒంటరిగా? అని అడుగుతారని ఆశ. మీరు వచ్చేవేళ ఎప్పుడెప్పుడా అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మీ రాక కోసం చక్కగా తయారై ఎదురుచూస్తూ ఉన్నాను.

మీరు వచ్చారు, చేతులోని, బ్యాగు నా చేతికి అందిస్తూ, గీజర్ ఆన్ చేసావా?, టవల్ అందుకో అంటూ హడావిడిగా వాష్ రూమ్ కి వెళ్ళిపోయారు.

పొంగుతున్న పాలుపై చల్లటి నీళ్లు చల్లి నట్లు అనిపించింది. కాస్త బాధపడ్డాను

ఫ్రెష్ అయి వచ్చి టీవీ ఆన్ చేసి కూర్చుని కాఫీ రెడీనా?అని కేక వేశారు.

పరుగు పరుగున కాఫీ తీసుకువచ్చి మీ చెంతనె నిలబడ్డాను. ఇప్పుడైనా అడుగుతారేమోనని నా చెవులు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి.

కానీ టీవీ లో లీనమైన మీరు రాత్రికి లంచ్ ఏం చేస్తున్నావ్,అని వంట గురించి ఆరా తీసారే తప్ప నేను అనుకున్నది అడగలేదు.

అలా కొత్తగా పుట్టిన కోరిక తీరకుండానే అప్పుడే సమాధి అయిపోయింది. కోరికల పుట్టుక అంతటితో ఆగలేదు. ఏదైన జంట షాపింగ్ చేస్తూ చూస్తే కనిపిస్తే, అయ్యో నేను ఒంటరిగా వచ్చానే"అని మనసు కుమిలిపోయేది. సముద్ర తీరాన, నీ చేతిని గట్టిగా పట్టుకొని, భుజంపై తలవాల్చుకుని కెరటాల ఆగమనాన్ని తిలకించాలని, ఇలా వరుస కోరికలు కలుగుతూనే ఉన్నాయి,తీరకుండా మిగిలిపోతూనే ఉన్నాయి.

నాకోసం మీరు ఎన్నో ఖరీదైన చీరలు విలువైన నగలు కార్లు, ప్రతిదీ క్షణాల మీద అమర్చారు ఒక్క నా మనసు పడుతున్న ఆరాటం తెలుసుకోవడం తప్ప.

ఏమిటో మా ఆడవాళ్ళం బయట ప్రపంచానికి సంబంధించినవి ఎన్నెన్నో అడిగేస్తాం. గాని మనసుకు సంబంధించిన చిన్న విషయాలు కూడా మీ ముందు వ్యక్తపరచడానికి సంకోచిస్తాం. మీరే స్వయంగా అవి తెలుసుకోవాలని ఆశపడతాం.లేనిపోని అసంతృప్తికి గురి అవుతాం.

అలా అసంతృప్తి గా బ్రతికేస్తున్న నన్ను ,మొన్న మీరు అమితమైన ఆప్యాయతతో చెయ్య పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకునె సరికి నా మనసు సంభ్రమాఆశ్చర్య నికి గురైంది. నా పట్ల మీ కళ్ళలో కనిపించిన ఆ కృతజ్ఞతా భావం చూసిన క్షణమె,ఇన్నేళ్లుగా నాలో తిష్ట వేసి ఉన్న అసంతృప్తి మొత్తం మటుమాయం అయిపోయింది. ఆ ఒక్క క్షణం చాలు జన్మ జన్మ లకు మీరే నా రారాజు కావాలని కోరుకోవడానికి.

అంతటితో ఆగలేదు మీరు నన్ను కిచెన్ టాప్ పైన కూర్చోబెట్టి, అడిగి అడిగి తెలుసుకుని మరి జీడిపప్పు వేసిన ఉప్మా చేశారు. నిజం చెప్పనా మీరు చేసిన ఆ జీడిపప్పు ఉప్మా ముందు పదేళ్లుగా నేను చేసిన వంటలన్నీ బలాదూరే. ఆ క్షణం నేను పొందిన అపురూపమైన అనుభూతి పదాలలో చెప్పలేను. ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి ఇటువంటి సౌభాగ్యము కలిగితే, విడాకులనే ఓ దౌర్భాగ్యపు పదము ఈ భూమ్మీదనే ఉండకుండా పోతుంది అనిపించింది నా మనసుకు.

ఆఖరికి మంచి మనసుతో నా అందమైన చిన్న జీవితాన్ని హరివిల్లులా రంగుల మయం చేసిన మీరే జన్మజన్మలకు నా జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటూ, మీ సహధర్మచారిని. వైదేహి.

అబ్బా ఎంత అద్భుతంగా రాసింది. ఈ జన్మకే కాదు జన్మజన్మలకు మా బంధాన్ని బలపరిచేసింది. ప్రపంచంలో ఉన్న భార్య భర్తలు అందరూ ఈ వివాహ బంధాన్ని మాలాగే బలపరుచుకోవాలని కోరుతూ, నిద్రకు ఉపక్రమించాను.

         స్వస్తి         పోలవరపు పుష్పావతి         సోంపేట.        శ్రీకాకుళం.        9110793796.


Rate this content
Log in

Similar telugu story from Romance