POLAVARAPU PUSHPAWATI

Drama Tragedy Classics

4.5  

POLAVARAPU PUSHPAWATI

Drama Tragedy Classics

అమ్మ మహాప్రస్థానం

అమ్మ మహాప్రస్థానం

5 mins
260


     అమ్మ మహా ప్రస్థానానికి సర్వం సిద్ధం అయిపోయింది. "నేను వచ్చిన పని అయిపోయింది. ఒక కూతురిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, సమాజంలో ఒక అంశంగా, నా బాధ్యతల అన్నిటిని నా సాయ శక్తుల సక్రమంగా పూర్తి చేసుకున్నాను.ఇక సెలవు",అంటూ అమ్మ భువి నుంచి దివికి బయలుదేరింది.

అమ్మ అంతిమ యాత్ర కోరకు పట్టు వస్త్రాలతో తయారు చేయబడిన అనంతశాల ఒక దివ్య సవారి లా గోచరిస్తుంది. ఇన్నాళ్లు అమ్మ నివసించిన వీధి, జనాలతో నిండిపోయి జనసముద్రమును తలపిస్తుంది. ఏడుపుల ఘోషతో నాలుగు దిక్కులు హోరెత్తుతున్నాయి. అమ్మ చేసిన సహకారమును తలుచుకుంటూ, తను చేసే పనులను కొనియాడుతు జనాలు అమ్మను పదేపదే స్మరిస్తూ ఉన్నారు.

కొంతమంది పెద్ద ముత్తైదువులు అమ్మకు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేశారు. తెల్లని చీర కట్టి అనంతశాలలో పద్మాసన భంగిమ లొ కూర్చోబెట్టారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రెండు చేతులు జోడించి అమ్మకు అంతిమ వీడ్కోలు చెబుతున్నారు.

ఆడవాళ్ళంతా అమ్మ పాదాలు తాకడానికి పోటీపడి మరి ముందుకి వస్తున్నారు. ఆమె దివ్య ఆశీస్సులు పొందడానికి ఎగబడుతున్నారు.

ఇదంతా చూస్తున్న నాకు ఎందుకో ఏడుపు రావట్లేదు. అమ్మ సేవలో మునిగి తేలుతున్న జనాలను చూసి గర్వంగా అనిపిస్తుంది నాకు.ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ గారు నటించిన ""ఆ నలుగురు" చలనచిత్రం లో సూచించిన సందేశం గుర్తుకు వచ్చింది.""మనకు ఎంత సంపద ఉన్నా చనిపోయిన తర్వాత అంతిమ ప్రయాణానికి నాలుగు భుజాలు తప్పనిసరిగా కావలసిందే. అందుకే ఆ నలుగురిని ప్రతి ఒక్కరు. సంపాదించుకోవాలి""అన్న సందేశం అది.

నలుగురు ఏం ఖర్మ ఇక్కడ 100 మంది పోటీ పడుతున్నారు. వాళ్ళ భుజాలపై అమ్మకి సాగనంపడానికి. కుల మత భేదం లేకుండా ఒక్క క్షణం కోసమైనా అమ్మ సవారీ చేస్తున్న అనంతశాలను తన భుజాలపై పెట్టమని అభ్యర్థిస్తున్నారు. విచిత్రం ఎంటంటే ఆ భుజాల మార్పిడి మూడు వైపులే జరిగింది. ఎందుకంటే అమ్మ వాళ్ళ వీధిలో ఉంటున్న క్రిస్టియన్ అబ్బాయి, భుజాలు మార్చడానికి ఒప్పుకోలేదు. చివరి వరకు అమ్మ తన భుజం పైనే ఉండాలి అని పట్టు పట్టాడు.

ఎంతటి స్నేహశీలి కాకపోతే ఇలా జరుగుతుంది.మా అమ్మ నిర్మల్ మైన మనసు గల అమృత మూర్తీ . ఏ వీధిలో ఉన్న ఏ ఊరిలో ఉన్న అందరి బాగోగులు గురించి తపన పడే విశాల హృదయంగల, మా అమ్మ మా ఐదుగురికే కాకుండా అందరికీ అమ్మ లా ఉండేది.

"బాడీ, కాస్త బరువు ఎక్కినట్టు ఉంది కదూ""అన్నమాటలు నా చెవిన పడ్డాయి, ఉలిక్కి పడ్డాను. మనసు బాధతో ములిగింది."ఏమిటో ఈ మానవ జీవితం ఎంతటి వాళ్ళకైనా ప్రాణం ఉన్నంత వరకే గుర్తింపు. ఆ జీవుడు శరీరాన్ని త్యజించిన మరు క్షణమే అంతవరకు ఎంతో అందమైన శరీరాన్ని బాడీ అని సంబోధిస్తారు. అమ్మని అలా బాడీ అనడం నాకు ససేమిరా నచ్చలేదు. తెలియని వాళ్ళకి ఎవరికో అనంతశాలలో కూర్చున్న అమ్మ ఒక బాడీ లా కనిపిస్తుందేమో కానీ నా కళ్ళకు మాత్రం ధవళ వస్త్రాలు ధరించి సుదీర్ఘ కాలంగా తపస్సు చేస్తున్న మహా సాధ్వి లాగా దర్శనమిస్తుంది.

నిజమే కదా! అమ్మ జీవితమం ఒక తప్పస్సు తో సమానమే.ఎప్పుడో తన 14వ ఏట తనకంటే రెట్టింపు వయసు గల వ్యక్తితో పెళ్లి పేరిట ముడి పెట్టించేసి, కన్నవారు సాగనంపేస్తే, మనోభావాలను వ్యక్తపరచడం కూడా తెలియని వయసులో ప్రారంభించిన అమ్మ జీవిత ప్రస్థానం ఈరోజు మహాప్రస్థానం గా చివరి అంకానికి చేరుకుంది.


భవసాగరాన్ని ఈదుకుంటూ అలుపెరగని పోరాటం చేసి తను అనుకున్నది సాధించి అమ్మను చూస్తుంటే ఈ క్షణం ఎంతో గర్వంగా ఉంది. అమ్మ కోరుకునేది ఒకటే చిన్నవయసులో పెళ్లి వల్ల అత్తారింటి లో తను పడిన బాధలు తన కూతుళ్లకు రాకూడదు. అలాగే పేద పిల్లలుగా బంధువుల దృష్టి లో లకన చేయబడుతున్న తన బిడ్డలు, ఎప్పటికైనా అందరు మెచ్చే విధంగా జీవించాలి. మరోవైపు పిల్లలో ఏ ఒక్కరూ నైతిక విలువలను విడకూడదు. ఇవి అమ్మ కోరుకునే ప్రధానమైన అంశాలు. తను అనుకున్నది సాధించింది అనడానికి మేము ఐదుగురమే సాక్షులం. నైతిక విలువలు అంటే పంచప్రాణాలు మాకు.

కటిక పేదరికంలో కూడా అక్షరం అనే ఆయుధాన్ని మా చేతికి అందిస్తు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ ఆయుధాన్ని మాత్రం విడిచి పెట్టకండి అని అమ్మ చెప్పిన ఆ మహా మంత్రమే మా అందరిని ఒక గౌరవప్రదమైన స్థానములో నిలబడినట్టు చేసింది.‌‌

ఈ రోజులలో ఒక్కరికి ఉద్యోగం రావడం గగనం అయితే మీ పిల్లలందరూ ఉద్యోగస్తులు అయ్యారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని ఎవరైనా అంటే, మా పిల్లలు మంచి వాళ్ళు చిన్నప్పటినుంచి కష్టపడ్డారు. అందుకే ఉద్యోగాలు సాధించగలిగారు అని అనేదే తప్ప, తనే మాకు సరైన మార్గంలో నడిపించింది అని ఎప్పుడు గొప్పలకు పోయేది కాదు.

ఇరవై ఏళ్లకే సంతానము, ఆర్థిక కష్టాలు చవిచూసిన అమ్మ అప్పుడే మా కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రణాళిక సాధన కోసం నిత్యం శ్రమించింది.

తన కృషి, పట్టుదల, కష్టాలను ఎదుర్కొనే అమోఘమైన శక్తిని చూసే, మా లక్ష్యసాధనలో మేమూ ముందుకు నడవగలిగాము. ఒక గౌరవప్రదమైన జీవితాన్ని సొంతం చేసుకోగలిగాము.

అసలు అమ్మ గొప్పతనానికి చెప్పడానికి పదాలు దొరకటం లేదు నాకు.పిల్లలకి నచ్చజెప్పడం లో అమ్మ మహాదిట్ట. మా తోటి పిల్లలు పేచీలు పెట్టి వాళ్ళ అమ్మానాన్నల చేత ఖరీదైన బట్టలు, ఆట వస్తువులు,బొమ్మలు, కొనిపించుకునేవారు. అలాగే సినిమాలకు షికార్లకు కూడా వెళ్లేవారు. కాని మా తమ్ముళ్లు పేచీలు పెట్టే దాఖలాలే లేవు.

నేను అక్క కాస్త పెద్దవాళ్ళం, కానీ తమ్ముళ్లు చిన్నవాళ్లు కదా, వాళ్లు కూడా ఎప్పుడు పేచీలు పెట్టరేంటి, అనుకుండే వాళ్ళం నేను అక్క. ఒకవేళ ఎప్పుడైనా స్థాయికి మించినది ఏదైనా మేము అడిగితే అమ్మ చిరునవ్వు చిందిస్తూ వినేది. ఆ తరువాత తన మాటల గారడీతో ఎలా హిప్నోటైజ్ చేసేదో కానీ మేము కోరిన కోరికను మర్చి పోయేవాళ్ళం.తీర్చగలిగేవి ఎప్పుడు కాదనేది కాదు అమ్మ.సాయసక్తుల మాకు సంతోష పెట్టేది.


రోజంతా అమ్మకు పనే. నాన్నకు బంధు ప్రీతి ఎక్కువ. ఎప్పుడు ఇల్లంతా బంధువులతో నిండి ఉండేది. ఇరుగుపొరుగు వాళ్ళ మా ఇంటిని ధర్మశాల అని పేరు కూడా పెట్టేశారు.స్వతహాగా అయితే నాన్నగారు చాలా మంచివారు. ఏ దురలవాటు లేని వ్యక్తి, మహాజ్ఞాని.గాని ఆయనకున్న బంధు ప్రీతి వల్లనో ఏమో గాని కాస్త ఇంటిపైన, బాధ్యత , శ్రద్ధ తక్కువే అని చెప్పాలి.

నాన్నగారికి అమ్మ ఎప్పుడు ఎదురు చెప్పేది కాదు. బహుశా ఇద్దరి మధ్య ఉండే వయసు వ్యత్యాసమే దీనికి ప్రధాన కారణమేమొ.

తెల్లవారుజామున నాలుగింటికి ఆరంభమైన దినచర్య, ఇంటి పని,వంటపని, చుట్టాల సపర్యాలు, రాత్రి 10 అయితే గాని పూర్తి అయ్యేవి కావు.మళ్ళి అందరు పడుకున్నాక అమ్మ ప్లాస్టిక్ వైరులతో బ్యాగులు అల్లేది. ఉన్నితో స్వెటర్లు అల్లేది. అక్కకి నాకు బాధ అనిపించేది. అమ్మకి అడిగే వాళ్ళం"ఎందుకమ్మా రోజంతా పని చేశావు మళ్లీ ఇప్పుడు ఇది ఎందుకు అని. అమ్మ చిరునవ్వుతోనే ఎదురు ప్రశ్న వేసేది, మరి పండగకి మీ అందరికీ కొత్త బట్టలు వద్దా? నాకు ఏం అనాలో తెలిసేది కాదు కానీ అక్క మాత్రం అనేది "కొత్త బట్టలు లేకపోతే లేదు నువ్వు పడుకో అమ్మ" అని. అమ్మ మా ఇద్దరినీ బుజ్జగించి నిద్రపుచ్చేసేదె, తప్ప తన పని ఆపేది కాదు. ప్రతి పండగలకి మాకు మంచి బట్టలు కొనాలని, ఎవరి దగ్గర మేము చిన్నబోకూడదని అమ్మ పడే శ్రమ తపన నాకు బాగా కలవర పెట్టేవి. కాని ఏం చేయాలో తెలిసేది కాదు. కాస్త పెద్ద అయినాక నేను అక్క పేచి పెట్టి బ్యాగుల అల్లిక నేర్చుకుని అమ్మకు సహాయం చేసే వాళ్ళం. ఎందుకంటే అప్పుడు మాకు ఒక విషయం అర్థమైంది. చదువులు కొనసాగించాలన్న, కనీసం తమ్ముళ్లను ప్రయోజకులను చేయాలన్న ఈ అల్లిక కొనసాగాల్సిందే. అమ్మ వారించిన రాత్రులు అమ్మతో పాటే మెలుకువగా ఉండేవాళ్లం.

అంతేకాదు నాన్నగారి చాలీచాలని సంపాదనతో పూటకు 10 కంచాలు చొప్పున మూడు పూటలకు కలిపి ప్రతిరోజు 30 కంచాలు అమర్చడానికి అమ్మ పడే శ్రమ అంతా ఇంతా కాదు.

ఇంటి పక్కన ఖాళీ స్థలంలో అన్ని రకాల కాయగూరలు పండించేది.ఏ రోజు మధ్యాహ్నం పూట అమ్మ నడుము వాల్చడం చూడలేదు మేము. ఓ రోజు వారంకి సరిపడా బియ్యపు నూక తిరగలి పట్టడం, మరో రోజు అమలదస్తాల కారం కొట్టడం, మరో రోజు పసుపు దంచుకోవటం, మసాలాలు తయారు చేసుకోవడం, ఆవకాయ తయారీ, కోళ్లు పెంచటం, ఇలా డబ్బు పెట్టి కొనలేకపోయినా, తన శక్తినే పౌష్టిక ఆహారంగా మార్చి మమ్మల్ని ఎంతో ఆరోగ్యంగా పెంచుకొచ్చింది అమ్మ.

ఇలా బాల్యమంతా మా అమ్మ యొక్క సంఘర్షమైన జీవితాన్ని చూస్తూ గడిచింది.

ఇంత వ్యస్తమైన జీవితంలో కూడా అమ్మ ప్రత్యేకత ఏంటంటే తన చుట్టూ ప్రక్కల వాళ్ల ఇంట ఏ కష్టము వచ్చినా నేనున్నాను అంటూ అభయం ఇచ్చేది.

ఉన్నదాంట్లోనే తన శక్తి మేరకు వాళ్లకు సహాయపడేది. వాళ్ల సమస్య తీరేంతవరకు ఆ సమస్య తనదిగా భావించి నిద్రపోయేది కాదు.

అంతటి మహోన్నతమైన మనసు గల ఆమె గర్భమున జన్మించినందుకు పదే పదే ధన్యోస్మి అనుకుంటూ ఉంటాను నేను. ఆమె అంతటి ఉత్తమురాలు కాబట్టే ఆమె సవారిని ఎత్తడానికి భుజాలు పోటీ పడుతున్నాయి. ప్రతి రెండు నిమిషాలకు భుజం మారుతుంది. ఆఖరి మజిలీ చేరేసరికి అక్కడున్న అందరికీ సవారీని భుజస్కందాలపై ఎత్తుకునే అవకాశం రావాలని కోరుకుంటున్నారు అందరూ. ఇదే అమ్మ అసలైన సంపాదన ఇంతకంటే అదృష్టం ఏమంటుంది.

అమ్మ కాన్వాయి మలుపు తిరిగింది. అనంతశాల కనుమరుగు అయిపోయింది. మరి కాసేపటిలో అమ్మ దేహం మట్టిలో కలిసిపోతుంది. అమ్మ ఇక మాకు లేదు అన్న ఆలోచన గుండెల్ని పిండేస్తున్నట్లుగా అనిపిస్తుంది. గట్టిగా ఏడవాలనిపించింది.అక్కని పట్టుకుని బోరున ఏడ్చాను. అక్కడ ఉన్న ముత్తైదువులు మమ్మల్ని ఓదారుస్తూ"మీ అమ్మ ఎక్కడికి వెళ్లి పోదు మీ చెంతనే ఉంటుంది" అన్నారు. అప్పుడు నాకు అనిపించింది అమ్మ లేకపోవటం ఏంటి? తను ఎప్పటికి మా గుండెల్లో ఒక దేవతల ఉండనే ఉంటుంది కదా. అసలు మా అమ్మలాంటి వాళ్ళకి---కాదు కాదు ఈ భూ ప్రపంచంలో పిల్లలనె పంచప్రాణాలుగా చూసుకునే ఏ అమ్మకి మరణం ఉండదు. అందుకే అమ్మ నీకు శతకోటి, వందనాలు.

స్వస్తి.

పోలవరపు పుష్ప

సోంపేట, శ్రీకాకుళం



Rate this content
Log in

Similar telugu story from Drama