POLAVARAPU PUSHPAWATI

Drama Inspirational

4.5  

POLAVARAPU PUSHPAWATI

Drama Inspirational

రాణీ హారం

రాణీ హారం

6 mins
377


విజయ మనసంతా అతలాకుతలంగా ఉంది. పరిపరివిధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మనసు మాత్రం దగధగ మెరిసే ఆ రాణీ హారం చుట్టే తిరుగుతూ ఉంది. అంత అందమైన హారం చేసుకున్న భాను ఎంత అదృష్టవంతురాలో అని వాపోతోంది మనసు. ఉదయం తను అత్తగారి కోసం మందులు తేవడానికి మందుల షాపుకి వెళ్తుంటే.. అప్పుడే వచ్చింది ధగా ధగా మెరుస్తూ కొత్త స్విఫ్ట్ కారు. ఆ కారులో నుంచి దిగివస్తున్న భానుని చూసి విజయ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ముఖ్యంగా భాను మెడలో ఉన్న హారం పైనే కళ్ళు ఆతుక్కుపోయాయి. విజయభాను చిన్ననాటి స్నేహితులు.

ఒకే తరగతిలో చదువుకునేవారు. విజయ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ గా నిలిచేది. భాను ఏదో అత్తెసరు మార్కులతో పాస్ అవుతూ ఉండేది. పై చదువులు చదివాక ఇద్దరూ ఉద్యోగాల్లో చేరారు. కానీ పెళ్ళయిన తర్వాత విజయ ఉద్యోగంలో కొనసాగలేకపోయింది.

విజయ ఒక సగటు గ్రృహిణి: భర్త తెచ్చే సంపాదనతో గుట్టుగా సంసారం నడిపే మంచి భార్య అత్తమామలకు. సేవచేస్తూ భర్త పిల్లలతో సంతోషంగా గడపటంలో సిద్ధహస్తురాలు. అసంతృప్తి, అత్యాశ అంటే తెలియని ఉత్తమురాలు.

కానీ ఎప్పుడో విడిపోయిన తన చిన్ననాటి స్నేహితురాలి వైభవాన్ని చూసి విజయ మనసు కలత చెందింది. ఇద్దరు స్నేహితురాళ్ళూ కాసేపు మాట్లాడుకుని 'మళ్ళీ కలుద్దాం' అనే వాగ్దానంతో ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.

"తను భానుకి ఏ విషయంలోనూ తీసిపోదు. అందం, చదువు- అన్నింటా ఒక మెట్టు పైనే ఉంటుంది. అయినప్పటికీ ఈరోజు భానుకి ఉన్న హోదా తనకు లేదాయె' అని మనసు చివుక్కుమంది. ఇంటికి తిరిగి వచ్చిన విజయ అత్తగారికి మందులు ఇచ్చి, మామగారికి పిల్లలకీ భోజనం పెట్టి కాస్త ఖాళీ సమయం దొరకగానే నడుము వాల్చింది. మళ్ళీ భాను మెడలో ఉన్న రాణీ హారం, అలాగే భాను దిగివచ్చిన కారూ కళ్ళముందు. ప్రత్యక్షం అయ్యాయి. ఎప్పుడో తన పెళ్ళినాడు కన్నవారు చేయించిన చిన్న నెక్లెస్, అత్తవారు చేయించిన నల్లపూసల గొలుసు, ఒక మంగళసూత్రం... ఇవే తన ఆభరణాలుగా మిగిలిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడూ బంగారం వైపు చూసే అవకాశం కూడా తనకు రాలేదు. ఒకసారి కొత్తగా హారాల ఫ్యాషన్ వచ్చినప్పుడు తను కూడా హారం చేయించుకోవాలి అనుకుంది. భర్త సహకారంతో కొంత పైకం సమకూర్చుకుంది.

అంతలోనే ఇంటిలో అనుకోని ప్రమాదం జరిగింది... అత్తగారు మెట్లమీద నుంచి జారి పడిపోయారు. వెన్నెముక దెబ్బతింది. ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. అంతే, ఆ దెబ్బకి హారం. చేయించుకోవాలి అన్న ఆలోచన మరుగున పడిపోయింది.

అలా హారం చేయించుకునే అవకాశం చేజారినందుకు విజయ ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే అత్తగారంటే విజయకి పంచప్రాణాలు.

కన్నతల్లిని కూడా మరిపించేటంత గొప్పవారు విజయ అత్తగారు. పెళ్ళయిన కొత్తలో భయంభయంగా తెల్లవారుజామునే లేచి స్నానం చేసి వంట గదివైపు వెళుతూ ఉంటే అత్తగారు పిలిచి 'నువ్వు మీ అమ్మావాళ్ళ ఇంటిలో కూడా ఇలానే లేస్తావా' అని అడిగారు. 'లేదండీ, అక్కడైతే అమ్మ అన్నీ చేసుకుంటుంది. నేను నీకి లేచి యోగా చేసుకుంటాను' అని చెప్పింది విజయ. "మరి ఇక్కడ ఎందుకు ఇంత చీకటితో లేచావు? అక్కడ అమ్మా వాళ్ళింట్లో ఎలా ఉన్నావో, ఇక్కడ కూడా నువ్వు అలాగే ఉండొచ్చు. ఇది నీ ఇల్లు. నువ్వు ఈ ఇంటి మహారాణివి' అని అత్తగారు ప్రేమగా దగ్గరకు తీసుకుని అంటుంటే విని విజయకి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. ఎందుకంటే పెళ్ళి కుదిరినప్పటి నుంచీ అందరూ "ఇలా ఉండకు, అలా ఉండకు, అత్తారింటిలో ఇలా ఉంటే పనికి రాదు' అని చెప్పిన వాళ్లే. దాంతో పెళ్ళి అవుతుంది. అన్న ఆనందంతోపాటే ఒక రకమైన భయం కూడా ఏర్పడింది. అత్తగారు తన ప్రేమతో ఆ భయాన్ని పోగొట్టేశారు. అప్పటినుంచీ విజయా ఆమె అత్తగారూ సొంత తల్లీ కూతుళ్ళలా ఉండేవారు. విజయ పెళ్ళయిన తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగాలని అనుకుంది.

అత్తగారు కూడా సరే అన్నారు. కానీ వెంటనే గర్భం దాల్చడంతో ఉద్యోగం చేసే ఉద్దేశం విరమించుకుంది. రిస్క్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పినప్పుడు అత్తగారు కాలు కింద పెట్టనివ్వకుండా, కంటికి రెప్పలా చూసుకున్నారు. అలా ఇటు కన్నవారూ అటు అత్తింటివారి ప్రేమల నడుమ విజయ ఇద్దరు పిల్లల తల్లి అయ్యింది. పిల్లలు కాస్త పెద్దయ్యాక 'ఇక పిల్లల సంగతి నేను చూసుకుంటాను. నువ్వు కోరుకున్న ఉద్యోగానికి వెళ్ళచ్చు' అన్నారు. అత్తగారు. ఆ మాటలు విని విజయకి అంటారీ ఎక్కినంత పనైంది. వెంటనే ఉద్యోగాల వేటలో పడింది భర్త కూడా అందులో విజయకి సహకరిస్తున్నాడు. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది. అత్తగారు మంచానపడ్డారు.

అలా అత్తగారిని మంచం మీద వదిలేసి, చిన్నపిల్లలను గాలికి వదిలేసి, తన ఉద్యోగం చేసి వెలగబెట్టిని ఏముంది. అనుకుంది విజయ. పరిస్థితులు అనుకూలిస్తే ఉద్యోగం ఎప్పుడైనా చేయొచ్చుగానీ, ఉద్యోగం చేయాలన్న తన సరదా కోసం స్వర్గంలాంటి తన ఇంటినీ అస్తవ్యస్తం చేయడం ఇష్టంలేక ఉద్యోగం చేసే ఆలోచనని మరోసారి అయినా విజయ ఎప్పుడూ బాధపడలేదు.

అత్తగారిని కన్నతల్లిలా చూసుకుంటోంది. అత్తగారు కూడా తనకి అంతే ప్రేమ పంచి పెట్టారు మరి. పిల్లల బాగోగులు చూసుకుంటూ, మామగారి ప్రేమాభిమానాలు పొందుతూ, భర్తని అన్నివిధాలా సంతోషపెడుతూ ఎంతో సంతోషంగా గడిపేసింది ఇప్పటివరకూ. 

కానీ బంగారానికి ఉన్న ఆకర్షణే వేరు. మహామహులే ఆ ఆకర్షణ నుంచి బయటపడలేదు. అందుకేనేమో ఈరోజు భాను మెడలో హారం చూసి విజయ మనసు కలత చెందింది. ఆ క్షణం 'నేను జీవితంలో అనుకున్నది ఏదీ పొందలేకపోయాను" అనే ఒక న్యూనతాభావం విజయ మనసులో ఆవిర్భవించింది. ఎందుకో అది తన చేతకానితనమే అనుకుంది. అలా అనుకున్నది మొదలు చిరాకు పడటం ప్రారంభించింది.

ఆ చిరాకు ఎవరిమీదో తెలియక ఇంటిలో గిన్నెల పైన చూపించడం మొదలు పెట్టింది. ఎప్పుడూ లేనిది. పంటగది నుంచి గిన్నెల శబ్దం రావడం, అలాగే తరుచూ వాళ్ళూ నీళ్ళూ కొనుక్కునే బంగారాలూ, ఆస్తుల గురించి వర్ణించడంతో విజయ భర్త ప్రకాష్క విజయ చిరాకుకి కారణం అర్ధమయింది.. విజయ ఒకప్పుడు హారం కొనుక్కోడానికి ప్రయత్నించిన విషయం గుర్తుకు వచ్చింది. మనసులో ఎంతో బాధపడ్డాడు. 'నిజమే కదా. పెళ్ళయింది మొదలు తను విజయ నుంచి ఎన్నో సహాయసహకారాలు పొందాడు.

కానీ తిరిగి తనకోసం ఏమీ చేయలేకపోయాడు. అందుకే ఈసారి ఎలాగైనా దసరాకి ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి విజయకు తను కోరుకున్న హారం చేయించాలి' అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.

అలా జరిగిన కొద్ది రోజులకే భాను విజయ ఇంటికి వచ్చింది. ఆ రోజు సెలవుదినం కావడంతో విజయ భర్తా, పిల్లలూ అందరూ ఇంటిలోనే ఉన్నారు. విజయ అత్తగారు విజయ తనకు చేసే సేవలను భానుతో చెబుతూ, విజయ లేకుంటే తాను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదంటూ కంటతడి పెట్టుకున్నారు. మామగారయితే విజయ గొప్పతనం గురించి పదేపదే చెబుతూ 'విజయ మా ఇంటి ఇలవేల్పు' అని కొనియాడారు. భర్తా పిల్లలూ కూడా విజయ చుట్టూ తిరుగుతూ విజయ లేకపోతే వాళ్ళ ఆస్తిత్వమే లేదు అన్నట్టు ప్రవర్తించారు. అది చూసిన భానుకి అసూయగా అనిపించింది.

మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. విజయకీ భానుకి కాస్త ఏకాంతం లభించింది. ఇద్దరూ పైన గదిలోకి వెళ్ళి చిన్ననాటి విషయాలు ముచ్చటించుకుంటున్నారు. అప్పుడు విజయ భానుతో "నీ లైఫ్ సక్సెస్ అయ్యింది. మంచి ఉద్యోగం చేసుకుంటున్నావు. కానీ, నా చదువు వృథాగా మూలపడిపోయింది. నేను కూడా నీలాగే ఉద్యోగం చెయ్యాలి అనుకున్నాను. కానీ పరిస్థితులు నాకు అనుకూలించలేదు" అంది బాధపడుతూ. ఆ మాటలు విన్న భాను ముఖంలో ఎన్నో రంగులు మారాయి. కాసేపు మౌనంగా ఉండి అంది, "అదేంటి విజయా, నీ చదువు వృథా అయిందని ఎలా అనుకుంటున్నావు? ముమ్మాటికీ కాదు. చదువు మనకి సరైన నడవడికతోపాటు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా నేర్పిస్తుంది. నువ్వు సంసారం పట్ల సరైన నిర్ణయాలు తీసుకున్నావు. నిన్ను అభిమానించే వాళ్ళని నీ జీవితంలో మొదటి స్థానంలో ఉంచావు. అందుకే వాళ్ళ హృదయాలలో మహారాణిగా నిలిచావు. అదేగనక చేయవంటే నువ్వుకూడా నాలాగే ఒంటరిగా మిగిలిపోయి ఉండేదానివి" అంది. కొంత మౌనం తర్వాత... పెళ్ళయిన కొత్తలో మావారు బెంగళూరులో, నేను వైజాగ్లో జాబ్ చేసే వాళ్ళం. మావారు నన్ను వైజాగ్లో జాబ్ మానేసి బెంగళూరు వచ్చేయమన్నారు. అక్కడ మరో జాబ్ చేసుకోవచ్చు అని కూడా అన్నారు. ఆయన చదువుకి ఇక్కడ సరైన జాబులు దొరకవు కాబట్టి నన్నే బెంగళూరు వచ్చేయమన్నారు. కానీ నేను ససేమిరా ఒప్పుకోలేదు. నా ఈగో అడ్డుపడింది. నా జాబ్ సినియారిటీ పోతుందని బెంగళూరు రానని చెప్పేశాను. ఆలా వైజాగ్లో నేనూ, బెంగుళూరులో మావారూ చాలా కాలం ఉండిపోయాం. వైజాగ్ సొంత ఊరు కనుక "అత్తగారూ. మామగారూ నాతోనే ఉండేవారు. అత్తగారికి కీళ్ళవాతం. నడవటానికి చాలా బాధపడేవారు. అయినా అలా వైజాగ్లో నేనూ, బెంగుళూరులో మావారూ చాలా కాలం ఉండిపోయాం. వైజాగ్ సొంత ఊరు కనుక అత్తగారూ. మామగారూ నాతోనే ఉండేవారు. అత్తగారికి కీళ్ళవాతం. నడవటానికి చాలా బాధపడేవారు. అయినా ఎలాగోలా పాపం పనులు చేసుకునేవారు. మామగారు కూడా ఆస్తమాతో బాధపడేవారు. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి వారిద్దరి అవస్థ చూసి నాకు చిరాకు అనిపించేది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవలసింది పోయి, వాళ్ళని విడిచిపెట్టి నేను హాస్టల్కి వెళ్ళిపోతానని మావారితో చెప్పాను. అలా చేస్తే ఊరిలో జనాలు రకరకాలుగా మాట్లాడతారనీ, నన్ను ఆడిపోసుకుంటారనీ, పాపం మావారే ఓ మెట్టు దిగి తనే బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చేసి తను చేసే ఉద్యోగంకంటే తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరారు.

అత్తగారినీ మామగారినీ చూసుకోవడానికి పనివాళ్ళను పెట్టాం. మావారు కూడా వాళ్ళ అమ్మానాన్నల పట్ల చాలా జాగ్రత్త వహించేవారు. కానీ ఎందుకో వాళ్ళని నా వాళ్ళు అనుకుని ఎప్పుడూ సేవ చేయలేకపోయాను. నా ప్రవర్తనకు మావారి మనసు తీవ్రంగా గాయపడినప్పటికీ నన్ను ఏమీ అనలేదు. కానీ, మా ఇద్దరి మధ్యా ఒక రకమైన దూరం ఏర్పడింది.

ఆ విషయం అర్ధమైనా ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు నేను. మా ఇద్దరిమధ్య సమన్వయ లోపంవల్ల మా బాబుని చిన్నప్పుడే హాస్టల్లో పెట్టేశాం.

మోడుబారిన కొడుకు జీవితాన్ని చూసి లోలోనే కుమిలిపోతూ మౌనంగా రోదిస్తూ, అత్తగారూ మామగారూ ఏడాదిలోపే కాలం చేశారు. దానితో మావారికి నా మీద ఉన్న ఆ కాస్తంత ప్రేమ కూడా లేకుండా పోయింది. బతికుండగా వాళ్ళ అమ్మానాన్నలని నేను చూసుకోలేదన్న బాధ ఆయనలో ఎప్పటికీ మిగిలిపోయింది. మా మధ్యన దూరం పూడ్చలేనంతగా పెరిగిపోయింది.

చిన్నప్పటినుంచీ బోర్డింగ్ స్కూల్లో చదవడం వల్లనో ఏమోగానీ బాబు మమ్మల్ని అభిమానించే అమ్మా నాన్నల్లా చూడలేకపోయాడు. ఇంటిలో ఉన్నంతసేపూ తన గదికే పరిమితం అయిపోతాడు. అలా ఒక ఇంటిలో ఉంటున్న మేం ముగ్గురం ఎవరికి వారుగా మిగిలిపోయాం.. రాజేష్ .. అదే, మావారు నేను అనుకున్న దానికి అడ్డు చెప్పరు. అలాగే తన జీవితంలోకి నన్ను తొంగి చూడనివ్వరు. ఎవరి లైఫ్ వాళ్ళది...

బయటి ప్రపంచానికి ఎంతో సుఖసంతోషాలతో, వైభవాలతో ఉన్నట్టు కనిపిస్తున్న మేము ఒక శూన్యంలో బతికేస్తున్నాం. పెద్ద ఇల్లు ఉంది. అందరికీ వేరువేరుగా గదులు ఉన్నాయి. ఒక్కొక్కరికీ రెండేసి కాళ్లు ఉన్నాయి. కానీ అందరం ఒకటిగా లేము. నాకు ఇప్పుడు అనిపిస్తోంది. ఇవన్నీ లేకపోయినా ఒకరి మనసులో మరొకరికి స్థానం ఉంటే బాగుండును అని. కానీ ఏం లాభం- చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అయ్యింది నా బతుకు. నిన్ను అంతలా ఆకర్షించిన ఈ హారం వేసుకుని అద్దంలో నాకు నేనే చూసుకోవాలి తప్ప, నన్ను చూసి మురిసిపోయేవాళ్ళు లేరు. కానీ చంద్రబింబంలాంటి నీ ముఖాన్ని చూసి నిన్ను గుండెల్లో దాచుకోడానికి మీ ఆయన అనుక్షణం నీ చెంతనే ఉన్నారు. ఆయన అనుక్షణం నీ చెంతనే ఉన్నారు.

ఇప్పుడు చెప్పు విజయా, నేను సంపాదించినది గొప్పదా? నువ్వు సంపాదించినది గొప్పదా? నీ చదువు పనికి వచ్చిందా? నా చదువు పనికి వచ్చిందా? నీది కదా అసలైన సంపాదన. మరి 'ఏమీ చేతకాని దానిని' అంటూ బాధపడతామేటి" అంటూ భాను దిగులుగా తన సుదీర్ఘమైన మాటలను పూర్తి చేసింది. భాను మాటలు విన్న విజయకి కనువిప్పు కలిగింది. మనసు కుదుటపడింది. పశ్చాత్తాపంతో తల్లడిల్లిపోయింది. క్షణిక ఆకర్షణకి గురై తన బుద్ధి ఎందుకు అలా దారి మళ్ళింది అని దిగులుపడింది.

ఒక్కసారి వెనక్కి ఆలోచించింది. అత్తగారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె ఎక్కువ రోజులు బతకదని అందరూ అన్నారు. కానీ తను అనుక్షణం ఆమె పక్కనే ఉంటూ, మానసిక ఆలంబన ఇస్తూ ఎనిమిదేళ్ళు కాపాడుకోగలిగింది. ఇప్పుడు అత్తగారు కాస్త మామూలు మనిషి అవుతున్నారు. చిన్న చిన్న అడుగులు వేసి నడుస్తున్నారు. ఇదంతా తన సంపాదన కాదా? ఇప్పుడు విజయ మనసు చాలా తేలికపడింది. తను జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నట్టు తెలుసుకుంది. ఇకముందు కూడా తన కుటుంబంతో ఇలాగే సంతోషంగా గడుపుతానని నిర్ణయించుకుంది. మనస్ఫూర్తిగా రాణీ హారానికి గుడ్బ్భై చెప్పింది.



Rate this content
Log in

Similar telugu story from Drama