POLAVARAPU PUSHPAWATI

Inspirational

4  

POLAVARAPU PUSHPAWATI

Inspirational

మహాత్మునికి లేఖ

మహాత్మునికి లేఖ

4 mins
360


మహాత్మ గాంధీజీ, జోహార్లు, ఎప్పటినుంచో నీకు జాబు రాయాలని ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఎలా రాయాలి ఎక్కడ నుంచి ఆరంభించాలి అనే సంశయం లో పడి రాయలేక పోతున్నాము. తీరా కష్టపడి రాసాక నువ్వు బాధపడతావేమో అని ఓవైపు ఆలోచిస్తున్నాం.

ఎట్టకేలకు మరి మా మనసుని ఆపుకోలేక, మా బాధ ఎవరితో చెప్పాలో తెలియక, మరో మార్గం కనిపించక, నీకూ జాబు రాయటానికి నిర్ణయించుకున్నాము.

బాపు, సూర్యాస్తమయం లేని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ పరిపాలకులని, అహింసా, సత్యాగ్రహం అనే అద్భుతమైన ఆయుధాలతో గడగడలాడించి, ఎట్టకేలకు వాళ్ళకి వెళ్ళగొట్టి. "ఇక నా దేశం సేఫ్" అనుకున్నావు.

అంతలోనే నీ అవసరం ఇంకా లేదు అన్నట్టు నిన్ను బలవంతంగా సాగనంపించేసారు. నిజం చెప్పాలంటే అప్పుడే నీకు అర్థం అయిపోయి ఉంటుంది, నువ్వు కోరుకునే సమాజం రూపుదిద్దుకోవడానికి చాలాకాలం పడుతుందని. 150 వ జయంతి నాటికైనా నువ్వు కోరుకున్న సమాజాన్ని చూస్తావని ఆశపడి ఉంటావు. మా తరం లో మా లాంటి వాళ్లు నీ 150 వ జయంతి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాము..

కానీ బాపు ఆశలు అడియాసలే అయిపోయాయి.రోజు రోజుకి ఈ సమాజము నీ కలలకి వ్యతిరేకంగా నడుచుకుని దిగజారిపోతునే ఉంది. ముఖ్యంగా బాలికల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

స్త్రీల అభ్యుదయానికి ఎన్నో ఎన్నెన్నో పోరాటాలు చేసావు. నువ్వు కోరుకున్నట్టే స్త్రీలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారు. భూమిపైనే కాదు అంతరిక్షంలో కూడా తన సత్తా చాటుకుంటున్నారు.

మగమహారాజులకు ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో ముందుకు దూసుకు పోతున్నారు. నిజం చెప్పాలంటే కొన్ని రంగాలలో ఆడవాళ్లే కరెక్ట్ అని నిరూపించు కుంటున్నారు.

కానీ బాపు ఏమి లాభం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఇంతలా ముందుకు దూసుకుపోతున్న ఈ నారి శక్తి తన రక్షణ విషయంలో ఎందుకు పనికిరాని దాని లా మిగిలిపోతుంది. ఇప్పటికే నీకు అర్థం అయి ఉంటుంది బాబు స్త్రీలకు లేనిదల్లా వాళ్లకు సరైన రక్షణ. 1978 లో గీత అనే బంగారు తల్లిని మానభంగం చేసి అతి కిరాతకంగా హత్య చేసినప్పుడు ఉలిక్కిపడింది నీ భారతావని.

ప్రజలు దిగ్భ్రాంతి చెంది రోడ్లపైకి వచ్చారు. సుదీర్ఘమైన ప్రజా ఆందోళన నడుమ నాలుగేళ్ల వ్యవధి తర్వాత 1982లో మానవ మృగాలైన రంగా బిళ్ళకు ఉరి తీయడంతో భారతమాత మనసు కాస్త కుదుటపడింది. హమ్మయ్య ఇకనుండి ఇటువంటి కిరాతకాలు జరగవని భావించింది.

కానీ బాపు అలా జరగలేదు. ఈ కిరాతకాలు దిన దిన అభివృద్ధి చెంది, పదులు వందలుగా, వందలు వేలుగా, వేలు లక్షలు గా మారిపోయాయి. మానభంగాలు, యాసిడ్ దాడులు సర్వసాధారణం అయిపోయే స్థాయికి చేరుకుంటున్నాయి.

కోమలాంగుల పవిత్రమైన శరీరముతో కిరాతకంగా, ఆడుకుని ,దారుణంగా చంపి పైశాచిక ఆనందం పొందడమే తమ జన్మ హక్కుగా భావించే స్థాయికి ఎదిగారు మానవ మృగాలు.

ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అందంగా కనిపిస్తే తప్పు, ఒంటరిగా కనిపిస్తే తప్పు, వెంబడించవద్దు అంటే తప్పు. ప్రేమించెను అంటే తప్పు. వాళ్ల వెకిలి చేష్టలను ఎదిరిస్తే తప్పు . చెప్పుకుపోతే ఎన్నో ఎన్నెన్నో అర్థంపర్థం లేని కారణాలు ఆడవాళ్లను చేర్చడానికి.

మేము చదువుకునే రోజులలో నీ గురించి వ్యాస రచ్చన్న పోటీలకు సన్నద్ధం అవ్వాల్సి వచ్చినప్పుడు నువ్వు చెప్పే మాటల్ని తెగ కంఠస్తా పెట్టేవాళ్ళం.

నువ్వు చెప్పే ప్రతి మాట మాకిష్టం. కానీ అన్నిటిలో ఒక మాటచాలా ఇష్టం.అదేంటో తెలుసా, "ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరగ గలిగిన నాడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు ". నిజం చెప్పాలంటే అప్పటిలో ఆ మాటకి అర్థం కూడా తెలియదు. టీచరని అడిగాం,"అదేంటి ఆడవాళ్ళకి అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం ఏంటి. గాంధీతాత అలా ఎందుకు అన్నారు అని.

అప్పుడు టీచర్ చెప్పారు."గాంధీ గారి ఉద్దేశం స్త్రీకి సంపూర్ణ రక్షణ ఉండాలి . అవసరం అయితే స్త్రీ ఎప్పుడైనా ఎక్కడికైనా ధైర్యంగా వెళ్లగలగాలి.అది అర్ధరాత్రి అయినా సరే భయం లేకుండా బయటకు వెళ్లి తన పని చేసుకోగలగాలి అని. అప్పుడు ఓ విషయం తెలుసుకున్నాం, స్త్రీలకు రాత్రులు రక్షణ లేదన్నమాట, అని.

కానీ బాపు, నువ్వు ఉన్న ఆ రోజుల్లో స్త్రీకి రాత్రి రక్షణ లేదేమో కాని పగలు రక్షణ ఉండేదన మాట. ఎవరైనా ఉన్నదానికంటే మెరుగైనది కోరుకుంటారు నువ్వు కూడా స్త్రీ పగలే కాదు రాత్రి కూడా నిర్ణయంగా తిరగగలగాలి అని కోరుకున్నావు.

కానీ బాపు నీ ఆశలు ఆశయాలకి పూర్తిగా భిన్నంగా ఉంది నేటి సమాజం. ఇప్పుడు అర్ధరాత్రి ఏం కర్మ పట్ట పగలే ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా అమ్మాయిని కిడ్నాప్ చేయడం హీరోయిజ్మ అయిపోయింది.

ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురేసి మానవ మృగాలు సమూహంగా చేరి అమ్మాయిలను చీల్చి చెండాడేసి, వాళ్ల పరపతిని అడ్డుపెట్టుకుని తప్పించుకోవటం సర్వసాధారణం అయిపోయింది.

వయసుతో సంబంధం లేకుండా, మూడేళ్ల ముక్కుపచ్చలారని పసి దాని నుంచి, 40 ఏళ్ల మగువ వరకు అందరూ ఈ మానవ మృగాల పైశాచికతనానికి బలి అయిపోతుంటే, కన్నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం.

అయ్యో బాపు అలాగని ఏమి చేయట్లేదు అనుకుంటున్నావేమొ. మేమే మీ ఊరుకోలేదు. పట్టిక అప్పుడు పోరాడుతూనే ఉన్నాము. రోడ్లపైకి వస్తునే ఉన్నాము. పోరాట ఫలితమే నిర్భయ చట్టం.

నిర్భయ దోషులకు మరణశిక్ష అమలు చేయడం కూడా జరిగింది. కానీ ఏమాత్రం భయం లేకుండా కొద్ది కాల వ్యవధిలోనే "దిశా" ఉద్దంతం జరిగింది. ఒక వెటర్నరీ డాక్టర్ అతి కిరాతకంగా మానభంగానికి గురైంది. సజీవంగా దహనం చేయబడింది. అయితే అప్పుడు కూడా పోరాట ఫలితము ఏమో గాని ఆ మానవ మృగాలకు శిక్ష పడింది. అమ్మయ్య ఈ శిక్షను చూసిన మానవ మృగాలు వెనకడుగు వేస్తారేమో అనుకున్నాం.

ఎన్ని చట్టాలు వచ్చినా ఏమాత్రం ఆగట్లేదు కిరాతకుల ఆగడాలు. వీటితో పాటే, వరకట్న వీధింపులు, అత్తవారింట అగ్ని ప్రమాదాలు, ఉరితీతలు కూడా కొంతమందికి హక్కుగా మారిపోతు ఉన్నాయి

అందుకే బాబు నీ ముందు మొరపెట్టు కుంటున్నాము. ఎందుకంటే బ్రిటిషువారు మిగతా అన్ని ఆయుధాలను ఎదిరించి అణిచివేశారు గాని నిన్ను,నీ ఆయుధాలకు తలవంచక తప్పలేదు వాళ్ళకి.

అందుకే బాబు నువ్వు మళ్ళీ పుట్టి అటువంటి ఒక తిరుగులేని ఆయుధాన్ని కనిపెట్టి మా బంగారు తల్లులను కాపాడితే జన్మజన్మలకి నీ కు రుణపడి ఉంటాము.

బాపు, బ్రిటిష్ వారితో నువ్వు ఒక్కడిగా పోరాడగలిగావు కానీ ఇప్పుడు పోరాటం ఇంటిలో ఉన్న మాన మృగాలతో. మన పెద్దలు చెప్పే ఉన్నారు"ఇంటి దొంగకు ఈశ్వరుడు కూడా పట్టుకో లేడని. అందుకే బాబు నువ్వు కోటి కోటి అంశాలుగా విభజించబడి పుట్టాలి.

ప్రతి ఇంట ఒక బాపు పుట్టాలి. ప్రతి అమ్మ మీ అమ్మ పుతలి బాయిగా మారి, తమ బిడ్డలను నీలా పెంచాలి. ప్రతి మోహన్ దాస్, మహాత్మాగా ఎదగాలి. అప్పుడే ఈ భయంకరమైన రాక్షసత్వం అంతమందుతుంది. చట్టాలు సాధించలేనిది నీ నీతి సాధించగలుగుతుంది అని మా గట్టి నమ్మకం. ఈ సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం ప్రతి ఒక్కరి మనసులో స్త్రీల పట్ల అపారమైన గౌరవభావాలు కలిగి ఉండడం. స్త్రీలు కూడా ఆ గౌరవభావాలను అందుకునే ఉద్ధాతమైన స్థాయిలో ఉండ గలగాలి.

       ఈ పని నువ్వు మాత్రమే చేయగలవు. అలాంటి మంచి భావాలను నువ్వే ఈ సమాజంలో వ్యాపింప చెయ్యగలవు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసును మార్చే శక్తి నీలో నిబడీకృతమై ఉంది. అందుకేగా ప్రపంచమంతా నీవు చూపిన మార్గం సరైనది అని కొనియాడుతున్నారు.

ప్రతి సారీ నీ జయంతి ఘనంగా జరుపుకొని నీవు చూపే మార్గాలను నెమరు వేసుకుంటున్నారు ప్రజలు. కానీ ఆ మార్గంలో నడిచేవారు చాలా తక్కువ. నామ మాత్రమే అని చెప్పుకోవచ్చు. అదే ఈ అనర్థాలకు అసలు కారణం.

అందుకే బాబు నువ్వు మళ్ళీ పుట్టాలి. అందరికీ సన్మార్గంలో నడపాలి. ముఖ్యంగా మా స్త్రీ జాతికి రక్షణ కల్పించి అమోఘమైన ఆయుధాన్ని కనిపెట్టి మాకు ఇవ్వాలి.

నువ్వు వస్తావని కోటి కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉంటాము. ఎందుకో తెలుసా ఇక్కడ నేను రాసింది పావు వంతు మాత్రమే. మొత్తం రాస్తే అసలు నువ్వు కూడా భయపడి రావేమో అని భయమేస్తుంది. అంత ఘోరంగా ఉంది. మిగతా విను వచ్చాక చూస్తావులే.

వస్తావు కదా, బాపు?


ఇట్లు,


నీవు ఎంతగానో అభిమానించే

నీ భారత బాలికలు.

 

స్వస్తి .

పోలవరపు పుష్ప

సోంపేట, శ్రీకాకుళం

ఆంధ్ర ప్రదేశ్.



Rate this content
Log in

Similar telugu story from Inspirational