మొనగాడు
మొనగాడు


చలపతి ఆ ఊళ్ళో మోతుబరి రైతు
60 ఏళ్ళ క్రితంపెదనాన్న ఇంటికి దత్తుడుగా వచ్చాడు
పదో తరగతితో చదువు ఆపించాడు పెదనాన్న
మనకున్న పది ఎకరాలభూమి సాగు చేసుకొంటూఊళ్ళోనే ఉండిపొమ్మన్న పెదనాన్న మాట చలపతికిశిరోధార్యమైంది
200 ఇళ్ళన్న చిన్న గ్రామమది
అన్ని కులాలవాళ్ళకు చలపతి కావలసినవాడు. గ్రామపార్టీలలో తలదూర్చ లేదు
పంచాయతీ సర్పంచిగానిలబడమని కుర్రకారు బ్రతిమాలారు నాలుగు దఫాలు
చలపతి ససేమీరా అని తన పొలంపై పనులు స్వయంగా చేసుకొస్తున్నాడు
కొడుకును MA చదివించాడు
మంచి సంప్రదాయకుటుంబంలో పిల్లను తెచ్చి పెళ్లి చేశాడు
కొడుకు ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ తన దగ్గర ఉండి పొమ్మంటే ‘మా కక్కడ ఏం తోస్తుందని ‘ ఊళ్ళో వారకు తలలో నాలుకగా ఉండి పోయాడు
’గూట్లో దీపం నోట్లో ముద్ద ‘ అని పొరుగువాళ్లు అనేవారు
రాత్రి ఏడింటికిభార్యాభర్త లిద్దరూ రెండేసిచపాతీలు తిని గ్లాసులు వేడిపాలుతాగి ఎనిమిదింటికే పడుకొనేవారు
ఒక్కొక రోజు పోతన భాగవతం తీసి పద్యాలు రాగయుక్తంగా చదువుతూ పొంగి పోయేవాడు
ఆ సమయానికి నలుగురురైతులు వచ్చి కూర్చొని వినేవారు
సందర్భానుసారంగా చలపతి పద్యాల సొగసులు వివరించేవాడు
పొద్దుటే ఐదింటికే శారదమ్మ లేచి తరంగాలు పాడుతూ పాచిపనులు స్వయంగా చేసుకొనేది
చలపతి స్నానాదులు ముగించి ధావళీ కట్టుకొని పూజామందిరంలో పట్టుమని పది నిముషాల్లో ముగించేవాడు
టిఫిన్ తిని ఆరింటికే ఎద్దుల బండి కట్టి పొలానికి ఎరువు తోలేవాడు
కాలి నడకన రోజూ మూడుమైళ్ళు నడిచి పొలానికి వెళ్ళేవాడు
నాలుగేళ్ళ కిందట కొడుకూకోడలు ఢిల్లీనుండి వచ్చి చలపతి షష్టి పూర్తి బంధుమిత్రుల సమక్షంలో ఊళ్ళోనే ఘనంగా జరిపి వెళ్లారు
యథాప్రకారం ఆ సంవత్సరం కృష్ణమందిరంలో రుక్మిణీకృష్ణుల కల్యాణం శారదమ్మ చలపతి పీటల మీద కూర్చొని జరిపించారు
ప్రసాదవితరణకు ముందు ఉట్టి కొట్టే సంబరం ఆ ఊళ్ళో ఏటా జరుగుతుంది
తూర్పు వీధి కుర్రాళ్ళంతా ఒక జట్టు
పడమటి వీధి కుర్రాళ్లు మరోజట్టు
పోయిన సంవత్సరం పడమటి వీధి జయరాం ఉట్టి కొట్టి 116 రూపాయలు గెల్చుకొన్నాడు
ఈసారి తూర్పువీధి వాళ్ళు ఉరకలు వేస్తున్నారు
తూర్పువీధిలో ఉంచాడు చలపతి
ఒక్కొక్క జట్టుకు ఆరు ఛాన్సులు
పడమటివీధి కుర్రాళ్లు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి
తూర్పువీధి శివ కండలు తిరిగిన మొనగాడు.కాలు విరిగి ఈ ఏడు రాలేక పోయాడు
ఆఖరి ఛాన్సు
తూర్పు వీధి కుర్రాళ్లంతా చలపతి పాదాలు పట్టుకొని రంగంలోకి దించారు
’నేను ఈ వయస్సులో .... ‘ అంటూనే పంచ ఎగదీసి గోచీ పెట్టాడు
’నడుములు పట్టుకొంటాయండీ! వద్దని శారదమ్మ హెచ్చరిక చేసింది
కుర్రాళ్ళు ‘ జై హనుమాన్’ అని కేకలు పెట్టారు
మరుక్షణంలో చలపతి లంఘించడం, ఉట్టికొట్టడం జరిగి పోయాయి
కుర్రాళ్ళు చలపతిని భుజాల పైకి ఎక్కించుకొని మందిరం ముందుకు తీసుకొచ్చారు
’ముసలాడైనా బసిరెడ్డి మేలు’ అని ఊరికే అనలేదని వరహాలు పెద్దగా అరిచింది స్వానుభవంతో