kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం 21 వ భాగం

మనసు చేసిన న్యాయం 21 వ భాగం

3 mins
9


మనసు చేసిన న్యాయం 21 వ భాగం

''అమ్మ...విజయా.. వచ్చి అత్తయ్య గారికి నమస్కారం పెట్టమ్మా'' అంది అత్తయ్య గారు.

జరుగుతున్నదంతా వింత చూపులతో చూస్తున్న వదిన యాంత్రికంగా లేచి వచ్చి అమ్మకి నమస్కరించింది.అమ్మకి ఎందుకో కన్నీళ్ళు ఆగలేదు.

''బాగున్నావా అమ్మా?'' అడిగింది వదినను. 

''ఊ'' అని జవాబిచ్చి తలవంచుకుంది వదిన. 

''వాడు..నాకొడుకు. ఆయన పోయాకా పెళ్లి చేసాను. వీడికి ఒక కొడుకు.''అంది అత్తయ్యగారు తన కొడుకును చూపిస్తూ.

అతను వచ్చినప్పటినుంచి అటూఇటూ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. మధ్యలో ఆగి ఫోన్ కళ్ళముందు పెట్టుకుని చూసుకుంటున్నాడు. 

ఇంతలో 'చిన్నాన్న' అంటూ బయటకు వచ్చిన సాత్విక నా దగ్గరగా వచ్చింది. 

సాత్వికను చూడగానే వాళ్ళ ముగ్గురు కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి. 

''ఎవరు వదినా? ఈ పాప ...బలే ముద్దొస్తోంది? మీ అమ్మాయా?'' అని అడిగింది నన్ను.

''మీ మనవరాలే. పేరు సాత్విక. '' అన్నాను నేను.

''మేము బారసాలలో పెట్టుకున్న పేరు 'ఉజ్వల' కదా.. సాత్విక ఏమిటీ?'' అంది అత్తయ్యగారు. 

''బారసాలకి నేను ఆసుపత్రిలో ఉండటం వల్ల రాలేకపోయాంగా...మీరు ఆ పేరు పెట్టుకున్నట్టు మాకు తెలీదు. మాకు తాను ఎప్పుడూ సాత్త్విక.'' అంది అమ్మ.

''ఈవిడ ఎవరో తెలుసా?'' అని అడిగింది వదిన దగ్గరకు సాత్విక రెక్కపట్టుకుని చూపిస్తూ అత్తయ్యగారు. 

'' తెలీదండి.'' అంది సాత్విక.

'' మీ అమ్మ. పేరు విజయ.'' 

'' అమ్మా..నీ పేరు విజయా?'' అడిగింది సాత్విక వదిన చెయ్యి పట్టుకుని.

''మరి నీ పేరేమిటి?'' అడిగింది వదిన.

''సాత్విక''

''ఏం చదువుకుంటుంన్నావ్?''

''నాల్గవ తరగతి. మా క్లాస్ లో ఫస్ట్ రాంక్ నాదే తెలుసా?'' అంది సాత్విక కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. 

''అలాగా!'' అన్న వదిన ఒక్కసారిగా రెండు చేతులూ చాచి సాత్వికను గుండెలకు హత్తుకుంది.అలా ఒక రెండు క్షణాలు వుండిపోయిన వదిన కళ్ళల్లో నీళ్లు.

''ఫోజ్ చాలా బాగుందే అక్కా. '' అని వదిన తమ్ముడు వదినను, సాత్వికని ఫోటో తీసాడు.

''నాక్కూడా తీయరా అబ్బాయి.'' అని అత్తయ్యగారు వదిన పక్కన కూర్చుని, వదినచేతుల్లోంచి పాపను తీసుకుని తన వొళ్ళో కూర్చోపెట్టుకుంది.

అతను చకచకా 'స్మైల్' అంటూ అయిదారు ఫోటోలు తీసాడు. 

''చిన్నాన్నా..నాకు ఈ లెక్క చెప్పవా..'' అంటూ సాత్విక నా చేయిపట్టుకుంది. నేను సాత్వికతో లోపలకు నడిచాను. 

మరో పదినిముషాలు వాళ్ళు ఏంమాట్లాడుకున్నారో...అమ్మ నన్ను బయటకు పిలిచింది. నేను బయటకు వచ్చేసరికి అత్తయ్యగారు అంటోంది.

'' ఆయన పోయిన సంవత్సరానికి మా నాన్నకూడా పోయాడు. నీకు తెలుసా? రాకపోకలు లావుగా..నీకు తెలీదులే. మానాన్న నాకిచ్చిన పొలం ఇక ఒక ఎకరమే మిగిలింది వదినా. దాన్ని బేరానికి పెట్టాను. ఎలాగూ అటువెళ్తున్నామని పాత ఇంటికి వెళ్తే మీ అడ్రస్ మీ ఇంటివాళ్ళు చెప్పారు. వెతుక్కుంటూ ఇలా వచ్చాము.వెళ్ళొస్తామయ్యా.'''' అంది అత్తయ్యగారు.

''అలాగేనండీ.'' అన్నాను నేను.

''ఏమిరా? వచ్చిన పని అయిందా ? వెల్దామా మరి?''అడిగింది తన కొడుకును. 

"అయిందమ్మా"అన్నాడు అతను.

''భోజనాలు చేసి వెళ్ళమనండి'' అంది చంద్రిక.

''మీరంతా ఉపవాసాలు ఉన్నట్టున్నారు. మీకెందుకులే శ్రమ. అయినా హోటల్లో టిఫిన్ కడుపునిండా తినే వచ్చాము. వెళతాం వదినా..'' అని ఆవిడ ముందుకు కదిలింది.

ఆమె కొడుకు అనుసరించాడు..కానీ వదిన మాత్రం సాత్విక కనిపిస్తున్నంతసేపూ వెనుతిరిగి చూస్తూనే వెళ్ళిపోయింది. 

వాళ్ళు ఎందుకొచ్చివెళ్లారో...వాళ్లకి అయిన పనేమిటో నాకు అర్ధం కాలేదు. కానీ వాళ్ళు వచ్చి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక ఫలితం మాకు ఉంటుంది అని తరువాత తెలిసింది.

*******

ఆ శనివారం అన్నయ్య వస్తూనే అమ్మ చేతిలో ఏవో కాగితాలు పెట్టాడు.

"ఏమిట్రా ఇవి..ప్రమోషనొచ్చిందా?"అమ్మ సంతోషంగా అడిగింది.

"నా బొంద. ఈ వారంలో విజయా వాళ్ళు ఇటేమైనా వచ్చారా?వాళ్ళని ఎందుకు లోపలికి రానిచ్చారు?"అన్నాడు కోపంగా.

"ఏమైందిరా అన్నాను నేను?"

"ఏముందిరా? రామేశ్వరం వెళ్లినా....అన్న సామెతలా...మీ వదిన చేత విడాకులకు, భరణానికి కేసువేయించారు నామీద. మొన్న ఎవరెవరు వచ్చారేమిటి?"

అన్నయ్య అడిగినదానికి జరిగినదంతా చెప్పాను.

"అదీ సంగతి.రేపు కేసు విచారణకు వచ్చాకా సాత్విక వాళ్లదగ్గరే ఉందని సాక్ష్యాలు చూపించడానికి ఫోటోలు తీసుకున్నారన్నమాట. అన్నీ వెధవబుద్ధులే. విత్తనం ఒకటైతే మొక్క వేరొకటి వస్తుందా అని...ఆ తల్లికి తగ్గ కొడుకు అన్నమాట."

అపుడు అర్ధమైంది అత్తయ్యగారు వెళ్తూ "పని అయిందా...వెల్దామా?"అని ఎందుకు అడిగిందో?

" మరి ఏం చేద్దాం అనుకుంటున్నావ్ రా?" అడిగింది అమ్మ .

"వాళ్లు అక్కడ కోర్టులో కేసు వేశారు. నేను ఇక్కడ కోర్టులో కేసు వేస్తాను. నేనుమగవాణ్ణి. నేను ఎక్కడికైనా వెళ్ళగలను. వాళ్లు ప్రతి సారి ఈ ఊరు కోర్టుకు కావాలంటే ఆ తల్లి, కొడుకు, కూతురు,ముగ్గురు రావాల్సిందే. దారి ఖర్చులకే అవుతాయి డబ్బులన్నీ." అన్నాడు అన్నయ్య.

" నెలనెలా భరణం అని కాకుండా ఒకేసారి ఇంత మొత్తం అని చెప్పి భరణం ఇచ్చేసెయ్యి. వదిలిపోతుంది .అప్పుడు ఆ విడాకులేవో తొందరగా మంజూరైతే నీ జీవితానికి కొత్త దారి వెతుక్కోవచ్చు"అన్నారు నాన్నగారు.

అలా అయినా కోర్టులో కేసులు మూడుసంవత్సరాలపాటు కొనసాగాయి.అనుకున్నట్టుగానే పాప తమదగ్గరే ఉందని ఆనాడు తీసిన ఫోటోలు సాక్ష్యాలుగా పెట్టారు వాళ్ళు. సాత్విక పుట్టిన నాల్గవ నెలనించే మా దగ్గర ఉన్నట్లు, కాన్వెంట్ లో చదువుతున్నట్లు అన్నయ్య సర్టిఫికెట్లు కోర్టువారికి అందచేశారు.

చివరగా సాత్వికనే విచారించింది కోర్టు.

తనకు అమ్మ ఎవరో తెలియదని, ఆ ఎదురుగా బోనులో కనిపిస్తున్న ఆవిడ ఒకసారి తమ ఇంటికి వచ్చిందని, తనతో ఫోటోలు తీయించుకుందని, తాను నాన్న దగ్గరే ఉంటానని చెప్పింది.

నెల నెలా భరణం కన్నా ఒకేసారి కొంత మొత్తాన్ని తన కుమార్తెకు జీవిత భరణంగా ఇప్పించమని కన్నీళ్లతో ఇద్దరు లాయర్ల సమక్షంలో వేడుకోవడంతో అన్నయ్య "పది లక్షలు"ఇవ్వడానికి అంగీకరించి, అటు స్నేహితులని, ఇటు అమ్మ దగ్గర దాచుకున్న సొమ్ముని పోగుచేసి కోర్టులో కట్టేసాడు.

ఆ డబ్బు వదిన సంరక్షణార్ధం కోర్టు సమక్షంలో డిపాజిట్ చేయబడింది.

అన్నయ్యకు వదిన నుండి విడాకులు మంజూరు అయ్యాయి.

అన్నయ్య సమస్యకు పరిష్కారం లభించడంతో ఇంట్లో అందరమూ సంతోషించాము. అప్పటికి సాత్విక 9వ తరగతిలోకి వచ్చింది.

(మిగతా 22 వ భాగంలో)Rate this content
Log in