Parimala Pari

Drama Inspirational

4.4  

Parimala Pari

Drama Inspirational

మళ్ళీ ఆడపిల్లా?!

మళ్ళీ ఆడపిల్లా?!

3 mins
337


పెళ్ళి అయిన ఆరునెలలకి శ్రావ్య ఒకసారి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తే టెస్ట్ చేసి రెండో నెల అని చెప్పారు. ఇంట్లో అందరూ ఆనందించారు.అమ్మాయి పుట్టింది. మహా లక్ష్మీ అనుకున్నారు.

రెండవ సారి గర్భవతి అయ్యింది శ్రావ్య. స్కానింగ్ సమయంలో అత్తగారు విశాలాక్షి అడిగింది ఆడపిల్ల మగపిల్ల చెప్పమని. డాక్టర్ ససేమిరా అంది.

ఇంటికి వచ్చాక డాక్టర్ ని తిట్టడం మొదలు పెట్టింది. అమ్మాయి అయితే ఎలా, రెండోసారి కూడా అమ్మాయే పుడితే అబ్బాయి పుట్టకపోతే వంశోద్ధారకుడు ఎక్కడ నుంచి వస్తాడు అని.

"అదేంటి అత్తయ్య అలా అంటారు. ఎవరయితేనేం మనకి పిల్లలు చాలు కదా. అయినామీరే అంటారుగామన చేతుల్లో ఏమి లేదని, మరి ఇది మాత్రం మన చేతుల్లో ఉన్న పనా? ఆ భగవంతుడు ఎవర్ని ఇస్తే వాళ్లే, కానీ ఇందులో మనం చేసేదేమీ లేదు. అది మీకు కూడా తెలుసు కదా మళ్ళీ ఇదేంటి అత్తయ్యా" అని అడుగుతుంది.

"ఒకవేళ ఇప్పుడు కూడా మళ్ళీ ఆడపిల్ల పుడితే ఏంచేస్తావే, అందుకే ముందు జాగ్రత్తగా స్కానింగ్ తీయిద్దాం మగ పిల్లాడు అని తేలితే వుంచుకోవచ్చు. అదే ఆడపిల్ల అయితే తీయించేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి చూడచ్చు కదా" అంటుంది విశాలాక్షి.

"అత్తయ్యా, ఇప్పుడు డాక్టర్లు ఎవరూ స్కానింగ్ తీయట్లేదు, ఇదుగో ఇలా మీలాగే అందరూ ఆలోచిస్తున్నారు అనేనేమో. ఆడపిల్లల్ని కడుపులో ఉండగానే చిదిమేస్తున్నారు. అభం శుభం తెలియని ఆ పసిగుడ్డు ఏం చేసిందని? ఇది న్యాయం కాదు" అంటూ తన బాధని చెప్పుకుంటుంది.

శ్రావ్య ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. తనకి చెకప్ చేసిన డాక్టర్ ని అడుగుతుంది శ్రావ్య అత్తగారు విశాలాక్షి. "డాక్టర్ అమ్మాయా అబ్బాయా" అని. "అలా చెప్పటం కుదరదు అమ్మా, అలా చేస్తే కేస్ వేస్తారు. జైల్లో కూడా పెడతారు. ఎవరైనా సరే పర్వాలేదు అనుకోవాలి. ఇంక మీరు వెళ్ళచ్చు" అని కచ్చితంగా చెప్పింది డాక్టర్.

ఒక నిట్టూర్పు విడిచి వచ్చేసింది విశాలాక్షి. కానీ కొడుకు చంద్రం కూడా "అమ్మా ఎవరైతే ఏంటి మనకి" అని వారించటంతో ఊరుకుంది. కానీ మనసులో మాత్రం మనవడే పుట్టాలి అని కోరుకుంటూ ఉండేది.

శ్రావ్య కి నెలలు నిండాయి, నొప్పులు రావటంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది అని అర్జంట్ గా ఆపరేషన్ చేయాలి అన్నారు. 

ఆపరేషన్ చేసి ఆడపిల్ల అని చెప్పింది డాక్టర్. విశాలాక్షిలో అసహనం పెరిగిపోయింది. "ఇదుగో డాక్టరమ్మ ఇంకోసారి అయినా మగ పిల్లాడు పుట్టేలా చూడండి. ఇప్పుడే ఆపరేషన్ అదీ వద్దు అని నువ్వైనా చెప్పమ్మా వీళ్ళకి" అంది. 

"చూడండి, ఇంకోసారి ట్రై చేయటానికి అవకాశం లేదు. మీ కోడలు గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. సారీ అమ్మా" అని చెప్పి వెళ్లిపోయింది డాక్టర్.

విశాలాక్షి శోకాలు అందుకుంది. వారసుడు పుట్టలేదు అని. ఆవిడకి ఇద్దరూ కొడుకులు, పెద్ద కొడుక్కి ఆడపిల్ల, అమ్మాయికి ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు చిన్న కొడుక్కి ఇద్దరు ఆడపిల్లలు కావటంతో ఆవిడ ఆశ నిరాశ అయిపోయింది. మగ పిల్లాడిని కనలేదని కోడలి మీద అరుస్తూ ఉండేది.

ఒకసారి ఇంక పట్టలేక శ్రావ్య ఇలా అంది. "అత్తయ్యా ఈరోజుల్లో ఎవరు అయితే ఏంటి అత్తయ్యా, మీరే అంటారుగా ఆడపిల్ల ఉన్న ఇల్లు అందమే వేరు అని. ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు మహాలక్ష్ములు లాగా తిరుగుతూ ఉంటే సంతోషించాల్సింది పోయి అలా బాధ పడతారు ఏంటి? 

ఆడపిల్లలు పుట్టనంత మాత్రాన అందరూ సంతోషంగా లేరా? మీ ఆడపడుచు మగ పిల్లాడి కోసం చూసి చూసి ఆరుగురిని కన్నారు ఎప్పటికో పుట్టాడు ఆ వంశోద్ధారకుడు. అంతమంది పిల్లలతో ఆవిడ ఎంత కష్టపడిందో మీకు తెలుసు కదా అత్తయ్యా! అదీ కాక కొడుకు తిన్నగా లేడు, కొడుకు పెళ్ళి కావటం లేదు అని ఇప్పటికీ తెలిసున్న అందరిని సంబంధం అడుగుతూనే ఉన్నారు కదా!

ఇప్పుడు చెప్పండి అత్తయ్యా, మా ఇంట్లో మేము ముగ్గురం ఆడపిల్లలమే, మరి మా అమ్మ అలా ఎప్పుడూ అనుకోలేదే! మమ్మల్ని మగ పిల్లలతో సమానంగా పెంచింది. 

ఇప్పుడు నేను కూడా అలాగే నా కుతుళ్ళకి అదే చెప్తాను. ఆడమగ సమానం అని. ఏమంటారు అత్తయ్యా? మీరే అంటారుగా మీకు ఆడపిల్ల లేని లోటు అలాగే ఉంది అని, నాలో మీ కూతురిని చూసుకోండి, మీలో నేను మా అమ్మని చూసుకుంటాను. అప్పుడు ఇద్దరికీ ఏ బాధ ఉండదు" అంటుంది.

కోడలి తెలివి తేటలకి, మాట తీరుకు ఎంతో సంతోషించింది విశాలాక్షి. అప్పటినుంచి మనవరాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటూ, వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసింది. మగవాళ్ళతో సమానంగా ఉండాలని కోరుకుంటుంది.



Rate this content
Log in

Similar telugu story from Drama