కొత్త జంట
కొత్త జంట
ఆ! వొదిన గారూ.. అంతా రెడీ అండీ. అబ్బాయి దారిలో ఉన్నాడు. ముహూర్తం సమయానికి వచ్చేస్తాడు అంది సుగుణ బంధువుతో.
పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. అప్పుడే భోజనం చేసి, అసలు వడ్డించిన ముప్పై ఆరు వంటకాల్లో ఉప్పు దేంట్లో తక్కువైందో, కారం ఎందులో ఎక్కువైందో చర్చిస్తూ స్టేజీ వైపు చూస్తూ ఉంది రేవతి. ముందు వరుసలో ఒకావిడ వెనక్కి తిరిగి అబ్బాయిదేవూరో? అంది.
అయ్యో. మీకు విషయం తెలిసినట్టు లేదే? అబ్బాయి ఆటోమేటాను(Automaton) అంది పక్కనే ఉన్న ఓ పెద్దావిడ. అంటే అని అడిగింది అర్థం కాక రేవతి.
ఆ పెద్దావిడ తన పక్కన కూర్చున్న మనవరాల్ని తట్టి, ఇదిగో అబ్బాయి గురించి వీళ్లకు చెప్పు అంది.
ముందు వరుస నుండి వెనక్కి తిరిగి చెవులు రిక్కించి మరీ వింటోందావిడ. రేవతి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తోంది.
ఆ చిన్న పిల్ల ఇలా చెప్తోంది. Automaton అంటే మనిషి కాదు. అదో యంత్రం లాంటిదే. పెళ్లి కూతురు ఏ విషయంలోనూ ఎవరితోనూ రాజీ పడదట. అందుకే తనకు ఎలాంటి భర్త కావాలో అలా ఆ Automaton ప్రవర్తించే విధంగా డిజైన్ చేయించుకుందట. అమ్మాయి ఆశ కాదనలేక వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది అని గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది.
రేవతి కాస్త చదువుకుంది. కానీ ఈ వింత సంగతులు అర్థం కాలేదు ఆమె బుర్రకి. మనసు, మనసు కలిపి మంచీ చెడూ అంటూ ఇద్దరి గురించీ ఆలోచించి, కుటుంబ వ్యవస్థను నడపాల్సిన కొత్త జంట స్థానంలో కేవలం తన మాటే నెగ్గాలి అనే జీవిత భాగస్వామి అతి తెలివితో వేసే ఏడు అడుగులు కనిపించాయి అక్కడ. అందరూ ఇలానే అవుతారా? ఓ మాటన్నా పడని అమ్మాయి, భర్తను ఏదో రకంగా సాధించే భార్య, భార్యను హింస పెట్టే భర్త ..
ఒకరినొకరు క్షమించుకోకుండా ఒకే కప్పు కింద నివసిస్తూ శిక్షించుకునే జీవిత ఖైదీలా భార్యా భర్తలంటే? ఇదేనా ఈ తరం నేర్చుకున్న పాఠం..
ఇవన్నీ చూసి,విని విసిగిపోయిన యువతరం ఇలా యంత్రాల్నే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటుందా?
ఇది వ్యక్తిగత అభిప్రాయాలకి విపరీతమైన శక్తి కల్పించిన పరిస్థితుల ఆటలా ఉంది. ఇష్టాఇష్టాలు మంచివే, రేపు నువ్వే వెర్రి పని చేసినా సమర్థించుకునే ఆర్థిక, శారీరిక శక్తి ఉందని ఎంత దూరం వెళతావ్? సృష్టికి ప్రతి సృష్టి అంటే ఇదేనా? యుగాంతమా? రేవతి ఇదంతా ఆలోచించి పెళ్లి కూతురిని ప్రశ్నించాలి అనుకుంది. కానీ ఆమెకు ధైర్యం చాలలేదు.
సర్దుకుని సంసారం చేసే రోజులు పోయి, ఇలా కొత్త ప్రయోగాలు సమాజంలోకి వచ్చేశాయి అని ఇదెక్కడా కాలజ్ఞానంలో లేదే అని ముందు వరుసలో ఉన్నావిడ వాపోయింది.
ఆ పెద్దావిడ మరొకరికి పెళ్లి కొడుకు గురించి చెప్పడానికి వెనక్కి వెళ్ళి కూర్చుంది. ఇంతలో ఎవరో అదిగో పెళ్లి కొడుకు అనగానే జనం గుంపుగా ఉన్న వైపు చూసింది.
