Rama Seshu Nandagiri

Drama

5.0  

Rama Seshu Nandagiri

Drama

ఇంటర్వ్యూ

ఇంటర్వ్యూ

2 mins
306


సుమారు నలభై సంవత్సరాల క్రితం నాకు ఇరవై రెండు సంవత్సరాల వయసులో జరిగిన సంఘటన. అవి డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్న రోజులు

భద్రాచలం పేపర్ బోర్డ్స్ నుండి కాల్ లెటర్ వచ్చింది. చాలా సంతోషంగా ఇంటర్వ్యూ కి వెళ్ళడానికి తయారయ్యాను. మేము ఉండేది వైజాగ్. నాన్న గారు ఆ మధ్యనే కాలం చేశారు. భద్రాచలం లో మా బావ అదే కంపెనీలో ఆఫీసర్ గా ఉన్నారు. ఆ ధైర్యం తో అమ్మ నన్ను పంపడానికీ ఒప్పుకుంది.

అంతేకాదు, భద్రాచలం మా నాన్నగారు పుట్టి పెరిగిన ఊరు. మా తాతగారు అదే ఊరిలో హెడ్మాస్టర్ గా చాలా కాలం పని చేశారు. మళ్లీ నాకు అదే ఊరిలో ఉద్యోగం వస్తే బాగుంటుంది అని కూడా ఆశ పడ్డాను. ఆ ఉత్సాహంతో ఆ ఊరి కి బస్ లో ప్రయాణమయ్యాను‌ ముందు రోజు బావకి బస్ లో వస్తున్నట్లు టెలిగ్రాం ఇచ్చాను. బావ బస్టాండ్ కి వస్తారని నమ్మకం తో ఉన్నాను.పన్నెండు గంటల ప్రయాణం తరువాత భద్రాచలం

వచ్చింది. బావ కోసం చూసాను. ఎక్కడా కనపడలేదు. ఆదుర్దా పెరిగింది. బస్ తిరిగి కొత్త గూడెం వెళ్ళడానికి బైలుదేరు తోంది. కండక్టర్ ఆ బస్ పేపర్ బోర్డు పక్కనుంచి వెళుతుందని చెప్పడంతో అదే బస్ లో పేపర్ బోర్డు దగ్గర దిగాను. ఎదురుగా పెద్ద ఫేక్టరీ. చుట్టూ చిమ్మ చీకటి. సమయం రాత్రి ఎనిమిది గంటలు. భయం భయంగా గేట్ దగ్గర కు వెళ్లి బావ పేరు చెప్పాను. ఆఫీసర్ క్వార్టర్స్ లో ఉంటారు. వెళ్ళమన్నారు. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాను. అన్ని క్వార్టర్స్ లో వాళ్ళు ఉండేది ఎక్కడ? తల్చుకుంటే

భయమేస్తోంది. కానీ అలాగే నడుస్తున్నాను. అలా ఎంత సేపు నడిచానో. ఎవరో ఇద్దరు నా వెనకాతల వస్తున్నట్లు అనిపించింది. అవును. ఎవరో వస్తున్నారు. వాళ్ళు నన్ను దాటుకుని వెళ్ళి పోతున్నారు. వాళ్ళని ధైర్యం చేసి పిలిచాను. మా బావ పేరు చెప్పి ఆయన ఇంటి అడ్రస్ అడిగాను.అందులో ఒకతను ఆయన తెలుసు కానీ అడ్రస్ తెలియదని హిందీ లో జవాబిచ్చాడు. నాకు హిందీ రావడం తో నేను ఆయనకి బంధువునని ఎలాగైనా ఆయన అడ్రస్ కావాలని రిక్వెస్ట్ చేసాను

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి వెళ్తే తెలుస్తుంది, వస్తే తీసుకెళ్తామని అన్నారు వాళ్ళు. నాకు వేరే దారి లేదు. వాళ్ళ సహాయం తీసుకోక తప్పదు. ఆ తొమ్మిది గంటల రాత్రి అపరిచితులను నమ్మి వారి వెంట వెళ్ళక తప్పలేదు. బస్టాండ్ కి రాని బావని మనసులోనే తిట్టుకుంటూ వారిని మౌనంగా అనుసరించాను.

వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి తీసుకు వెళ్లి అక్కడ మా బావ గారి పేరు అడిగారు. వెంటనే బావ బయటికి వచ్చి "సారీ, నాకు ఆఫీస్ లో మీటింగ్ ఉండటం తో నిన్ను రిసీవ్ చేసుకోలేక పోయాను. నాకు ఇంకా పని ఉంది. ఇంటి కి వచ్చాక మాట్లాడదాం. వీళ్ళు నిన్ను మన ఇంటి దగ్గర దిగ పెడతారు." అంటూ మరో మాటకు తావివ్వకుండా వారికి అడ్రస్ చెప్పి మళ్ళీ వాళ్ళ తోనే ఇంటికి పంపించారు. ఇంకేమీ అనలేక వారిద్దరినీ అనుసరించి ఇంటికి చేరుకున్నాను.

ఇంట్లో వాళ్ళని చూసేవరకు నాకు టెన్షన్ తగ్గ లేదు. వాళ్ళని చూసాక ధైర్యం వచ్చి ‌వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపాను.

ఇప్పటికీ ఆ సంఘటన తల్చుకుంటే వళ్ళు గగుర్పొడుస్తుంది. వాళ్ళిద్దరూ కనపడకున్నా,

లేదా మంచి వారు కాకున్నా నా పరిస్దితి ఏమైఉండునో అనుకుంటే భయం కలుగుతుంది.



Rate this content
Log in

Similar telugu story from Drama