హోమ్ లోన్
హోమ్ లోన్
నన్నడిగి లోన్ తీసుకున్నావా? నా జీతంలోంచి ఎందుకు కట్టాలి అంది సంధ్య కాస్త గట్టిగానే.
పెళ్లి కాగానే భర్త తన జీతం కోసం ఆశ పడతాడని వాళ్లక్క ముందునుంచి చెప్తూనే ఉంది. అదే జరిగిందనే కోపంతో అలా అంది సంధ్య.
శ్రవణ్ మొహం అదోలా పెట్టాడు. తను ఇల్లు తీసుకుంది సంధ్య ఇబ్బంది పడకూడదనే. సంధ్య ఆఫీసుకి దగ్గర్లో ఉండేలా ఆలోచించి మరీ ఈ అపార్టుమెంటులో ఫ్లాట్ కొన్నాడు.
ఇప్పుడు కొన్ని అనుకోని ఖర్చులు వచ్చాయని సంధ్య జీతంలోంచి నెల నెలా కొంత డబ్బులు ఇవ్వమని అడిగాడు. అందుకే ఈ అలజడి.
మన కోసమే కదా ఇదంతా అని సర్దిచెబుదామని ప్రయత్నించాడు. తనను తాను గొప్ప ఫెమినిస్ట్ గా అనుకునే సంధ్యకు వాదించడమే సరైన మార్గంగా తోచింది.
ఎన్నయినా చెప్పు శ్రవణ్! నా జీతం జోలికి వస్తే ఊరుకునేది లేదు. భర్తన్నాక ఇల్లు, ఖర్చులు అన్నీ చూసుకోవాలి. ఇలా నా జీతం అడుక్కోడం ఏమీ బాలేదు అని విసురుగా వేరే గదిలోకి వెళ్ళింది.
భరించాలనే బాధ్యత, బయటికి చెప్పుకుని నిస్సహాయుడిలా మారొద్దనే హెచ్చరికల మధ్య అతను అలా స్థాణువులా నిలబడ్డాడు.
