Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Varun Ravalakollu

Thriller

4.5  

Varun Ravalakollu

Thriller

ఎవరు - 3

ఎవరు - 3

4 mins
615


3. అమ్మాయి-అవకాశం“ఈ చోటు అంత మంచిది కాదు. అందులోనూ నీలాంటి భయస్తులు ఇక్కడ ఉండటం చాలా కష్టం. జాగ్రత్తగా ఉండు.”

తెల్లవారు ఝామున నిద్ర పట్టటం వల్ల, ఉదయం చాలా ఆలస్యంగా లేచాను. లేచిన వెంటనే బయటకి వచ్చి భవంతి వైపు చూసాను. అంతా నిశ్శబ్దంగా ఉంది. దగ్గరకు వెళ్లి గమనించాను. అంతా మాములుగానే ఉంది. ఎవరి పనిలో వారు ఉన్నారు. మనసు కొంచెం కుదుట పడింది. అప్పుడు నాకు పరీక్షా సమావేశం ఉంది అని గుర్తుకు వచ్చి, ఉరుకు పరుగులు మీద పనులన్ని ముగించుకుని భవంతిలో మహేష్ భూపతి గారి ఆఫీస్ కి బయలుదేరాను.

“ఎందుకు ఆ హడావిడి? పెద్దవాళ్లు ఎప్పుడు ఆలస్యంగా వస్తారు! నువ్వు కంగారు పడి, ఆ కంగారులో తిక్క తిక్క సమాధానాలు చెప్పి ఉన్న అవకాశం చెడగొట్టుకోకు.” అని మనసులో నాకు నేనే సర్దిచెప్పుకొని లోపలికి అడుగుపెట్టాను. అప్పటికే ఆయన నా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన కళ్ళలో కోపం స్పష్టంగా కనిపించింది. నాకు కంగారు మొదలైంది.

“రా రాయుడు… కూర్చో”

నేను కుర్చీలో కూర్చున్నా. ఆయన ఏవో దరఖాస్తులు చూస్తున్నారు. రాజసం ఆయన వేస్కున్న బూట్ల నుండి పెట్టుకున్న టోపీ వరుకు కనిపిస్తుంది. బట్టలే కాదు, మనిషి మొహంలో కూడా ఆ కళ కనిపిస్తుంది. దరఖాస్తులు పక్కన పెట్టి, “Are you ready?”

ఇంగ్లీష్! లండన్లో చదువుకుని వచ్చారు కదా. నాకు ఆయన అడిగిన ప్రశ్న కాస్త ఆలస్యంగా అందింది. “సిద్ధంగానే ఉన్నాను అండి.”

గంభీరంగా “నేను అడిగినా దానికే సమాధానం చెప్పు, ఎక్కువ తక్కువ కాదు, సూటిగా చెప్పు. ముందు నాన్నగారు పంపిన లేఖ చూపించు.”

“పోయింది సార్”

“Certificates ఉన్నాయా?”

“లేవు సార్”

ఆయన పాము లాగా బుస కొడుతూ సర్రుమని లేచారు, కుర్చీలో నుండి “ఎందుకు వచ్చావు అయ్యా ఏమి లేకుండా? సమయం విలువ తెలియదు, సమావేశ పద్ధతులు తెలియవు? ఆ గెడ్డం చూడు!”

“జ్ఞానంకి కొలమానమా, విద్య పత్రాలు? పత్రాలు లేకపోయినా జ్ఞానం ఉంది. పద్ధతులు ప్రవర్తనలో ఉంటాయి గాని గెడ్డంలో కాదు కదా సార్.”

కాస్త వెటకారంగా “జ్ఞానం అన్నావు కదా, నీటి యొక్క శాస్త్రీయ సూత్రం చెప్పు?”

“తెలియదు సార్” నా మాటలో వణుకు నాకు తెలుస్తుంది.

ఆయనకు చిరాకు వచ్చింది. “నీకు ఇంకా ఏమి తెలుసు?”

“ఈ భూపతి ఎస్టేట్స్ మొత్తం 3256 ఎకరాలు, అందులో అడివి ప్రాంతం కాకుండా ఆదాయం ఇచ్చే భూములు సుమారు 800 ఎకరాలు. ప్రధానంగా కాఫీ, టీ మరియు వరి పంటలు ఉంటే, ఏటా వీటి వల్ల వచ్చే ఆదాయం లక్ష రూపాయలు పైనే. వీటికి తోడు ఈ ప్రాంతం లో 40 కి పైగా సరస్సులు ఉన్నాయి. ఊరిలో తొంభై శాతం మందికి ఆదాయం భూపతి ఎస్టేట్స్ లో పని వల్లే వస్తుంది. ఈ భవంతిలో ఇద్దరు వంట వాళ్ళు, ఎనిమిది పనివారు, ముగ్గురు తోటవారు పని చేస్తున్నారు. రోజుకి ఇక్కడ అయ్యే ఖర్చు సుమారు 120 రూపాయలు.”

మహేష్ భూపతి: “నువ్వు చెప్పిన వివరాలు కొంత వరకు మాత్రమే నిజం.” ఆ మాట విని చాలా నిరుత్సాహంగా అనిపించింది.

ఇంతకీ నీకు పెళ్లి అయ్యిందా?”

“కాలేదు సార్.” నేను చెప్పిన అన్ని సమాధానల్లో ఆయనకు నచ్చింది ఇది ఒకటే అనిపించింది. మహేష్ గారికి పెళ్లి అంటే పడదు అని పనివారి దగ్గర విన్నాను.

“మంచిది.” తన పక్కనే ఉన్న చెక్క బీరువాలో నుండి, ఎస్టేట్ మ్యాప్ మరియు ఆదాయము వివరాలు ఉన్న కొన్ని పుస్తకాలు నాకు ఇచ్చారు. ఇక నుండి ఈ ఎస్టేట్ బాధ్యత నీది.

ఆ రోజు సాయంత్రం పోతన అతిధి గృహానికి వచ్చి, తన సామానులు సర్దుకుంటున్నాడు. అప్పుడే లోపలికి వెళ్లిన నేను, “రేపు వెళ్ళండి పోతన గారు, ఇప్పుడు చాలా చీకటి పడింది కదా.”

“నాది కాని చోట నిముషం కూడా ఉండ లేను బాబు.”

కాసేపు ఆగి, “నిన్న రాత్రి మీరు లేరు, ఎక్కడికి వెళ్లారు?”

“ఎక్కడికి వెళ్తాను?” కాస్త బెరుకుగా.

“దాహం వేసి లేచాను, మీరు కనిపించలేదు.”

“ఓ అదా! ఏదో పందికొక్కు వంట గదిలో గొడవ చేస్తుంది అని, వంట వాడు వస్తే, తాళం తీసుకుని వెళ్ళాను.”

అబద్ధం అతికినట్టు చెప్పారు. ఆయన సర్దుకొని వెళ్లిపోతూ, “ఈ చోటు అంత మంచిది కాదు. అందులోనూ నీలాంటి భయస్తులు ఇక్కడ ఉండటం చాలా కష్టం. జాగ్రత్తగా ఉండు.” ఆయన మాటలు బెదిరింపుల్లా అనిపించాయి.

మరుసటి రోజు ఉదయం, కొత్త హుషారుతో కాఫీ తోటకి వెళ్లిన నాకు వర్షం ఎదురు వచ్చింది. తడవకుండా ఉండాలని పనివారు అందరూ పరుగులు తీశారు. వర్షం అంటే చిరాకు పడే నాకు ఆది అంత చిరాకుగా అనిపించలేదు. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నా. పొగమంచు వల్ల కాస్త దూరంగా ఉండే జనం స్పష్టంగా కనిపించట్లేదు, అలికిడి మాత్రం తెలుస్తుంది.

ఆ అలికిడిలో మువ్వ సవ్వడి ఒకటి వినిపించింది. అది ఆ రోజు కొలను దగ్గర విన్న శబ్దం, అదే అమ్మాయా? మంచు పొగలో మంచి ముత్యంలా, తొలకరి జల్లులో స్వాతి చినుకులా, ఒక అమ్మాయి కనిపించింది. ఆమె సొగసును గుర్తించిన నా కళ్ళు నా మనసును మురిపించి, నన్ను వశపర్చి ఆమె వెనక నడిపించేలా చేశాయి.

కాస్త లోనే ఆమె కనుమరుగు అయ్యింది. వర్షం కూడా కాస్త ఊపు అందుకుంది. నేను ఒక పెద్ద చెట్టు కింద చేరాను. పొగమంచు మెల్లగా తొలగిపోతుంది. తొలగిపోతన్న మంచులో నుండి ఆమె కనిపించింది. నా ఊహ కన్నా అందంగా ఉంది ఆమె మోము. తడవకుండా గొనె సంచి కప్పుకుని, ఎదురుకుండా ఉన్న చెట్టు కింద నిలబడి ఉంది. కానీ ఆ చెట్టు చిన్నది కావటంతో వర్షపు చినుకులలో ఆమె తడవటం నాకు కనిపించింది.

కొత్త వారితో ఎప్పుడు నేను మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడకుండా ఉండలేకపోయాను. “ఓ అమ్మాయి! అక్కడ తడుస్తునావు కదా, ఇక్కడికి రా.”

”మీరే ఇక్కడికి రండి”

చిలక పలుకులు లాంటి ఆ మాట విన్న నా ఒళ్ళు పులకరించింది. ఎంతటి మహాభాగ్యం! చిన్న చెట్టు, పైన వర్షం, పక్కన అందమైన అమ్మాయి. ఇంత కన్నా అదృష్టం ఉంటుందా అనుకుని ఆమె వద్దకు చేరాను. ఆమె నేను అటు వెళ్ళగానే నేను ఇంతకు ముందు ఉన్న చెట్టు కిందకి చేరింది.

“ఓయ్! ఇది ఏమి బాలేదు”

“ఆ అవును, ఆ చెట్టు కింద అంత బాలేదు, అందుకే ఇటు వచ్చా” అని ఒక చిరు నవ్వు విసిరింది.

“ఇది పద్ధతి కాదు”

“ఒంటరిగా ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అనుకోవటం కూడా పద్ధతి కాదు.”

మాటలు రాలేదు. మనుసు ఆమె సొగసుకు బానిస అయ్యిపోయింది. అంతలో వేరే అమ్మాయిలు కూడా ఆమె వద్దకు వచ్చారు. అందరూ కాఫీ తోటలో పని చేసే వారిలా ఉన్నారు. ఆమె వాళ్ళతో ఏదో చెపింది. అందులో ఒక అమ్మాయి, “ఏంటి అలా తడిచిన ఆడ పిల్లలను చూస్తున్నావు? తినేస్తావా? అయ్యను పిలవమంటావా?”

తప్పుగా చూడకపోయినా ఎవరూ తెలియని ఊరిలో గొడవ ఎందుకు అనిపించి అక్కడ నుండి ఇంటికి బయల్దేరాను. దారిలో అంతకు ముందు భవంతిలో కలిసిన పోలీస్ అతను సైకిల్ మీద నా దగ్గరకు వచ్చి, తన సైకిల్ వెనుక ఉన్న సంచి నాకు ఇస్తూ “ఇది నీదే కదా!”

“అవునండి”

“పోతన చెప్పినట్టుగా, ఈ సంచి దొరికిన చోట ఏ జట్కా బండి లేదు, దిగువ అంత వెతికాము.”

“అసలు నిజంగానే ప్రమాదం జరిగిందా లేక కథ చెప్పావా?”

“కథలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు.”

“అది నేను చెప్పాలి. నువ్వు చెప్పిన వివరాలకి, దొరికిన ఆధారాలకి పొంతన లేదు. నీ సంచిలో నీ వివరాలు కూడా లేవు.”

నా విద్యా పత్రాలు మరియు భూపతి రాజు గారు నాకు పంపిన లేఖ కోసం నా సంచిలో చూసాను. కానీ అవి కనిపించలేదు.

“నువ్వు నాతో స్టేషన్ కి రావాలి.”

అదే సమయానికి మహేష్ భూపతి గారు కారులో అక్కడికి వచ్చారు. “మా మేనేజర్ తో మీకు ఏమి పని?”

“మీ నాన్న గారి కేసు గురించి విచారించటానికి ” పోలీస్ గొంతులో మర్యాద, భయము.

“ఏమి విచారించాలి? ఇతని మీద అనుమానమా? సబ్ ఇన్స్పెక్టర్ తో నిన్నే మాట్లాడాను, ఇతని మీద అనుమానం ఏమి లేదు అని చెప్పాడు.”

అతను మౌనంగా ఉండిపోయాడు. ఇప్పుడు ఇతను మా మేనేజర్, మా మనిషి. పోలీస్ స్టేషన్ కి వస్తే మా మర్యాద పోతుంది. ఏదైనా ఉంటే రేపు మీ ఇన్స్పెక్టర్ ని ఇంటికి రమ్మనండి. “రాయుడు, నువ్వు కారు ఎక్కు.” పోలీస్ ఏమి మాట్లాడలేదు.

నేను కారులో కూర్చున్నా, జరుగుతున్న ఏ విషయము నాకు అంతు చిక్కట్లేదు. నాకు తెలియకుండా నేను ఎవరి ఉచ్చులో అయినా పడ్తున్నానా?

***


Rate this content
Log in

More telugu story from Varun Ravalakollu

Similar telugu story from Thriller