దేవుడికి ఉత్తరం....శ్రీనివాస భ
దేవుడికి ఉత్తరం....శ్రీనివాస భ


రంగమ్మ కల్లు దుకాణం దగ్గర...
"ఇంకాస్త పొయ్యరా."..అన్నాడు మల్లిగాడు
"చాల్లేరా ఇప్పటికే ఎక్కువైంది.."అన్నాడు సూరి.
మల్లి గాడి కన్నా సూరి బాగా తక్కువ తాగుతాడు.
వాళ్ళ మాటల ప్రవాహం...ఇలా
"ఎవడు చెప్పాడు?మరో మూడేసుకున్నా నిటారుగానే నిలబడతా"
"తెలుసులేరా"
"మరింకేం?"
"మొన్న ఇంటి తలుపనుకొని లైటు స్తంభం ఊపావ్ "
"నువ్వు మరీ చెప్తావు లేరా"
"నిన్న మురుగు కాల్వలో ఓ కాలు పెట్టి నాకాలేవరో
నరికేసారని గోల పెట్టింది ఎవరంటావ్?"
"ఒరేయ్ మళ్ళీ అన్నావంటే ఒప్పుకొను "అన్నాడు మల్లిగాడు
"పగలంతా కష్టపడి పనిచేసి సాయత్రం అయ్యేసరికి
రంగమ్మ కొట్టు దగ్గర తేలతావేమిరా?"
"దాన్ని చూస్తే ఇంకా చూడాలనే ఉంటుంది"
"నీ పెళ్ళాం ఏం కాదుగా?" సూరిగాడి వెటకారం.
"పెళ్ళాం అలాంటి వేషాలేస్తే పాతెయ్యనూ?
"అవునారా. మొన్న మీ ఆవిడ 5 కేజీ ల బియ్యం పట్టుకెళ్లింది. మాఇంటినుండి."
"దానికేం పోయేకాలం. తెచ్చిందంతా ఏం చేస్తుంది?"
"ఎంత ఇస్తున్నావేమిటి?"
"సంపాదించిదంతా దానికే కదా"
"నాకంటే నీకే ఎక్కువ కూలి ఇస్తారు. అయినా చాలదేంట్రా?"
"పిల్ల ను చదివిస్తున్నానా?"
"అవున్లే.అదో గొప్ప. 5 తరగతి.అదీ గవర్నమెంట్ స్కూల్లో... మధ్యాన్నం భోజనం కూడా వాళ్లే ఇస్తారు".
"మా స్తోమత అంతేలేరా" మల్లిగాడు అన్నాడు.
మల్లిగాడి భార్య అప్పుడప్పుడు కూలి కెళ్తుంది కూడా.
"నీకేం రా. ఈ తాగుడు మానేసినా, బాగా తగ్గించినా
నీ బతుకు బంగారం రా!. మనలో 10 వరకు చదువు కున్నది, కుర్రాడివీ నువ్వేరా..ఎందుకిలా బతుకు తగలేసుకుంటావ్." సూరిగాడు ఓదార్పుగా చెప్పాడు.
"రంగమ్మని చూడలేకపోతే ఉండలేనురా."
"ఇంట్లో మీ ఆవిడని అలాగే ఉండమను"
"ఒరేయ్. నిన్ను తగలెయ్య..నీ కెలా నోరొచ్చిందిరా. ఈ తాగుబోతోడికి నీ మాటలు అర్ధం కావనుకుంటున్నావా?"
"నీకెందుకు అర్ధం కాదురా. ఆ రంగమ్మ హొయలు, వగలుఅందరికీ పంచుతుంది...నీ ఒక్కడికే కాదుకదా.అలాంటిది కరివేపాకు
అంతే..."
"ఏమో నాకదంటే ప్రాణం"
"తాళికట్టావా?"నవ్వుతూ అన్నాడు సూరిగాడు ఒకే ఊ
ఊళ్ళో ఉన్న చిన్నప్పటి చనువుతో.
"కట్టకపోతేనేం?"
"ఒరేయ్. నీకంటే ఏడేళ్లు పెద్దనేను. 5 తరగతే చదివాను.మా కంటే బాగా చదువుకున్న నీకు
ఈ తాగుడు జబ్బేన్టీరా?"
"నా ఇష్టం. ఇంకా నువ్వు ఇలాగే వాగితే నాతో మాట్లాడక్కర్లేదు." ..మల్లిగాడు కోపంగా అన్నాడు.
"సరే. నీ ఖర్మ...ఇక ఆ విషయం మాట్లాడనులే." సూరి కూడా విసుక్కున్నాడు అలా చాలా సార్లు..చెప్పి విసిగి పోయాడు గనుక.
ఈ సంభాషణ గడిచి వారమైంది.
ఒకరోజు ...
రంగమ్మ దుకాణం మూసేసారు.
నాలుక పీకేస్తోంది..మల్లిగాడు ఉరఫ్ మల్లేష్ కు.
ఏమీ తోచక కూతురి స్కూల్ బాగ్ తీసాడు.
తెలుగు పుస్తకము మధ్యలో ఏదో రాసున్న కాగితం కన్పించింది.
దాన్లో...
దేముడుకి..నువ్వు మంచోడివత. మాన్న తగుతాడు.రోడు మీన తులుతాడు. పడి పొటాడు. ఎపుడో సానిపోతాడ. మా అమ్మ కూల కూడ ఒత్తుపొతడు. కూలు డబ్బు కూడ తాగేట్టుడు.మాన్న పోతే మాకేవురి దిక్కు. నాను కుల కెలత. మా అమ్మ కి రొగం..నువ రకి చే0చు...
ఉత్తరం తీసాడు...మల్లిగాడు.. రెండు లైన్లు కష్టంగా చదివి నీళ్ల పొర కంటిని కప్పేయగా సరిగా చదవ లేకపోయాడు.
5 వ తరగతికి వచ్చినా సరిగా తెలుగే రాకపోతే మిగిలినవి....ఒకలా ఆలోచిస్తే.
తనెలా బ్రతుకుతున్నది తొమ్మిదేళ్లఅమ్మాయికి... అదే కూతురికి తెలిస్తే.. ఇంకా ఈ దరిద్రం బ్రతుకెందుకు.
ఒక నిశ్చయానికి వచ్చాడు..
ఇక జీవితంలో తాగనని ప్రాణంగా ప్రేమించిన కూతురిపై మనసులోనే ఒట్టు పెట్టుకున్నాడు.
మనసు తేలిక పడింది.
తాగుడు ఆగి పోయింది.
ఎప్పుడైనా మనసు చికాకన్పిస్తే..జేబులోని ఫొటో చూస్తాడు..అంతే.
ఇప్పుడు మల్లిగాడు ఉరఫ్ మల్లేష్ రాత్రి కూతురు తో బాటు కొందరు పిల్లలకీ ప్రైవేట్ చెప్తున్నాడు.అందులో సూరిగాడు ఉరఫ్ సురేష్ 2వతరగతి కొడుకొకడు.
మల్లేష్ జేబులో ఫోటో..అతడి భార్యా ,కూతురిదీ.
--------xxxx. xxxxxxxxx. xxxxxxxxxx