Surekha Devalla

Drama

3  

Surekha Devalla

Drama

డైరీ (లోని) కథ.

డైరీ (లోని) కథ.

6 mins
346


ఒరేయ్ నందు, ఏం చేస్తున్నావు అసలు నువ్వు, గంట క్రితం పెట్టిన టిఫిన్, కాఫీ అలానే ఉన్నాయి. చేతిలో పుస్తకం ఉంటే చాలా తిండి, నిద్ర ఏం వద్దా ఇలా ఇవ్వు ఆ పుస్తకం"అంటూ నందు చేతిలో పుస్తకం లాక్కుంది అనురాధ.


అబ్బా అమ్మ ప్లీజ్, ఒక పది నిమిషాలు ఆ కథ అయిపోతుంది, ఇవ్వమ్మా ప్లీజ్ అంటూ బ్రతిమాలుకున్నాడు వాళ్ళ అమ్మని.నోరు మూసుకొని ముందు తిను తర్వాత పుస్తకాలను తిందువుగానీ, కానీయ్ అంటూ కోప్పడి పుస్తకం తీసుకుని వెళ్ళిపోయింది.

ఇక తప్పదన్నట్లుగా లేచి కూర్చుని తింటున్నాడు.అవును మర్చేపోయాను రెండు రోజుల్లో ఇంటర్వ్యూ ఉంది హైదరాబాద్ లో ...అమ్మో , టికెట్ బుక్ చేసుకోవాలి ఇప్పుడే అనుకుంటూ వాళ్ళమ్మకి చెప్పి బయటికి వెళ్ళాడు.

"అమ్మా రేపే నా ప్రయాణం, నా బట్టలు సర్దు, మళ్ళీ నాలుగు రోజుల తర్వాత వస్తా"అంటూ లోనికి వస్తూనే అరుస్తూ చెప్పాడు.సరేరా సర్దుతా కానీ పోయినసారి చేసినట్లుగా చేయకు.


జర్నీలో బుక్ చదువుతూ దిగాల్సిన ప్లేస్లో దిగకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు.. నీ పుస్తకాల పిచ్చి వల్ల మంచి జాబ్ మిస్సయ్యావు..ఈసారి అయినా జాగ్రత్తగా ఉండు.అబ్బా సరేలే అమ్మా అప్పుడు ఆ నవల ఇంట్రెస్టింగ్ గా అన్పించి అంతా మర్చిపోయాను...ఈసారి అలా జరగదులే,అసలు ఏ పుస్తకం తీసుకుని వెళ్ళను సరేనా అన్నాడు. సరే అంటూ లోపలికి వెళ్ళిపోయారు ఆవిడ.

నందు బస్సు టైం అయ్యింది కదులుతున్నావా,లేదా అంటూ అరిచింది అనురాధ.


వెళ్తున్నా అమ్మా మళ్ళీ నాలుగు రోజులు బుక్ చదవను కదా, అందుకనే అంటూ పుస్తకం పక్కన పెట్టి బయలుదేరాడు.

నందూ వెళ్ళేసరికి బస్సు కదుల్తూ ఉంది. గబగబా పరిగెత్తి బస్సు అందుకున్నాడు. హమ్మయ్య అనుకుంటూ తన సీట్ లో కూర్చున్నాడు .కాళ్ళకి ఏదో తగిలినట్లు అనిపిస్తే తీసి చూశాడు.

ఏదో డైరీలా ఉంది. చాలా బాగుంది చూడటానికి.ఓపెన్ చేయాలా వద్దా అనుకుని ఒకసారి బస్సు లో వాళ్ళని అడిగి చూద్దాం అని అందరినీ అడిగాడు. ఎవరిదీ కాదు అన్నారు.ఇక తప్పక డైరీ తెరిచాడు.


"సుస్వర"అంటూ అందమైన చేతిరాత కనిపించింది."నా పేరు సుస్వర. ఈరోజు నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఈ డైరీలో రాస్తున్న.ఈ డైరీకి ఒక పేరు పెడుతున్న."సన్నీ".బాగుంది కదా పేరు ఇకనుంచి సన్నీ నా బెస్ట్ ఫ్రెండ్".

ఫస్ట్ పేజీలో ఉన్నదాన్ని చదివి నవ్వుకున్నాడు నందు. డైరీకి నేమ్ ఆ ఇంట్రెస్టింగ్ అనుకుని పేజీ తిప్పాడు.

"ఈరోజు ఎంత భయం వేసిందో తెలుసా సన్నీ, ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు నాకు.


రోజూ నన్ను చూస్తాడంట,నేను స్కూలుకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఫాలో అవుతాడంట..ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా ఉండలేను, నువ్వంటే నాకు ప్రాణం అన్నాడు.నేను టెంత్, ఆ అబ్బాయి ఇంటర్.."తొందరగా జాబ్ తెచ్చుకుంటా బాగా చదివి..... మనం పెళ్ళి చేసుకుందాం" అన్నాడు.నేను షాక్ అయ్యా.ఆ అబ్బాయి చూడటానికి బాగానే ఉన్నాడు. మంచిగానే అనిపిస్తున్నాడు. తను ప్రపోజ్ చేసిన విధానం కూడా బాగుంది.

అయినా సరే భయం వేసింది చాలా. పరిగెత్తుకుని వచ్చేసా".చదివే కొద్దీ ఆసక్తిగా అన్పించసాగింది నందూకి..వరుసగా చదువుకుంటూ వెళ్తున్నాడు.


నా ఫ్రెండ్ లయకి ఈ లవ్ ప్రపోజల్ గురించి చెప్పా , తను  కూడా షాక్ అయ్యింది.. నాకు చూపించు వాడెవడో దులిపి పారేస్తా అంది..సాయంత్రంఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను చూసి దగ్గరకు వస్తున్న ఆ అబ్బాయి ని చూపించా..

అటు చూసిన లయ అశ్చర్యపోయింది. 'అరే రవి అన్నా నువ్వా' అంది..

ఆశ్చర్యపోవడం నా వంతయింది.


"స్వరా,రవి అన్న చాలా మంచివాడే, మా ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు. తను నిన్ను లవ్ చేయడం నీ లక్ తెలుసా అంది.

నాకు కొంచెం గర్వంగా అనిపించింది. సిగ్గు గా కూడా అనిపించింది.తను నవ్వుతూ నా వైపు చూస్తున్నాడు..నేను కూడా నవ్వుతూ తన లవ్ కి ఓకే చెప్పేసా.

ప్రేమిస్తే ఇంత బాగుంటుందా,మనసంతా చెప్పలేనంత సంతోషం .ఈ లోకంలో ఉన్న సంతోషం అంతా నా సొంతం అయినట్లు అనిపిస్తుంది.మేము కలిసి ఉండేది చాలా తక్కువ సమయం..ఉదయం, సాయంత్రం ఇంటి నుండి స్కూల్ వరకు నడిచే సమయం మాత్రమే. ఆ కొంచెం టైంలోనే మేము మాట్లాడుకునేది. తను చాలా బాగా మాట్లాడతాడు. ఎంతసేపు మాట్లాడినా వినాలనిపిస్తుంది.

ఈ ప్రేమ విషయంలో పడి మేము చదువుని అశ్రద్ధ చేయలేదు. ఇద్దరం కష్టపడి చదువుతున్నాం..ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇద్దరం బాగా రాశాం..

ఇక ఈ సెలవుల్లో కలవడం ఎలా అనేదే మా సమస్య.


రోజు సాయంత్రం నేను వాకింగ్ అని మాకు కొంచెం దూరంలో ఉన్న పార్క్ దగ్గరకు వెళ్ళేదాన్ని..రవి ఆ టైంకి అక్కడికి వచ్చేవాడు.నోటితో మాట్లాడలేని ఎన్నో మాటల్ని మా కళ్ళు మాట్లాడుకునేవి..అవి చెప్పే ఊసులు మాకు అర్థమయ్యాయి అని మా పెదవులు వాటికే

సొంతమైన చిరునవ్వుతో తెలియచేసేవి..

ఇది మా దినచర్య. రిజల్ట్స్ వచ్చాయి. మాకు ఇద్దరికీ మంచి మార్కులు వచ్చాయి. లయకి కూడా బాగా వచ్చాయి.

మా సంతోషానికి అవధులు లేవు.

లయ నేను ఒకే కాలేజ్ లో జాయిన్ అయ్యాం..తను ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. మా కాలేజ్ పక్కనే అది.అంతా బాగా జరుగుతోంది


తనది ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. క్యాంపస్ సెలెక్షన్ లో జాబ్ వచ్చింది రవికి .

ఫస్ట్ టైం ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం ఒక చిన్న హోటల్లో. అయినా మాకు ఆ హోటల్ చాలా నచ్చింది. ప్రేమలో ఉంటే అంతేనేమో ప్రతీది నచ్చుతుంది.

రవి లేట్ చేయకుండా వాళ్ళ ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పి ఒప్పించాడు..మా ఇంట్లో కూడా చాలా కష్టపడి ఒప్పించాడు.ఇద్దరి పేరెంట్స్ ఒప్పుకోవడంతో మేము రిలీఫ్ గా ఫీలయ్యాం.


టైం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. తను జాబ్ లో జాయిన్ అయ్యాడు బెంగుళూరులో. తను వెళ్తుంటే చాలా ఏడుపు వచ్చింది. కంట్రోల్ చేసుకున్న. నవ్వుతూ సెండాఫ్ ఇచ్చా.

రోజూ ఫోన్లో ఛాటింగ్ ,కాల్స్తో దూరం దగ్గర అయ్యింది..కాలం చాలా వేగంగా పరిగెడుతుంది..నా డిగ్రీ కంప్లీట్ అయింది.

మా ఎంగేజ్మెంట్ కి డేట్ నిర్ణయించారు. షాపింగ్, ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయడం ఈ పనులతో ఫుల్ బిజీ.ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్ళాం..ఎంగేజ్మెంట్ అయిపోయింది. బాగా జరిగింది అంతా.

తను వెళ్తున్నాడు ఈరోజు.


మాకు జరిగింది ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళి అయ్యి మేమిద్దరం భార్యాభర్తలం అనే ఫీలింగ్ వచ్చింది మా ఇద్దరికీ.తను వెళ్తుంటే మళ్ళీ తను మొదటిసారి నా దగ్గర నుండి వెళ్లిన సమయంలో ఎంత బాధ అనిపించిందో అంతకంటే ఎక్కువ బాధ అనిపిస్తుంది ఎందుకో తెలీదు.

కంట్రోల్ చేసుకోలేకపోతున్న.. రవి నన్ను నార్మల్ చేయడానికి గంట పట్టింది.

ఒక నెల ఆగితేజీవితాంతం కలిసే ఉంటాం కదా,నువ్విలా ఏడిస్తే నాకు నీ ఏడుస్తున్న మొహమే గుర్తొస్తుంది. నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, అర్థమైందా!నాకు నీ నవ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడూ దాన్ని దూరం చేసుకోకూడదు. ఇదే నువ్వు నాకిచ్చే బహుమతి..వెళ్ళొస్తా కన్నా , నా కోసం ఒకసారి నవ్వు బంగారం ప్లీజ్ అంటూ నన్ను నవ్వించాడు. నేను నవ్వుతూ తన వైపు చూశాను.

అది నా బంగారం అంటే అంటూ నా నుదుటి మీద ముద్దు పెట్టాడు..అది మా మొదటి ముద్దు.


మనసంతా ఏదో తెలియని సంతోషంతో నిండిపోయింది.ట్రైన్ వచ్చింది. తను ట్రైన్ ఎక్కి డోర్ దగ్గరే నిలబడ్డాడు. ట్రైన్ మూవ్ అవుతోంది. నవ్వుతూ చెయ్యి ఊపుతూ సెండాఫ్ ఇచ్చాను. తను కనిపించనంత దూరం వెళ్ళేవరకూ చూస్తూ ఉండిపోయాను.కానీ కానీ అదే నా లాస్ట్ సెండాఫ్ అని

తెలుసుకోలేకపోయాను .నా రవి నాకు అందనంత దూరం వెళ్ళిపోతున్నాడని ఊహించలేకపోయాను.


ఆ మర్నాడు ఉదయం రవి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న నాకు నా రవి అసలు ఈ లోకంలోనే లేడని చెప్పే కాల్ వచ్చింది.నేను నమ్మలేదు. నా రవికి ఏం కాదు, ఏం కాదు అంటూ స్పృహ తప్పి పడిపోయాను..


అమ్మా వాళ్ళు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. గంట తర్వాత ఈలోకంలోకి వచ్చాను.

ట్రైన్ ఆక్సిడెంట్ లో రవి చనిపోయాడనే నిజాన్ని మేమెవ్వరం నమ్మలేకపోయాం.ఆ నిజాన్ని తట్టుకోవటానికి నాకు రవి పేరెంట్స్ కి కొన్ని నెలలు పట్టాయి.

అసలు బయటికి రావడం మానేసాను..నన్ను మామూలు మనిషిని చేయడానికి అమ్మా నాన్న, లయ,రవి పేరెంట్స్ చాలా ప్రయత్నించారు..

రవి పేరెంట్స్ ఇక్కడ ఉండలేక అమెరికా లోని వాళ్ళ పెద్దబ్బాయి దగ్గరకు వెళ్ళిపోయారు.


రవి చనిపోయి సంవత్సరం అయింది. నేను ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్నా..

జాబ్ కోసం ట్రై చేశాను. ఒక నెల లోనే జాబ్ వచ్చింది.జాయిన్ అయిన ఆరు నెలల్లోనే చాలా వరకు నార్మల్ అయ్యా..

అంటే రవిని మర్చిపోయా అని కాదు. కానీ తను లేడు, ఇక రాడు అనే విషయాన్ని అర్థం చేసుకుని, తట్టుకున్నాను..

ఈలోగా పెళ్ళి అన్నారు..నా మనసు ఒప్పుకోలేదు. అదే చెప్పా ఇంట్లో.

వాళ్ళు ఒప్పుకోలేదు. తిట్టారు, భయపెట్టారు, ఏడ్చారు,ఎలా అయితేనేం చివరికి ఒప్పించారు.


నాకు చెప్పకముందే సంబంధం కుదిర్చారు..నన్ను ఒప్పించటానికి టైం తీసుకున్నారు అంతే .ఒక వారంలో  పెళ్ళి. ఆ అబ్బాయితో రవి విషయం చెప్పారా అని అడిగా..చెప్పలేదన్నారు , నన్నూ చెప్పొద్దన్నారు.ఆ అబ్బాయితో నన్ను మాట్లాడనివ్వలేదు పెళ్ళి అయ్యేవరకు.

పెళ్ళి అయింది. నేను తనని(పెళ్ళికొడుకు)జీలకర్ర బెల్లం పెట్టినపుడు మాత్రం చూశా ,ఒకే ఒక్క నిమిషం. ఎందుకో ఏదో చెప్పలేని ఫీలింగ్.

అదేంటో తెలీదు మరి..అసలు తన పేరు కూడా నాకు తెలీదు.

ఆరోజు మా ఫస్ట్ నైట్.. అందరూ సంతోషంగా ఉన్నారు నేను తప్ప. అలా అని బాధ కూడా కాదు. నిర్లిప్తంగా ఉన్నా అంతే...పాలగ్లాసు తీసుకుని గది లోకి వెళ్ళాను .నన్ను చూడగానే ఆయన కళ్ళల్లో మెరుపు. తన పెదవుల మీద దాచి పెట్టలేని దరహాసం నాట్యం చేస్తోంది.

నా దగ్గరగా వచ్చి నన్ను మంచం వద్దకు తీసుకుని వెళ్ళారు.తరువాత జరిగేది ఏమిటో నాకు తెలుస్తోంది .నేను అందుకు సిద్ధంగా లేను..

మీతో కొంచెం మాట్లాడాలి అన్నాను. సరే చెప్పు అన్నారు.ఏదీ దాచకుండా మొత్తం ఆయనకు చెప్పేసాను..ఆయన ఏం మాట్లాడలేదు కొద్దిసేపు..ముందే ఈ విషయం ఎందుకు చెప్పలేదు అన్నారు. నాకు అవకాశం ఇవ్వలేదు మా వాళ్ళు అన్నాను.


నాకు కొంచెం టైం ఇవ్వు అంటూ దిండు తీసుకుని సోఫాలో పడుకున్నారు..

ఆయన నిర్ణయం కొంచెం అర్థమయింది , కానీ నాకు రిలీఫ్ గా అనిపించింది..ఇక నా జీవితం ఎలా ఉన్నా పర్లేదు.ఆ మర్నాడే ఆఫీస్ లో అర్జెంట్ వర్క్ ఉందంటూ వెళ్ళిపోయారు..నాతో ఏమీ మాట్లాడలేదు, కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. కొంచెం బాధ కొంచెం ఆశ్చర్యం అనిపించింది.ఆయన నన్ను చూడనందుకు ఎందుకు బాధ పడాలి.

నా మెళ్ళో ఆయన తాళి కట్టేటప్పుడు కూడా రవి గుర్తొచ్చి ఏడుపొచ్చింది....నేను చనిపోయేవరకు రవిని మర్చిపోలేను అనుకున్నా..అలాంటిది చిత్రంగా ఆయన తలపులే ఎక్కువ అయ్యాయి.

ఎందుకు ఇంత మార్పు నాలో. పెళ్ళి ఇంతగా మార్చేసిందా నన్ను..ఏం మాయ వుంది పెళ్ళిలో , ఏమో ఏమీ అర్థం కావట్లేదు.మా అత్తవారింటికి రెండుసార్లు వెళ్ళొచ్చాను.ఆ సమయంలో నేను ఆయనని చూడడమే కానీ పలకరించడానికి ధైర్యం సరిపోలేదు.

ఎందుకంటే ఆయన నన్ను కన్నెత్తి చూడలేదు. అందరూ అది ఆయనకి మొహమాటమో సిగ్గో అనుకున్నారు..

నిజం నాకు మాత్రమే తెలుసు.


ఆయన నాతో సరిగా లేకపోయినా నా మనసులో రవి స్థానంలో ఆయన వచ్చి చేరారు. ఆయన నన్ను అర్థం చేసుకోవాలి అని దేవుడిని కోరుకున్నా.పదిహేను రోజుల తర్వాత మా అత్తగారింటికి వెళ్ళే సమయం వచ్చింది. రేపే నా ప్రయాణం.

ఎందుకో కొంచెం టెన్షన్ గా అనిపిస్తుంది .సాయంత్రం ఆయన ఫోన్ చేశారు.

ఆరోజు తర్వాత నాతో ఇప్పుడే మాట్లాడుతున్నారు..మా  పెళ్ళి అయ్యాక ఆయన నాకు చేసిన మొదటి కాల్ .ఎందుకో నా చేతులు వణికాయి. కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాను..

మన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా.. రేపు చెప్తాను ఆ విషయం అని పెట్టేశారు..

అంతా మంచే జరగాలని ఆ దేవుని కోరుకున్నా.


ఈరోజే నేను ఆయన దగ్గరకు వెళ్తున్న.

ఏం జరుగుతోందో ఏమో తెలియట్లేదు .మనసంతా ఏదోలా ఉంది.

కొంతలో కొంత రిలీఫ్ ఏంటంటే లయ కూడా పెళ్ళి చేసుకుని హైదరాబాద్ లోనే మా అత్తగారింటి పక్కనే శ్రీనగర్ కాలనీలో ఉంటుంది. అది కొంచెం రిలీఫ్ గా అనిపించింది.అంతవరకే ఉంది ఆ డైరీలో.

ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలనిపించింది నందూకి. కానీ ఇంటర్వ్యూ ఉంది. అది అయ్యాకా తెలుసుకోవాలి అనుకున్నాడు.

ఇంటర్వ్యూ బాగా జరిగింది. ఆ జాబ్ నందూకే వచ్చే లా ఉంది. రెండు రోజుల్లో కాల్ చేస్తాం అన్నారు.ఇక డైరీ అమ్మాయి గురించి వెతకటం మొదలుపెట్టాడు..

  

నాలుగు గంటల తర్వాత అడ్రస్ దొరికింది. కాలింగ్ బెల్ నొక్కాడు.ఎవరో ఒకతను వచ్చి తలుపు తీసి ఏం కావాలండీ అనడిగాడు. ఈ డైరీ బస్సులో దొరికింది అంటూ చూపించాడు నందు.

అది చూడగానే ఆయన సంతోషంగా లోపలికి రండని "స్వరా చూడు నీ సన్నీ నీ దగ్గరకు వచ్చేసింది. తొందరగా రా అంటూ గట్టిగా పిలిచాడు.

ఆమె కూల్ డ్రింక్ తీసుకుని వచ్చి ఇస్తూ థాంక్స్ చెప్పింది సంతోషంగా .థాంక్యూ అండీ మా ఆవిడకి ఇదంటే ప్రాణం ,ఇంత శ్రమ తీసుకుని తెచ్చినందుకు అన్నాడు.

నందూ స్వర వైపు చూశాడు సంతోషంతో వెలిగిపోతోంది ఆమె మొహం. అది చూసి నందూకి సంతోషం అనిపించింది. ఇక వస్తానండీ అంటూ లేచాడు నందూ..

మరోసారి కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఆ భార్యాభర్తలు.

బయటికి వచ్చిన నందూ ఆయన వైపు తిరిగి మీ పేరు అని అడిగాడు.రవిప్రకాష్ అన్నాడాయన.తనకి తెలియకుండానే చిరునవ్వు వచ్చి చేరింది నందూ పెదవుల మీదకి .

ఒక రవి తన సంతోషాన్ని తీసుకెళ్ళిపోయాడు..మరో రవి సంతోషంతో పాటు తన జీవితాన్ని కూడా తిరిగిచ్చాడు... 

  ఏమి నీ లీల స్వామి అంటూ మనసులోనే ఆ దేవుడికి నమస్కారం చేశాడు.


**అయిపోయింది**


Rate this content
Log in

Similar telugu story from Drama