భయానక సంఘటన
భయానక సంఘటన
మొన్నెప్పుడో భయమేస్తుందని చెప్పి ఆ సీరియల్ చూడను అన్నావ్, ఇప్పుడు మళ్లీ చూస్తున్నావ్ అని నన్ను తిట్టి మళ్లీ వెళ్లి పడుకుంది లావణ్య.
నేను ఎపిసోడ్ మొత్తం చూసి, తర్వాత నిద్ర పట్టక అటూ ఇటూ తిరిగి ఎలాగో నిద్రపోయాను.
మరుసటి రోజు ఇద్దరం కాలేజీకి వెళ్ళాము. సిరీ! ఏంటే ఎలా నిద్రపోతున్నావ్? క్లాసు బ్రేకులో తట్టి మరీ అడిగింది వెనుక బెంచీలోంచి స్వరూప.
మేడమ్ గారు రాత్రంతా ఆ ప్రేతాల సీరియల్ చూసారు. మహా ఎపిసోడ్ అట. మూడు గంటలు చూసిందట అని నా తల మీద మొట్టికాయ వేస్తూ చెప్పింది లావణ్య.
అదేంటే! నిన్న ఆ సీరియల్ టెలికాస్ట్ చెయ్యలేదని పేపర్లో వార్త వచ్చిందే. చిన్న పిల్లలు ఎక్కువగా ఆ సీరియల్ చూసి భయపడుతున్నారని, దాన్ని ప్రస్తుతానికి నిలిపేశారు. నువ్వెలా చూసావే అని నా భుజం మీద తట్టింది స్వరూప.
నాకు కళ్ళు తిరిగినట్లు అనిపించింది. వెంటనే లైబ్రరీకి పరుగెత్తాను. నా వెనకే స్వరూప, లావణ్య కూడా వచ్చారు. న్యూస్ పేపర్లో ఆ సీరియల్ టెలికాస్ట్ ఆపేసినట్లు వార్త చూసి నా గుండె వేగం హెచ్చింది.
అప్పుడే కరెంట్ పోయి లైబ్రరీ తలుపులు మూసుకున్నాయి. భయంతో నుదుటి మీద పట్టిన చెమటను చున్నీతో తుడుచుకుంటూ ఎవరూ అని అడిగాను. సమాధానం లేదు. అక్కడ నేనొక్కదాన్నే ఉన్నట్టు అనిపించింది.

