Thulasi Prakash

Horror

3.5  

Thulasi Prakash

Horror

😎 అవ్వ 😎

😎 అవ్వ 😎

9 mins
2.5K


రమణ, సరయు, వారి ఇద్దరు అబ్బాయిలు,

జీవన్ , అభి కారులో ప్రయాణిస్తున్నారు..


అసలు ఆ రోజు ఉదయం, ఊరిప్రయాణం పెట్టుకోగానే , జానకమ్మ రమణని అడిగింది 

" ఈ రోజు ఆదివారం పైగా అమావాస్య, ఈ రోజు ప్రయాణాలు వద్దు , మరో రోజు పెట్టుకోండిరా అని..రమణ చెప్పాడు, అలా ఎలా అమ్మా, 

శశికాంత్ వాళ్ళు రేపే అమెరికా వెళ్ళిపోతున్నారు, పదేళ్ళుగా చూసుకోలేదు ప్రాణస్నేహితులం మేమిద్దరమూ ఒకరినొకరం, ఈ రోజు వాడి ఫామిలీని నేను, నా ఫామిలీని వాడు కలుసుకుని బోలెడు కబుర్లు చెప్పుకోవాలి, ఇలాంటి అమావాస్య భయాలు నువ్వూ పెట్టుకోకు,నన్నూ భయపెట్టకు, మేం జాగ్రత్తగా వెళ్ళొస్తాము అని చకచక బయల్దేరారు రమణ వాళ్ళు...జానకమ్మ మనసు కీడు శంకిస్తోంది..కానీ పిల్లలు వినట్లేదు..దేవుడికి ఇంకో రెండుగంటలు ఎక్కువ పూజ చేసుకుంది మనసుని కుదుటపరుచుకోవటానికి..


రోజంతా ఫ్రెండ్స్ సరదాగా కబుర్లు చెప్పుకుని లేట్ అయిందని తెలిసినా, మర్రోజు తాను చేయాల్సిన ఆపరేషన్ వాయిదా వేయటానికి కుదరదని, డాక్టర్‌ రమణ భార్యా బిడ్డలతో నల్లని కారులో బయలుదేరాడు...గంట ప్రయాణం బాగానే సాగింది...


ఉన్నట్టుండి సుడిగాలి మొదలయ్యింది..చూస్తూ చూస్తూ ఉండగానే గాలి వేగం పెరిగింది, గాలి వేగానికి ఈలల శబ్దం తెలుస్తోంది, రివ్వురివ్వున వీస్తూ వీస్తూ గాలి ఉధ్రృతం అవుతోంది..రోడ్డుకి అటూ ఇటూ ఉన్న చెట్లు ఊగిపోతున్నాయి...పొలాల్లో ఉన్న రేకుల షెడ్లుకి , ఉన్న రేకులు , గాలి తీవ్రతకు ఊడిపోయి రోడ్డు మీదకు కొట్టుకొచ్చి, ఫ్లయింగ్ సాసర్ల లాగా ఎగిరొచ్చి, బైకులవాళ్ళకు, కార్లకు ప్రమాదకరంగా తగులుతున్నాయి..


రమణకు, సరయుకు జానకమ్మ మాటలు జ్ఞప్తికి వచ్చాయి, అమావాస్యరా ప్రయాణాలు వద్దు అన్న మాట...ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు, ఇద్దరికీ చిరుభయం మొదలయ్యింది...


టపటపమని వడగళ్ళ వాన మొదలయ్యింది..పెద్దపెద్ద రాళ్ళ, సైజులో , వడగళ్ళు కారుమీద పడుతూ పెద్దశబ్ధం చేస్తున్నాయి...పిల్లలు ముందు సరదా పడ్డారు, కాసేపటి తరువాత ఆకాశానికి, భూమికి మధ్య నది పారుతున్న చందాన ఆగకుండా పడుతున్న పెద్దవర్షానికి చాలా భయపడిపోయారు..రమణ అతికష్టం మీద కారు డ్రైవ్ చేస్తున్నాడు...వాన కాస్త తెరిపినిచ్చింది...హమ్మయ్య అనుకుంటున్నారో లేదో...పెద్దశబ్దంతో ఢాం అంటూ , కారు టైరు పంక్చర్ అయ్యింది...అమ్మో అనుకున్నారు అందరూ ఒక్కసారి ..కారణం ఇదీ అని తెలిసినా అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు...టైమ్ చూస్తే అర్ధరాత్రి 12 గంటలు, చిమ్మచీకటి, రోడ్డుకి అటూ ఇటూ అడవిలాగా దట్టమైన చెట్లు, అప్పటివరకూ గ్లాసులు వేసుకునే ఉన్నారు కాబట్టి బయటి శబ్దాలు అంతగా వినిపించలేదు...అప్పుడే కారు టైరు చూడటం కోసం గ్లాసులు దించటం, డోర్ తెరిచి కారు దిగటం...రమణ కారు ఆపి కిందకు దిగబోతున్నాడు, ఝాప్ మని.. ఒక కారు విపరీతమైన స్పీడుతో రమణని దాదాపుగా తాకుతూ వెళ్ళిపోయింది..రమణ అప్రయత్నంగా అమ్మో అనేసాడు గుండె ఝల్లనగా...అయ్యో ఏమయ్యిందీ అడిగింది కంగారుగా సరయూ...ఏంలేదులే ఏదో కారు మెరుపువేగంతో పక్కనుండీ వెళ్ళింది అని ధైర్యం చెప్పాడు రమణ, సరయుకి...సరయు కూర్చున్న ముందువైపు కారుటైరు పంక్చర్ అయ్యింది...రమణ, జీవన్ టైరు మార్చటానికి కిందకు దిగి పని మొదలుపెట్టారు...అమావాస్య, అర్ధరాత్రి.. అస్సలు ఏమీ కనిపించటం లేదు..ఫోన్ ఫ్లాష్ లైౖౖట్ వేసుకున్నారు..ఫోన్ ఛార్జ్ కూడా అయిపోవస్తోంది, ఫోన్ బ్యాటరీ అయిపోయేలోగా పని పూర్తవ్వాలి అని చకచకా పని చేస్తున్నారు రమణ, జీవన్...

ఊ ....ఊ ....అని గట్టిగా దూరంగా నక్క ఒకటి ఊళ వేసింది..అది విని అభి అమ్మా ఏంటదీ అని దాదాపూ ఏడుపుగొంతుతో అమ్మ చెయ్యి గట్టిగా పట్టుకుంటూ భయపడుతూ అడిగాడు...ఏం లేదు నాన్నా అది కూడా కుక్క అరుపే అంది అభిని ఊరుకోబెడుతూ...ఇంతలో పది కుక్కలు ఏదో చూసి భయపడ్డట్టు అన్నీ కలిసి ఒకేసారి గట్టిగా ఏడుస్తున్నాయి...చాలా హ్రృదయవిదారకంగా, భయం గొలిపేలా ఉంది ఆ ఏడుపు..అది చాలక నక్క మళ్ళీ ఊళలు పెడుతోంది, ఆగిందనుకున్న తుఫాను గాలి మళ్ళీ మొదలయ్యింది..జీ.. అని గాలి మోత ఆ విశాల ప్రదేశంలో మారుమ్రోగుతోంది..ఉన్నట్టుండి అక్కడున్న నలుగురికీ మనస్సుకి చిరాకుగా అనిపించసాగింది, ఏదో అర్థం కాని అలజడిగా అనిపిస్తోంది మనసులకి...ఏమర్రా ఎంతసేపింకా అంది సరయు కోప్పడుతూ...ఊ ఊ అవుతోంది అన్నాడు రమణ సహనంగా, జీవన్ మాత్రం, కోపంగా, చేస్తున్నాం కదా అమ్మా, అన్నాడు విసుక్కుంటూ ...


సరయు అప్రయత్నంగా రియర్ వ్యూ మిర్రర్ లో చూసింది...మెరుపులు మెరుస్తూ ఉన్నాయిగా వరుసగా, ఒక మెరుపు మెరిసినప్పుడు...దూరంగా ఏదో కదిలి తమవైపు వస్తున్నట్టుగా అనిపించింది, భ్రమేమో అనిపించింది...మెరుపులో అలా ఏదో కనిపించిపోవడం తప్ప అస్సలు వెలుతురే లేదు...ఫోన్ లైట్ కూడా డిమ్ గా అయిపోయింది ఛార్జ్ అయిపోతున్నదానికి సూచనగా...మళ్ళీ ఇంకో మెరుపు మెరిసింది..అలానే అనుమానంగా చూస్తూనే ఉన్న సరయు కళ్ళకి ఒక ఆకారం తెలిసింది..అంతే గుండె పట్టేసినట్టు అయ్యింది సరయుకి...తాను చూసిన ఆకారం తెల్లని మొహం ఉన్న ఒక పెద్దావిడ, తెల్లని చీర కట్టుకుని, కాస్త వంగిపోయి నడుస్తూ వస్తోంది...ఆవిడ వయసు ముసలి అయినా నడకలో తెలీని ధ్రృడత్వం, వేసే అడుగులో కసి కనిపిస్తున్నాయి...సరయుకి చాలా భయం వచ్చేసింది..అర్ధరాత్రి, ఇలా మధ్య దారిలో , ఒక ఆవిడ అలా నడుచుకుంటూ రావడం అసాధారణంగా అనిపించింది..గుండె ఝల్లుమంది...రమణ, జీవన్ కారెక్కండి, కారులోకి రండి అంటోంది డోర్ కిటికీ బయటకు తల పెట్టి ..కానీ భయంతో తన గొంతు పెగలట్లేదు, తన మాట తనకే వినపడట్లేదు, ఇహ జీవన్ వాళ్ళకు ఎలా వినిపిస్తుంది...కొంచెం తెగించిన ధైర్యం తెచ్చుకుని, రమణా మీ ఇద్దరూ కారులోకి ఎక్కెయ్యండి ప్లీజ్ అంది, అంటూనే ఉంది..జీవన్ కి అమ్మ మాట కాస్త అర్ధమయ్యింది...నాన్నా అమ్మ ఏదో చెబుతోంది చూడు అంటూ వెనక్కి చూసాడు రోడ్డు వైపు...ముసలావిడ కనిపించింది...ఎక్కరా జీవన్, ఎక్కండి రమణా అనేస్తోంది కంగారుగా సరయూ....ఏమనిపించిందో ఏమో రమణ, జీవన్ కారులోకి ఎక్కారు...నాలుగు వైపులా అద్దాలు పైకి లేపేసి కారులో వణికిపోతూ కూర్చుని, ధైర్యం కోసం ఆంజనేయస్వామిని తలుచుకుంటూ కూర్చున్నారు....వాళ్ళ గుండెచప్పుడు, వాళ్ళు పీల్చి వదిలే గాలి శబ్దం వారికి చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి...అభి అయితే భయంతో నిక్కరు తడిపేసుకున్నాడు...కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు...నిశ్శబ్దంగా ఏడ్చేస్తున్నాడు కూడా..రమణ సరయు జీవన్ ఏడవట్లేదు కానీ వారి ముగ్గురికీ పిచ్చి భయం వేస్తోంది...ఆ ముసలావిడ అడుగుల చప్పుడు చాలా దగ్గరిగా వచ్చేసింది....హూ హూ హూ అని ఒకరకంగా ఏడుపుతో కూడిన మూలుగులా శబ్దం చేసుకుంటూ కారు పక్కగా వెళుతోంది ముసలవ్వ..సూటిగా చూసే ధైర్యం చాలక , తల కిందకే ఉంచి కనుగుడ్లు మాత్రం పక్కకు జరిపి చూస్తున్నారు రమణ జీవన్ సరయు...అవ్వ కారు దాటి ముందుకి వెళుతోంది...అసలు తను నడిచి వెళుతున్న దారిలో ఒక కారు ఉంది అన్న ధ్యాసే లేనట్లుగా వెళుతోంది అవ్వ.. తెల్లని శరీరఛాయ అవ్వది...దానికి తోడు తెల్లని చీర...అమావాస్య చీకటిలో కూడా కనిపిస్తోంది అవ్వ...


దాదాపూ మీటర్ దూరం వెళ్ళింది అవ్వ...ఆమె మనిషేనా కాదా అని తేల్చుకునే ప్రయత్నంలో ఆలోచిస్తున్నారు రమణా వాళ్ళు ...ఒక కారు రయ్యిమని వచ్చి అవ్వని తాకుతూ స్పీడుగా వెళ్ళిపోయింది...అవ్వ రోడ్డు మీదకు విసిరేసినట్లు పడిపోయింది, అమ్మా అని కూడా ఆర్తనాదం చేసింది...రోడ్దు మీద పడిపోయి ఉంది అవ్వ...


రమణకు జీవన్ కి అయ్యో పాపం అనిపించింది...కారు దిగి వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంది...అయినా సరే భయాన్ని లెక్కచెయ్యకుండా ముసలావిడ అన్న జాలితో, కారులో పట్టనట్టు కూర్చుని ఉండలేక , 

భయంతో ద డ ద డలాడే గుండెలతో నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళుతున్నారు అవ్వ దగ్గరకి , అవ్వ కదలకుండా పడుకుని ఉంది..ఇంకో మూడు అడుగుల దూరంలో ఉన్నాడు రమణ అవ్వకి , సరిగ్గా అప్పుడే...

అవ్వ కదిలింది , రమణ గుండె ఝల్లుమంది , అడుగు ఆగింది , జీవన్ భయంభయంగా చేతులు నులుముకుంటున్నాడు , జీవన్ కి హార్ట్ బీట్ పెరిగింది , వళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి , ధడాక్ అని పెద్ద శబ్దంతో పిడుగు పడుతూ ఆగకుండా శబ్దం చేస్తోంది , జీల్ మని గాలి ఈల లు వేస్తోంది.. అవ్వ లేచి కూర్చుంది , చిటుక్కున తల తిప్పి రమణ వైపు చూసింది , ముందుకు పడబోయే అడుగుని టక్కున తిప్పుకుని వెనక్కి పరిగెట్టటానికి రెడీ అయ్యాడు రమణ..అదంతా చూస్తున్న సరయు బాగ్ లోంచీ తీసి పట్టుకున్న చిన్న ఆంజనేయస్వామి బొమ్మని చేతిలో పట్టుకుని కారు దిగింది , అమ్మా నువ్వు కూడా వెళ్తున్నావా , వెళ్ళకు అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు అభి , ఉండు నాన్నా , అన్న ని నాన్న ని జాగ్రత్తగా వెనక్కి తెస్తాను అని అభికి ధైర్యం చెప్పి అడుగు ముందుకువెయ్యబోయింది.. రోడ్దుకు అవతల పక్కన ఉన్న చెట్టుమీద పెద్ద పిడుగు పడి చెట్టు నిలువునా కాలిపోతోంది , కొరివిదెయ్యంలా... , అమ్మా అని ఇంకా భయంతో అభి గట్టి గట్టిగా ఏడ్చేస్తున్నాడు...


అవ్వ తన తల పట్టుకుని నొప్పితో అబ్బా అని అంటూనే , సరయూ వైపు పిచ్చి కోపంగా చూస్తోంది , చెట్టు కాలుతున్న వెలుగులో తెల్లని అవ్వ మొహంలో , కళ్ళు ఎర్రబడటం స్పష్టంగా తెలుస్తోంది , విసురుగా లేచి సరయూ వైపు రాబోయింది ...సరయూ తన చేతిలోని ఆంజనేయస్వామి బొమ్మని తన నుదుటికి తాకిచ్చుకుంది ధైర్యం కోసం , అవ్వ విసురుగా దూసుకొస్తోంది సరయూ వైపు... 

రమణ ను దాటేసింది , జీవన్ నూ దాటింది , ఒసేయ్ అంటూ సరయూ మీదకి కోపంగా కసిగా దూకింది..సరయూ కెవ్వు ..మని గట్టిగా కేక పెట్టింది , ఢామ్ అని పెద్ద పిడుగు శబ్దం , ఊ ...అంటూ గట్టిగా ఓ నక్క ఊళ అన్నీ కలిసి భయంకరమైన శబ్దకాలుష్యం.... ఏమయ్యిందో ఏమో ఉన్నట్టుండి అవ్వ నేలకి జారిపోయింది....సరయూకి భయంతో తల నరాలు జుమ్మని లాగుతున్నాయి , గుండె దడ దడ దడ మని రెట్టింపు వేగంతో కొట్టుకుంటోంది...


జీవన్ రమణ ఒక నిముషం ఆగి నెమ్మదిగా అవ్వ దగ్గరకు వెళ్ళారు...అవ్వ చెయ్యిని తన వణుకుతున్న చేతితో పట్టుకుని చూసాడు రమణ , పల్స్ చెక్ చేసేలోగా అవ్వ మళ్ళీ గట్టిగా మూలుగుతూ నొప్పి అన్నట్లుగా బాధపడుతోంది...ఇక డాక్టర్‌ రమణ రెండో ఆలోచన లేకుండా అవ్వను రెండుచేతులతో ఎత్తుకుని కారు ముందుసీటులో కూర్చోబెట్టి సీటుబెల్టు పెట్టాడు..వెనుక సీటులో సరయు , పిల్లలు బిక్కుబిక్కుమంటూ ముడుచుకుని కూర్చున్నారు విపరీతంగా భయం వేస్తుండగా...


గంట ప్రయాణం తరువాత ఒక ఊరు కనపడింది..అక్కడున్న హాస్పిటల్ లోకి అవ్వని తీసుకెళ్ళారు... కాంపౌండర్ ప్రసాద్ , నర్స్ శివానీ అవ్వని చెక్ చేసి జాయిన్ చేసుకున్నారు...హాస్పిటల్ కి అయ్యే ఖర్చులకి డబ్బులు కట్టి రమణ, ప్రసాద్ వాళ్ళకి చెప్పాడు , ఏదైనా అవసరమైతే తనకు ఫోన్ చేయమని...అప్పుడే ఇంక వాన వెలిసింది...నలుగురూ కారులో కూర్చోబోతున్నారు , గట్టిగా రీసౌండ్ లో అవ్వ మూలుగులా వినిపించింది , నలుగురూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు , మళ్ళీ వెంటనే అవ్వ గొంతు నవ్వుతూ వినిపిస్తోంది , అవ్వ గొంతుతో పాటూ మరిన్ని గొంతులు కలిసి కోరస్ లో భీకరంగా నవ్వులు వినిపిస్తున్నాయి...ఒకరినొకరు చూసుకున్నారు , అభీకి మళ్ళీ ఏడుపు మొదలైంది...ఇంక భయపడేందుకు కూడా ఓపిక లేక కారులో కూర్చున్నారు నలుగురూ...రమణ డ్రైవ్ చేస్తున్నాడు , పిల్లలు బాక్ సీట్ లో నిద్రపోతున్నారు , సరయు సీటుకి చేరగిలబడి కూర్చుంది , రమణ జెట్ స్పీడుతో కారు పోనిచ్చాడు...


రెండు గంటల తరువాత ఒకచోట సిగ్నల్ పడిందని కారు ఆపాడు రమణ..సరయు ఉన్నట్టుండి సీటులో నిటారుగా కూర్చుంది ఎడమవైపు దూరంగా సూటిగా చూస్తోంది , ఏమయింది సరయుకి అని రమణ కూడా అటువైపు చూసాడు , అక్కడ అవ్వ కూర్చుని ఉంది , తమవైపే సూటిగా చూస్తోంది..రమణ తల తిప్పి సరయుని చూసాడు , కనురెప్ప వేయకుండా కదలకుండా బిగుసుకుపోయినట్టు ఉంది సరయు..రమణకి భయం వేసింది , సరయు తేడాగా ఉందేంటి అని , సరయూ అని భుజం మీద చెయ్యేసి త ట్టాడు , సరయు పలకలేదు , కదల లేదు , అమ్మో సరయుకి గుండె ఆగిపోయిందా ఏంటి అని రమణకి భయం వేసింది , వణుకుతున్న చేత్తో సరయూ అని గట్టిగా పిలుస్తూ సరయూని కదిపాడు...అమ్మో అవ్వ అక్కడకి అవ్వ ఎలా వచ్చింది అంటూ సరయు వణికిపోతోంది భయంతో అవ్వ ఉన్నవైపు చూపిస్తూ...కూర్చున్న అవ్వ లేచి నుంచుని వీరి వైపు రాబోయింది...సరయుకి రమణకి పిచ్చిభయం మొదలైంది , తాను కారు ఇంత స్పీడుగా నడిపి ఇంత దూరం వస్తే తమకంటే ముందే అవ్వ ఇక్కడికి ఎలా వచ్చింది , ఏమిటీ మాయ అనుకుని ..అవ్వ వైపు చూసాడు రమణ..అవ్వ స్పీడుగా అడుగులు వేసుకుంటూ తమ కారు వైపు వచ్చేస్తోంది , సరయుకి చెమటలు కారిపోతున్నాయి భయంతో , 


అవ్వ గాయానికి , ఇందాక , హాస్పిటల్ లో నర్స్ శివానీ శుభ్రం చేసి కట్టు కట్టింది , ఇప్పుడు చూస్తే అవ్వకి మొహాన గాయం ఇంకా రక్తం కారుతూనే ఉంది..అవ్వ నాలుగే అడుగుల దూరంలో ఉంది కారుకి ... 


గ్రీన్ సిగ్నల్ పడింది..అంతే రమణ అవ్వకి అందకుండా రయ్యిమని కారుని ముందుకి పోనిచ్చాడు...అలా అరగంట ప్రయాణించాక ఒక పక్కన కారు ఆపాడు....అసలు హాస్పిటల్ లో ఉన్న అవ్వ ఇక్కడకి ఎలా వచ్చింది అని , సందేహం తీర్చుకుందాము , అవ్వ హాస్పిటల్ లో ఉందా లేదా అని హాస్పిటల్ కి ఫోన్ చేసాడు కాంపౌండర్ ప్రసాద్ కి గానీ నర్స్ శివానీ కి గానీ ఫోన్ ఇమ్మన్నాడు రమణ ఫోన్ లో మాట్లాడే అతనితో...ఎవరు కావాలి అన్నాడు అవతలి అతను...ప్రసాద్ ని కానీ శివానీ ని కానీ పిలవండి అన్నాడు రమణ...మీకేమన్నా పిచ్చా సార్ , కాంపౌండర్ ప్రసాద్ ని నర్స్ శివానీని కిందటి సంవత్సరం ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారని శివానీ వాళ్ళ అమ్మే చంపించేసింది , నా చేత్తో నేనే వాళ్ళ కి ఆఖరి కర్మలన్నీ చేసాను , వాళ్ళ తో పొద్దుగాల మీరు మాట్లాడటం ఏంటండీ , రాత్రేమన్నా ఎక్కువ తాగేసారా ఏంటి , ఫోన్ పెట్టెయ్యండి సార్..నాకు బోలెడు పనులున్నాయి అని ఫోన్ కట్ చేసాడు హాస్పిటల్ అతను...రమణ కి గిర్రున కళ్ళు తిరిగాయి...పొద్దున తాము చూసిన , మాట్లాడిన ప్రసాద్ శివానీ లు మనుష్యులు కారా అని రమణకి భయంతో వళ్ళు వణికింది.....తన ని తాను తిప్పుకుని గుండె దిటవు చేసుకుని కారులో కూర్చునేందుకు కారు వైపు వెళ్ళబోయాడు రమణ...కారుకి ఆనుకుని నుంచుని ఉంది అవ్వ...


అదే సూటిగా చూసే చూపు అదే రక్తం కారుతున్న నెత్తి మీది గాయం...అద్రృష్టమో దురద్రృష్టమో పిల్లలూ సరయు మంచి నిద్రలో ఉన్నారు...అవ్వని చూస్తుంటే భయం వేసి కారుకి దూరంగా పారిపోవాలని ఉంది రమణకి, కానీ కారులో ఉన్న భార్యా పిల్లలను అవ్వ ఏమైనా చేస్తే అన్న ఆలోచన వచ్చి ఏమి చేయాలో తోచనట్లు కాళ్ళు వణుకుతుండగా అలానే అటూ ఇటూ చూస్తూ నుంచున్నాడు , అవ్వ వైపు చూడటానికే భయం  వేసి...అవ్వ ఒక్కో అడుగు బలంగా వేస్తూ రమణ వైపు వస్తోంది , అవ్వ గట్టిగా మూలుగుతోంది ఊ ....ఊ ...అంటూ...ఆ శబ్దానికి చెవులు నొప్పులు పుడుతున్నాయి రమణకి..అవ్వ బలంగా వేస్తున్న అడుగులకి రమణ దగ్గరకు అవ్వ వస్తున్న కొద్దీ కాళ్ళ కింద నేల అదురుతోంది రమణకి...తల్లి నిత్యం పూజించే సాయిబాబాని మనసారా తలుచుకుంటూ ధైర్యం తెచ్చుకుంటున్నాడు రమణ , తన మెడలోని ఆంజనేయస్వామి లాకెట్ ని చేతితో గట్టిగా పట్టుకున్నాడు , 

తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ ...అవ్వ దగ్గరకొచ్చి నా బిడ్డలు ...నా మనవరాలు శివానీ ని , తాను మనసారా ప్రేమించిన ప్రసాద్ ని ఒకే కులం కాదని ఊరు ఊరు వెలేసారు..ఒకప్పటి పాత తరం దాన్ని అయినా కూడా , మూర్ఖించకుండా నేనే ఏం పర్లేదు కులం ఇవ్వని సంతోషం ప్రేమ ఇవ్వగలదర్రా అని నా మనవరాలికి మద్దతు పలికాను , కానీ నా కోడలు , ఇదిగో ఇక్కడుందే నీ పెళ్ళాం లానే ఉంటుంది , నా బిడ్డలిద్దరినీ , కొత్త పెళ్ళి కొడుకు కొత్త పెళ్ళి కూతురని కూడా చూడకుండా , మీ కారు అడవిలో ఆపారే అక్కడే చంపించిందయ్యా...వాళ్ళ కోసం అందరినీ తిట్టి తిట్టీ గుండాగి నేనూ సచ్చిపోయాను ....  


నేను సచ్చిపొయ్యాక నాకు శివానీ , ప్రసాద్ లు ఎక్కడా కనపడలేదు..వారి కోసం వెతుక్కోవటానికి రోజూ అర్ధరాత్రి మీరు కారు ఆపారే , అక్కడికి వస్తూ ఉంటా..కానీ ఏ రోజూ వారు కనపడరు , వారు కనపడకపోయేటప్పటికీ , నిరాశతో , నా కోడలిని చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు..  ...ఇవాళే హాస్పిటల్ లో మళ్ళా కలుసుకున్నా నా బిడ్డలిద్దరినీ , ఇన్నాళ్ళుగా ఎక్కడెక్కడ తిరిగారో నాకు కనపడనేలేదు , మీ పుణ్యమా అని నాకు ఈ రోజు కనపడ్డారు , చాలా ధాంక్స్ బాబూ , అది చెబుతామనే మీ వెనకెనకాలే తిరుగుతున్నా రెండు గంటల నుంచీ , అబ్బా అంత స్పీడేంటి బాబు కారు నడపటం , జాగ్రత్తగా నడపాలి కారు..నీ స్పీడుకి అందుకోలేక పోయా ఎంత గాలిలో రయ్యిమంటూ నేను ఎగురుకుంటూ వచ్చినా కూడా , మధ్య మధ్యలో ట్రాఫిక్ జామ్ ఒకటి నా ప్రాణానికి , ఈ హై వే ల మీద స్పీడుగా డ్రైవ్ చేసి సచ్చిపోయినోళ్ళు బొచ్చెడుమంది తయారయారు ఈ మధ్య , వాళ్ళంతా తెగ అడ్డొచ్చేసారు గాలిలో...సరే బాబు ధాంక్స్ చెప్పేసాగా , ఇహ పోతా నేను , సేఫ్ డ్రైవింగ్ బాబు , స్పీడు తగ్గించి నడుపుకో , అన్నివిధాలా మంచిది , బై బై అని మాయమయిపోయింది అవ్వ....హమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు రమణ త్వరగా ఇల్లు చేరాలి , అమ్మకి టెన్షన్ తప్పించాలి అనుకున్నాడు , కారు స్పీడు మాత్రం , ఎనభయికి మించి పెంచలేదు రమణ , సేఫ్టీ గా ఉంటే మంచిదని..


Rate this content
Log in

More telugu story from Thulasi Prakash