Sirisha ogeti

Horror

3.5  

Sirisha ogeti

Horror

అర్ధరాత్రి - ఆడపిల్లలు

అర్ధరాత్రి - ఆడపిల్లలు

5 mins
1.3K



అదో " అమావాస్య అర్ధరాత్రి", నిర్మానుష్యమైన ప్రదేశం. రోడ్ కిరువైపులా పొలాలు వాటి అంచు వెంబడి రోడ్ పక్కగా మఱ్ఱిచెట్లు. కొంతదూరంలో స్మశానం. తలలో నుండి చెమటలు ధారలుగా కిందకు జారుతుంటే, ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ వణికే శరీరాన్ని అదుపు చేసుకుంటూ కార్ డ్రైవ్ చేస్తోంది అనూహ్య. రోడ్ మీద కార్ హెడ్ లైట్ల కాంతి తప్ప మరేమీ లేదు. చుట్టూ "చిమ్మ చీకటి". కార్ వెళ్ళే శబ్దానికి అక్కడక్కడా రోడ్ పక్కన పడుకున్న "కుక్కల అరుపులు."  పక్క సీట్ లో కూర్చున్న స్నేహ కూడా భయం భయంగానే ఉంది. ఇంకా నేనే నయం అనుకుంటూ స్నేహ వంక చూసి నిట్టూర్చింది అనూహ్య.


సిటీకి దూరంగా ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో పార్టీకి వెళ్ళి వస్తున్నారిద్దరూ. కబుర్లలో పడి టైమ్ చూసుకోలేదు నిజానికి అంత లేట్ నైట్ పార్టీకి ఎప్పుడూ వెళ్ళే అలవాటు లేదు కానీ ఈసారి ఫ్రెండ్స్ మాట కాదనలేక వెళ్ళారు. అసలంత నిర్మానుష్యమైన చోట బిల్డింగ్ ఎందుకు కట్టారో ! ఇలా పార్టీలకు రెంట్ కి ఇస్తూంటారట ఎక్కడా ప్లేస్ దొరక్క ఇక్కడ పెట్టారు. అక్కడకీ ఫ్రెండ్ రవి అంటూనే ఉన్నాడు డ్రాప్ చేస్తానని,తనే అర్ధరాత్రి - ఆడపిల్లలమైతే భయమేమిటి అంటూ బయలుదేరింది.


అకస్మాత్తుగా "ఈదురు గాలులు" కాసేపటికి "ఉరుములు, మెరుపులతో" కూడిన "వర్షం". అబ్బా త్వరగా వెళదామంటే ఈ అంతరాయాలేమిటో? ఇంటికి ఫోన్ చేద్దామంటే సిగ్నల్ కూడా అందడం లేదు అనుకుంటూ చాలా స్పీడ్ గా డ్రైవ్  చేస్తోంది. సహజంగా అనూహ్య ధైర్యస్థురాలే కానీ ఇందాక పార్టీలో వద్దన్నా వినకుండా అభయ్ అందరికీ చెప్పిన దెయ్యం కథ పదే పదే గుర్తొచ్చి వెన్నులో వణుకు పుడుతోంది. సడన్ గా కార్ కి అడ్డంగా ఏదో నల్లటి ఆకారం వెళ్ళినట్టయి సడన్ బ్రేక్ వేసింది అనూహ్య. అసలే భయంగా ఉన్న స్నేహ ఏమయిందే అంది. వెళ్ళినదేమిటో  తనకే అర్ధం కాక ఏమీ లేదే కుక్కో ఏదో అయుంటుంది అడ్డంగా వెళ్ళింది అంది అనూహ్య. "దూరంగా ఎక్కడ నుండో నక్కల ఊళలు" వికృతంగా వినిపిస్తున్నాయి.


 ఓహో అంటూ విండో నుండి పక్కకు చూసి కెవ్ మంది స్నేహ. ఒసేయ్ సరిగ్గా స్మశానం దగ్గరే ఆపావు కదే పోనీయ్ ముందు అంది. సరే అంటూ అనూహ్య మళ్ళీ డ్రైవింగ్ మొదలు పెట్టింది. కాసేపలా బిక్కు బిక్కు మంటూ కూర్చున్నాక ఏమే వర్షం అని నెమ్మదిగా వెళ్తే తెల్లారిపోయేలా ఉంది .ఈ రోడ్ మీద అదీ ఈ సమయంలో ఎవరూ ఉండరు కానీ స్పీడ్ గా పోనీయ్ అంది స్నేహ. అవును నిజమే అనుకుంటూ వేగాన్ని మరింత పెంచింది. పావుగంట ప్రయాణించాక రోడ్ మీద ఏదో తెల్లని ఆకారం కార్ కి ఎదురుగా నుంచున్నట్టయి మరలా సడన్ బ్రేక్ వేసింది.ఆ వర్షంలో కార్ కీచ్ మంటూ ఆగింది.


 కాసేపుంటే ఆ ఆకారాన్ని గుద్దేసేదే. కానీ ఆశ్చర్యం అక్కడెవరూ లేరు. ఏమయి ఉంటుందే అంది అనూహ్య ఏదో అనుమానంగా. ఏమైతే మనకెందుకు ముందు పోనీయ్ అంది స్నేహ. ఇంతలో విండో గ్లాస్ మీద టక్ టక్ మంటూ చప్పుడు, ఏదో తెల్లటి ఆకారం కదులుతూ కనపడింది. వర్షం వలన ఎవరో తెలియడం లేదు. కానీ విండో తీసి చూసే ధైర్యం ఇపుడు ఇద్దరిలోనూ లేవు. సర్ మంటూ కార్ ని ముందుకు దూకించి వేగంగా పరుగు పెట్టించింది అనూహ్య కానీ.. 


ఎంతో దూరం వెళ్ళకుండానే ఠా..ప్ మన్న శబ్ధంతో కార్ మెలికలు తిరుగుతూ పోయింది.పక్కనున్న పొలాలలోకి పోకుండా ఆపే ప్రయత్నంలో రోడ్ పక్కనున్న ఒక మఱ్ఱిచెట్టును ఢీ కొంది. దాదాపు ఏడుస్తున్నట్టుగా ఉంది స్నేహ మొహం. పైకి తేలక పోయినా అనూహ్య పరిస్థితీ అదే. నెమ్మదిగా కార్ వెనక్కి తీద్దామని ప్రయత్నించి ఓడిపోతోంది అనూహ్య. వెనక చక్రం ఏదో గుంతలో పడింది. అతి వేగంగా వెళ్ళేటపుడు కార్ ముందు చక్రం దేనికో గుచ్చుకుని పంక్చర్ అయినందువలన కార్ మెలికలు తిరుగుతూ పోయి అలా ఇరుక్కుపోయారిద్దరూ. కిందకు దిగాలన్నా భయం. కార్ లో ఉండాలన్నా ఆ వర్షం, ఉరుములు, మెరుములు, అన్నిటికీ మించి వికృతమైన నక్క ఊళలతో ఏమి చేయాలో తెలియడం లేదు. ఇంతలో మళ్ళీ విండో డోర్ మీద అదే శబ్ధం టక్ టక్ టక్... తెల్లని ఆకారం. 


ఒకరినొకరు దాదాపు అతుక్కుపోయినట్టు కూర్చున్నారు స్నేహ, అనూహ్య. ఏదైతే అది అయిందని విండో డోర్ దించబోతుంటే వద్దని వారిస్తున్నట్టు చేయి పట్టుకుంది స్నేహ. తప్పదే ఇంతకు మించి అవకాశం లేదు అంటూ వణికే చేతులతో విండో గ్లాస్ కొద్దిగా దించింది. తెల్లని దుస్తులతో ఒకతను మేడమ్ ఇందాక పిలిచింది నేనే. అటుగా వెళ్తుంటే బైక్ పంక్చర్ అయింది లిఫ్ట్ కోసం ఆపాను. సారీ లేడీస్ అని తెలియదు కదా! అన్నాడు. 


హమ్మయ్య దెయ్యమయితే కాదు మనిషే అన్నట్టు స్నేహ మొహంలో రిలీఫ్ చూసి చిన్నగా నవ్వింది అనూహ్య. చూడండి మాకే దిక్కు లేదు మీకెలా లిఫ్ట్ ఇవ్వడం అంది. గుంతలో పడింది కదా! మీరు కార్ స్టార్ట్ చేయండి నేను నెడతాను అంటూ ఆ వర్షం హారులో వినపడక గట్టిగా అరుస్తున్నాడు అతను. ఓకే అంది అనూహ్య. ఆ అపరిచితుడి సహాయంతో కార్ బయటకు వచ్చింది. ఆ వర్షంలో చకచకా కదులుతూ అతనే స్టెఫినీ తీసి వేస్తున్నాడు. ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే అంది అనూహ్య. అవునే నేనూ అదే అనుకున్నానంది స్నేహ. మెకానిక్ లాగా టకటకా చేసేస్తున్నాడు కానీ చీకటి వలన తడుముకుంటూ చేయడంతో గంటన్నర సమయం పట్టింది అన్నిటికీ. మేడమ్ మీ కార్ రెడీ తప్పక అడుగుతున్నాను లిఫ్ట్ ప్లీజ్ అన్నాడు. అయ్యో ప్లీజ్ అన్నారిద్దరూ. 


వెనక డోర్ తీసుకుని కూర్చున్నాడతను. కాసేపటికి పక్కకు చూస్తే ఒక మనిషి అండ దొరికిందన్న ధీమా కాబోలు కునుకు లాగుతోంది స్నేహ. తనకూ నిద్ర వస్తున్నా తప్పదు కదా అనుకుంటూ, గుప్పున ఏదో వాసన రావడంతో వెనక్కి చూసింది అనూహ్య. ఆల్కహాల్ బాటిల్ మూత తీసి గొంతులో ఒంచుకుంటూ సారీ మేమ్ చలికి తట్టుకోలేక పోతున్నాను అయినా మీరు మందు వేస్తారా? అన్నాడు. వాట్ అంటూ చిరాగ్గా చూసింది అనూహ్య. అంటే కార్ లో పెట్టుకుని వెళుతుంటేనూ అన్నాడు. 


అప్పుడు గుర్తొచ్చింది ఇందాక అభయ్ ఏదో షాపింగ్ ఉందంటూ తన కార్ వేసుకుని బయటకు వెళ్ళడం. ఛీ ఛీ అది నాది కాదు అంటూ అంతా నా ఖర్మ ఇలా ఇరుక్కున్నాను అనుకుంటూ మౌనంగా కార్ నడపసాగింది. కానీ ఇన్నిటి మధ్య ఆమె మెదడు ఆలోచిస్తూనే ఉంది ఇతన్ని ఎక్కడ చూసానూ అని. అలా చించగా చించగా ఎక్కడో మెదడు పొరల్లో నిక్షిప్తమైన ఒక చిత్రం అదే అదే ఆ పార్టీ జరిగిన గెస్ట్హౌస్ లో అది కట్టించిన ఆయనది పెద్ద ఫొటో ఉంది. అది ఇతనే కానీ ఆ ఫొటోకి దండ వేసుందే. అంటే అంటే ఇతను మనిషి కాదా? ఆత్మా?


వెనక్కి తిరిగి ఒకసారి చూడాలని ఉన్నా ఏం చూడవలసి వస్తుందో ? అక్కడ ఉన్నది మనిషి కాకపోతే అన్న భయంతో నోరు తడారిపోతోంది అనూహ్యకు. కానీ అంతలోనే ఆత్మ అయితే ఇంతసేపు ఏమీ చేయకుండా ఏదో తమకు సాయపడడానికే వస్తుందా ఏమిటి ? ఛీ ఛీ అంతా నా భయం, అనుమానం అంతే! అనుకుంటోంది. తనకు తాను నచ్చజెప్పుకుంటోంది, అంతలోనే ఫొటో గుర్తొస్తే ఇంతకు ముందు దాకా ఉన్న కాస్త ధైర్యం సడలిపోతోంది. 


అద్దం లోనుంచి వెనక్కి చూడడానికి లేదు ఇందాక జరిగిన ఏక్సిడెంట్ వల్ల మిర్రర్ పోయింది. ఇంతలో కార్ హైవే ను చేరుకుంది. ఇక సిటీలోకి వచ్చేసినట్టే ఏమైతే అదయింది అనుకుంటూ కార్ ఆపి వెనక్కి తిరిగి చూసింది అనూహ్య. అంతే... ప్రాణం లేని దానిలా కొయ్యబారిపోయింది. అక్కడా మనిషి లేడు పైగా ఒక అస్థిపంజరం ఉంది. కళ్ళ ముందంతా చీకటైపోతుంటే స్పృహ తప్పి పడిపోయింది అనూహ్య. 


కళ్ళు తెరచి చూసేసరికి హాస్పిటల్ లో ఉంది. ఎదురుగా స్నేహ, పక్కనే అదే వ్యక్తి. దెయ్యం దెయ్యం అంటూ వణికిపోతూ లేచి కూర్చో బోయింది. గబుక్కున దగ్గరకు వచ్చి పట్టుకుని,అనూహ్యా అతను దెయ్యం కాదు మనకు హెల్ప్ చేసినతను పేరు వికాస్ అంది స్నేహ. 


కాసేపటికి సర్దుకుని అయోమయంగాచూస్తూ మరి కార్ లో అంది అనూహ్య. అభయ్ రేపో నాటకంలో దెయ్యం వేషం వేస్తున్నానని చెప్పాడు కదా! నీ కార్ లో షాపింగ్ కి వెళ్ళినపుడు ఆ డ్రస్ కొనుక్కుని నీ కార్ లోనే మరచిపోయాడట. ఇందాకే మీ పేరెంట్స్ కి, మన ఫ్రెండ్స్ కి కాల్ చేసినపుడు చెప్పాడు. ఈ పెద్దమనిషి చలికి తట్టుకోలేక అదే కప్పుకుని కూర్చునే నిద్రపోయాడు. వెనక్కి తిరిగి చూసేసరికి నల్లని క్లాత్ మీద తెల్లని గీతలతో అస్థిపంజరం బొమ్మ ఉండేలా డిజైన్ చేసిన డ్రస్ అది. దాన్ని చూసి అసలే భయంలో ఉన్న నువ్వు దెయ్యమే అనుకుని పడిపోయావు పాపం అతనే డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చాడంటూ వివరించింది స్నేహ. ఓహ్ అంటూ సారీ మిష్టర్ వికాస్ అని మరి మరి ఆ గెస్ట్ హౌస్ లో ఫొటో అంది ఆశ్చర్యంగా. నేను చెప్తాను అది మా తాతగారి ఫొటో అండీ ఆ బిల్డింగ్ ఆయనే కట్టించారు దురదృష్టవశాత్తూ ఏక్సిడెంట్ లో నా వయసులో ఉండగానే మరణించారట. నేను అచ్చం ఆయన పోలికలోనే ఉండడం వలన మీరు భయపడ్డారు అన్నాడు వికాస్.అలాగా అంటూ ఊపిరి తీసుకుంది అనూహ్య. 


చూడండి మేడమ్ దెయ్యం కంటే భయం ప్రమాదకరమైనది. మీ మంచి కోసం ఒక మాట చెప్తాను ఏమీ అనుకోకండి. అంత అర్ధరాత్రి ప్రయాణాలు ఆడపిల్లలు ఒంటరిగా మంచిది కాదు. ఆ వర్షంలో నిర్మానుష్యమైన ప్రాంతంలో " ప్రకృతి విలయ తాండవం చేస్తున్న ఆ వేళ" నా స్థానంలో దెయ్యమే అక్కరలేదు మరో దుష్ట బుద్ధి ఉన్న మనిషున్నా చాలు. మీ జీవితం నాశనం అవడానికి. ఇక నుంచైనా లేట్ నైట్ పార్టీలు అటెండ్ అవకండి అన్నాడు. అవును వికాస్, ఆ సమయంలో మీరే లేకుంటే ఏమైపోయేవాళ్ళమో థాంక్యూ.. ఇక నుంచీ మీరు కూడా మాకు మంచి ఫ్రెండ్ అంటూ అభిమానంగా నవ్వింది అనూహ్య.థాంక్యూ ఇప్పటికైనా నేను దెయ్యం కాదని నమ్మారు అనేసరికి ముగ్గురూ హాయిగా నవ్వుకున్నారు.


Rate this content
Log in

Similar telugu story from Horror