అన్నదమ్ములు
అన్నదమ్ములు


"ఏమండీ, కాఫీ తీసుకోండి." వంట గది కిటికీ నుండి బైటికి చూస్తూ భర్త రాఘవయ్య ను పిలిచారు జానకమ్మ గారు.
"వస్తున్నా." అంటూ ఆమెకు బదులిచ్చి చేస్తున్న పని ఆపి కుళాయి దగ్గర చేతులు కడుక్కుని హాల్లోకి వెళ్ళేసరికి కాఫీ గ్లాసు తో ఎదురు వచ్చారు జానకమ్మ గారు.
"పొద్దున్నే మొదలు పెట్టారా తోటపని." అన్నారు ఆవిడ తాను కూడా కూర్చొని కాఫీ తాగుతూ.
"ఈరోజు శెలవు కదా, అని కొంచెం మొక్కల దగ్గర శుభ్రం చేస్తున్నాను." అన్నారు రాఘవయ్య.
"స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ పని, లేనప్పుడు తోటపని పెట్టుకుంటే మీకు రెస్ట్ ఉండొద్దా చెప్పండి. ఏదో ఒక పని పెట్టు
కోకుండా ఉండరు కదా. వచ్చే వయసా, పోయె వయసా. ఇలా అయితే ఎలా ఆండీ." ఆవిడ గొంతు లో ఆదుర్దా స్పష్టంగా వినిపిస్తోంది.
"మరీ అంతగా భయపడి నన్ను భయ పెట్టకు. గవర్నమెంట్ వాళ్ళే రెండు సంవత్సరాలు పొడిగించి 60 ఏళ్ళ వరకు పని చేయమని
ప్రోత్సహిస్తుంటే నువ్వేంటి నన్నప్పుడే వయసు మీరి పోయింది అన్నట్లు మాట్లాడుతున్నావ్." అన్నారు నవ్వుతాలుగా ఆవిడ మాటల్ని కొట్టపారేస్తూ.
"వాళ్ళకేం, అవసరముంటే ఇంకొక రెండేళ్ళు కూడా పెంచుతారు.
ఈ మధ్య టీచరు ఉద్యోగాలకి ఎవరూ రావడం లేదని మీలాంటి
వాళ్ళకి రిటైర్మెంట్ వయసు పెంచి ఉంటారు లెండి." అదొక పెద్ద విషయమేమీ కాదన్నట్లు జానకమ్మ గారు కూడా రాఘవయ్య గారి
మాటల్ని కొట్టి పారేశారు.
"అబ్బో, ఇలాంటి విమర్శలు బాగానే చేస్తారు మీ ఆడాళ్ళు. మెచ్చుకోవడం మాత్రం చేతకాదు, కదా." నవ్వుతూనే చురక
అంటించారు రాఘవయ్య గారు.
రాఘవయ్య గారు విశాఖపట్నం జిల్లా లో ఒక గ్రామం లో టీచర్ గా చేస్తున్నారు. ఆయనకి బదిలీ అయినప్పుడల్లా ఆ ఊరి సర్పంచ్ తన పలుకుబడితో ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు తప్ప దూరంగా
వేయనివ్వరు. అతనికి, ఆ ఊరి వారికి మాస్టారి మీద ఉన్న అభిమానం అలాంటిది. మొదటి సారి ఆ ఊరిలో అడుగు పెట్టినప్పుడు ఆయన కొత్తగా ఆ ఉద్యోగం లో చేరారు. ఆ వేళా
విశేషం ఎలాంటిదో కానీ అందరికీ తలలో నాలుకలాగ అయ్యారు.
అక్కడికి వచ్చిన తర్వాతే ఆయనకి పెళ్ళి అవడం జానకి ని
కాపురానికి తేవడం జరిగింది. ఆమె కూడా అందరికీ ఇష్టురాలే. ఎవరికి ఏ అవసరం వచ్చినా తానే ముందుంటారు. వారికి ఇద్దరు
కొడుకులు. తమకు ఉన్న ఆదాయం తోనే ఎంతో జాగ్రత్తగా వారికి
పెద్ద చదువులు చదివించారు. వారిలో పెద్దవాడు సురేష్ అమెరికా లో చిన్నవాడు నరేష్ బెంగళూరు లోను స్థిర పడ్డారు.
రాఘవయ్య గారుఅక్కడి పెద్దలు సహకారం తో ఆ ఊరి లో ఒక ఎకరం పొలం, ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా అక్కడే ఉండాలని ఆయన నిర్ణయం. ఇన్నేళ్ళుగా కన్నతల్లి లాగా ఆదరించిన ఊరిని, ఆ ఊరి వారిని వదిలి వెళ్ళడం వారిద్దరికీ ఇష్టం లేదు.
రాఘవయ్య గారు తన పొలంలో కొబ్బరి, మామిడి లాంటి పండ్ల
చెట్లు నాటించారు. ఆయనకి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారు. వారి సహాయ సహకారాలతో వ్యవసాయం మీద అవగాహన లేక పోయినా పొలం మీద ఎప్పుడూ నష్టం కలగ లేదు. పిల్లలు దూరంగా ఉన్నా వారి మంచి కోసమే అన్న దృష్టితో
ఎప్పుడూ బాధ పడేవారు కాదు. కానీ సంవత్సరానికి ఒక్కసారైనా రమ్మని అడిగేవారు.
పెద్ద కొడుకు సురేష్ అమెరికా వెళ్ళి పది సంవత్సరాలు అయింది.
చిన్న కొడుకు నరేష్ కూడా బెంగళూరు లో స్థిరపడి ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. ఇద్దరూ నాలుగు సార్లు వచ్చి ఉంటారు. ఈ సంవత్సరం ఎలాగైనా రమ్మని చెప్పారు రాఘవయ్య గారు. ఆయన ఈ సంవత్సరం రిటైర్ కాబోతున్నారు. పిల్లలు తన రిటైర్మెంట్ సమయానికి రావాలని ఆయన కోరిక.
కొడుకులిద్దరూ తమ కుటుంబాలతో ఆయన రిటైర్మెంట్ సమయానికి వచ్చారు. స్కూల్ లో ఘనంగా సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆయనని అభినందిస్తూ స్కూల్ వాళ్ళు, గ్రామ
పెద్దలు మాట్లాడారు. వారు కూడా ఇన్నేళ్ళుగా ఆదరించిన ఊరి
వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మున్ముందు కూడా తాను
ఇక్కడే ఉండ బోతున్నట్లుగా చెప్పారు. ఊరు వారంతా సంతోషంగా చప్పట్లతో తమ ఆనందాన్ని తెలియ చేశారు.
ఇంటికి వెళ్ళి తీరుబడిగా కూర్చున్నాక, కొడుకులు, కోడళ్ళు, వారిద్దరి దగ్గర కూర్చున్నారు.
చిన్న కొడుకు నరేష్ "నాన్నా, ఏమిటి, మీరు రిటైర్ అయ్యాక కూడా ఇక్కడే ఉంటారా. ఇంకా ఇక్కడేం చేస్తారు? మా ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ఉంటే సరి పోతుంది కదా. ఈ వయసు లో ఒక్కరూ ఉండి ఏం కష్ట పడతారు?" అన్నాడు.
"ఒక్కడినే అంటావేమిటిరా. అమ్మ, నేను ఇద్దరం. మా ఇద్దరికీ తోడు ఈ ఊరి జనం. ఈరోజు సన్మాన సభ లో చూశారుగా అందరూ ఎలా మాట్లాడారో. అయినా ఇంకా మా పనులు మేం చేసుకునే శక్తి ఉంది. ఇప్పటినుండి మీకెందుకు భారంగా ఉండడం. అదీగాక ఇక్కడ పొలం, ఇల్లు ఉన్నాయిగా. అన్నీ వదిలేసి ఎలా
వచ్చేస్తాం" అన్నారు రాఘవయ్య గారు.
"వదిలేసి ఎందుకు, అమ్మేసి రండి. ఏం అన్నా, ఏం మాట్లాడవేం."
సపోర్ట్ కోసం అన్నట్లు నరేష్, సురేష్ ని అడిగాడు.
జానకమ్మ గారు, కోడళ్ళు నిశ్శబ్దంగా వింటున్నారు.
రాఘవయ్య గారు సురేష్ వైపు చూశారు.
"నేనేం చెప్తాను? అంతా నాన్నగారి ఇష్టం. నాకైతే ఇంకా రిటైర్ అయ్యాక కూడా పొలం పనులు అని కష్ట పడే బదులు హాయిగా
వచ్చే పెన్షన్ తో గడుపుకుంటే సరిపోతుంది అన్పిస్తుంది. ఎందుకు
అక్కర్లేని ఝంఝాటం అని. ఆ ఒక్క ఎకరా మీద ఖర్చే తప్ప ఆదాయం ఏం ఉంటుంది? ఇన్నాళ్లు అంటే వచ్చిన జీతంలో ఖర్చు
పెట్టేవారు, కానీ ఇప్పుడు ఎలా? అదీ ఆలోచించాలి కదా." అన్నాడు సురేష్.
"అయితే నీ ఉద్దేశ్యం పొలం అమ్మేయమనా?" సూటిగా అడిగారు
రాఘవయ్య గారు.
"అవును నాన్నగారు. ఇంకా ముసుగులో గుద్దులాట దేనికీ. పొలం అమ్మేసి నా వాటా నాకిస్తే, నేను అమెరికా లో ఈ మధ్యనే ఇల్లు కొనుక్కున్నాను కదా, కొంచెం హెల్పింగ్ గా ఉంటుంది ఇంకా ఈ
ఇల్లంటారా, మీ ఇష్టం. వాడన్నట్లు అమ్మేసి వాడి దగ్గరకు వెళ్ళి
పోయినా మంచిదే." అన్నాడు సురేష్.
జానకమ్మ గారి దృష్టి కోడళ్ళ వైపు తిరిగింది. చిన్న కోడలు విజయ కళ్ళల్లో సంతోషం ఆవిడ దృష్టిని దాటి పోలేదు. పెద్ద కోడలు ప్రమీల కొంచెం ఆలోచనలో ఉన్నట్లు అన్పించింది.
"సరే, మీ ఉద్దేశ్యాలు మీరు చెప్పారు కదా. మేం ఆలోచించు కోవాలి." అన్నారు గంభీరంగా.
జానకమ్మ గారు ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉన్నారు.. అప్పటికే సాయంత్రం 5 అవుతూ ఉండడంతో ఆవిడ టీ పెట్ట
డానికి లేచారు. టీ తాగేసి రాఘవయ్య గారు పొలం వైపు వెళ్ళి వస్తానని వెళ్ళారు. మనవలు వెంట పడటం తో వాళ్ళని కూడా
పొలానికి తీసుకొని వెళ్ళారు.
ఇంతలో పక్కవీథిలో ఉండే కమలమ్మ వచ్చి పిండివంట చేయడానికి సహాయం అడగడంతో ఆవిడ బైటికి వెళ్ళి పోయారు. కమలమ్మ, ఇంటికి వెళ్ళేసరికి వారింటికి చుట్టాలు వచ్చి ఉండటం తో పిండివంట పని వాయిదా పడింది. వచ్చిన వారు కమలమ్మ ఆడపడుచు కావడంతో కొంచెం సేపు మాట్లాడి ఇంటికి తిరిగి వచ్చారు జానకమ్మ గారు.
ఇంట్లోకి అడుగు పెట్టే బోతుంటే పెద్ద కోడలి మాటలు గట్టిగానే విని
పించాయి. "పొలం, ఇల్లు రెండూ అమ్మేసి వచ్చిన డబ్బులో సగం వాటా మాత్రమే మాకు వస్తుంది, కానీ వాళ్ళని మీ దగ్గరే పెట్టుకుంటే మామగారి పెన్షన్ డబ్బులతో పాటు వాళ్ళు ఇంట్లో చేసే పని కూడా మీకు కలిసి వస్తుందని కదా, అని మీ ఆశ. అందుకేగా వాళ్ళని అంతగా అన్నీ అమ్మేసి రమ్మని వత్తిడి చేసేది." అంటోంది కోపంగా.
"అలా అయితే మీరు తీసుకెళ్లి పెట్టుకోండి. మేం కాదన్నామా.
ఏమండీ, మాట్లాడరూ." దీర్ఘం తీసింది చిన్న కోడలు.
"మేం తీసుకెళ్ళి ఏంచేయాలి? వాళ్ళు అక్కడ ఉండలేరు. రానూ, పోనూ ఖర్చు మోపెడు. మీకంటే అన్ని విధాలా కల్సి వస్తుంది, కానీ
మాకేం లాభం." పెద్ద కోడలు.
బైట నిల్చుని ఉన్న జానకమ్మ గారికి వాళ్ళ మాటలు వింటుంటే కాళ్ళ కింది భూమి కదిలి నట్లు అన్పించింది. నిల్చోలేక అక్కడే కూలబడి పోయారు ఆవిడ.
"ఏమండీ, మీ వదిన మాటలు విన్నారా. . మనకేదో కల్సి వస్తుంది అన్నట్లు మాట్లాడుతోంది. తీసుకెళ్తే బాధ్యత పడాలి కదా. అది
ఎవరు పడతారు? వాళ్ళు పెన్షన్ డబ్బులు వాళ్ళకే చాలవు. ఇంక మాకేంటి మిగిలేది?" అంది చిన్న కోడలు.
"చూడు చిన్నా, ఇదంతా కాదు. నాన్నగారిని పొలం అమ్మేసి డబ్బులు పంచమందాం. ఉంటే ఇక్కడే ఉండనీ. ఊరు మొత్తం మాతో ఉంటుందని అంటున్నారు కదా." అన్నాడు సురేష్.
"నీకేం, నువ్వు బాగానే చెప్తావు. వాళ్ళకి ఏమాత్రం బాగులేక పోయినా పరుగులు పెట్టాల్సింది నేను. నువ్వు పై దేశం లో ఉంటావు, కాబట్టి ఎవ్వరూ ఏమీ అనరు. మరి నా పరిస్థితి?" అన్నాడు నరేష్.
కొంచెం సేపు నిశ్శబ్దం, తర్వాత "ఎక్కడో ఉన్న నేను పదే పదే రాలేను. కావాలని కాదుగా. కుదరక. నాకన్నా దగ్గరగా ఉంటావు
కాబట్టి నువ్వు వస్తావని, రావాలని అందరూ అనుకుంటారు.
అందులో పెద్ద విషయం ఏం ఉంది. నీ ప్లేస్ లో నేనున్నా అంతేగా."
అన్నాడు సురేష్.
"డాలర్ల లో సంపాదించే నీకేం తెలుసు. బెంగళూరు కాస్ట్లీ సిటీ.
మా సంపాదన అసలు ఖర్చులకు సరిపోదు.ఇంక మధ్య మధ్యలో
ప్రయాణాలంటే, పరిస్థితి ఏంటి?" నరేష్ గొంతులో అసహనం.
"డాలర్ల లో సంపాదిస్తానని తెగ ఫీలవు తున్నారు, కానీ ఖర్చు కూడా డాలర్ల లోనే అని ఎందుకు అనుకోరు? అక్కడేదో సుఖపడి పోతున్నామని ఓ బాధ పడుతున్నారు. అక్కడ ఎన్ని బాధలు పడుతున్నామో తెలుసా." సురేష్ గొంతులో కోపం తొంగి చూసింది
"సరే లే. ఇవన్నీ ఆయన ఒప్పుకున్నప్పుడు కదా. అప్పుడు ఆలోచిద్దాం." అంటూ చర్చకి ఫుల్ స్టాప్ పెట్టాడు నరేష్.
" నేను నా ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నా" అంటూ నరేష్ బైటికి
వెళ్ళి పోయాడు. ఆ వెనుకే సురేష్ వెళ్ళి పోయాడు. కోడళ్శిద్దరూ గదుల్లోకి వెళ్ళి పోయారు.
కాస్త ఆగి లోపలికి వచ్చిన జానకమ్మ "ఎక్కడున్నారు
అందరూ. లైటు కూడా వేయలేదు." అంటూ లైటు వేశారు.
బైటికి వచ్చిన పెద్ద కోడలు " మీ అబ్బాయిలు బైటికి వెళ్ళారండీ."
అని సమాధానం ఇచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి పోయింది.
జానకమ్మ గారికి ఏంచేయాలో తోచలేదు. వంటగది లోకి వెళ్ళి వంట ప్రయత్నం లో పడ్డారు. ఇంతలో రాఘవయ్య గారు, మనవలు రావడంతో సందడి మొదలైంది. వంట పూర్తి చేసి పిల్లలకు పెడుతూండగా కొడుకులు రావడం తో తండ్రి, కొడుకులకు భోజనాలు పెట్టేశారు. కొడుకులు లోపలికి వెళ్తూంటే రాఘవయ్య గారు పిలిచి మర్నాడు అందరూ పొలానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని చెప్పారు. తరువాత ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళి పోయారు.
జానకమ్మ గారు రాఘవయ్య గారి ని "కాసేపు తోటలో కూర్చుందాం రండి." అని పిలవడం తో ఇద్దరూ తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక బెంచ్ మీద కూర్చున్నారు.
"చెప్పు జానకి." అన్నారు రాఘవయ్య గారు.
"నేనేం అనలేదే." అన్నారు జానకమ్మ గారు.
"నీ సంగతి నాకు తెలియదా. ఏమైనా మాట్లాడాలంటేనే తోటలోకి
రమ్మని పిలుస్తావు" అన్నారు నవ్వుతూ.
జానకమ్మ గారు కూడా నవ్వేసి " అనుకోకుండా నేను పిల్లలు మాట్లాడు కుంటూ ఉంటే వినడం జరిగిందండీ." అంటూ వారు మాట్లాడు కున్న విషయాలన్నీ రాఘవయ్య గారి కి చెప్పి " పిల్లల మనస్తత్వాల్లో చాలా మార్పు వచ్ఛిందండీ. చిన్నప్పుడు అన్నకు
ఏమైనా ఇస్తే తమ్ముడికి ఇవ్వాలని, తమ్ముడికి కొంటే అన్నకు కొనాలని పేచీ పెట్టేవారు. ఇప్పుడు ఏంటి ఇలా తయారయ్యారు?"
అన్నారు నీళ్లు నిండిన కళ్ళతో.
"బాధ పడకు జానకీ. మార్పు సహజం. కాలంతో పాటు మార్పులు
జరుగుతాయి." అంటూ రాఘవయ్య గారు ఓదార్పుగా ఆమెను
దగ్గరకు తీసుకున్నారు. ఆ మాత్రానికే చల్లగాలి తాకిన మేఘంలా ఆమె కళ్ళు వర్షించ సాగాయి.
"ఊర్కో. నేనున్నాను కదా. నేను చూసుకుంటాను." అన్నారు ఆయన మళ్ళీ ఆమె ను గుండెలకు హత్తుకుంటూ.
"ఏమండీ, చిన్నప్పుడు వాళ్ళని చూసి అందరూ రామలక్ష్మణులు
అనేవారు కదండీ. నేను అప్పుడు ఎంతో పొంగి పోయే దాన్ని. ఇప్పుడు వాళ్ళు మాటలు వింటుంటే అసలు అన్నదమ్ములేనా,
అన్పిస్తోందండీ. వీళ్ళు జీవితంలో కలిసి, మెలిసి ఉంటారా. మళ్ళీ
వీళ్ళను నేను కోరుకున్నట్లు చూడగలవా." మరొకసారి మళ్ళీ ఆమె కన్నీటి సంద్రం అయింది.
"జానూ, నా మాట మీద నమ్మకం ఉంది కదా. బాధ పడకు. నేను
చూసుకుంటాను. నువ్వు భయపడ్డట్టు ఏం జరగదు. పద పడుకుందాం. చాలా రాత్రయింది." అంటూ ఆమెని లోపలికి
తీసుకెళ్ళారు రాఘవయ్య గారు.
మర్నాడు ఉదయం అందరూ పొలానికి వెళ్ళారు. పిల్లలు ఆనందంగా పరుగులు పెడుతున్నారు. మామిడి తోటలో చల్లగా ఉంటుంది అని వాటి మధ్య చాపలు వేయించారు. పనివాడు వచ్చి అందరికీ కొబ్బరి బొండాలు ఇచ్చాడు.
మామిడి తోటను చూపిస్తూ రాఘవయ్య గారు " ఈ తోట వేసినప్పుడు మా చిన్నాకి 8 ఏళ్ళు, సురేష్ కి 10 ఏళ్ళు ఉంటాయి." అన్నారు.
"అవును నాన్నగారు, నాకు బాగా గుర్తుంది. తోటలో మొక్కలు
వేసినప్పుడు మేం మీతోనే ఉన్నాం, కదరా అన్నా." అన్నాడు
నరేష్ ఉత్సాహంగా.
" అవును ముందు రెండు రోజులు ఏవో కొలతలు కొలిచి దూరదూరంగా మార్కింగ్ చేయించి తర్వాత మామిడి మొక్కలు పాతించారు." అన్నాడు సురేష్, ఆనాటి విషయాలు గుర్తు చేసుకుంటూ.
"ఓహో, అయితే ఆ విషయాలు మీకు ఇంకా గుర్తున్నాయి అన్నమాట. అయితే మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారో, ఎలా
ఆడుకొనే వారో , ఎక్కడ ఆడుకొనే వారో అన్నీ పిల్లల కి చూపించండి. సరదా పడతారు." అన్నారు రాఘవయ్య గారు.
పిల్లలు వారిద్దరి చుట్టూ చేరారు. పిల్లల చేతులు పట్టుకుని పరిగెడుతూ వాళ్ళిద్దరూ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళకి ప్రత్యక్షంగా అరుస్తూ, ఆడుతూ, పాడుతూ చూపించారు. పిల్లల
తో పాటు పెద్దలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. సురేష్, నరేష్ లకు తమ చిన్ననాటి విషయాలు గుర్తుకు వచ్చాయి. ఒకరినొకరు ఎంతో అభిమానం గా చూసుకున్నారు
నరేష్ కొడుకు వినయ్ "డాడ్, ఇన్నాళ్లు ఎంత ఎంజాయ్ మెంట్
మిస్ అయ్యాం కదా. మీకే హాపీ, చిన్నప్పుడు పెదనాన్న తో బాగా
ఎంజాయ్ చేశారు." అన్నాడు బుంగమూతి పెడుతూ.
సురేష్ కొడుకు దీపక్ "ఔను బ్రో, వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేసి మనల్ని ఎంజాయ్ చేయనివ్వలేదు. నీకో సిస్టర్, నాకో సిస్టర్, వాళ్ళతో ఏం ఆడతాం. ఈ 4 డేస్ బాగా ఎంజాయ్ చేశాం కదా.
ఇంక ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావాలి, ఎంజాయ్ చేయాలి, అంతే."
'నా మాటే శాసనం' అన్నట్లు అంటూ ఉంటే అందరూ నవ్వులే
నవ్వులు.
వారిని చూసి జానకమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
రాఘవయ్య గారు "బాబూ, సురేష్ నువ్వు ఇందాక నీచిన్నప్పుడు మొక్కలు నాటే ముందు మార్కింగ్ చేసి దూర దూరంగా మొక్కలు నాటించానని గుర్తు చేశావు కదా. దానికి కారణం ఏమిటో తెలుసా. మొక్కల వేళ్ళు అడుగు భాగంలో బాగా విస్తరిస్తాయి.
ఒక చెట్టు ఎదుగుదల మరో చెట్టు కి ఆటంకం కాకుండా జాగ్రత్త తీసుకో డానికి అలా చేస్తారు. కానీ చెట్లు ఎదిగాక కొమ్మలు దగ్గరగా వచ్చి నీడని ఇస్తున్నాయి చూశారా." అన్నారు
" మరి మనుషులు ఎందుకు తాత గారూ, చిన్నప్పుడు కలిసి పెరిగి
పెద్దయ్యాక దూరం అవుతారు?" సురేష్ కొడుకు దీపక్ ప్రశ్న విని
అందరూ ఉలిక్కిపడ్డారు.
" ఇతరులకు ఇవ్వడం కోసం చెట్లు కాస్తాయి, నదులు
ప్రవహిస్తాయి, గొప్పవారు ఇతరులకు సహాయం చేయడం కోసం
పుడతారు. కానీ మామూలు మనుషులు ఎవరి గురించి వాళ్ళే ఆలోచిస్తారు. అందుకనే చిన్నప్పుడు కలిసి పెరిగిన వాళ్ళు కూడా
పెద్దయ్యాక దూరం అవుతారు బాబూ." అన్నారు రాఘవయ్య గారు
సురేష్, నరేష్ ఒక్కసారిగా తండ్రి దగ్గరకు వచ్చి " క్షమించండి
నాన్నగారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టాం. ఇంక మీరు చెప్పినట్లు నడుచుకుంటాం." అని ఆయన చేతులు పట్టుకున్నారు.
"అంతేకాదు, దీపూ అన్నట్లు ప్రతి సంవత్సరం వస్తాం. వీలైనంత త్వరలో మన దేశానికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తాను." అతని మాటలు విన్న నరేష్ సంతోషంతో సురేష్ ని పైకి లేపాడు. పిల్లలంతా చప్పట్లు కొట్టారు.
కోడళ్ళిద్దరూ జానకమ్మ దగ్గర చేరి "క్షమించండి అత్తయ్యా, మీకు బాధ కలిగించాం." అన్నారు. ఆమె వారిద్దరినీ ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు.
రాఘవయ్య గారు జానకమ్మ గారి వైపు చిరునవ్వు తో చూసేసరికి
ఆమె కూడా చిరునవ్వులు చిందించారు