ఉదయబాబు కొత్తపల్లి

Tragedy

4.8  

ఉదయబాబు కొత్తపల్లి

Tragedy

ఆత్మదండన!(కధ)

ఆత్మదండన!(కధ)

10 mins
524''నాన్నగారూ.నాకు వందరూపాయలు కావాలి." ఉయ్యాల బల్లమీద పేపర్ చదువుతున్న శంకరంగారిని అడిగాడు రమణ .


శంకరంగారు అతనికేసి ఏ భావమూ లేకుండా చూసి ముఖం మళ్ళీ పేపర్ లోకి తిప్పారు.


''మిమ్మల్నేనండీ...నాకు వంద కావాలి. ఇమ్మంటే మాట్లాడరేం? మీ కోడలే అడగమంది.'' అన్నాడు రమణ విసురుగా.


''అమ్మా సరస్వతీ..'' పిలిచారాయన.


''ఏంటి మామయ్యా?'' అంటూ కొంగుకు చెయ్యి తుడుచుకుంటూ వచ్చింది సరస్వతి.ఆమె వెనుకే భవానీగారు కూడా 

వచ్చారు.


''నువ్వు వాడితో నన్ను వందరూపాయలు అడగమన్నావట. నిజమేనా?'' అడిగారు శంకరంగారు.


''ఆయన ,,,ఆయన సినిమా చూస్తానంటేనూ...''


''అంటే, తన వినోదం కోసం నా కష్టార్జితం పాడు చేస్తాడా వీడు? నేను..నేను ఇవ్వను. అయాం సారీ.'' అన్నారాయన కుర్చీలో కూర్చుంటూ.


''నేనేం వూరికే అడగలేదు. నేను సంపాదనలో పడిన తర్వాత అణాపైసలతో సహా ఇస్తాను. మీ కోడల్ని సినిమాకు తీసుకువె ల్దామని నేనే అడుగుతున్నాను.ఇవ్వరా?'' అన్నాడు మరింత విసురుగా.


''అదేమిట్రా రమణా? నాన్నగారితో మాట్లాడే విధానం అదేనా?'' భవానీ గారు ముందుకు వచ్చి మందలిస్తున్నట్టుగా అంది కొడుకుతో.


''నువ్వు ఆగు భవానీ.బాబూ రమణా! నువ్వు డిగ్రీ పాసై రెండేళ్ళు అయింది. ఈ రెండేళ్ళలో నువ్ చేసిన ప్రయోజకత్వమైన పని నీ పెళ్లి. అది తప్ప మరో పని చేసావా నువ్వు? ఎందుకురా మమ్మల్ని ఇలా క్షోభ పెడతావ్? ఎపుడు వస్తావో తెలీదు. ఎందుకు బయటకు వేల్తావో తెలీదు. నీకోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూసి, నీతో కలిసి భోజనం చేద్దామన్న కల తీరక నిద్రపోతుందా అమ్మాయి.రాత్రి ఏ రెండితికో ఇంటికి వచ్చి, మనకోసం ఎదురుచూసే ప్రాణి ఒకటి ఉంటుంది అన్న ఆలోచన లేకుండా మంచానికి అడ్డంగా పడుకుని నిద్రపోయే నిన్ను ఏంచేస్తే బాగుపడతావురా? చూడరా.పట్టుమని పదిహేను నెలలు కాలేదు ఆ అమ్మాయి మనింట్లో కాలుపెట్టి ..ఎంత వీక్ గా ఉందొ చూడు. మూడుసార్లు గర్భస్రావం అయిందంటే ఆ అమ్మాయి పరిస్తితి ఏమిటో ఆలోచించు. వాళ్ళ నాన్న వచ్చి అడిగితె ఏమని సమాధానం చెప్పను?ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో. ఏ తండ్రి తన బిడ్డకు నచ్చ చెప్పినా అతని మంచికే చెబుతాడు కానీ చేదిపోవాలని చెప్పాడు. కస్టపడి ఒకరూపాయి సంపాదించి చూడు. దాని తాలూకు ఆనందం ఎంత సంతృప్తిని ఇస్తుందో అనుభవించి చూడు. నిన్ను నమ్ముకుని వచ్చిన ఆ అమ్మాయిని అన్యాయం చెయ్యకు.''


''వందరూపాయలు ఇమ్మంటే వంద నీతులు గడ్డి పెట్టడం తెలుసు మీకు. నేను మిమ్మల్ని నన్ను కనండో అని ఏడవలేదు. ఒక్క కొడుకుని పెంచి పోషించలేని వారు పిల్లలు లేని అనాధల్లాగే ఉండలేకపోయారా?అంతగా పిల్లలంటే ఇష్టమైతే

ఓ అనాధని తెచ్చి పెంచుకోలేకపోయారా?"


కొడుకు మాటలకు ఆయన నిర్ఘాంతపోయారు. 


''అదే మేం చేసిన తప్పు బాబూ. నిజంగా మేము అలా చేసి ఉంటె ఈ నాడు మాకీ మానసిక క్షోభ ఉండేదే కాదు. అయినా మేం చేసిన తప్పు పని నువ్వెందుకు చేస్తున్నట్టు ?''


''నేను..నేనేం చేసాను?'' అర్ధం కానివాడిలా అడిగాడు రమణ. 


'' ఎం చేసావో గుర్తు తెచ్చుకో ...నీ భార్యకి మూడుసార్లు గర్భస్రావం అయిందంటే కారణం ఎవరు? పక్కింటి వాడా?''


"నాన్నా?'' గర్జించినట్టుగా అరిచాడు రమణ .


''ఎందుకురా గొంతు చించుకు అరుస్తావ్? నేను అరవలేను అనుకున్నావా? రేపు ఆ కడుపునుంచి నీ కొడుకో కూతురో పుట్టి వాళ్ళు నన్నెందుకు కన్నావ్? అని నిన్ను ప్రశ్నించిన నాడు నీకు తెలుస్తోందిరా మూర్ఖుడా..ఎందుకు కన్నారని ప్రశ్నిస్తున్నావా ? నీ తల్లి గొడ్రాలు కాదు అని సమాజానికి చెప్పడం కోసం .నేను స్వచ్చమైన మగాడిని అని నీలాంటి మూర్ఖులకి తెలియడం కోసం, మాది అనురాగ దాంపత్యం అని అందరూ ..అంటే అటు నన్ను కన్నవాళ్ళు ఇటు ఆత్మబంధువులు తెలుసుకోవడం కోసం, ముఖ్యంగా మన వంశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తావని నిన్ను కన్నాం గానీ, నువ్వు సంపాదించి పోసే లక్షలకు ఆశపడి కాదు.అసలు ఏ తండ్రీ అందుకోసం పిల్లలను కనడు. నువ్వు నీ పెళ్లికి తీసుకున్న కట్నం బ్యాంకు లో నీపేరున డిపాజిట్ చేసాం. ఉంచుకుంటావో, తగలేసుకుంటావో నీ ఇష్టం.


ఒక్కగానొక్క బిడ్డవని, రెండో బిడ్డ పుడితే ఆ ప్రేమ వాడికి పంచాల్సివస్తుందని మీ అమ్మ రెండో బిడ్డ కావాలో అన్నా నచ్చచెప్పుకుని ఉన్నంతలో నిన్ను అపురూపంగానే పెంచాను. పిల్లల అభిరుచి తెలుసుకుని ప్రవర్తించాలి - వారి అభీష్టం ప్రకారం నడుచుకోవాలి - వారి పసి మనసు గాయపడకుండా నచ్చ చెప్పాలని పత్రికలూ, చట్టాలు ఘోషిస్తుంటే ఎంతో ఓర్పు, సహనం వహించి కొడుకులా చూడకుండా ఒక స్నేహితుడిలా మసిలాను. ఆప్తుడిలా సలహాలు ఇచ్చాను.తండ్రిగా మందలించాను. నువ్వు ఏ విషయం లో తొందరపాటు నిర్ణయం తీసుకున్నా, అర్ధం అయ్యేలా చెప్పి, సర్దుబాటు చేసుకుంటూ వచ్చాను, వస్తూనే ఉన్నాను.


చదువు తప్ప వేరే ఆస్థి మనకు లేదు. కష్టపడి చదువుకోమని విడమర్చి చెప్పాను.'కష్టసుఖాలు' అన్న సమాసం నువు చదువుతుంటే ...జీవితంలో ముందుగా కష్టపడితేనే, భావిజీవితం సుఖంగా ఉంటుందని వివరించాను.'సుఖదుఃఖాలు'అని చదివినప్పుడు జీవితంలో ముందుగా శిఖపడితే,తరువాతి కాలమంతా దుఃఖపడవలసి వస్తుందని చిలక్కి చెప్పినట్టు చెప్పాను.


నీకిష్టమైన దానిమీద ఎలా మనసు లగ్నం చేస్తున్నావో, ఇష్టం లేకపోయినా చదువుమీద ఆసక్తి పెంచుకోమన్నాను.తెలియనివి నన్ను అడిగి చెప్పించుకోమన్నాను.తెలియనివి తెలుసుకోవడం కోసం ట్యూషన్స్ ఏర్పాటు చేసాను.కానీ..కానీ...నువు చేసిందేమిటి?


దీపావళి పండుగ రోజు నువ్ సంతోషంగా,ఆనందంగా కాల్చుకుంటావని పదిహేను రోజుల ముందుగానే లేత తాటి మట్టలు కొట్టించి, ఆరబెట్టి ఇంట్లో పటాసు నూరి టపాకాయలు తయారు చేస్తే ఏంచేసేవాడివో నీకు గుర్తుందా? వాటిని పట్టుకెళ్ళి నీ స్నేహితులకు దానం చేసేవాడివి.


ఎవడో పరీక్ష హాల్లో కాపీ కొడుతుంటే , వాడు బీదవాడని, వాడు కాపీ కొట్టి పాసుకాకపొతే ఉద్యోగం రాదని, వాడు ఉద్యోగం చేయకపోతే వాళ్ళ ఇల్లు గడిచే దిక్కు లేదని ఇన్విజిలేటర్ కి చెప్పావత. కానీ, ఆయన తన డ్యూటీ చేస్తూ వాడిని పట్టుకుంటే, 'బయటకు రా , నీ పని చెబుతా ' అని ఎవరో గొట్టంగాడి కోసం నువ్వు రాసిన ఆన్సర్ షీట్స్ ని అడ్డంగా చిమ్పేసి ఆయన మొహాన కొట్టి బయటకు వచ్చేసావే,,,ఆ వెధవ తర్వాత హాయిగా పరీక్ష పాసై, రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుని పెళ్ళాం బిడ్డలతో సుఖంగా కులుకుతున్నాడే...కనీసం తన పెళ్లికైనా నిన్ను పిలిచాడా?


గురువును అవమానించిన నీకు ఆ పరీక్ష ఈనాటికీ పూర్తీ కాలేదన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఇవన్నీ చెయ్యమని నేను నీకు చెప్పానా? అయినా నీకు ఇంకా కుర్రదనం పోలేదని సరిపెట్టుకున్నాను.


ఆనాడే నాకు నువ్వు తెచ్చిన మచ్చాకి నిన్ను అడ్డంగా నరికి ఉంటె ఈ వేళ నన్నెందుకు కన్నావు అన్న ప్రసన నీ చేత వేయించుకునే వాడిని కాదు.నేను నిన్ను కన్న తండ్రిని. కసాయివాడిని కాదు కానీ నువ్వు కసయివాడివి. నువ్వు నన్ను కనలేదు. నువ్వింకా ఎవరినీ కనలేదు. అది మర్చిపోకు.నీకు ఉండాలని ఉంటె ఈవూరిలో ఉండు. లేకుంటే నీ భార్యని తీసుకుని వెళ్ళవచ్చు.


కనీసం పెళ్లి చేస్తే అయినా మారతావని ఎంతో ఆశతో మీ అమ్మ నన్ను పోరితే స్నేహితుడి కూతుర్ని కట్నం లేకుండా కోడల్ని చేసుకుందామని ఆశపడ్డ మమ్మల్ని పదిమందిలోనూ డబ్బు మనుషులను చేసి కట్నం పుచ్చుకున్నావు.ఆ అమ్మాయి పేరుకు తగ్గ సహనశీలి కనుక సరిపోయింది. లేకపోతె నీలాటి వాడికి భార్య అయినందుకు పౌరుషం, అభిమానం ఉన్న ఉన్నదైతే ఉరేసుకునేది. అందుకే ఇక నిన్ను భరించే శక్తి నాకు లేదు. ఆ అమ్మాయి ఇక్కడ ఉంటె నాకు అభ్యంతరం లేదు.నిన్ను, నీ నీడను క్షణం కూడా భరించలేను.ప్లీజ్ గెటౌట్. అప్పుడు గానీ నీకు నీ బాధ్యత తెలిసిరాదు.'' అంతసేపు ఏకధాటిగా మాట్లాడిన ఆయన కోపం బాధ, నర నరాన కృంగదీస్తుండగా కుర్చీలో వాలారు.


''అంటే నేనంటే మీకు విషం, నా భార్య మీకు పనికి వస్తుంది. అంటే దాన్ని ఉంచుకుందామనుకుంటున్నారా ? " తీవ్రస్వరంతో పదునుగా అన్న అతని మాటలు ఒక్కొక్కటి శంకరంగారికి పదునైన శూలాల్లా గుచ్చుకున్నాయి.


ఆ మాట వింటూనే సరస్వతి నోట్లో చీరకొంగు కుక్కుకుని గుడ్లనీరు కక్కుకుంటూ వెళ్ళిపోయింది లోపలికి.


అంతవరకూ మౌనంగా రోదిస్తున్న భవానీ గారికి ఉక్రోషం ముంచుకొచ్చేసింది.


''ఒరేయ్ పశువా.మీ నాన్నగారిని అంతమాత అంటావా?'' అంటూ ఆవేశంగా పిచ్చిబలం తెచ్చుకుని కొడుకు కాలర్ పట్టుకుని ఆ లెంప, ఈ లెంప వాయించేసింది కోపంతో ఊగిపోతూ.


''అమ్మా!'' కళ్ళల్లో నిప్పులు చెరుగుతుండగా తల్లిని కొట్టడానికి చెయ్యి ఎత్తిన రమణ అంతలోనే నిగ్రహించుకుని నిస్సహాయంగా చేయి కిందకు దించుతూ అన్నాడు అంతే గట్టిగా.


''హు.కన్నా తల్లివైపోయావ్. లేకపోతేనా? చూడండి. నేను బయటకు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేసరికి నన్ను కన్నా పాపానికి నాకెంత ఆస్థి ఇవ్వదలుచుకున్నారో ఇచ్చేయండి.నేను వెళ్ళిపోతాను. లేదా మీరు వెళ్లిపోండి. ఇంట జరిగాకా నేను మీ బిడ్డను కాను. మీరు నా తల్లి తండ్రులు కారు.'' వికటాట్టహాసం చేస్తూ వికృతంగా నవ్వుతున్న రమణని చూస్తూ...


''ఒరేయ్ ..నీకు పిచ్చి గాని పట్టిందా..ఎందుకురా మమ్మల్ని ఇలా కాల్చుకు తింటున్నావ్ ? చంపెయ్యరా..ఒక్కసారిగా చంపేయ్. ఎంత తప్పు చేసాను రా నిన్ను కనీ? ఎంత పాపం చేసాను?" హృదయవిదారకంగా ఏడుస్తూ, తల బాదుకుంటూ కూలబడిన తల్లిని చూసి కూడా రామనలో మార్పు లేదు.


''హు.నటన. నాకు పిచ్చి పట్టిందట. అవును నాకు పిచ్చే పట్టింది.'' అంటూ కాలి ముందున్న టీపాయిని బలంగా ఒక్క తాపు తన్ని విసవిసా బయటకు వెళ్ళిపోయాడతను.


ఒక్కసారిగా ఎగిరిన టీపాయ్ గోడ దగ్గరున్న అక్వేరియం కు తగిలి అది భళ్ళున పగిలిపోవడంతో, అందులోంచి బయటపడి గిలగిలా కొట్టుకుంటున్న రంగుల చేపలకు ప్రతిరూపాల్లా ఉండిపోయారు ఆ ఇంట్లో వ్యక్తులు.


*******


పై సంఘటన నాటికి శంకరంగారు బ్యాంకు అసిస్టంట్ మేనేజెర్ గా పనిచేస్తున్నారు. ఇంకా రెండేళ్ళ సర్వీసు ఉంది. ఒక్కగా నొక్క కొడుకు వేకట రమణ. శంకరంగారు టీచర్ ట్రైనింగ్ పాసైన వెంటనే కాన్వెంట్ లో పని చేస్తున్న రోజుల్లో భవానీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.


ఆమె పాదం పెట్టిన మహత్యమో, ఆయన అదృష్టమో అంతకు ఆరునెలల కిందట రాసిన బాంక్ పరీక్షల్లో సెలెక్ట్ అయి అపాయింట్మెంట్ ఆర్డర్ వివాహం అయిన మరునాడే వచ్చింది. వారి ప్రేమానురాగ దాంపత్య దీపంగా వెంకటరమణ పుట్టాడు.


ముక్కు సూటిగా పోయే తత్వం, ఖచ్చితత్వం బాంక్ ఉద్యోగం వల్ల అలవాటైతే, టీచర్ గా పూర్వానుభావంలో మనస్త్వత్వ శాస్త్రం, వేదాంత శాస్త్రం అవగాహనతో ఆయన ఎంత చెప్పినా, ఏంచెప్పినా అందరికీ వినాలనిపిస్తుంది.పెద్ద వయసు వారు కూడా తమ సమస్యలను ఆయన ముందు పెట్టి సలహా తీసుకుని పాటించి మంచి ఫలితం పొందారు.


ఆరోజుల్లో బ్యాంకు ఉద్యోగం చేస్తున్న మొదటి రోజుల్లో కాన్వెంట్ విద్యార్ధులు ఎందఱో ఆయన వద్దకు ట్యూషన్ కి వచ్చేవారు. 


''నేను చెప్పింది చెప్పినట్టు చదవండి.నూటికి తొంభై మార్కులు వస్తాయి. మీరిలా ట్యూషన్లకు వచ్చి మీ తల్లితండ్రులచేత అదనంగా డబ్బు ఖర్చు పెట్టించడం నాకు చాలా బాధగా ఉంది.'' అంటూ ఉండేవారాయన.


''తొంభై మార్కులు ఎలాగూ వస్తాయన్న నమ్మకం ఉంది సర్. నూటికి నూరు తెచ్చుకుని మాతో పాటు మీకూ పేరు తేవాలని మీ దగ్గర చేరామే గానీ, మా తల్లితండ్రులను బాధ పెట్టాలని కాదు సర్.'' అనేవారు విద్యార్ధులు.


అటువంటి వాళ్ళల్లో జబ్బార్ ఒకడు.ఆటను ముస్లిం. శంకరం కాన్వెంట్లో చేరిన నాటికి జబ్బార్ ఆరవ తరగతి. ఆ సంవత్సరమే శంకరం గారి వివాహం జరిగింది.జబ్బార్ ఏడవ తరగతిలో ఉండగా రమణ పుట్టాడు. భవానీ గారికి చేదోడు వాదోడుగా ఉండేవాడు.రమణని ఎత్తుకుని మోసినవాడు మోసినట్లు ఉండేవాడు.


''నువ్వు లెక్కలు నేర్చుకోవడానికి వచ్చావ్ గాని, మా అబ్బాయిని మోసేందుకు కాదు'' అని శంకరంగారు కోప్పడినప్పటికీ 

'లెక్కలు ఫస్ట్ మార్క్ రాకపోతే అడగండి సర్.అంతే గానీ తమ్ముడిని ఎత్తుకోకుండా వుండటం నావల్ల కాదు' అనేవాడు జబ్బార్.


శంకరం బ్యాంకు లో చేరాకా కూడా పడవ తరగతి వరకు ఆయన వద్ద చదివి, అటు తర్వాత కంప్యుటర్లో జాయిన్ అయి, ఇటు డిగ్రీ, అటు బి.సి.ఎ. పూర్తిచేసాడు.


''విద్యార్ధి ఎప్పుడూ పారలెల్ స్టడీ చెయ్యాలి.అలా చేస్తే ఇటు అకాడమిక్ సైడ్ గానీ, లేకుంటే అటు టెక్నికల్ సైడ్ గానీ సెటిల్ కావచ్చు.'' అన్న శంకరం గారి సలహాను అక్షరాలా పాటించిన జబ్బార్ సొంతంగా 'జబ్బార్ కంప్యూటర్ సెంటర్' ను ప్రారంభించాడు.సోషల్ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది విద్యార్ధులకు ఉచితంగా కంపూటర్ కోర్సెస్ ను అందిస్తున్నాడు. అంటే కాదు చిన్న వయసులోనే ఒక ఓల్డ్ ఏజ్ హోం స్థాపించి పెద్దల దీవనలు అందుకున్నాడు.


*****


శంకరంగారు ప్రస్తుతం ఆ జబ్బర్తోనే మాట్లాడుతున్నారు.


''ఇదీ బాబూ జరిగింది. వాడు నామీద అంత అభాండం వేసాక ఇక ఆ ఊరిలో ఉండలేక లోన్ తీసుకుని కట్టిన ఇల్లు వాడి పేరున రాసేసి, అతనికి భార్యను చేసిన ఖర్మకు సరస్వతిని వాడి దగ్గరే వదిలేసి వచ్చాను.భవాని వాడిలో మార్పు కోసం 

ఎదురుచూస్తూ ఆ ఊరిలోనే ఉందామని అంది కానీ,నేను వద్దు అని ఎంతో కష్టం మీద ఇక్కడకు బదిలీ చేయించుకున్నాను. ఇక నాకు కొడుకువు నువ్వే జబ్బార్.'' అన్నారాయన.


పడక కుర్చీలో కూర్చున్న శంకరంగారి పాదాల వడ కూర్చున్న జబ్బార్ ఆశ్చర్యపోయాడు .''ఎంతకాలమైంది సర్ ఇలా జరిగి?''


''మూడేళ్ళు.నేను రిటైర్ అయి ఏడాది దాటింది. ఇక్కడకు వచ్చి ప్రశాంత జీవనం గడుపుతున్న మేము అనుక్షణం నిన్ను తలుచుకుంటూ ఉంటాము.రోజూ నీ పేరు ఏదో ఒక సేవా కార్యక్రమంలో పేపెర్ లో చూసి ఆనందిస్తున్నాము.మీ అమ్మగారు నిన్ను ఇక్కడకు వచ్చిననాడే కలుస్తాను అంది.కానీ నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే వద్దన్నాను .అంటే తప్ప వేరే ఉద్దేశ్యం లేదు.''అన్నారాయన.


''నేను ముందు నమ్మలేకపోయాను సర్.ఈ మధ్య ఇనిస్టిట్యూట్ లో మరీ బిజీగా ఉంటోంది.ఓల్డ్ ఏజ్ హోం కి పాతికవేలు డొనేషన్ ఇస్తే ఈ శంకరం గారు ఎవరా అని ఆశ్చర్యపోయాను.మీ పూర్తీ అడ్రస్ లో రిటైర్డ్ అని చూసి నిజంగా నాకు మతిపోయింది.మీరింకా నిన్నటి రోజున నాకు పాఠం చెబుతున్నట్టే ఉంది సర్. తమ్ముడు అలా ప్రవర్తించాడు అంటే నాకు నమ్మకం కుదరడం లేదు సర్. పోనీ నేను వెళ్లి నచ్చ చెప్పమంటారా ?"


భవాని వచ్చి జబ్బార్ కి కాఫీ కప్పు అందించింది.ఆమె కళ్ళలో లీలగా ఆశ దోబూచులాడి మాయమవడం లీలగా గమనించాడు అతను.


భవానీ కి తెలుసు భర్త మొండితనం. ఆరోజు రమణ అంత మాట అన్నాకా ఆయన వాడివైపు కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి మాట్లాడలేదు. ఊళ్లోనే ఉన్న వియ్యంకుడి ఇంటికి ఆ రాత్రే కట్టుబట్టలతో భార్యని తీసుకువెళ్ళాడు.అక్కడే రమణ పేర ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించి, కట్నం డిపాజిట్ చేసిన బ్యాంకు బుక్, ఆ ఇంటి దస్తావేజులు వియ్యంకుడికి ఇచ్చి కొడుకుకు అందే ఏర్పాటు చేసారు. తర్వాత వారం రోజులు సెలవు పెట్టి బదిలీకి ప్రయత్నం చేసి ఆ వూరు వదిలేసారు. వెళ్ళేలోగా ఒక్కసారి కొడుకుని, కోడల్ని తనివితీరా చూసుకోవాలని తాపత్రయపడిన భవాని ఆశ అడియాసే అయింది.ఒకసారి కొడుకు ప్రస్తావన తెస్తే ఆయన చాలా బాధగా అన్నాడు.


'' భవానీ. నీకు నేను కావాలో, నీ కొడుకు కావాలో తేల్చుకో అనే అగ్ని పరీక్షలు పెట్టను.ఈలోకంలోకి అందరం ఒంటరిగానే వచ్చాము.మన చుట్టూ కాలక్షేపం కోసం భవబంధాలు పెంచుకుంటాము.తిరిగి ఒంటరిగానే వెళ్లిపోతాము. నాకు శేష జీవితం ఎలా గడుస్తుంది అన్న బాధ లేదు.బాధ్యతనెరిగిన తండ్రిగా నీబిడ్డ 'నన్నెందుకు కన్నావ్ ' అన్న ప్రశ్నకు పరిహారం చెల్లించాను అనే అనుకుంటున్నాను. నువ్ కోరితే నీకూ అలాంటి ఏర్పాటే చేస్తాను.''


ఆయన అంత బాధగా అన్న మాటలు విని భరించలేక కుమిలి కుమిలి ఏడ్చింది.''నన్ను క్షమించండి...ఇక వాడి ప్రస్తావన నేను బతికి ఉండగా ఏనాడు మీ ముందు తీసుకురాను.''అందామె వెక్కిళ్ళ మధ్య.


కాలం గాయం మాన్పుతుందని ఊహించింది గానీ, భర్తలో ఏ మార్పూ లేదు. ఆ ఆశ ఇపుడు జబ్బార్ వాళ్ళ తీరుతుందన్న నమ్మకం కూడా పోవడంతో ఆమె నిర్లిప్తంగా లోపలకు వెనుదిరిగి వెళ్ళింది.


వారి మానసిక సంఘర్షణ తన కష్టంగా భావించిన జబ్బార్ హృదయం బరువెక్కింది. ఇది వారి కుటుంబ సమస్య. తమ సంస్థ పరిష్కరించేది కాదు. ఒకే ఒక్క కొడుకు ఉన్న ఇంటి సమస్య. సార్ కు గురుదక్షిణగా రమణ లో చైతన్యం కలిగించి, మనిషిలో మార్పు తెప్పించి అప్పగించాలి.అదే తన మొదటి పని అని నిర్ణయించుకున్నాడు జబ్బార్.


******


పదిరోజులుగా తీవ్ర జ్వరంతో చిక్ల్కి సల్యమైన శంకరం గారి సుస్తీ కబురు విని పరుగెత్తుకుంటూ వచ్చాడు జబ్బరి.


మంచంలో శవం లా గడ్డం మాసిపోయి, మానసిక వేదనతో ఆయనను పదిరోజుల క్రిందట చూసింది తానేనా అని ఆశ్చర్యపోయాడు జబ్బార్. శంకరంగారు మూసినా కన్ను తెరవకుండా పడుకున్నారు.


''సార్.ఏమిటి సర్..ఇలా అయిపోయారు? అమ్మా..అదేమిటమ్మా ? మీరైనా నాకు కబురు చేయలేకపోయారా?''అడిగాడు భవానిని.


''ఆయన వద్దన్నారు జబ్బార్. పైకి చెప్పారు గానీ, మా అబ్బాయి మాటలు ఆనాడే ఆయన్ని జీవచ్చవం చేసేసాయి.''ఏడుస్తూ అందామె.


జబ్బార్ లేచి భవానికి దగ్గరగా వచ్చి, ఆమెకు మాత్రమె వినిపించేలా అన్నాడు.


"అమ్మా.మీరేమీ అనుకోనంటే ఒక్క మాట. నేను వెళ్లి రమణ ను కలిసాను. తమ్ముడు ఇపుడు పూర్తిగా మారిపోయాడు.అతనికి అబ్బాయి పుట్టాడు.సార్ వచ్చేసాకా అమ్మాయిగారు ఎదురు తిరిగారాంట. 'నీది మగ పుట్టుకే అయితే, నువ్ ఒక తల్లికి తండ్రికి పుట్టినవాడివే అయితే మమ్మల్ని నీ కష్టార్జితం తో పోషించు. లేదా ముగ్గురం పురుగుల మందు తాగి చద్దాం రా..అంతే గానీ తల్లి తండ్రుల ఉసురు పోసుకుని నువ్వేం బాగుపడతావ్ ?నీ ఇంట్లో ఉండగా నా కన్న తండ్రి కూడా నాకు గుర్తుకు రానంత అపురూపంగా మావయ్యగారు నన్ను చూసుకున్నారు. అలాంటి ఆయనతో నీ పెళ్ళానికి రంకు కడతావా? మమ్మల్ని చంపి నువ్ చావు.లేదా ఈనాటికైనా చీము రక్తం ఉన్న మనిషిలా బతుకు...ఛీ.నువ్వు..నీ వెధవ బతుకూ...' అని చాకుతో పోదిచేసుకుందట. అంతే.రమణ లో మార్పు వచ్చిందట. నిజమమ్మా.తమ్ముడు నిజంగా మారాడు.మీరు అనుమతిస్తే లోపలకు తీసుకువస్తాను.''అన్నాడు జబ్బార్ కన్నీళ్ళతో.


''ఆయన కళ్ళు తెరిచి చూస్తె ఏమంటారోనయ్యా.నీ ఇష్టం. ఏమ్చేసినా ఆలోచించి చెయ్యి.వాడి మీద ఈ కన్నతల్లి ప్రేమను ఏనాడో చంపేసుకుంది.'' అంది భవానీ మౌనంగా రోదిస్తూ.


''పర్వాలేదమ్మా. సార్ తో అన్నీ నేను వివరంగా చెబుతాను. ఏం జరగకుండా చూస్తాను.ప్లీజమ్మా. వాడిని చూస్తే సారే క్షమిస్తారమ్మా.ప్లీజ్.'' చేతులు జోడించాడు జబ్బార్.


ఆమె మాట్లాడలేక మౌనంగా తలాడించింది.జబ్బార్ వెళ్లి బయట నిలబడి ఉన్న రమణను లోపలకు తీసుకు వచ్చాడు. రమణ తల్లిపాదాలకు చుట్టుకుపోయాడు.చంటి పిల్లవాడి కన్నా దారుణంగా వెక్కి వెక్కి ఏడవసాగాడు.ఆమె అతని తల నిమురుతూ ఉండిపోయింది గుండె బరువెక్కుతుండగా.


జబ్బార్ రమణని శంకరంగారి కాళ్ళ దగ్గర నిలబెట్టాడు.శంకరం గారి దగ్గరగా వచ్చి ఆయన చెవిలో ''సార్...సార్'' అని పదిసార్లు పిలిచాడు.


శంకరం గారిలో కదలిక వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.ఎదురుగా ఉన్న రమణను చూస్తూనే భయాందోళనలతో అంతటి జ్వరం లోను ఆయనకు విపరీతంగా చమటలు పట్టసాగాయి. ఆయన అతి కష్టం మీద దిండు కిందకు చేయి పోనిచ్చి నెమ్మదిగా ఏదో లాగబోయే ప్రయత్నంలో సగం బయటకు వచ్చిన కవరు ఆగిపోయింది - నిశ్చలంగా కొడుకునే చూస్తూ ఉండిపోయిన ఆయన చూపులా.


జబ్బార్ కవర్ తీసుకుని అందులోని కాగితాన్ని విప్పాడు.


''బాబూ రమణా! ఎంత మాట అన్నావురా నీ కన్నతండ్రిని. కూతుర్ని కామించే తండ్రులు, కోడళ్ళను పాడుచేసిన మామగార్లు ఈ లోకం లో ఉన్నారేమో నాకు తెలీదురా. నేనెవరో, నా తత్వమేమిటో తెలియంది వాడు నాపై అపవాదు వేసాడూ అంటే అర్ధం ఉంది. కానీ..కానీ..ఆ అమాయకపు తల్లిని, మరో అమ్మ కన్నబిడ్డని నాతొ సంబంధం అంటగడుతూ ఎంత మాట అన్నావురా. ఎక్కడ జరిగింది నా పెంపకంలో లోపం? ఏది ఏమైనా నీచేత ఆమాట అనిపించుకున్నానూ అంటే అలా అనే అవకాశం నీకు నేను ఇచ్చానన్నమాట. ఆ మాటే కాదురా. నువ్వు మరో మాట అనే అవకాశం కూడా నీకు ఇచ్చాను. 'ఈ ముసలాడు చచ్చాక కొరివి పెట్టాల్సింది నేనే...ఏమిటో అనుకుంటున్నాడు.అప్పుడు తెలుస్తుంది ఈ కొడుకు విలువ. ' అని నీ భార్యతో నువ్ అంటుంటే నేను విన్నాను. కానీ నీకు ఆ అవకాశం ఇవ్వనురా.


ఈ ప్రపంచంలో అందరూ ఆడపిల్లలే ఉన్న తల్లితండ్రులు ఏమ్చేస్తున్నారు? అసలు పిల్లలే లేనివాళ్ళకు తలకొరివి ఎవరు పెడుతున్నారు? ఏ అనాధ ఆశ్రమానికి పదివేలు చందా ఇచ్చినా దాటగా నన్ను కీర్తిస్తూ, పదిమందిని తీసుకువచ్చి ఊరేగించి మరీ తలకొరివి పెడతారు.అంతెందుకు? నిన్ను సొంత తమ్మునిలా భావింఛి నా పెద్ద కొడుకులా నా ఇంట మసిలాడే ...ఆ జబ్బార్ కి చెబితే చాలు, నన్ను సకల లాంఛనాలతో తగలేస్తాడు.


నిజమే బాబూ.నిన్ను అడగకుండా నిన్ను కనడం నేను చేసిన ఘోరాతి ఘోరమైన తప్పు.అందుకే నాకు నేనే 'ఆత్మదండన' విధించుకుంటున్నాను. ఈనాటి నుంచి నీకు నా ముఖం చూపించను.నీతో పన్నెత్తి 'నాన్నగారూ' అని పిలిపించుకోను. నాకు ఆజన్మాంతం ఆ శక్తి ఇవ్వాలని, ఇవ్వమని భగవంతుడిని కోరి, కోరి ప్రార్ధిస్తున్నాను.అందుకే రిటైర్ అయిన వెంటనే పాతికవేలు ఏ అనాధాశ్రమానికైనా విరాళం ఇస్తాను.ఇక నిన్ను ఏనాడూ బాధించను.


ఒక వేళ నీలో మార్పు వచ్చి క్షమించమని నా దగ్గరకు వస్తావేమో.అటువంటి దుస్థితి నీకు రాకూడదనే కోరుకుంటున్నాను.ఒకవేళ వచ్చినా బతికి ఉండగా నన్నుగానీ, చచ్చాకా నా శవాన్ని గానీ నువ్ తాకడానికి వీల్లేదు. నీకు ఆ ఆవకాశం కూడా ఇవ్వకుండా మరణానంతరం నా శరీరంలో ముఖ్య అవయవాలని 'అవయవదానం' చేసేశాను. ఇక నా ఆత్మా సంస్కారం నేనే చేసేసుకున్నాను. అర్ధం కాలేదా? నా మాసికం, తద్దినం, సంవత్సరీకం...అన్నీ నేను బతికి ఉండగానే పెట్టించేసుకున్నాను.ఇది అక్షరాలా నిజం .వింటే బాధ పడుతుందని మీ అమ్మకు కూడా చెప్పలేదు ఈ విషయాన్ని.


సెలవు - శంకరం మాస్టారు (రిటైర్డ్ ఎ.బి.ఎం.)''


జబ్బార్ వెనుకనే నిలబడి అక్షరం -అక్షరం చదివిన రమణ అరుపుతో ఆ గదంతా ప్రతిధ్వనించింది. ''నాన్నా..నన్ను క్షమించండి.నాన్నా..నన్ను క్షమించండీ ...''అంటూ పిచ్చిగా తలబాదుకుంటూ ఏడవసాగాడు.


దూరంగా మైక్ లోంచి -

''అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా..!

ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా?...."

అని వినిపిస్తున్న పాత అతనిని నిలువెల్లా ప్రక్షాళన చేసున్న గంగా తరంగాల్లా తేలుతూ వినిపిస్తోంది.


                             Rate this content
Log in

Similar telugu story from Tragedy