ఆహారపు అలవాట్లు మారుతాయా?
ఆహారపు అలవాట్లు మారుతాయా?


ప్రియమైన డైరీ,
ఇది భారతదేశం లాక్ డౌన్ లో పదిహేడవ రోజు.
ఉదయాన్నే వాకింగ్ చేద్దామని ఇంటి డాబా పైన ఖాళీ ప్రదేశంలో తిరుగుతున్నాను.
ఎదురింటి తాత గారితో కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ అసలు వీళ్లకు ఏదీ దొరకనట్లు ఆ గబ్బిలాలు తినడం ఏంటో అన్నాను.
దానికి తాత గారు అలా మనం అనలేం బాబూ అని అన్నారు.ఎందుకు అన్న ప్రశ్నకు ఆయన చాలా పెద్ద సమాధానం చెప్పారు.
మనిషి తీసుకునే ఆహారం అతడి కుటుంబం అనుసరించే సంస్కృతి సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుంది.
కోడిని తినే చాలా మంది పందిని తినే వాళ్ళ అలవాటుని అంగీకరించరు.
అలాగే చేపను తినే చాలా మంది పక్షుల మాంసాన్ని అంగీకరించరు.
అన్ని రకాల జీవుల్ని తినే వారు అసలు మిగతా వారి అభిప్రాయాల్ని పట్టించుకోరు.
కుటుంబం తన పూర్వీకులు మతం ద్వారానో వాళ్ళ సొంత అలవాట్ల ద్వారానో వారి ఆహారాన్ని తీసుకోవచ్చు.
కానీ ఏ జీవిని ఎలా తిన్నా ఫరవాలేదు అన్నట్లు ప్రవర్తిస్తే అది ఇలాంటి సమస్యలు తెచ్చి పెట్టింది.
ఒక వేళ కరోనా సమస్య అంతమైనా మానవ జాతి మొత్తం తమ ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
చాలా అలవాట్లు మార్చుకోవాలి.
లేదు.ఎవరిష్టం వారిది అని అనుకుంటే మళ్లీ ఎవరో ఒకరు ఏదో ఒక జీవిని తిని మరో విచిత్రమైన వ్యాధిని తీసుకు రాకుండా పోరు.
తాత గారు ఇవన్నీ చెప్పి పేపరు చదవటం ప్రారంభించారు.
నేను మాత్రం మనుష్యులు ఆహారపు అలవాట్లు మార్చుకుంటారు అని అనుకున్నాను.