ఉదయబాబు కొత్తపల్లి

Drama Inspirational Children


3  

ఉదయబాబు కొత్తపల్లి

Drama Inspirational Children


ఆడపడుచు (కధ )

ఆడపడుచు (కధ )

9 mins 140 9 mins 140

ఆడపడుచు (కధ )   -  కొత్తపల్లి ఉదయబాబు 

( ఆంధ్ర సచిత్ర వారపత్రిక 0 4. 0 5. 2002 సంచిక 63వ పేజీలో ప్రచురితం. )


నేను సరిగ్గా లోపలకి అడుగు పెట్టేసరికి ఇందిర చెందూను బెల్టుతో ఇష్టం వచ్చిన చోటల్లా కొడుతూ ఉండటం చూసి ఒక్క ఉదుటున వెళ్లి తన చేతిలో బెల్టు లాక్కున్నాను.


‘’నీకు గాని మతిపోయిందా ఇందు! ఏమిటా బాదడం గొడ్డును బాదినట్లు? వాడెంత? వాడి ప్రాణం ఎంత? రేపొద్దున ఏదైనా జరిగితే రామచంద్రా అంటూ ఏడిచేది నువ్వే.’’ అన్నాను చెందూను దగ్గరగా తీసుకుని రక్షణకవచంగా నా చేతులు వాడి చుట్టూ వేసి.


‘’మీరు అలా వెనకేసుకు రాబట్టే వాడు అలా పెట్రేగి పోతున్నాడు. లక్ష సార్లు చెప్పాను వెధవకి. ఆడపిల్ల పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా పుట్టింటిలో ఉండదు. ఆ తరువాత దాన్ని బతుకంతా అత్తారింట్లోనే తెల్లవారుతుంది. దానితో ఏ విషయంలోనూ పోటీ పడవద్దు రా అంటే వినడు కదా. నేను కూరగాయలు తీసుకువచ్చేసరికి ఒకరితో ఒకరు కాట్లకుక్కల్లా దెబ్బలాడుకుంటూ విరక్కోట్టేసుకుంటున్నారు. ఆ పిల్ల అంతకన్నా. తమ్ముడితో పోటీ పడవద్దు. ఒకగానొక్క తమ్ముడితో ప్రేమగా ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పినా సరే. ఒకళ్ళను చూసి ఒకళ్ళు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. నా కడుపున చెడపుట్టారు వెధవలు.’’ ఆయాసంతో రొప్పుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది విసురుగా.


నేను వెతుకుతున్న వాడి కన్నీళ్ళు తుడిచి నా వైపు తిప్పుకున్నాను. అసలే పచ్చ దబ్బపండు రంగులో ఉంటాడేమో మోకాళ్ళ కింద, చేతుల మీద బెల్ట్ దెబ్బలు తేనెరంగులో చిత్రకారుడు గీసిన చారికల్లా కనిపిస్తున్నాయి. చొక్కా విప్పి చూశాను. వీపు నిండా అవే. నాకు కళ్లు చెమర్చాయి.


 


ఇందిర ఎప్పుడూ అంతే. కోపం వస్తే అసలు ముందువెనుకలు చూసుకోదు. పిల్లలను కొట్టే క్రమశిక్షణ నేర్పడం అనేది నా పద్ధతికి విరుద్ధం. మంచి మాటలతో సందర్భోచితమైన కథలతో వాళ్ళలో మార్పు తీసుకురావాలి అన్నదే నా సిద్ధాంతం.


 


‘’చూడండి నాకు అంత ఓర్పు సహనం లేవు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అది దాటితే అసహ్యం గా ఉంటుందని నాకు హద్దులు నేర్పుతారు. నాకు అంత ఓపిక లేదు. ‘దండం దశ గుణం భవేత్’ అన్నది నేను నేర్చుకున్న సూత్రం. ఎలాంటి వాడిని అయినా సరే దెబ్బకు దెయ్యం వదిలిస్తుంది అంటారు. మీ పద్ధతి నాకు రాదు. నా విధానం మీకు నచ్చదు . నాకు నీతి బోధలు మానేసి మీ పిల్లలకు చేసుకోండి.’’ అని విసుక్కుంటూ ఉంటుంది నా మీద కూడా.


 


నేను ఆ ఆలోచనల్లో వుండగానే వాడి ఎక్కిళ్లు తగ్గాయి కానీ ఆనపపువ్వుల్లాంటి వాడి కళ్లల్లో నుంచి నీళ్లు ఆగకుండా శ్రవిస్తూనే ఉన్నాయి.


‘’ ఏం జరిగింది నాన్నా?’’ అన్నాను వాడిని నా పక్కన కూర్చోబెట్టుకుని. వాడు వెక్కుతూ ఇలా చెప్పాడు.


 


‘’స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఎవరు ఈ సాయంత్రం నీళ్లు పట్టాలో వాళ్లు యూనిఫారం మార్చుకుని రెడీ అవ్వండి. నేను కూరలు తీసుకుని పది నిమిషాల్లో వచ్చేస్తాను- అని అమ్మ బజారుకు వెళ్ళింది. నిన్న రాత్రి హోం-వర్కు విపరీతంగా ఇవ్వడంతో రాత్రి అవి చేసుకునే సరికి చాలా ఆలస్యం అయిపోయింది ఉదయమే లేవలేక పోయాను. ఉదయం నేను నీళ్లు పట్టాలి. అమ్మే పట్టిందట. సాయంత్రం వంతు అక్కది. అయినా నువ్వే పెట్టాలి అంటూ గొడవ పెట్టింది. నేను పట్టను . రేపు ప్రొద్దుట పడతాను అన్నాను. పందిలా పడుకొని లేవకుండా ఉండటానికా...అంది అక్క. నన్ను తిడితే నాకు కోపం రాదా మరి. అందుకని అక్కయ్య వీపు మీద గుద్దుతుండగా అమ్మ వచ్చేసింది. బెల్ట్ తోటి నన్ను కొట్టింది నాన్నగారు.’’ అంటూ వాడు నన్ను కరుచుకుపోయాడు.


 


వాడి వీపు మీద ఆప్యాయంగా నిమురుతూ ఉండిపోయాను రెండు నిమిషాలు.


‘’ ఏమిటి వాడిని ఓదారుస్తూ కూర్చున్నారా...మీరొకరు నా ప్రాణానికి. వాళ్లకి కాస్త క్రమశిక్షణ నేర్పండి అంటే పురాణ కథలు చెబుతారు. ఇదిగో కాఫీ’’ టీపాయ్ మీద పెట్టేసి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇందిర.


 


నేను నవ్వుకుంటూ కాఫీ తీసుకున్నాను.


 ‘’వెళ్లి బట్టలు మార్చుకుని టవల్ కట్టుకొని చల్లని నీళ్లతో స్నానం చేసిరా. వాటర్ లో కొంచెం డెట్టాల్ వేసుకో. ఇంతకీ అక్కయ్య ఏది?’’ అడిగాను నేను చుట్టూ పరికిస్తూ.


‘’ తన గదిలో చదువుకుంటోంది ఏమీ ఏరుగని పెద్ద పతివ్రతలా’’ అన్నాడు వాడు బట్టలు మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళబోతూ కసిగా.


‘’తప్పు అలా అనకూడదు. అలా మాట్లాడకూడదు అనేగా అమ్మ నిన్ను కొట్టింది. సరేగాని నువ్వు వెళ్లి స్నానం చేసిరా. నైసీల్ రాస్తాను. ఈ లోగా అక్క ని చూసి వస్తాను’’ అని వాడిని బాత్ రూం లోకి పంపి నేను దీప్తి ఉన్న గది లోకి వచ్చాను.


 


నన్ను చూస్తూనే దీప్తి లేచి నిలబడింది.’’ ఐ యాం సారీ నాన్నగారండీ...నావల్లే తమ్ముడు దెబ్బలు తిన్నాడు పాపం. నన్ను క్షమించండి తమ్ముడికి సారి చెబుతాను’’ అంది.


‘’ చూడమ్మా ఇంటికి పెద్ద పిల్లవు. ఆడపిల్లలు కాలు జారినా తీసుకోవచ్చు. కానీ నోరు జారితే తీసుకోవడం చాలా కష్టం. తమ్ముడు ఒంటి మీద వాతలు ఎలా తేలిపోయాయో చూడు. వెళ్లి వాడికి సారీ చెప్పి నైసిల్ రాశి రా. మళ్లీ ఏం గొడవ పెట్టకు.’’ దానికి ఇచ్చి పంపి నేను బట్టలు మార్చుకుంటూనే హాల్లో వారిద్దరిని గమనిస్తూనే ఉన్నాను. వారి ప్రవర్తనకు బాధపడుతూ ఏమి చేస్తే వారి ప్రవర్తనలో మార్పు వస్తుందా అని ఆలోచిస్తున్న నాకు నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన ఫోన్ మార్గం అంతరాన్ని సూచించింది.


 


*********


 


సుజాత! అంటే నాన్నగారి చెల్లెలు. ‘అత్తయ్యకి ఒంట్లో బాగుండలేదు. ఒకసారి వస్తే వెళ్ళి చూసి సాయంత్రానికి వచ్చేద్దాం’ అని నాన్న గారి ఫోన్.


 ఇందిరకి నేను పిల్లల్ని తీసుకువెళ్లడం ఇష్టం లేదు. మా వైపు వాళ్ళు తనకు నచ్చక, తను నా తరపు చుట్టాలింటికి రాదు. అందుకే పిల్లల్ని నేను బయలుదేరదీస్తుంటే తీసుకువెళ్లవద్దని ఆడ్డం పెట్టింది.


‘’ఇందూ. పెద్దయ్యాక వాళ్ళు మనతో రమ్మన్నా రారు. పిల్లలను నాలుగు చోట్ల తిప్పడం వల్ల చూసిన తాలూకు అనుభవం వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అయినా సాయంత్రానికి వచ్చేస్తాంగా. నా తరపు చుట్టాలు కూడా ఉన్నారని వాళ్ళకి తెలియ చెప్పడం నా కనీస బాధ్యత. ‘’అన్నాను.


ఇందిర ఇక నాతో వాదించలేదు. 


‘‘సాయంత్రానికి ఖచ్చితంగా వచ్చేయాలి.’’ లేకపోతే మన ఇద్దరి మధ్య గొడవే - అన్న రీతిలో స్థిరంగా చెప్పింది నాన్నగారితో నేను, చందు, దీప్తి బయలుదేరి ముప్పారం చేరుకున్నాము.


 


********


 


అత్తయ్యని చూస్తూనే మతి పోయినంతపని అయింది నాకు. నా జ్ఞానం వచ్చాక ఆమెని అలా చూడలేదు నేను. కంచుకోట సినిమా లో ‘సావిత్రి’ లా ఉండే ఆమె జగన్మోహిని సినిమాలో ‘సావిత్రి’ లా చూసే సరికి కడుపు తరుక్కుపోయింది. 


మంచం మీద నుదుట చల్లని తడిగుడ్డతో నిస్సత్తువగా నీరసంగా ఆ కుక్కి మంచం లో పడున్న ఆమె తన శక్తినంతా ఉపయోగించి ఉత్తేజితమైన కళ్ళతో నన్ను చూసి ‘’వచ్చావురా అన్నయ్య’’ అంది. 


 


నాన్నగారు అనుకుంది కాబోలు. నేను నాన్నగారికి ఆ ప్లేస్ ఖాళీ చేసి ఇచ్చాను. నాన్న గారు వచ్చి చెల్లెలు పక్కన కూర్చున్నారు. నేను పిల్లలు పక్కనే నిలబడ్డాము.


‘’అదేమిటి చెల్లయ్ ఇలా అయిపోయావు? నాన్న గారి గొంతు గాద్గదికంగా ఉంది. మాటల్లో ఆర్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.


 అన్న గారి చేతిని తన రెండు చేతులలోకి తీసుకుని బలంగా ఆప్యాయంగా పట్టుకున్న అత్తయ్య మౌనంగా రోదిస్తున్నట్లు ఎగిసిపడుతున్న ఆమె ఎండిన డొక్కలే చెబుతున్నాయి.


 


‘’జ్వరం బాగా ఉంది రా అబ్బాయి. ఓసారి అలా వూళ్ళోకి వెళ్లి మన ఆర్. ఏం.పి. గోపాలం ఉన్నాడేమో చూసి వెంటబెట్టుకుని రా’’ అన్నారు నాన్నగారు నాతో.


 సరే అని కదలబోయిన నా రెండు చేతులు పట్టుకున్నారు దీప్తి. చందు.


‘’ నాన్న ఇప్పుడే వచ్చేస్తాడమ్మ. నేను ఉన్నానుగా’’ అన్నారు నాన్న చెందును దగ్గరకు తీసుకుంటూ. అంతలోనే తేరుకొన్న నా అత్తయ్య అంది హీన స్వరంతో.


‘’ఉదయం ఆరింటికి వచ్చి గోపాలం ఇంజక్షన్ చేసి మందులు ఇచ్చి వెళ్ళాడు అన్నయ్యా. వెంకటేష్ కూడా వచ్చాడా ‘’ అంది నన్ను ఉద్దేశించి.


 ‘’అవునమ్మా. పిల్లలిద్దర్నీ కూడా తీసుకు వచ్చాడు’’ అంటూ నాన్నగారు దీప్తిని, చందూనీ ఆమె దృష్టి పథంలోకి వచ్చేలా ముందుకు జరిపారు.


 ‘’నమస్తే నాన్న అత్తయ్య’’ అన్నారు పిల్లలిద్దరూ ముక్తకంఠంతో.


 


‘’ బాగా చదువుకుంటున్నారా నాన్న. ఈ నాన్నత్తయ్యని చూడటానికి మీరు కూడా వచ్చారా? నా బాబే, నా అమ్మే ...’’అంటూ ఆప్యాయంగా వారిద్దరి బుగ్గలు పుణికి ముద్దాడింది ఆమె. 


లోపలి అస్థిపంజరానికి చర్మపు తోలు అలంకారప్రాయంగా ఉన్నట్లు విపరీతంగా ముడతలు పడిన ఆమె దేహంలో జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవాలు, కష్టాలు, మలుపులు చవిచూసినట్టుగా ఉంది. ఆమె చేతి ఎముకలు గుచ్చుకున్నా ఏమో పిల్లలిద్దరూ నెమ్మదిగా లేచి వచ్చి నా రెండు చేతుల వెనక చేరిపోయారు.


‘’రమణ లేదా?’’ నాన్న గారి మాట పూర్తయ్యేలోగా-


 


‘’ఏరా బావ ఎప్పుడొచ్చారు? ఓ పిల్లలిద్దరు వచ్చారు’’ అంటూ ఫ్రీగా మాట్లాడబోయిన వాడు నాన్నగారిని చూస్తూనే పులిని చూసిన లేడీకూనలా అయిపోయాడు.


 


‘’ఎంత సేపు అయింది మావయ్య వచ్చి?’’ ఆన్నాడు చేతులు కట్టుకుని నిలబడి.ఇందాకటి నన్ను పలకరించినదానికి, నాన్నగారిని పలకరించినదానికి ఆమడ దూరం వ్యత్యాసం కనిపించింది నాకైతే.


 


‘’ఇప్పుడేరా. మీ ఆవిడ కనబడదేం?’’ నాన్నగారి కంఠం గంభీరంగా మారిపోయింది. చూపుల్లో క్రోధపు ఛాయలు ప్రస్ఫుటంగా గోచరించాయి. రమణ మాట్లాడలేదు.


‘’అమ్మ సుజాత! మందులు వేసుకున్నావా లేదా?’’


 ఆమె లేదన్నట్లు తల ఊపింది.


‘’ బాబు. నువ్వెళ్ళి పిల్లలకు టిఫిన్ పెట్టించి నాలుగు ఇడ్లీ చట్నీ లేకుండా పంచదార వేయించి తీసుకురా’’ అన్నారు నాతో.


‘’నీ కోడలు టిఫిన్ పెట్టలేదామ్మ?’’ రమణ అమాయకంగా అడిగాడు. నాన్నగారు వాడికేసి చూసిన చూపు వాడిని రెండవ మాట మాట్లాడకుండా చేసింది.


‘’ నువ్వు వెళ్ళు బాబు’’ అన్నారు నాన్నగారు. నేను పిల్లలతో సందు చివర శీను హోటల్ కు వచ్చేశాను.


 


*******


 


 పిల్లలకు టిఫిన్ పెట్టించి వేడిగా తీసిన ఇడ్లీలను ఫ్యాక్ చేయించుకుని ఇంట్లోకి అడుగు పెట్టే సరికి మా బావ రమణమూర్తి భార్య ‘ విద్యావతి’ ముక్కు చెబుతూ అంటోంది.


‘’ మీకేం తెలుసు పెదనాన్నగారు? ఆవిడ మమ్మల్ని రచ్చకీడ్చాలని చూస్తోంది. మా మీద పంతం నెగ్గించుకోవడానికి కాకపోతే వారం రోజులుగా తిండి మానేసి, జ్వరం తెచ్చుకుని, ఎక్కడో ఉన్న మీకు రహస్యంగా ఉత్తరం వ్రాసి ఇంతగా ఇబ్బంది పెడుతొందంటే మీకేం తెలుసు మా బాధ? ఆవిడ తన గోడు వెళ్లబోసుకోవడానికి పెద్దవారు మీరు ఉన్నారు. మాకు ఎవరున్నారు ?’’


 


అసలే ఎర్రని రంగులో వుంటుందేమో, ముక్కు చీదుతూ కళ్ళమ్మట వచ్చిన నీళ్ళు తుడుచుకునే సరికి బుగ్గలు ఎర్రగా చిదిమితే రక్తం చిందేటంతగా ఎరుపెక్కి ముక్కుపుటాలు వింత కాంతితో మెరుస్తూన్నాయి. నాన్నగారు సమాధానం చెప్పబోయిన వాడల్లా నా చేతిలో పొట్లం తీసుకున్నారు. 


 


అత్తయ్య ఇప్పుడు మంచంలో పడుకుని లేదు. కుర్చీలో కూర్చుని ఉంది. ముఖం కడిగి శుభ్రమైన కల్నేత చీర కట్టడంతో తేటగా ఉన్నా జ్వర తీవ్రత ఉన్నట్లు ఆమె వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉంటే తెలుస్తోంది.


 నాన్నగారు పొట్లం విప్పి ఇడ్లీ తినిపించి మందులు వేశారు. ఆబగా తిందామని ప్రయత్నించినా రెండు ఇడ్లీ కన్నా ఎక్కువగా తినలేకపోయింది అత్తయ్య. నాన్నగారు అత్తయ్యని పడుకోబెట్టారు.


 


 


‘’అమ్మ సుజాత. మేము అలా వెళ్ళోస్తాం . మన కరణం గారు దారిలో కనిపించి ‘ఓ సారి ఇంటికి వచ్చి వెళ్లరా అబ్బాయి’ అన్నాడు. కనిపించి వస్తాను అన్నారు. అత్తయ్య నీరసంగా తల ఊపింది. నిమిషాళ్ళో నిద్ర లోకి జారుకుంది.


 


‘’రమణ ఓ గంటలో వస్తాం. నీతో మాట్లాడాలి. రా వెంకు. పిల్లలెరీ?’’ అడిగారు నాన్నగారు బయటకు వెళ్లడానికి సిద్ధం అవుతూ.


‘’ మా పిల్లలతో వీధిలో ఆడుకుంటున్నారు మావయ్య’’ అన్నాడు రమణ మూర్తి.


నేను గమనించనేలేదు. దీప్తి, చెందూలకు ఆ మంచి లక్షణం ఉంది. ఎవరితోనైనా ఇట్టే స్నేహం కలిపేస్తారు ఇందిర పోలిక. నాలా రిజర్వ్డ్ మనస్తత్వం కాదు. మేము వీధిలోకి వచ్చి పిల్లల్ని తీసుకుని బయలుదేరాము.


*******************


‘’ముప్పారం’’ మా తాత గారి ఊరు, నాన్న గారు పుట్టిన ఊరు. నాన్న గారు తన చిన్ననాటి అల్లరి చేష్టలు, అమ్మని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నది, ఇద్దరూ యే యే చెట్లు, పుట్టలూ తిరిగింది అన్నీ కథలుగా వివరిస్తూ ముఖ్యమైన ప్రదేశాలని చూపించారు. దారిలో తెలుసుకున్న అందరినీ పలకరించారు.


 


చివరిగా సోమేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి అక్కడ అష్టోత్తర పూజ చేయించారు అత్తయ్య పేరుమీద, తన పేరున, నా పేరు న కూడా విడివిడిగా.


 ఆచారి గారు ఆప్యాయంగా పలకరించారు. రామాయమ్మ ‘మెస్’ లో భోజనం చేసాము. దారిలో పళ్ళు కొని అత్తయ్య గారి ఇంటికి చేరాము.


********************


 


‘’కాళ్ళు కడుక్కుని రండి పెదనాన్నగారు. భోజనం వడ్డిస్తాను.’’ మేము లోపలికి అడుగు పెట్టేసరికి విద్య రెడీగా తువాలు భుజాన వేసుకున్నది తీసి ఇవ్వబోయింది.


‘’మా భోజనం అయిపోయిందమ్మ. పిల్లలు. మీరు వెళ్ళి బయట ఆడుకోండి నాన్న’’ అంటూ నాన్న వాళ్లని రమణ పిల్లల దగ్గరకు పంపేశారు నాన్నగారు.


‘’ఏం? మా ఇంట్లో భోజనం చేయకూడదు అనుకున్నారా మావయ్య?’’ రమణ అడిగాడు నాన్నగారిని సూటిగా చూస్తూ కుర్చీలోంచి లేచి సీటు చూపిస్తూ.


‘’అవును రా. నా అభిప్రాయం సరిగ్గా గ్రహించారు. మేము ఎవరి ఇంటికి వెళ్ళలేదు. రామాయమ్మ మెస్ లో భోజనం చేసి వస్తున్నాము. నీ కన్నతల్లి అయినా నా చెల్లికే నీ ఇంట్లో భోజనం చేసే యోగ్యత లేకపోతే పరాయివాళ్ళం .. మాకు ఉంటుందని ఎలా అనుకుంటాం రా?’’ నాన్న గారు మడత మంచం గుడ్డ దులిపి కూర్చున్నారు. 


‘’ఎంత మాట మామయ్య? మీ ఇంట్లో ఉంది పి.యు.సి. చదివాను. అత్తయ్య నన్ను చూసి కాదు నా కడుపు తడిమి మరి అన్నం పెట్టేది. ఈనాడు ఈ ఉద్యోగం చేస్తున్నాను అంటే అంతా మీ చలవ..అత్తయ్య చలవ. కానీ అమ్మ సంగతి మీకు తెలీదు మావయ్య. మీ తాతల ఆస్తి మీకు కాకుండా చేయడంలో చినమామయ్య తో చేతులు కలిపి ప్రతి సంవత్సరం ‘ఆడపడుచు’ లాంఛనంగా మీరిచ్చే బట్టలు కట్టుకుని, మీరిచ్చే సొమ్ము తీసుకుని కూడా మిమ్మల్ని మోసం చేసింది. ‘’


 


‘’అవన్నీ నాకు తెలుసు. దాని వల్ల నీకు కలిగిన నష్టం ఏమిటి?’’ ఊహించని ప్రశ్న ఎదురయ్యేసరికి నిజంగా మతిపోయిన రమణమూర్తి తడబడిపోయాడు.


‘’మా ఆవిడని అనరాని మాటలు అంది.’’


 


‘’ఏమని?’’


‘’ ఏమని అంటే...?’’


 


‘’నువ్వు... నువ్వు చెప్పమ్మ విద్యా!మీ అత్తగారు నేను ఏముంది? కట్నం తెమ్మని వేధించిందా? మడి, దడి అంటూ సాధించిందా? మీ ఇద్దరి అనురాగానికి మధ్యలో అడ్డుగా తయారయిందా? ఏం చేసిందో చెప్పమ్మా?’’ గద్దించి అడిగారాయన.


‘’అదికాదు పెదనాన్నగారు. మా వాళ్ళు వస్తేనే ఆవిడకు గిట్టదు. నేను పుట్టింటికి ఆయన సంపాదన అంతా ధారబోస్తున్నానట. నాకు సినిమా పిచ్చట. షోకులు చేసుకుని తిరుగుతూ, కనిపించిన చీరల్లా కొంటానట.’’


 


‘’ ఆవిడ నిజంగా అలా అందా? నువ్వు ఊహించుకుంటున్నావా.?’’


‘’....................................’’


 


‘’నిజం చెప్పమ్మా? నిజంగా నా చెల్లిడే తప్పు అయితే ఈ వయసులో కూడా నీ ముందే ఆమెను చెంప చెళ్లు మనిపిస్తాను. నిజం చెప్పు’’ తీవ్ర స్వరంతో నాన్నగారడిగిన మాటలకు ఆ సీలింగ్ గది ప్రతిధ్వనించింది.


‘’ఆవిడే అంది’’తడబడుతూ అంది విద్య.


‘’ఆయన ఆ మాటలు ఏమీ లేదు అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. సరే..ఆవిడ అందనుకుందాం. అందుకు నువ్వు ఏమన్నావ్?’’


‘’ఎప్పుడు?’’


‘’ పది రోజుల క్రితం మీ అమ్మగారు వచ్చినప్పుడు.’’


‘’ నేనేమీ అనలేదే?’’’’


‘’ నా మీద గౌరవం ఉంటే రమణా! మీ ఆవిడ చేత నిజం చెప్పించరా...’’గర్జించారు నాన్నగారు.


‘’నిన్ను తగలెయ్య. ఏమన్నావో చెప్పవే. నేను ప్రతిదానికి ఛస్తానని బెదిరించడంతో నీ మాటలన్నిటికీ తలవూపడంతో ఇంత గొడవ వచ్చిపడింది. చెప్పు . నిజం చెప్పు. ఆవేశంగా ఒక అరుపు అరిచి రమణ ముందుకు ఉరికాడు ఆవేశంగా. 


‘’అమ్మ మందు నా మీద పెత్తనం చెలాయించబోయింది ఆవిడ. అందుకని...’’


 ‘’అందుకని?’’


‘’ మీరు ఛస్తేనే నా కాపురం చక్క బడుతుంది అన్నాను’’ అనేసి బావురుమంది విద్యావతి.


కొయ్యబారీపోయాడు రమణమూర్తి. పెద్దంతరం చిన్నంతరం లేకుండా తన కన్నతల్లిని అంతా మాట అందా?


నాన్నగారు లేచి తన జేబులో ఉత్తరం తీసి రమణకు ఇచ్చారు. రమణ చదివి నాకు ఇచ్చాడు. అందులో ఇలా ఉంది.నేను పైకి చదివాను.


‘’పూజనీయులు, గౌరవనీయులైన శ్రీ చక్రధరరావు బావ గారికి,


 నమస్కారాలతో అన్నపూర్ణ వ్రాయునది. నేను మీ మేనల్లుడి అత్త గారిని. విద్యావతి మా అమ్మాయి. అన్నివిధాలా అనువైన ఇంట్లో మా స్థాయి కన్నా పెద్దదైన మీ మేనల్లుడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాము. అయితే నాకు ఒక అమ్మాయి, ముగ్గురు కొడుకులు. కోడళ్ళు నన్ను ప్రాణప్రదంగా చూసుకుంటారు. అప్పుడప్పుడు అమ్మాయిని చూడడానికి నేను ముప్పారం వెళుతూ ఉంటాను. కానీ నేను వెళ్ళిన ప్రతిసారి నేను చాలా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ... మా అమ్మాయి మీ చెల్లిని ‘’అత్తింటికం’’ పెట్టడం.


ఆవిడ నిజంగా ఎంతో ఓర్పు గల మనిషి.


 చిన్నప్పటినుంచి మా అమ్మాయికి ఎదురెట్టి చదరంగం ఆడడం, ఏమైనా అంటే తనా మీదకేదైనా వచ్చి పోతుందేమో అని భయంతో ప్రవర్తించడం, నోరెసుకు పడిపోవడం అలవాటు. మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఎందుకు వస్తుందో తెలియదు . అంత లోనే వాళ్ళేదో అన్నారు వీళ్లెదో అన్నారు అని ఒకటికి పది కల్పించుకుని, ఊహించుకుని అరగంటలో బయలుదేరి వెళ్ళిపోతుంది. రానురాను దాన్ని నియంత్రించడం మా ఎవరి వల్ల కావడం లేదు.


పది రోజుల క్రితం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో సందర్భంలో ‘దుబారా ఖర్చులు తగ్గించుకొమ్మా... నీ సంసారం బాగుచేసుకునే బాధ్యత నీదే’ అని మీ చెల్లాయి అన్నప్పుడువెంటనే తాడేత్తున లేచి ‘’ మీరు చస్తే నా కాపురం బాగుపడుతుంది’’ అనేసరికి మీ చెల్లి చాలా బాధపడ్డారు. తల్లిగా లాగి లెంపకాయ కొట్టాను. ‘మళ్ళీ నా గుమ్మం ఎక్కవద్దు. ఇది నా సంసారం నా ఇష్టం.’ అంది. దీనికంతటికీ కారణం మీ మేనల్లుడి అతి మంచితనం. వారి కాపురంలో ఎటువంటి కలతలు లేకుండా చూసే నచ్చచెబుతారని మీకీ ఉత్తరం రాస్తున్నాను. ఆ తర్వాత నేను రెండు రోజులు ఉన్నాను. మీ చెల్లెలు పచ్చి మంచి నీళ్ళు ముట్టుకోలేదు. ఒకసారి మీరు చూసి వీలైతే నా వంతు కూడా దాన్ని నాలుగు తగిలించి పెద్ద వాళ్ళు అంటే కనీసం గౌరవం, భయం, భక్తి నేర్పి పుణ్యం కట్టుకోమని ప్రార్థిస్తున్నాను.


-నమస్కారాలతో


అన్నపూర్ణ.’’


దానిని మౌనంగా విద్యకి అందించాను.


చదువుతున్న కొద్దీ ఊసరవెల్లి రంగులు అన్ని ఆమె ముఖంలో కల్పించాయి. 


రమణ దండం పై ఉన్న పాంటు కి ఉన్న బెల్ట్ తీసాదు. నాన్నగారు ఒక్క ఉదుటున లేచి రమణని ఆపారు.


‘’రమణా...ఆవేశపడితే సమస్యలు పరిష్కారం కావు. ఇందులో నీ తప్పు కూడా ఉంది.’’


‘’మావయ్యా...భార్యమోజులో పది సంసారం ఎటుపోతోందో చూసుకోలేని వాళ్ళ సంసారాలు ఇలాగే ఉంటాయి.తల్లా ? పెళ్ళామా? అన్నది అసలు ప్రశ్నే కాదు.తల్లేరా ... తల్లి తర్వాతే పెళ్ళాం. ముందు జన్మనిచ్చిన తల్లి. ఆమె ఉంటేనే నీ వెనుక ఒక పెళ్ళాం తయారయ్యేది. పెళ్ళాం చెప్తే వినాలి కానీ ఆలోచించుకోవాలి. నీ తల్లి ఏమిటో నీకు తెలిసిన తర్వాతే పరాయి ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లకు తెలిసేది, మీ అమ్మ అభిమానవంతులురాలు. మా తమ్ముడితో కలిసి నాకు ద్రోహం చేసింది అన్నావే. ఎవరి కోసం మీ కోసం మీ బిడ్డల కోసం కాదూ? నా కొడుకుకు ఆ ఆస్తి అనుభవించే యోగం లేదు. నీకు ఉంది. అంతే రా. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే అని మీ ఈకాలం పిల్లలు వయసు మీరాకా గాని తెలుసుకోలేకపోతున్నారు. అది మీ ప్రారబ్దం , మా కర్మ. మా మాట వినకపోతే పోయే. కనీసం మమ్మల్ని గ గౌరవించాలి కదా. మమ్మల్ని అగౌరవపరిచే పనులేవీ మేము చెయ్యలేదే? ఏటువంటి వ్యక్తి కైనా ఆత్మగౌరవం ఉంటుంది కదా. కనీసం వయసుకు ఇచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా మీ ఆవిడ నేను వచ్చినప్పటి నుంచి ‘అది’ అన్న భావంతోనే మాట్లాడింది. ఇప్పుడు అర్థమైందా? నేను మీ ఇంట్లో ఎందుకు భోజనం చేయలేదో?’’


 


 నాన్న గారి మాటలు పూర్తికాకుండానే విద్య నాన్న గారి కాళ్లమీద పడింది.


‘’ నన్ను... నన్ను క్షమించండి పెదనాన్నగారు. నేను ఘోరమైన తప్పు చేశాను. ‘’ ఆమె భోరున ఏడవసాగింది. ‘’చూడమ్మా. ఆడపడుచు కంట తడి పెడితే ఏడు తరాలకు క్షోభ కలుగుతుందంటారు. అలాంటి ఇంటి ఆడపడుచుకు, ప్రతి సంవత్సరం దీపావళి వెళ్ళిన మర్నాడు భగిని హస్త భోజనం పేరిట ఆమె చేతి వంట తిని, ఆమెకు పసుపు-కుంకుమ. చీర. గాజులు, రవికలగుడ్డ, పువ్వులు. పళ్ళు ఇవ్వడం మా అమ్మ గారు చిన్ననాటినుండి అలవాటు చేశారు. ఆనాటినుంచి క్రమం తప్పకుండా ఆ సాంప్రదాయం పాటిస్తూ వస్తున్నాను. ఈ సారి నా చెల్లి భోజనం తినకుండా చేశావు కదమ్మా...ఈ పడటం నా కాళ్ళ మీద కాదు, మీ అత్త గారిని క్షమాపణ అడుగు’’ అన్నారు.


విద్య లేచి కళ్ళు తుడుచుకుంది. అనువనువునా ఆమె పశ్చాత్తాప పడుతుంతొందన్న విషయం ఇంకా వెతుకుతున్న ఆమె ఎక్కిళ్ళే చెబుతున్నాయి.


‘’ఆగమ్మా... ఇవి తీసుకొని మీ అత్తగారికి ఇవ్వు ‘’అంటూ నాన్న గారు నాకు చేతిలోని పళ్ళు, సంచీలోని చీర తదితర వస్తువులన్నీ ఇచ్చారు.


 జ్వర తీవ్రత తగ్గి అప్పుడే మెలకువ వచ్చిన అత్తయ్యను నాన్నగారు లేపి కూర్చోబెట్టారు.


వాటన్నింటిని అత్తగారికి చేతుల్లో పెట్టి కాళ్ళ మీద పడింది విద్యా .


‘’నన్ను క్షమించండి అత్తయ్యా. మీరేం చెప్పినా నా శ్రేయస్సు కోరే చెప్పారని గ్రహించ లేకపోయాను. మా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నాను. ఇంకేనాడు మీ మీద ఈగ వాలనివ్వను. నా ప్రాణంలో ప్రాణంగా మిమ్మల్ని చూసుకుంటాను. తప్పుగా మాట్లాడి మీ మనసు నాధపెట్టాను. నన్ను క్షమించండి.’’


‘’ అవునమ్మా! ఇందులో నా తప్పు కూడా ఉంది. నన్ను కూడా క్షమించు’’ రమణ కూడా అత్తయ్యకు నమస్కరించాదూ.


‘’ నాకు ఇప్పుడు సంతృప్తిగా ఉంది రా అబ్బాయి. కష్టం కలిగించే మాటలు ముందు ఈటెల్లా గాయం చేసినా తప్పు తెలుసుకున్న ఫలితాలు ఎప్పుడు చల్లని మంచు గడ్డతో కడిగి నట్టుగా ఉంటాయి. ఇక మీదట ఎప్పుడూ నా చెల్లెలు కంటతడి పెట్టకుండా ఇలా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక.’’ నాన్న గారు అత్తయ్య పక్కన కూర్చుని ఆమె భుజాలు పట్టి ఆప్యాయంగా తల నిమిరారు.


అరుపులకు. కేకలకు పిల్లలు ఎప్పుడు వచ్చారో నలుగురు గోడను ఆనుకుని చేతులు కట్టుకుని వింతగా చూస్తున్నారు .


 


 


నేను దీప్తిని, చెందును దగ్గరకు పిలిచాను.


‘’చూసారా... నిజమైన అన్నాచెల్లెలు అంటే వాళ్ళు. తాతగారు నాన్నత్తయ్య ఎంత సంతోషంగా ఉన్నారో?’’ అన్నాను నేను.


‘’ మేం కూడా ఇంకెప్పుడు అలాగే ఉంటాము నాన్నగారు.’’


‘’ ప్రామిస్?’’


‘’ ప్రామిస్!”


 అంతలో విద్య బత్తాయి పళ్ళు జ్యూస్ తెచ్చింది.


‘’ ఇలా ఇవ్వమ్మా’’ అన్నారు నాన్నగారు.


‘’కాదు పెదనాన్నగారు. నేనే అత్తయ్య గారి చేత నిరాహార దీక్ష విరమింప చేస్తాను. ఈ సమస్యకు మూల కారణం నేనే కదా’’ అంది బాధగా.


‘’కాదమ్మా. ఇది ఒక మంచూ కల అనుకుని మరిచిపో. నీ చేతితోనే తాగించు’’ అన్నారు


 


అపురూపమైన గాజుబొమ్మను పొదివి పట్టుకున్నట్టుగా అత్తయ్యను పట్టుకుని జ్యూస్ తాగించింది విద్య.పిల్లలందరూ ‘హేయ్’ అని చప్పట్లు కొట్టారు.


జీవం తొణికిసలాడుతున్న చూపులతో ఆరాధనగా నాన్నగారిని చూస్తూ నమస్కరించింది అత్తయ్య!


 


 సమాప్తం


Rate this content
Log in

More telugu story from ఉదయబాబు కొత్తపల్లి

Similar telugu story from Drama