12.క్షమాపణ
12.క్షమాపణ


ఆమె కోసం...నేనెంతగా తపించానో...!
ఆమెపై నాలో నేనే ఇష్టాన్ని పెంచుకున్నాను. చానాళ్లుగా చూస్తూ వున్నా...ప్రేమిస్తున్న విషయం ఆమె ఎదురుగా వెళ్లి చెప్పలేకపోయాను. కానీ నామనసులోని అమ్మాయి ఫోటోని నా కళ్లముందుకు తెచ్చి చూపించాడు స్నేహితుడు ఆకాష్.
ఆమె ఫోటో చూసి ఒక్కసారిగా నివ్వెరపోయాను. ఇదేంటి..ఈమె ఫోటో నీదగ్గరకు ఎలా వచ్చింది...? ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో...నామనసు వాడు చదివేశాడనుకుని అడిగాను.
"నాదగ్గరకు రావడమేంటిరా...? ఈ అమ్మాయిని నేను పెళ్లిచేసుకోబోతున్నాను...పేరు భూమిక" అన్నాడు.. అది జోక్ కాదన్నట్టు ఆకాష్.
నేను వినేది నిజమేనా...? నేనిష్టపడిన ఆమెను వీడు చేసేసుకుంటే...నేను జీవితాంతం ఏడవాల్సివస్తుంది. ఎంత స్నేహితుడినైనా మోసం చేయాల్సిందే.... కోరుకున్నది జరగాలంటే. ఇప్పటికైనా ఆమెకు నేను ప్రేమిస్తున్న విషయం చెప్పేయాలి. ఎలాగైనా ఆకాష్ కీ భూమికకూ పెళ్లి జరగకూడదు...గట్టిగా తీర్మానించుకున్నాను.
"సరేరా...సంతోషం . నాకు కొద్దిగా పనుంది అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాను. భూమికకు ఏం చెప్తే ఆకాష్ తో పెళ్ళాగిపోయి నన్ను ఇష్టపడుతుందోనని ఆలోచిస్తూ కూర్చున్నాను.
ధైర్యం చేసి...ఓరోజు భూమికను బయటకలిసాను. నాపేరు రాజేష్ అంటూ పరిచయం చేసుకున్నాను.
భూమిక నన్ను చూసి నవ్వింది. బాగున్నారా అంటూ పలకరించింది.
ఆమె అలా పలకరిస్తే ఆశ్చర్యపోవడం నావంతైంది. నేను మీకు ముందే తెలుసా...? కుతూహలంగా అడిగాను.
తెలుసన్నట్టు తలాడించి..."మీరు రాజేష్ కదూ. మిమ్మల్ని ముఖాముఖి చూడ్డం ఇప్పుడే అయినా...ఫొటోల్లో చూస్తూనే వుంటాను. మీ గురించి ఎంతో మంచిగా చెప్తూ ఉండేవాడు మా బావ. ఎప్పటికప్పుడే పరిచయం చేస్తాననడమే గానీ ఇప్పటివరకూ చేయనేలేదు. ఈరోజు అనుకోకుండా మీరే వచ్చి పలకరించడంతో గుర్తుపట్టాను" అంది.
ఓహ్...అవునా..? ఇంతకీ మీ బావపేరు? అడిగాను..ఆమె నాతో అలా మాట్లాడుతూ ఉంటే ఎంతో థ్రిల్లింగా అనిపించి.
"మా బావ ఎవరో కాదండీ...మీ స్నేహితుడు ఆకాష్. మా ఇద్దరికీ చిన్నప్పుడే పెళ్లి నిశ్చయమైంది. మీరే దగ్గరుండి మీ స్నేహితుడికి ఏర్పాట్లు చేయాలి మరి" అంటూ నవ్వుతూ అక్కడ నుంచి కదిలి వెళ్ళిపోయింది భూమిక.
నా గురించి ఎంతో మంచిగా చెప్పే ఆకాష్ పై లేనిపోనివి చెప్పి ...వారి పెళ్లి తప్పిద్దామని పన్నిన నా పన్నాగాన్ని మనసులోంచి తీసిపారేసాను ఆక్షణాన్నే...వెళ్తున్న భూమికను చూస్తూ...
ద్రోహం చేయాలనుకున్న ఆకాష్ కి మనసులోనే క్షమాపణ చెప్పుకున్నాను...!!*
*** *** ***