వసంతపు పతంగాలు
వసంతపు పతంగాలు
ఆకాశములో ఎగిరే పక్షుల రెక్కలు
రుధిరపు రంగుల్లో కనిపిస్తున్నాయి
శాంతి కపోతాల కాలం కనిపించలేదు
బ్రతుకుల్లో నిత్యం యుద్ధమే నడుస్తుంది..
మహా ప్రళయాలను చరిత్ర నిర్మిస్తే
చిగురుటాకులా జనం వణికి పోయారు
కాలపు రెక్కలు ఎన్నో జ్ఞాపకాలు మిగిలిస్తే
మతం మూలాలు చరిత్రపై ముద్రలు వేసే..
ఎక్కడైనా మధ్యతరగతి భారతం నడుస్తుంది
దేశము గుండెలో గునపాలను దించుతూ
మందబుద్ధుల కొలతల్లో సరిహద్దులు మారుస్తూ
జెండా రంగుల్లో మార్పులు చెయ్యాలని చూస్తారు...
బడుగు జీవుల్లో వసంతపు పతంగాలు ఎగరవు
రాజకీయ ముళ్ళకంపలో ఇరుక్కుపోయి
నిరుద్యోగము మోస్తూ యువత భుజం వాచిపోతే
చివరి వాక్యాలకు ముగింపు దొరకలేదు..
అమ్మబడుతుంది ఐదేండ్లకు ఒక్కసారి ఓటు
ప్రజాస్వామ్యం పొట్లములో సువాసనలు పూయిస్తూ
అవినీతి కంపులో ఆకలికి రేట్లు కడుతూ
మధ్యపు మత్తులో ఓటర్ల నిర్ణయాలను శాసిస్తున్నాయి..
పేద గుడిసెలో బుడ్డి దీపం దీనావస్థలో ఉంది
వెలుగు చూడని చీకట్లు కమ్ముకొనె ఉన్నాయి
రాజ్యాంగంలో ఇంకా మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి
నల్లధనం న్యాయంగా సంఘంలో నడుస్తూనే ఉంది..
చౌకగా దొరుకుతుంది నేడు కులమతం
సమానత్వపు ముసుగులో లేని అభిమతం
ముందు తరాలకు నేర్పుతుంది మూఢత్వం
ఎన్నో ప్రశ్నలకు జవాబులు లేని సమాజతత్యం.

