ఊరు నిరూపిస్తోంది
ఊరు నిరూపిస్తోంది
చూస్తున్నా...
దూరంగా విసిరేసినట్టున్న పచ్చని పల్లెను.. !
అంధకారపు చీకట్లను తొలగించుకొని..
కొత్తగా ముస్తాబయిన ఊరును.. !
కొబ్బరాకులు చీల్చుకొని వస్తున్న సూర్యుడు..
మాపల్లె గుండెల్లో స్నేహపు కిరణాలు పూయిస్తున్నాడు.. !!
ఏరు దాటుతుంటే చల్లగా కాలికి తగిలే చేపపిల్లల కితకితలు..
చేల గట్లెంట తిరిగిన తుమ్మెదంటి
తుంటరిపాదాలు.. !!
పదాలు పాడుతూ తిరగల్లా తిరిగిన పల్లె.. !!
కురిసే వాన, మురిసే మనసు ఎంతాపినా ఆగవు.. !!
జ్ఞాపకాలు..
పుటంలో కాల్చినట్టు
కొత్త మెరుపును సంతరించుకున్నాయి.. !!
వదిలెళ్లిన ఊరిని చూస్తుంటే..
ఏతమేసి తోడినట్టు ఏదో బాధ..
గుండెను మెలిదిప్పింది.. !!
దారంట ఉమ్మెత్తలు..
కొంగొత్తగా తలలూపుతున్నాయి.. !
రావిచెట్టు కింద రచ్చబండ..
రమణవ్వను గుర్తు చేసింది.. !
రాలిన ఆకులు అవ్వ ఆశీర్వాదంలా
తలను నిమిరాయి.. !!
జ్ఞాపకమైనా, వ్యాపకమైనా పల్లెతోనే.. !
మనసు కొక్కేనికి వేలాడేసిన
జ్ఞాపకాల చొక్కా మళ్ళీ ఒంటికంటింది.. !!
ఊరు పిలుస్తోంది..
ఇన్నింటినీ ఎప్పుడెప్పుడు చూస్తావంటూ..
ఇన్ని సంబరాలని నాకు చూపించాలని.. !!
అనురాగపు అగరు ధూపమై నిత్యo పరిమళిస్తుంది పల్లె.. !!
ఊరికి దూరమై...!
ఎండిన మనసు...
నిండిన కన్నీళ్లతో ఏరై పారింది.. !!
