స్వాగతాంజలి
స్వాగతాంజలి
చక్రనేమి విధంబుగ జగతియందు
కాలగతిలోన దినములు కదులుచుండ
కష్టసుఖముల్ వెనువెంట కలిసిరాగ
జనుల జీవన యానము సాగుచుండు.
గడిచి పోయిన వత్సర కాలమందు
రోగభయమున గ్రుంగిరి లోకులెల్ల
యుద్ధ మేఘాలు నిండగా నుర్విపైన
దిగులు నొందుచు పౌరులు దీనులైరి.
క్రొత్తవత్సరమందున కోలుకొనెడి
దారి దొరుకునే మోయని తల్చితల్చి
భావి వెల్గెడి యభివృద్ధి బాటలోన
నడిచి వెళ్లుచు మనుజులు నమ్మకముగ
స్వాగతించిరి నూతన వత్సరమును.
బంతి చామంతి యందముల్ పలుకరించ
మిహిక బిందువుల్ జారగా మిన్నునుండి
యొడిసి పట్టుచు ప్రకృతి యుత్సహించి
ముత్యముల ముగ్గులేయగా మురిసి మురిసి
పచ్చపచ్చని తరువులు పర్ణములను
రాల్చుచుండెనీ భువికి రంగులద్ద.
ఆశలన్నియు తీర్చగా నవనియందు
కాలుమోపెతా భాగ్యంపు కలిమినిపుడు
ప్రజలకందించ వేగమే పరుగులిడుచు
దివ్యమైనట్టి శోభతో దిశలు వెలుగ
వచ్చె నిప్పుడు నూతన వత్సరంబు.
స్వాగతంబులు పల్కుచు ప్రజలునేడు
సంబరంబులు జరిపిరి సంతసముగ//
