శ్రీరామరాజ్యం
శ్రీరామరాజ్యం
శ్రీరామ రాజ్యం.
1.
మత్తకోకిల.
తామసంబగు బుద్ధి తొల్గగ ధర్మమార్గము కైవడిన్
రామనామము పల్కి బోయెడు వ్రాసి చూపెను కావ్యమున్
కామితంబులు తీర్చి సంచిత కర్మలన్నియు కాల్చుచున్
రాముడే దిగి వచ్చి బ్రోచును లాలితంబుగ భక్తులన్ //
2.
మత్తకోకిల.
రామరాజ్యము నందు ధర్మము రంజిలన్ ముదమొందుచున్
నీమ నిష్ఠల తోడ పౌరులు నీతి తప్పక మెల్గుచున్
బ్రేమ మీరగ కొల్చి రాముని భీతి నొందక నుండిరా
స్వామి గాథలు తల్చువారికి స్వర్గసౌఖ్యము లల్పమౌ //
3.
మత్తకోకిల.
జీవనంబున శాంతి కల్గగ చింతలన్నియు తొల్గగన్
బావనంబుగ రామ భక్తులు పాపకర్మలు వీడియా
దేవ దేవుని పాదయుగ్మము దిక్కటంచును మ్రొక్కుచున్
సేవచేయగ ముక్తిధామము చేరి వెల్గుట తధ్యమౌ.//
4.
ధ్రువకోకిల.
కుదురుగా రఘురామ కీర్తన కూర్మి మీరగ పాడుచున్
బదిలమొప్పగ రామపాదము పట్టి కొల్చిన భక్తులన్
వదలడా రఘురాము డెప్పుడు ప్రక్క తోడుగ నిల్చి తాన్
ముదముగా కని పెట్టి కాపుగ పుణ్యమౌ గతులిచ్చుగా //
