పుష్యమి -శీతాకాలం
పుష్యమి -శీతాకాలం
తుహినబిందువుల్ జారెడి కాలము
మహిని చల్లగా మార్చెడి కాలము
వృక్షాలు పర్ణాలు రాల్చెడి కాలము
పక్షులు వలసలు వెళ్లెడి కాలము
పుష్యమిలోవచ్చే శీతాకాలము
పల్లెల్లో ధాన్యము పండెడి కాలము
కళ్ళము లన్నియు నిండెడి కాలము
చల్లని గాడ్పులు వీచే కాలము
పిల్లలు సందడి చేసెడి కాలము
పుష్యమిలో వచ్చే శీతాకాలము
భానుడు రాశిని మార్చే కాలము
దానము ధర్మము చేసెడి కాలము
శ్రద్ధగ పూజలు సల్పెడి కాలము
పెద్ద పండుగ వచ్చెడి కాలము
పుష్యమిలో వచ్చే శీతాకాలము
ముంగిట ముగ్గులు పెట్టెడి కాలము
చెంగట గొబ్బిళ్ల నుంచెడి కాలము
హరిదాసులు తిరిగెడి కాలము
కరువు కాటకం తీరే కాలము
పుష్యమిలో వచ్చే శీతాకాలము
పాత రోజు మరలెడి కాలము
నూతన వత్సరం వచ్చే కాలము
కాంతి తగ్గెడి సాయం కాలము
సంక్రాంతి రాకతో సిరుల కాలము
పుష్యమిలో వచ్చే శీతాకాలము
గాలి పటాలు ఎగిరే కాలము
నీలి గగనాన్ని తాకెడి కాలము
కోడి పందాలతో తూగే కాలము
వేడుకలెన్నియో జరిగే కాలము
పుష్యమిలో వచ్చే శీతాకాలము
చలిమంటలు వేసెడి కాలము
నలువైపుల మంచు నిండు కాలము
దుప్పటిలో జనులు దూరే కాలము
నిప్పు సెగవద్ద కూడెడి కాలము
పుష్యమిలో వచ్చే శీతాకాలము
తేనీరును తెగ సేవించే కాలము
చన్నీటికి భయమొందే కాలము
'ఉహుహూ 'అని వణికే కాలము
దేహము ముడిచి నడిచే కాలము
పుష్యమిలో వచ్చే శీతాకాలము
గోదాదేవి పాశురముల కాలము
మోదమిచ్చెడి ధనుర్మాస కాలము
కన్నెపిల్లల నోముల కాలము
చిన్ని కృష్ణుని కొలిచెడి కాలము
పుష్యమిలో వచ్చే శీతాకాలము
-------------------------------------------------
