...పునీత..
...పునీత..
కల్లోలాల కాలానికి, కల్పితాల లోకానికి
ఉమ్మడిగా ఒక రాయి దొరికింది.
కాలానికి కలవరమొచ్చి కళ్ళు తెరిచిన,
లోకానికి కంపరమొచ్చి వళ్లు మరచిన
రాయి రంగు మార్చబడుతుంది.
లోకం ఆడే ప్రతి నాటకానికి,
దర్శకురాలైన కాలం..
రాయిని నాయికగా మలచి
మెప్పించ మంటుంది.
ఆ అదుపులో
రాటు దేలిన రాయి
పాత్రారస ప్రవాహమవుతుంది.
కొలతల ప్రవాహంలో కొట్టుకు పోయే లోకం,
రాయిని రాయలేని రసకులానికి రాసిస్తుంది.
రస సౌధానికి
రాణి అయిన రాయి..
కాల ఇంద్రుని కంటిపాపకు
center">పాన్పు అవుతుంది.
కనులు తెరచిన కనుపాప..
కలల పాన్పును కాలదన్ని
కర్తవ్య స్వర్గానికి కదలిపోతుంది.
కంటిపాప నాటకానికి..
నాట్యమైన రాయి..
జ్ఞాన గౌతముని, బ్రహ్మచర్యానికి భంగమవుతుంది.
భావభంగిమకు,
బంధువైన రాయి,
కాలరాసిన కరుణ కావ్యపు
శకలమవుతుంది.
వళ్ళు మరచిన
లోకం కంటికి కంపరంగా,
కళ్ళు మూసిన
కాలం వంటికి వాహనంగా
రాయి మిగిలి ఉంటుంది.
కాలపురుషుని కాలి స్పర్శతో,
పునీతయైన రాయి, నవ నాటకానికి, నాంన్దీ గీతమవుతుంది...!