కుమతి
కుమతి


నా పేరుకు ముందు రెండు పదాలు..
కాదుకాదు నాకు బదులుగా రెండానవాళ్ళు..
అందులో నాదేదో! తేల్చుకొమ్మని నాకు సవాలు..
నాలా! యేకొందరికో ఈ ప్రాస పొసగలేదనే దిక్కుమాలిన దిగాలు..
ఆ రెంటి నడుమ నూరేళ్ళ నావునికీ!
యేటికెదురీదే నావవుతుందనుకుంటే..!
దానవత్వం పూనిన మానవత్వం దాడియజ్ఞం చేపట్టి..
నేరాన్వేషణ పర్వానికి తెరతీసింది.
తెరవెనుక నాకు కిరీటాలనిపించే.. ఆ రెండు పదాల తాలూకు పథకాలూ..!
నన్ను పావును చేసి.. పాచికలాడి..
ఘనంగా నాపై మలిమకుటాన్ని ప్రతిష్టించీ!
ఆ శిరోదార్యమే నా చిరాయువని పలికీ!
పరిచయమెరగని పరపక్షానికి రాణిని చేశాయి..
శిరసెక్కిన సిరికళనూ! కనులారా కాంచకముందే..!
నా పరమైన పరపక్షం నన్ను నిష్కారణంగా పరిమార్చబోతుంటే..!
తెగువ తుపాకీ చేపట్టీ! తప్పిదానికి గురిపెట్టీ!
సంప్రదాయాన్ని సంహరించిన సాహసాన్నయ్యాను.
తీర్పుతూటా తగిలేనని నా తొలిపక్షం తలుపేసుకుంటే..!
మమతలనిధి వీడీ! మనుగడనది చేరి.. ఈత రాని చొరవనయ్యాను.
అందిన ఆది,అంత్య ప్రాసలు కలలా కుదిపి కదిలిపోతే..!
కాంతికాగితాన్ని కాంచలేని అక్షరాన్నయ్యాను.
కలలింకిన నా కళ్ళు కాంతివాకిళ్ళు దాటబోతే..!
చోద్యాల సుడిగాలి దోషాల దుమ్మెత్తి పోస్తే..!
తన్మయ తాంబూలమందని తపనయ్యాను.
విచక్షణెరిగిన అక్షరపక్షానికి ఆంక్షలక్షేత్రానున్న శ్లేషలు చూపిస్తే..!
ఆ ఘోషకు సోషల గుడికట్టి స్వాగతిస్తూ నా పదగౌరవం చెప్పమంది.
'ఆ పదద్వయానికే నా పరిణితి పరిమితమా?' అనబోతే..!
'తొలిపదప్రాయపు పదనిసలేవి?' అన్న నొసవిరుపు
'పళ్ళురాల్చేందుకు యే రాయైతేనేం?' అనేలోపే..!
'మలిపదం మాటున మధురిమలేవి?' అన్న పెదవిరుపు
ఈ విరుపుల చరుపులకు తెరిపెరుగని మెరుపులు
వెరసి విసిగిన నా శమదమాలు ప్రశ్నించాయిలా..
నువ్వసలూ..! 'కదిలించే కుమారివా! సృష్టించే శ్రీమతివా!',
ఆ రెండు పదకోశాలు పంచుకుని వంచించి వదిలిన కుమతివా!
మేసే కంచెకు చోటివ్వందే సుమతివి కావా?
తెగిన పాదరక్షకు తగనిపదభిక్షలకు మోక్షమిచ్చే కాలమతివి కాలేవా?
ఏ కుపదాగ్రేశ్వరులకు ద్వంద్వపద దొంతరలు చూపే సారమతివి కాగలవా?
నా పదపొదను పేల్చిన పై ప్రశ్నలూ..
ఈ ప్రపంచపు యదచెదను కాల్చేనా..!