నీకై
నీకై
నీకై పరితపించిపోయే మనస్సును
పశ్చాత్తాపపడనీయకు ఎప్పుడూ
నీకై ఎదురుచూసే చూపులను
విస్మరించి సంచరించకెప్పుడూ!
ప్రేమించిన హృదయాన్ని
బాధపెట్టాలని చూడకెప్పుడూ
అది తగని భారంగా మారి
నిన్ను నిదురపోనీయదేమో!
ఆరాధనకు అంకితమైన ఎదను
అంత చులకనగా చూడకెప్పుడు
నిజమైన ఆత్మీయతను మరచి
అంతర్మధనంలో పడిపోతావేమో!
తెల్లవారక ముందే నిద్రలేచే
నా మనస్సును ఓసారి చూడు
కన్నులు నములుకుని మరీ
పగటికలలు కంటూంటుంది!
నీ కోసం ఎదురుచూడడం
ఎందుకో కొత్తగా ఉన్నా సరే
నచ్చినట్టుగానే ఉంది నాకు
మనస్సు మొదటసారి కదిలి
నీవైపు పరుగులు పెడుతోంది!
నువ్వు దగ్గరైన ప్రతిసారీ
నా గుండె చప్పుడిన్నావా
వేగం బాగా పెరిగినట్టు
దడతో మాట పెగలనట్టు
ప్రేమంతా నాలోనే ఉన్నట్టు!

