నేస్తమా
నేస్తమా
పండుటాకులని
నేల రాలే ఎండుటాకులని
చులకన గా చూడకు మిత్రమా !
మొన్నటిదాకా
నీకు నీడనిచ్చి
నీకు ఆయువిచ్చి
చెట్టుకు అందమిచ్చి
చెట్టుకు ఆహారమిచ్చి
ప్రకృతి కి పచ్చచీరె కట్టి
పండుగ కు పచ్చతోరణమై
పక్షులకు కొమ్మ ఊయలలై
కొమ్మ కొమ్మ కో సన్నాయి ఆలపించి
చెట్టమ్మ పూచిన లేచిగురు గొమ్మలే
ఆ పత్రహరితాలు ..
హరుని కొలిచే మారేడు దళాలు
ఆ పూజా హరితాలు..
హరిని అలంకరించే తులసీ దళాలు
ఎండుటాకులని
నీ తల్లిదండ్రుల చులకన జేయకు మిత్రమా!
ఓంకార నాదం
ఆది స్వరం గా
విన
ిపించింది అమ్మే గా
మరో దైవం
నడిచే వేదం
బ్రహ్మ కు మరో పేరు నాన్నేగా
వారే గా ....
నీ మనుగడకు ఆధారభూతాలు
నీ చరితపై చెరగని పాదముద్రలు
వసంత కాలాలు చూసిచూసి దాటిన
శిశిరాలు అమ్మా నాన్నలు
వసంతాలనే కాదు
శిశిరాలను కూడా ప్రేమించు .. నేస్తమా !
సూర్యాస్తమయాలు అమ్మా నాన్నలు
సూర్యోదయాలే కాదు
సూర్యాస్తమయాలు కూడా
శోభాయమానమే నేస్తమా !
ఋతు భ్రమణం లో
ఎవరి అస్తిత్వం శాశ్వితం కాదని తెలుసుకో
నేడు వారు
రేపు మనం
పండుటాకులమే ....
రాలిపోయే ఎండుటాకులమే