STORYMIRROR

POLAVARAPU PUSHPAWATI

Tragedy

4  

POLAVARAPU PUSHPAWATI

Tragedy

నాన్న ఎందుకు వచ్చాడు పెట్టెలో

నాన్న ఎందుకు వచ్చాడు పెట్టెలో

2 mins
408

ప్రభుత్వ లాంఛనాలతో స్వగ్రామానికి చేరుకున్న ఓ సైనికుని మృతదేహం చూసి అభం శుభం తెలియని వాళ్ళపిల్లవాడి మనోవేదనే నా రచన.

నాన్న ఎందుకు వచ్చాడు పెట్టెలో పడుకుని

మిలట్రీ దుస్తులలొ, భుజాన బ్యాగు వేసుకుని, ఊరి చివర బస్సు దిగి, హుందాగా నడుచుకుని, ఎదురొచ్చే పెద్ద వాళ్లకు పాదాభివందనాలు, తోటి వాళ్లకు జోరుగా హుషారుగా ఆలింగనాలు, అలా నవ్వుల జల్లులు కురిపిస్తూ వచ్చే నాన్న, ఈసారెందుకు వచ్చాడు పెట్టెలో పడుకుని, మువ్వన్నెల జెండా ఆ పెట్టె పై కప్పుకొని,

నాన్న వస్తున్నాడని కబురందగానే, చంద్రబింబములా మెరిసే మోముతో , మువ్వల సిరిసిరి మధుర సవ్వడితో, నుదుట కుంకుమ మెరుపులతో, వంటింటి ఘుమ ఘుమల నడుమ, ఒళ్లంతా కళ్ళు చేసుకుని,ఎదురుచూసే అమ్మ ఈ సారెందుకు ఏడుస్తుంది, తన గాజులు పగలగొట్టుకొని, నుదుట కుంకుమ చెరిపేసుకుని, నాన్న ఎందుకు వచ్చాడు, పెట్టెలో పడుకొని, మువ్వన్నెల జెండా ఆ పెట్టె పై కప్పుకొని?

నాన్న వస్తున్నాడని కబురందగానె, అమితంగా సంబర పడిపోతు, కాలు కాలిన పిల్లిలా అటు ఇటు పరిగెడుతు,నాన్నకు నచ్చినవన్నీటిని నెమరవేస్తు, సర్దిన ఇంటినే, మళ్లీ మళ్లీ సర్దెస్తు, తెగ హడావిడి చేసే నానమ్మ, ఈసారెందుకు ఏడుస్తుంది, గుండెలను దబ దబ బాదుకొని, పెట్టెను చూస్తూ తల కొట్టుకొని, నాన్న ఎందుకు వచ్చాడు పెట్టెలో పడుకొని, మువ్వన్నెల జెండా ఆ పెట్టె పై కప్పుకుని?

నాన్న వస్తున్నాడని కబురందగానె, తెల్లని ఇస్త్రీ పంచె లాల్చీ కట్టుకొని, భుజాన కండువా ఎగర వేసుకుని, ఊరందరికీ కొడుకు రాకను వివరిస్తూ, హుషారు హుషారుగా అడుగులు వేస్తూ పొలిమేర వరకు వెళ్లిపోయిన తాతయ్య, ఈ సారెందుకు ఏడుస్తున్నాడు, నన్ను చెల్లిని హృదయానికి హత్తుకొని, కండువతో తన ముఖాన్ని కప్పుకొని, నాన్న ఎందుకు వచ్చాడు పెట్టెలో పడుకొని,మువ్వన్నెల జెండా ఆ పెట్టె పై కప్పుకొని.

నాన్న వస్తున్నాడని కబురందగానె, పాపం, మామయ్యను వెంటేసుకుని, ఊరిలో ఉన్న దేవాలయాలన్నిటిని, పదేపదే ప్రదక్షణాలు చేసుకుని, బొట్టు ప్రసాదము చేతపట్టుకుని, సరిహద్దుల నుంచి వచ్చే తమ్ముడికి అందరి దృష్టి తగిలి ఉంటుందని, ఎంత వారించినా వినంటే విననని, నాన్నకి ఇరుగుదృష్టి పురుగు దృష్టి తీసే అత్తయ్య, ఈ సారెందుకు ఏడుస్తుంది అమ్మని, నానమ్మని పట్టుకొని, నాన్న ఎందుకు వచ్చాడు పెట్టెలో పడుకొని, మువ్వన్నెల జెండా ఆ పెట్టె పై కప్పుకొని?

అంటున్నారు ప్రక్కింటి అత్త ఎదురింటి పిన్ని, నాన్న కాలం చేశాడు చైనా బార్డర్లోనని, నాన్న ఎందుకు వెళ్ళాడు చైనా బార్డర్ కని చింటూ, పింటూ,బన్నీ, అన్షు,మంగా, ఉన్నారుగా వాళ్ళ నాన్నలతోనే హాయిగా, నాన్నా, ఉండొచ్చుగా మాతోనే ఏం చక్కగా, వెళితే వెళ్ళాడు రాలేదేందుకు ఎప్పటిలాగా, మాపై అలిగి ఉన్నాడా ఇలా ముభావంగా, అందుకే నాన్న వచ్చాడా పెట్టెలో పడుకుని, మువ్వన్నెల జెండా ఆ పెట్టె పై కప్పుకొని?

స్వస్తి ......

మన రక్షణ కోసం సరిహద్దుల్లో పహారాకాసే ప్రతి సైనికునికి అంకితం.


Rate this content
Log in

Similar telugu poem from Tragedy