మట్టి మనిషి
మట్టి మనిషి
అవును పుట్టింది మట్టి గోడల మధ్య
పెరిగింది మట్టి మనుషుల మధ్య
అందుకే... మనిషి విలువ తెలుసు...
మట్టి పై మమకారం ఎటువంటిదో...
మనిషి పై చూపే మమకారం కూడా అటువంటిదే...
అందుకే... మట్టి మనుషులు అంటే ఎప్పటికీ... అభిమానమే...
నాగలి ఎత్తేటి చేతులు...
సహాయం చేసేప్పుడు
ముందువరసలో నిలుచుంటాయి..
అయ్యో పాపం అని ఆదుకునే చేతులు
ఆత్మీయతను పంచే చేతులు అవే...
దుక్కి దున్ని నారు నాటేప్పుడు...
కలుపుమొక్కల్ని ఏరిపారేస్తారు...
నిజ జీవితానమాత్రం కలుపుమొక్కలు
వారి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంటాయి...
అయినా...
సహాయం చేసే రారాజు గుణం మాత్రం వీడదు వాళ్ళని ...
ఎండలో పాదరక్షలు లేకుండా పాదాలు మట్టిని ముద్దాడుతాయి...
పాదాలు పగిలి నెత్తురు కారుతున్నా...
అదే మట్టిని మందుగా రాసుకుని...
కన్నీటిని కూడా కను రెప్పలు వెనుక దాచుకుని
మట్టి చేతుల్తోనే ముద్దని ఆరగిస్తుంటాడు...
కష్టానికి మరోపేరు...
సహాయానికి అసలైన రూపం...
విలువ కట్టలేని వజ్రమే ఆ మనిషి...
అందరికీ పట్టెడన్నం పెట్టే మట్టి మనిషి...
అందుకే మట్టి మనుషులు అంటే ఎప్పటికీ... అభిమానమే
తుఫాను వచ్చినా, క్షామం వచ్చినా..
ప్రకృతిని నమ్ముకున్న ఏకైక వ్యక్తి మట్టి మనిషి...
కోట్లున్నా...బంగ్లాలు ఉన్నా...
మట్టివాసనను మరువని మహా మనిషి...
దేశ అభివృద్ధి లో మొదటి స్థానంను ఇచ్చి...
సత్కరించుకోవాల్సిన మనిషి...
అయినా... నేటి ఆధునీకరణ లో...
సముచిత స్థానం పొందలేని మట్టి మనిషి...
రాబోయే తరాలకు
బహుశా...కనుమరుగయ్యే ప్రమాదం ఉన్న ఒకే ఒక్క మనిషి మట్టి మనిషి
కాపాడుకుంటే... రేపటి తరాల ఆకలి చావులు ఉండకపోవచ్చు...
లేకుంటే... మందు గుళికలను
ఇనుప పనిముట్లను
మట్టిని తినాల్సిందే...
అప్పటికీ తిండి దొరకని నాడు...
మనిషి మనిషిని తినాలేమో...
ఎప్పటికి మారుతాయి మట్టి మనిషి జీవితాలు...
ఓ మట్టిమనిషి...! చులకనగా చూస్తున్న ఈ జనమే...
నీ పాదాల దగ్గరకి రాకపోరు...
ఆ రోజు దగ్గరలోనే ఉందోయ్...
