మనిషి జాడ
మనిషి జాడ
కసాయిల పడగ నీడన కాలం వెళ్లదీయడమంటే
అనుక్షణం బతుకుతూ చావడమే
మృత్యువు ఏ రూపాన
మనల్ని కాటేస్తుందో
ఉహలకందని విషయమిపుడు
మనిషిని పశుత్వం
నిలువెల్లా ఆవహించినప్పుడు
చంపటం చావడం ఓ క్రీడ
తండ్రి ని కొడుకు చంపడం
అన్నను తమ్ముడు చంపడం
తల్లిని బిడ్డ చంపడం
భర్త ను భార్య చంపడం
భార్యను భర్త చంపడం
తన మాట వినలేదని
అధికారినే తగలబెట్టడం
వినీ వినీ
మనసు మొద్దు బారుతోంది
కరెన్సీ కల్చర్
స్వార్ధం తో సహవాసం చేస్తూ
మనిషితనాన్ని సమాధి చేస్తుంది
మానవ విలువలను వెతకడమంటే
ఎండమావిలో నీటిని వెతకడమివాళ
ఆర్థిక సంబంధాలే
మనల్ని శాసిస్తున్నపుడు
మానవ సంబందాలెక్కడివి మన పిచ్చి గాని
మృగ్యమవుతున్న
మనిషి జాడను వెదకి పట్టగలిగే
పాతాళ గరిగె కోసం అన్వేషిస్తున్నా...