మంగలి
మంగలి


మాసిన తలను
మృదువుగా దూస్తూ
మునివేళ్ళతో సరిచేస్తూ
తలపై మంగలి చల్లిన జలం
గంగా మంగల స్నానం
ఎంత దుర్గంధంగా ఉన్నా
జుట్టు ముట్టకుండా ఉండడు
అమ్మలాగ..
పిచ్చి మొక్కల్లా
అడ్డదిడ్డంగా పెరిగిన
వెంట్రుకల్ని కత్తిరించి
చక్కదిద్దుతాడు
తండ్రి లాగ!
కొద్దిసేపు తలప్పగిస్తే చాలు
అద్దంలో అందమైన జుట్టుతో
ముఖం తళుక్కున మెరిసేలా చేస్తాడు!
మంగలి మాలిష్ చేస్తుంటే
అమ్మ ఒడిలో పవలించే బిడ్డలా
హాయిగా నిద్రించొచ్చు
కష్టసుఖాలన్నీ మరిచి
వెంట్రుకల్ని చెక్కే
శిల్పి తాను
తన కళాఖండం
తలపై ధగధగల వజ్ర కిరీటాన్ని
మించిన సృజన!
నేనెప్పుడూ రామప్పని చూడలేదు
నీ చేతుల్నొక్కసారి తాకనివ్వు మంగలీ!