మంచుపూల కత్తి
మంచుపూల కత్తి
పొద్దుపోదు నీవులేక''..అనడమెంత బాగున్నది..!
నీవునేను ఒకటేనను..జ్ఞానమెంత బాగున్నది..!
చింతనలో మునిగిపోవు..అవసరమే తీరె కదా..
విరహముతో పనేలేని..భావమెంత బాగున్నది..!
సుమకోమల తటిల్లతా..మనోహరం నీ హాసం..
మదిలోయల జరిగే నీ.. నాట్యమెంత బాగున్నది..!
మాటలాగి పోతున్నవి..మౌనగగన వీధులలో..
గుండెగదిని సాగుతున్న..ధ్యానమెంత బాగున్నది..!
మంచుపూల కత్తి దూసి..మనసు మాయ చేసినావె..
సాక్షిని 'నే'నను ఎఱుకన..మరణమెంత బాగున్నది..!

