మాల్యాద్రి
మాల్యాద్రి
తేటగీతిపద్యములు.
1.
సాధు వర్తన మీయవే శార్ఙ్గపాణి!
దుష్ట గుణముల దూలింపు దోషహరణ!
పాప కర్మలు వారించి పద్మనాభ!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
2.
కాల కంఠుని పాశంబు కంఠమందు
బిగుసు కొన్నట్టి క్షణమందు వీడిపోక
దయను జూపవె యాత్మకు ధైర్యమొసగి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
3.
పాంచ భౌతికదేహమ్ము పట్టు సడలి
కన్ను మూసెడి క్షణమందు గాంచవయ్య
ధైర్య మించుక లేనట్టి దారి యందు
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
4.
కష్ట సుఖముల బడయుచు కాల మందు
నొడ్డు జేరక తిరిగెడి యోడ వోలె
నిండ మునిగిన నాకింత నెరవు జూపి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
5.
కాల చక్రపు టిరుసునఁ గలియ దిరిగి
విసివి వేసారి తుదకిల వెతలు బొంది
మరచి పోయితి మనమెల్ల మాయ గప్పె
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
