లోపల మనిషి
లోపల మనిషి
అంతర్యామి ఎక్కడో లేదు
వీచే గాలిలా రూపం లేదు
అయినా సూర్యునిలా వెలుగుతుంది
వర్షమై, వర్ణమై తడుపుతుంది
పిలిస్తే పలుకదు, తనే పలికిస్తుంది ఏదైనా
మనుషుల్లో మర్మకళలా నిలుస్తుంది
ఎవరు అమ్ముడుపోయినా పోదెన్నడు అంతర్యామి
అవసరమైతే నిలదీస్తుంది
పట్టించుకోకపోతే వదిలేస్తుంది
ఎగిసి పడే అగ్నిపర్వతం
కుంగిపోయిన బ్యారేజీ
అగాధంలోకి జార వేసుకున్న ఆయుధాలు
ఓవైపు రాచ బాట, మరోవైపు గతుకుల రోడ్డు
అన్నీ కలబోసుకున్న లోపలి మనిషి
పూలలోని సున్నితత్వం, సువాసన
కింది, మధ్యతరగతిలోని మమతలు
వజ్రంలోని కఠినత్వం
ఊబిలాంటి మూర్ఖత్వం
అవసరానుగుణంగా ఊసరవెల్లి లక్షణం
బయటి, లోపలి మనుషుల మధ్య బంధం
జీవాత్మ పరమాత్మ వైపు ప్రయాణం
ఆధ్యాత్మిక ప్రవచన సారాంశం
గోరంత మంచిని హిమాలయాలంత పెంచడం
పాపపు బుద్ధులను పురిట్లోనే సంహరించడం
లోపలి మనిషి ముసుగేసుకుని పడుకోక
బట్టి పంతులై బెత్తం పట్టుకొని గదిమితే
విచక్షణ విత్తనాలు చల్లుతూ పోతే
ప్రకృతిని అర్థం చేసుకొని మెసిలితే
బయటి మనిషి వెన్నపూస మనసుతో
మేలుకుంటాడు, మెసులుకుంటాడు
..
