కుదిరెనిపుడు
కుదిరెనిపుడు
చెలి చెలిమే కావ్యంలా..మలచుకోగ కుదిరెనిపుడు..!
చూపరాని తన మౌనం..వ్రాసుకోగ కుదిరెనిపుడు..!
నిఘంటువుల ఆలయమే..ఉందికదా తన చూపున..
అమృతమధుర భావాలే..పంచుకోగ కుదిరెనిపుడు..!
సారస్వత శాస్త్రాలకు..మూలముంది తనపదముల..
కోటిపాల పుంతలనిధి..చదువుకోగ కుదిరెనిపుడు..!
సరసస్వర గమకతీర్థ..వాహినియే తన నవ్వున..
గుండెలయల వీణియతో..పాడుకోగ కుదిరెనిపుడు..!
నృత్యనాట్య సంగతులకు..అనువాదం తననడకల..
కలహంసల నడుమచేరి..ఆడుకోగ కుదిరెనిపుడు..!
నిజవసంత పరిమళాల..గగనమంటె చెలిసొగసే..
వ్యామోహములెల్ల వీడ..అందుకోగ కుదిరెనిపుడు..!