గురువు-పరబ్రహ్మ స్వరూపము
గురువు-పరబ్రహ్మ స్వరూపము
గురువు - పరబ్రహ్మస్వరూపము.
పరబ్రహ్మ రూపమై వెలుంగువాడు
పరమపథంబును జూపించువాడు
తరతమ భేదంబెఱుంగని వాడు
కరుణారసహృదయుండైనవాడు
గురువై నిల్చెను భువిలో విజయ.
చదువులు నేర్పుచుండు మా యొజ్జగ
వదలక బోధించు నీతి జ్ఞానిగ
వేదవేదాంత విద్యా ప్రకాశునిగ
ముదముగ మా వెన్క చరించునుగ
సదాచారిగ మా గురువు విజయ.
నిరతము మా గురువును దల్చెద
చరణపు ధూళిని సంగ్రహించెద
శిరమున భక్తితోడ నే దాల్చెద
గురువాజ్ఞను శిరసావహించెద
చిరయశముతో జీవింతు విజయ.
గురువే దైవము గురువే దీపము
గురువాణి విశ్వప్రణవ నాదము
గురూచ్ఛిష్టమే కదా జీవామృతము
గురుసేవ యున్నతికి సోపానము
గురుని కటాక్షమే రక్ష విజయ.
దురితగుణంబు మాన్పెడి గురువు
దరిజేర్చి ప్రేమను పంచు గురువు
భరణము లెప్డు కోరని గురువు
తోరపు బుద్ధి ప్రసాదించు గురువు
పరమాత్మ యనుచు మ్రొక్కు విజయ.
