ఎగిరి పోవడానికి ఎందుకు భయం...
ఎగిరి పోవడానికి ఎందుకు భయం...
ఊపిరి ఊదితే జననం!
ఊపిరి ఆగితే మరణం!
ఉత్త గాలివాటం
కన్ను తెరిస్తే జననం!
కన్ను మూస్తే మరణం!
రెప్పపాటు ప్రాణం
నీరవ నిశ్శబ్దం నుండి శబ్దంలోకి జననం
శబ్దం నుండి సైలెన్స్ లోకి మరణం
శబ్దపాటు జీవితం
"జాతస్యాహి ధృవో మృత్యుః"
ఈ క్షణమో మరు క్షణమో
నేడో రేపో
తప్పని తద్దినానికి
ఒప్పని మనసు!!
కేర్ మంటూ వచ్చావు
క్రొత్త చొక్కా తొడిగావు
ఆనందపు బాల్యం
ముడుతలు ఇస్త్రీ చేసావు ధగా ధగా
ముదితల కూడావు మధురంగా
సింగారపు యవ్వనం
చొక్కా చిరిగింది
అన్నీ చిల్లులే
చెమట కంపు
పళ్లూడాయి
కళ్ళు మాశాయి
వొళ్ళు సడలింది
నడుము వంగింది
కీళ్లు వంగడం లేదు
తింటే అరగదు
తినకపోతే జరుగదు
చొక్కా మార్చు
"ధృవం జన్మ మృతస్యచ"
మరెందుకు చావంటే భయం?
మళ్లీ వస్తావుగా క్రొత్త చొక్కాతో
ఆనందించవోయ్ చావంటే!
నీ పాత్ర పూర్తి అయిపోయింది
ఈ జగన్నాటకంలో
నీ ప్రేక్షకులూ వెళ్లిపోయారు
జారుతున్న తెరను పట్టి
వ్రేలాడతావెందుకోయ్ ఇంకా!
.... సిరి ✍️
