ధన్వంతరి
ధన్వంతరి
క్షీరసాగరమందు శ్రీకరుడై పుట్టి
నమృతంబు జేపట్టి యవధరించె.
శంఖు చక్రధరుడు సత్త్వగుణవరుడు
జీవంబు నిల్పుచు సేమమొసగు.
ధన్వంతరి యనుచు దల్చిన లోకుల
కారోగ్య మిచ్చెడి యభయ ప్రదుడు.
నారాయణాంశగా నమ్మిన వారికి
చేయూత నొసగెడి చిన్మయుండు.
సకలమౌ నారోగ్య శాస్త్రాధి దేవత
రక్షచేసెడి వాడు లలిని జూపి.
వర పతంజలి యోగ భాష్యము నందున
నిల్చియుండెడి వాడు నిశ్చలముగ.
యోగసూత్రంబుల నొడిసి పట్టిన వారి
హృదయమందుండి తా గృపను జూపు.
ధన్వంతరిని గొల్వ తనువు నందున్న
రోగముల్ పాఱగా లోకులెల్ల
బలశాలులై భువిన్ వర్థిల్లు చుండగా
భావితరంబు నిల్చు భవిత వెలుగు.
అట్టి ధన్వంతరికి మ్రొక్కి యంజలిడుచు
నాయురారోగ్య వంతులై యవని యందు
జాగరూకత తోడనీ జనులు మెల్గ
సంబరంబులు ప్రతియింట జరుగుచుండు.//
