ఆమె త్యాగం
ఆమె త్యాగం
నువ్వు
సేద తీరిందెప్పుడు..!?
స్వేచ్ఛా గాలుల్ని పిల్చిందెప్పుడు..!?
అంతా భ్రమల సాధికారతలోనే
ఒరిగి పోయావు
ఒలికి పోయావు
బాల్యమంతా
కొంగు చాటు పిల్లవయ్యావు
యుక్త వయసులో
భర్త పెత్తనానికి బానిసయ్యావు
నవమాసాల బిడ్డ కోసం
ప్రసవ వేదనల ధరిత్రి వయ్యావు
నీ పిల్లల కోసం
మాతృ చాకిరిలో మునిగి పోయావు
బాధ్యతల కోసం
బంధాల కోసం
రెక్కల్ని ముక్కల్ని చేసుకుని
నీలో దు:ఖాల గోతులు తవ్వి
స్వేదాల చెలమలు తీసి
ముళ్ల కిరీటాలు ధ
రించి
ముసలి తనాన్ని కప్పుకొని
ఓ త్యాగాల పల్లవిలా మిగిలిపోయావు
నువ్వు లేని దెక్కడ..!?
వ్యవసాయంలో కర్మాగారంలో
పనుల్లోనూ ప్రజల్లోనూ
సర్వాంతర్యామివై సాగిపోయావు
నువ్వు నువ్వుగానే అనవరతం
కన్నీళ్లను దిగమింగావు
ఆమెగా అహర్నిశలూ
శ్రమించావు..శోధించావు
నువ్వు లేని తరుణం లేదు
నువ్వు లేని జననం లేదు
అప్పుడూ ఇప్పుడూ ఎల్లప్పుడూ..
నిరంతరం ...తరంతరం
మోగే నీ గుండె చప్పుడు
త్యాగాల పల్లవే కదమ్మా..
నీకు వందనం...అభివందనం..!