Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varun Ravalakollu

Thriller

4.6  

Varun Ravalakollu

Thriller

ఎవరు - 2

ఎవరు - 2

5 mins
1.2K


2. ఆందోళనఅక్కడ నుండి నేను వెనక్కి తాతతో పాటు ఊరు లోకి వచ్చేసాను.

తాత “బాబు.. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి?”

“భూపతి రాజు గారి భవంతికి దారి చెప్పు తాత”

“నేను అక్కడికే వెళ్తున్న. ఇంతకీ నువ్వు ఎవరు?”

“భూపతి రాజు గారి ఎస్టేట్ కి కొత్త నిర్వాహకుడిగా వచ్చాను కానీ ఆయన చనిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో?”

తాత “నన్ను బదిలీ చేస్తుంది నువ్వేనా?”

ఒక నిముషం నాకు మాట రాలేదు.

తాత నవ్వుతు “ఏంటి మౌనంగా ఉండిపోయావు.”

“ఏమి లేదు…”

ఒక క్షణం ఆగి “మీ పేరు?”

“మర్రిటి పోతన”

“పోతన గారు, మీరు ఏమి అనుకోను అంటే ఒక ప్రశ్న?”

“ఈ పిలుపు కన్నా ఇందాక వరకు నువ్వు పిల్చిన తాత అనే పిలుపే బాగుంది….”

నాకు కొంచెం ఊపిరి ఆడినట్టు అనిపించింది. “ఎందుకు మిమ్మల్ని బదలీ చేసారు.”

“వయసు వల్ల అవ్వచ్చు. పట్నం వాళ్లు అంటే ఆ మోజు కూడా ఉంటుంది కదా!”

నాకు ఆ తాత పైకి నవ్వుతూ కనిపించినా లోపల బాధ పడుతున్నాడు అని అర్థం అయ్యింది. ఆయన బాధను గుర్తించాలి అనిపించలేదు. మనిషి స్వార్ధం అలాంటిది. నా మిత్రుడు మౌనమే మేలు అనుకుని, అతనితో భవంతి వరుకు నడిచాను. భవంతి ముందు ఒక చిన్న ఇల్లు కనిపించింది. లోపలికి వెళ్తే ఆ ఇల్లు విశ్రాంతి గృహం అని అర్ధం అయ్యింది. అది ఎడమ పక్క ఉంటె కుడి పక్కన పెద్ద భవంతి. నేను రాజు గారు భవంతి అంటే నిత్య నూతనంగా ఉంటుంది అనుకున్నా కానీ ఆ భవంతి కొంచెం పాడుపడి పోతున్న స్థితిలో కనిపించింది.

పోతన: “నువ్వు ఈ రోజుకి ఈ అతిధి గృహంలో విశ్రాంతి తీసుకో. ఈరోజు నువ్వు ఎవరినీ కలవటం అవ్వదు. రేపు రాజు గారి కుటుంబ స్నేహితులు వస్తారు. వాళ్లతో నువ్వు మాట్లాడి ఉద్యోగంలో చేరవచ్చు.”

అతని మాట కాదనే అవకాశం నాకు లేదు. తల కూడా నొప్పిగా ఉంది. అందుకే ఆయన నీడ చూపిన వెంటనే నేను నిద్రలోకి జారుకున్నా.

రెండు రోజులు గడిచిపోయాయి. నేను ఎవరిని కలవలేదు, పోతన గారు నాతో ఉంటున్నా ఆయన నాతో మాట్లాడే అంత తీరికగా కనిపించలేదు. రెండు రోజులు ఆ చుట్టుపక్కల తిరిగాను. ఈ ప్రాంతం చాలా విచిత్రంగా ఉంది. వెలుగులో అందంగా, తొలకరి జల్లులో ఆనందంగా, వర్షంలో అలజడిగా, ఉరుములు మెరుపులలో హడలుగా అనిపించింది. ఇవన్ని క్షణంలో ప్రకృతిలో వచ్చే మార్పులు. ఎక్కువ సేపు పొగ మంచులో ఉంటుంది, అతి తక్కువ సేపు వెలుగు వస్తుంది.

ఈ రోజు కూడా పరిసర ప్రాంతాలు చూడటానికి వెళ్లిన నాకు ఊరు చివరిలో ఒక అందమైన చెరువు, అందులో కలువలు కనిపించాయి. అందులో స్నానం చేయాలని నా మనుసు ఉవ్విల్లూరి, బట్టలు తీసి స్నానాకి దిగబోతుండగా, ఆ నీళ్లలో నుండి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. అది చూసి వంటి మీద నూలు పోగు లేదు అన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే నేను నీళ్లలోకి దూకేసాను. తల నీటి పైకి పెట్టె సాహసం చేయలేకపోయాను. నీటిలో నుండి గజ్జల సవ్వడి వినిపించింది. అవి ఘల్లు.. ఘల్లుమంటూ దూరం వెళ్ళాక నేను నీటి పైకి వచ్చి చుసాను. అప్పటికి ఆ అమ్మాయి వెళ్లిపోయింది.

మరుసటి రోజు ఉదయం కాఫీ తాగుతుంటే, ఆమె నీటి నుండి బయటకు వచ్చిన దృశ్యం కళ్ళలో మెదలాడింది. “అలా అలా మెదలుతున్న ఆమె రూపం నిజంగా అందంగా ఉంటుందా! లేక ఇది నా ఊహ? మొహం చూశానో లేదో కూడా తెలియని నాకు ఎందుకు ఈ పులకింత? కలయిక కోసం కలువ కోన దగ్గరికి మళ్ళీ వెళ్లాలా? లేక ఆ కుమారి కోసం కలవరిస్తున మనసుకి కంచె కట్టాలా?” అంతలో ఒక పనివాడు వచ్చి “మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు” అని చెప్పి వెళ్లి పోయాడు.

అక్కడికి వెళ్లిన నా కోసం పోలీసు ఎదురు చూస్తున్నాడు. పక్కనే పోతన గారు కూడా ఉన్నారు. నేను వెళ్తుంటే పోతన నా గురించి ఆయనకు ఏదో చెప్తున్నటు తెలుస్తుంది. నన్ను పైకి కిందికీ పరిశీలనగా చూసాడు. నాకు పోలీసుని మామూలుగా చూస్తేనే భయం. ఇతను అనుమానంగా చూస్తుంటే ఇంకా భయం వేసింది. పోతన వైపు చూసి తల అడ్డంగా ఊపాడు. అదే సమయంలో వెనక నుండి ఒక 50 యేళ్ళ వయసుకి దగ్గరలో ఉన్న ఒక అతను నడుచుకుంటూ వచ్చారు. పైన తలపాగా, కోటు. కింద పంచి, గుండె దగ్గర బంగారపు పథకం, కొర్ర మీసం.. చూడటానికి జమీందారులా ఉన్నారు.

పోతన: “ఈయన, దర్శన చిత్రపాటి, భూపతి రాజు గారి ప్రాణ స్నేహితులు.”

నేను నమస్కారం పెట్టాను. పోతన నా వివరాలు చెప్పాడు.

దర్శన చిత్రపాటి పోతనతో, “నువ్వు ఉండగా ఇతను ఎందుకు? పంపించేయక పోయావా?”

పోతన: “రాజు గారు ఎలాగో పోయారు. కానీ, ఆయన మాట పోకూడదు”

దర్శన: “నిజమే! నీ విద్యా పత్రాలు, ఉద్యోగం ఖరారు చేసినట్టు భూపతిగారు పంపిన లేఖ దగ్గర పెట్టుకో. రేపు ఆయన వారసుడు మహేష్ భూపతి ఇక్కడికి వస్తారు. ఆయనతో మాట్లాడు, నీ ఉద్యోగం విషయం ఆయనే చూసుకుంటారు.”

పోలీస్ దర్శనతో ఏదో చెవిలో చెప్పాడు. దర్శన చిత్రపాటి ఆక్సిడెంట్ ని ఊద్దేశిస్తూ, “ఆ రోజు నువ్వు తప్ప ఈ ప్రాంతానికి ఎవరు కొత్త వారు రాలేదు.” పోలీస్ కన్ను ఆర్పకుండా నన్నే చూస్తున్నాడు. “నన్ను అనుమానిస్తున్నారా వీళ్లు? దానికి నేను ఏమి సమాధానం చెప్పాలి?” నా మౌనం ఆయనికి నచ్చలేదు.

పోలీస్ నన్ను చూసి “సరే నువ్వు వెళ్ళు, నాకు తెలియకుండా నువ్వు ఊరు దాటకూడదు.”

నేను అక్కడే నిలబడ్డాను.

పోతన: “నువ్వు వెళ్ళు బాబు”.

నేను వెనక్కి తిరిగి వెళ్తూ, “ఇంకేముంది, నేను మళ్ళి ఇంకో ఉపాధి చూసుకోవాలి. నాకు ఉన్న ఒకే ఒక అవకాశం మహేష్ భూపతి. ఆయనని ఎలాగైనా కాకా పట్టాలి. రేపు వచ్చేసరికి కొలనుకు వెళ్లి పుష్ప గుచ్చంతో ఎదురు వెళ్ళాలి.

మరుసటి రోజు ఉదయం పనివారు అందరూ మహేష్ భూపతి కోసం ఎదురు చూస్తున్నారు. నేను కూడా అదే వరుసలో పుష్ప గుచ్చంతో నిలుచున్నా. వాతావరణంలో మార్పులు వచ్చాయి. నల్లని మేఘాలు భవంతిని చుట్టేశాయి. కారు మబ్బులు అని చాల పుస్తకాలలో చదివాను కానీ అవి ఇంత భయంకరంగా ఉంటాయి అని అనుకోలేదు. కారు వచ్చి గేట్ ముందు ఆగింది. వర్షం జోరు అందుకుంది. మేము అందరం భవంతి నీడ కిందకి వెళ్లి పోయాము. ఆగిన కారులో నుండి ఎవరూ కిందకు దిగలేదు. కాసేపటికి ఇంజిన్ సౌండ్ పెరిగింది, కారు వర్షంలో కదలట్లేదు అనిపించింది.

దర్శన చిత్రపాటి గొడుగు తీసుకొని వెళ్లి మహేష్ భూపతిని లోపలికి హడావిడిగా తీసుకుని వచ్చాడు. నాకు ఆయన కనీసం కనిపించలేదు కూడా. గుమ్మం దగ్గర ఆగారు. నాకు వెనకనుండి అమ్మాయిలు మహేష్ భూపతికి హారతి ఇవ్వటం కనిపిస్తుంది. ఆ అమ్మాయిలు హారతితో పాట పాడుతుంటే, పోతన మహేష్ గారితో మాట్లాడ్తున్నారు. మహేష్ భూపతి హారతి తీసుకోవటానికి చేతులు చాపారు, గట్టిగా ఒక మెరుపు, ఆ శబ్దానికి హారతి కింద పడిపోయింది. అంతా నిశబ్దం, పోతన ఆ అమ్మాయిలను ఏదో అంటుండగా, మహేష్ భూపతి చెయ్యి పైకి ఎత్తి, ఆపమని సైగ చేసి నడుచుకుంటూ లోపలి వెళ్లిపోయారు.

ఆ రోజు అంతా ఎడతెగని వర్షం, అంతటి వర్షంలో నాకు రేపు మహేష్ గారితో పరీక్షా సమావేశం అని కబురు వచ్చింది. అర్థరాత్రి అయ్యింది కానీ నాకు నిద్ర రావట్లేదు. నా దగ్గర విద్యా పత్రాలు కానీ, ఉద్యోగం ఖరారు చేసినట్టు భూపతి గారు పంపిన లేఖ గాని లేవు. అవి సంచితో పాటే పోయాయి. “పోతన వంటి మంచి వారు, అనుభవజ్ఞులు ఉండగా నాకు ఇస్తారా?”

అదే సమయంలో బయట నుండి ఒక వెలుగు కిటికీ లోనుంచి వచ్చి, గోడ మీద పడింది. పోతన గారేమో అనుకున్నా, కానీ ఆయన ఇంట్లోనే ఉన్నారు. కిటికీ నా తల దగ్గర ఉండటం వల్ల , పడుకున్న నాకు ఆ వెలుతురులో నుండి నలుగురు, ఐదుగురు మనుషుల నీడ వెళ్లినట్టు కనిపించింది. పోతనని పిలుద్దాము అనుకుని అటు వైపుకు తిరిగాను. పోతన అప్పటికే లేచి ఉన్నారు. చేతిలో కత్తి పట్టుకుని, ఆ పక్కన ఉన్న తాళాలు తీసుకుంటున్నాడు. విచిత్రమైన కూత ఒకటి వినిపించింది. వెనక్కి తిరిగి నా వైపు చుసాడు. నేను కళ్ళు మూసేస్కుని నిద్ర నటించాను. కళ్ళు మెల్లగా తెరుస్తున్న నాకు అతను కత్తితో నా వైపే వస్తునట్టు కనిపించింది. భయం తో గుండె వేగం పెరిగింది. లేచి పరుగెడదాం అనే సమయానికి కిటికీ తలుపు మూసిన శబ్దం, దాని వెనక మళ్ళి ఆ విచిత్రమైన కూత. అడుగలు దూరం వెళ్ళటం వినిపించి కళ్ళు తెరిచాను. పోతన తలుపు తీసి తాళాలు బయట వాళ్ళకిచ్చాడు. తాను కూడా బయటకి వెళ్లి, మెల్లగా తలుపు దగ్గరికి వేసాడు. నిద్రించే అంత నిర్లక్ష్యం లేదు, వెంబడించే అంత ధైర్యమూ లేదు. అప్పటి వరకు అయోమయంగా ఉన్న నా పరిస్థితి ఆందోళనగా మారింది.

***


Rate this content
Log in

Similar telugu story from Thriller