తెల్ల చొక్కా
తెల్ల చొక్కా
“ఒరేయ్, సూరీ ఆ ముందు వెళ్తున్న వాడు మన వెంకటి గాడిలా లేడూ” ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్న సూరిగాడి వీపు మీద ఒక్క దెబ్బ వేసి మరీ అడిగాడు మురళీ. “ఒరేయ్ ఫోన్ మాట్లాడుతుంటే మధ్యలో నీ నస ఏంట్రా”? కొంచెం కోపం ప్రదర్శిస్తూ అన్నాడు సూరి. అదేమీ పట్టించుకోని మురళీ మళ్ళీ “ఆ ముందు నడుస్తున్నవాడు మన వెంకటి గాడిలా లేడూ” అడిగాడు.
“వాడు మన వెంకటి గాడే. పిలుద్దాం ఉండు” అన్నాడు సూరి. “వద్దురా అలా పిలిస్తే ఎలా మజా ఉంటుంది. చూడు ఏం చేస్తానో” అంటూ పరుగు లాంటి నడకతో ముందుకు వెళ్ళాడు మురళీ. “ఒరేయ్ వెంకటీ, ఎన్నాళ్లకు కనిపించావురా” అంటూనే వాడి భుజంమీద చేయి వేశాడు. మురళీ భుజంమీద చేయి వేయడంతో వెంకటి ఖంగు తిన్నాడు. తానేదో సరదా పడి కొనుక్కున్న తెల్ల చొక్కా వేసుకుని దర్పంగా వీధంతా తిరిగి వద్దామనుకుంటే మురళీ గాడు పిలవని పేరంటానికి వచ్చినట్లు వచ్చి ఇప్పుడు భుజంమీద చెయ్యి వేశాడు.
ఏమీ అనలేక మురళీ చెయ్యిని భుజంమీద నుండి కిందికి తోసేసి ఆ చెయ్యి పడిన భుజంమీద కి చూశాడు. అంతే ఒక్కసారి గుండె ఝల్లుమంది. ఒకటా రెండా.. ఏకంగా పన్నెండు వందలు పెట్టి స్టైల్ గా ఉంటుందని ఈ తెల్ల చొక్కా కొనుక్కుని అంతా సవ్యంగా ఉందనుకున్నప్పుడు తెల్ల చొక్కా వేసుకుని బయటికి వస్తే అయిదు నిమిషాలు కూడా కాకుండానే చేతికి ఉన్న మురికి అంటించేశాడు మురళీ గాడు. “ ఏరా మురళీ, దూరం నుండే పిలవచ్చు కదరా, తెల్ల చొక్కా ని చూడు ఎలా మురికి చేసేశావో, దాదాపుగా దుఃఖం తో గొంతు పూడిపోయినట్లయింది వెంకటి కి.
ఏమైందిరా నడుస్తూ .. నడుస్తూ ఇద్దరూ రోడ్డు మధ్యలో ఆగిపోయారు. వస్తూనే వెంకటి రెండో భుజంమీద చెయ్యి వేశాడు సూరి. సూరి చెయ్యి వేసిన భుజం వైపు చూసుకుని “ఒరేయ్ మీకు నేనేం అన్యాయం చేశానురా.. నిక్షేపం లాంటి తెల్ల చొక్కాని క్షణం లో పాడు చేశారు కదరా” బాధగా అన్నాడు. “అయ్యో, సారీ రా, నువ్వు ఇంతలా ఫీల్ అవుతావు అనుకోలేదురా వెంకటీ, ఏమనుకోకు” అంటూ కొంచెం దూరంగా జరిగారు ఇద్దరూ . “లేదులే, నాకు ఉద్యోగం వచ్చిందని మీ అందరికీ చెప్పాలని బయల్దేరాను” తెల్ల చొక్కా మీద మరకలు పడినందుకు బాధపడుతూనే చెప్పాడు. అవునా, కంగ్రాట్స్ రా అంటూ ఇద్దరూ వాణ్ణి పొగడ్తలతో ముంచేశారు.
వెంకటి అసలు పేరు వేంకటేశ్వర రావు . ఏ ముహూర్తన ఎవరు పెట్టారో కానీ వెంకటి పేరు శాశ్వతమైపోయింది. ఎప్పుడో ఎలిమెంటరీ స్కూల్ లో వాళ్ళ మూర్తి మాస్టారు గారు తెల్ల చొక్కా వేసుకుని స్కూల్ కి వచ్చిన రోజు ఆ చొక్కా చూసిన వెంకటి గాడికి అలా తెల్లని మల్లెపువ్వు లాంటి తెల్ల చొక్కా వేసుకోవాలని కోరిక కలిగింది. తన ఫ్రెండ్స్ సూరిగాడికి, మురళీ గాడికి ఆ విషయం చెప్పి, నాకు అలాంటి తెల్ల చొక్కా వేసుకోవాలని ఉందిరా అన్నాడు. కానీ ఆ మాటలు అర్థం చేసుకునే స్థితి లో లేని చిన్న వయసు వాళ్లది. అప్పటికప్పుడే ఆ విషయం మరిచిపోయారు .
పుట్టిన రోజుకి ఎలాగైనా తెల్ల చొక్కా కొనిపించుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్న వెంకటి, పుట్టిన రోజు ఇంకో వారం రోజుల్లో ఉందనగా వాళ్లమ్మ దగ్గర కూర్చుని “ఈ ఏడాది పుట్టిన రోజుకి నాకు తెల్ల చొక్కా కొనిపెట్టు” అంటూ అడిగాడు. “అమ్మో తెల్ల చొక్కా నా, ఇంకేమైనా ఉందా? నువ్వసలే కోతివి . ఏది సరిగా ఉంచుకోవు. ఈ చొక్కా కూడా మురికి చేస్తే నేను ఉతకలేక చావాలి, అందుకే తెల్ల చొక్కా కొనిపెట్టను” నిర్మొహమాటంగా చెప్పింది అమ్మ. “అయితే నాకు పుట్టిన రోజు వద్దులే అమ్మా” బుంగమూతి పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు వెంకటి గాడు.
“ఏమంటాడు వాడు” అడిగాడు వెంకటి వాళ్ళ నాన్న సుందరం. “మీ పుత్ర రత్నానికి పుట్టిన రోజుకి తెల్ల చొక్కా కావాలిట” చెప్పింది వెంకటి వాళ్లమ్మ సీత. “పోనీలే ముచ్చట పడుతున్నాడు కదా, ఒకటి కొందాం. ఆ తెల్ల చొక్కా మోజు తీరిపోతుంది” చెప్పాడు సుందరం. “ఏంటి మోజు తీరిపోయేది. వాడు ఆ చొక్కా పాడుచేస్తే నేను ఉతకలేను” తన అయిష్టతని వెళ్లగక్కింది ఆవిడ. “పోనీలే ఆ చొక్కా పాడైపోతే మళ్ళీ వాడు కొనమని ఆడగడు, ఆ కారణం చూపించి మనం తెల్ల చొక్కా కొనడం మానేయవచ్చు” భర్త ఎప్పుడైతే కొడుకు కోసం తెల్ల చొక్కా కొనడానికి సిద్ధపడ్డాడో, తన మాట చెల్లదని కొడుకు సరదా కాదని ఎందుకు మొండిగా ఉండాలని ఆవిడా మాట్లాడకుండా ఊరుకుంది. మొత్తంమీద వెంకటి కోరిక మొదటిసారి నెరవేరినది.
“ఇదిగోరా నీ పుట్టిన రోజుకి తెల్ల చొక్కా”, అని తండ్రి చూపించిన రోజు వెంకటి ఎక్కడో విమానం లో ఎగురుతున్నట్లు ఫీలైపోయాడు. “తెల్లారడానికి ఇంకా ఎంత టైమ్ ఉందమ్మా”, అప్పటికే ఏడో సారి నిద్రలేపి మరీ అడిగాడు వాళ్ళమ్మని వెంకటి. “ఒరేయ్, నీకు పుణ్యముంటుంది నన్ను కాసేపు పడుకోనివ్వరా” దాదాపు కన్నీళ్ళు పెట్టుకున్నంత పని చేసింది ఆవిడ. “సరేలే” అని అయిష్టంగా పక్కకి తిరిగి పడుకున్నాడు. పడుకున్నాడు అనేకంటే ఏదో ఆలోచనలో ఉన్నాడని అనుకోవచ్చెమో! స్కూల్ లో ఇప్పటిదాకా తెల్ల చొక్కా వేసుకుని ఎవరూ తనకి కనపడలేదు. సూరిగాడు, మురళీ గాడు, శ్రీధరం గాడు, అబ్బాస్ గాడు, రాజు గాడు, ఖాన్ గాడు, .. ఒక్కరికంటే ఒక్కరికీ కూడా తెల్ల చొక్కా ఉన్నట్లు తనకి తెలీదు. రేపు పుట్టినరోజని ఎవరికీ చెప్పలేదు. డైరెక్ట్ గా స్కూల్ లో అందరూ తన తెల్ల చొక్కా చూసి ఆశ్చర్యపోవాలి అంతే. ఇలా అనుకుంటూ ఎప్పుడు నిద్ర పోయాడో తెలియలేదు” స్కూల్ బెల్ మొగుతూ ఉంటే మెలకువ వచ్చింది.
ఇవాళే లేట్ అవ్వాలా.. తనలో తానే అనుకుంటూ గబగబా స్కూల్ కి రెడీ అయ్యాడు. బెల్ అయిపోయింది ఇప్పుడు వెళ్తే కొడతారేమో చెప్పింది వాళ్లమ్మ. పుట్టిన రోజు కదా, ఏమీ అనరులే అంటూ గబగబా బట్టలు వేసేసుకుని అమ్మకి నాన్నకి కాళ్ళకి దణ్ణం పెట్టి, అమ్మ ఇచ్చిన స్వీట్లు, చాక్లెట్లు పట్టుకొని బడివైపు పరుగు తీశాడు. సరిగా నాలుగు అడుగులు వేశాడో లేదో, దారిన పోతున్న గేదె, తోక తో ఒక్కటి కొట్టడం, తెల్ల చొక్కా కాస్త పేడ మరక తో పాడైపోవడం అయిపోయింది. ఏడుస్తూ ఇంట్లోకి వచ్చి జరిగింది తల్లితో చెప్పాడు. నిదానంగా ఉండాలని చెప్పేది అందుకే. చూసుకుని నడవాలిగా అంది అమ్మ. మళ్ళీ శుభ్రంగా స్నానం చేయించి వేరే కొత్త బట్టలు వేసి నాన్న బడికి దిగబెట్టారు.
మొదటిసారి తెల్ల చొక్కా కోరిక తీరకుండానే ఐపోయిందని వెంకటి బాధపడుతూనే ఉన్నాడు. కాలం గిర్రున తిరిగి ఆరవ తరగతిలో అడుగు పెట్టాడు. పక్క ఊళ్ళో హై స్కూల్ లో జాయిన్ అయిన రోజు వెంకటి కి కళ్ళు చెదిరిపోయాయి. రంగు రంగుల బట్టల్లో స్కూల్ కి వస్తున్న స్టూడెంట్స్ ని చూసి చాలా ఆనంద పడ్డాడు. ఇప్పుడైనా తెల్ల చొక్కా కొనుక్కోవాలి అనుకున్నాడు. అసెంబ్లీ లో లైన్లో పిల్లల్ని నిలబెడుతున్న డ్రిల్ సార్ ని చూశాడు. తెల్లని చొక్కా లో తెల్లని బనీను ఎంత అందంగా కనిపిస్తోందో. ఒక్కసారైనా అలా రెడీ అవ్వాలనిపించింది.
ఎలాగో నాన్నని ప్రాధేయపడి తెల్ల చొక్కా తెల్ల బనీను కొనుక్కుని స్కూల్ కి వేసుకెళ్లాడు. అదేంటో చిత్రం తన షర్ట్ లోంచి బనీను కనిపించడమే లేదు. “ఈ తెల్ల చొక్కాలో రాజకీయ నాయకుడిలా ఉన్నావురా వెంకటీ” అని ఫ్రెండ్స్ అంటూ ఉంటే కొంచెం గర్వంగా ఉన్నా, బనీను లోపలినుండి కనిపించలేదనే చింత వాడిలో అంతకంతకూ ఎక్కువైపోయింది. సాయంత్రానికి ఆ చొక్కా మాసిపోయి ఇంటికి వచ్చేసరికి “నీ షర్ట్ నువ్వే ఉతుక్కో” అంది అమ్మ. “అమ్మా స్కూల్ లో డ్రిల్ సార్ వేసుకున్న తెల్ల చొక్కా లోంచి తెల్లని బనీను ఎంత అందంగా కనిపించిందో, మరి నా షర్ట్ లోంచి ఎందుకు కనపడలేదో అర్థం కాలేదు” అన్నాడు. అమ్మ చిన్నగా నవ్వేసి, ఈ తెల్ల చొక్కా పిచ్చి ఎలా పట్టుకుందిరా నీకు” అంది.
ఎంత ప్రయత్నం చేసినా చొక్కా తెల్లగా మెరిసిపోలేదు. ఇంకోసారి తెల్ల చొక్కా ముచ్చట మూలన పడిపోక తప్పలేదు. కాలేజీ లో కూడా తన కల సఫలం కాలేదు. రోజులు, వారాలు, నెలలు సంవత్సరాలుగా మారిపోయి, డిగ్రీ చదువు పూర్తి చేసుకున్న వెంకటి ఎన్నో సార్లు తెల్ల చొక్కాని ప్రయత్నం చేశాడు కానీ, ఆ ముచ్చట తీరకుండానే తెల్ల చొక్కా కి ఏదో ఒక ప్రమాదం సంభవించడం సాధారణ విషయమైపోయింది. “ఒరేయ్ వెంకటీ, నువ్వు రైల్వే లో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యావురోయ్” అని నాన్న గావు కేకలు పెడుతూ ఉంటే, వెంకటి ఆనందానికి అవధుల్లేవు.తాను రైల్వే లో రెండు జాబ్స్ కి అప్లై చేస్తే ఒకటి వచ్చిందన్నమాట. ఆర్డర్ కాపీ చేత్తో అందుకొని చూసిన రోజు, ఆనందం తనకి ఆమడ దూరంలో ఆగిపోయిందని ఉసూరు మన్నాడు. తనకి వచ్చింది అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్. ట్రైనింగ్ ఆరునెలలు. ఇంక జీవితంలో తెల్లచొక్కా వేసుకునే సౌభాగ్యం లేని జీవితం అంటూ బాధపడ్డాడు.
బంగారం లాంటి ఉద్యోగం, తెల్ల చొక్కాలు ఎన్ని కావాలంటే అన్నీ కొనుక్కో, ఇంటి దగ్గర వేసుకోవచ్చు, ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటావో, తెల్ల చొక్కాలే కొంటావో నీ ఇష్టం అంటూ డబ్బులు ఇస్తూ చెప్పారు నాన్న. ఏదో మూల చిన్న ఆశ తో బట్టల షాప్ కి వెళ్ళి ఒక నాలుగు తెల్ల చొక్కాలు కొంటూ ఉంటే, అక్కడి సేల్స్ మ్యాన్ నోరు తెరుచుకుని ఉండిపోయాడు. ఇంటికి వచ్చి సంబరంగా తల్లికి చూపించాడు వాటిని. ఒక తెల్ల చొక్కా కొనుక్కుని మిగిలినవి రంగు చొక్కాలు కొనుక్కోవలసింది. మీ ఫ్రెండ్స్ అంతా జీన్స్ లు టీ షర్ట్ లు వేసుకుంటూ ఉంటే నీకు తెల్ల చొక్కా పిచ్చి ఏంటో అర్థమై చావదు నాకు” అమ్మ విసుగ్గా మొహం పెట్టిన పట్టించుకోలేదు వెంకటి. “పోనీలే ఇన్నాళ్ళకి నీ కోరిక నెరవేరింది, చొక్కా పాడు చేసుకోకు, నీకు ఉద్యోగమొచ్చిందని స్వీట్ చేశాను” అంటూ ఒక ప్లేట్ లో స్వీట్ తీసుకొచ్చి ఇచ్చింది. ఎంతో జాగ్రత్తగా అందుకున్న ప్లేట్ ని టేబుల్ మీద పెట్టి, లేచి ఫ్యాన్ వేసుకోడానికి కుర్చీలోంచి పైకి లేచాడు. ప్లేట్ చేతికి తగిలి, స్వీట్స్ షర్ట్ మీద పడడం, షర్ట్ అంతా స్వీట్ మరకలతో నిండిపోవడం జరిగిపోయింది.
అవాక్కైపోయి, తనని తానే ఒకసారి చూసుకున్నాడు. “అదేంట్రా, చొక్కా అలా పాడు చేసేసుకున్నావు చిన్న పిల్లాడిలా” వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అమాయకంగా మొహం పెట్టి అమ్మ అడుగుతుంటే, ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్లు మొహం పెట్టాడు వెంకటి. పోనీలే ఇంకో చొక్కా వేసుకొందువు లే. ముందు వెళ్ళి ఆ చొక్కా మార్చుకుని రా, తండ్రి చెప్పిన ఆ మాట తన మనసులోని బాధని కొంచెం తగ్గించినా, నిక్షేపం లాంటి తెల్ల చొక్కాని శుభ్రంగా ఉంచుకోలేకపోయినందుకు చాలా బాధ పడ్డాడు.
ట్రైనింగ్ లో జాయిన్ అయిన మొదటి రోజు తనతో ఉద్యోగానికి వచ్చినవాళ్లంతా రైల్వే నీలం యూనీఫార్మ్ వేసుకుని వస్తే వెంకటి ఒక్కడే తెల్ల చొక్కా వేసుకుని, దానికి సరిపడేలా బ్లూ జీన్స్ టక్ చేసుకుని వెళ్ళాడు . ఏమయ్యా నీ యూనీఫార్మ్ ఏదీ, ఎందుకు వేసుకోలేదు అడిగారు ట్రైనింగ్ స్కూల్ లో. సమాధానం లేక తల దించుకున్నాడు వెంకటి. సరేలే.. ఇవాళే మొదటి రోజు కాబట్టి పరవాలేదు. రేపటినుండి యూనీఫార్మ్ లో రావాలి తెలిసిందా? తెల్లని చొక్కాలోంచి, అంతకంటే తెల్లగా బనీను కనిపిస్తున్న అధికారి, సూటిగా కళ్ళల్లోకి చూసి చెప్తూ ఉంటే, “మీరు మాత్రం తెల్లచొక్కా లోపల తెల్ల బనీను కనపడేలా వేసుకోవచ్చు. అదే మేము వేసుకుంటే మాత్రం మీకు రూల్స్ గుర్తొస్తాయి” తనలో తానే తిట్టుకుంటూ, ఏమీ అనలేక మౌనంగా తలూపాడు సరే సార్ అన్నట్లు. “ఒరేయ్ వెంకటీ, నీ లైఫ్ ఖతం రా ఇంక. ఈ ముతక నీలం గుడ్డలలో నీ బతుకు తెల్లరిపోయినట్లేరా.. నీ బతుక్కి తెల్ల చొక్కా యోగం లేదురా అబ్బాయ్” అని తిట్టుకున్నాడు.
గిర్రున ఆరు నెలల ట్రైనింగ్ పూర్తయిపోయి, ఉద్యోగం లో జాయిన్ అయిపోయాడు. మంచి అమ్మాయితో పెళ్లి చూపులు జరిగాయి. అమ్మాయి చదువు, అందం, డబ్బు.. వగైరాలన్నీ వెంకటికి నచ్చేశాయి. వెంకటికి వెంకటలక్ష్మి తో పెళ్లయిపోయింది. మొదటి రాత్రి అయినా తన ముచ్చట తీర్చుకోవాలి ఇంక ఇదే ఆఖరి ప్రయత్నం అనుకున్నాడు. సరిగ్గా ముహూర్తం సమయానికి తెల్లని పట్టుచీర కట్టుకొని, తలలో మల్లెలు పెట్టుకొని, చేతిలో పాల గ్లాసు తో గదిలో అడుగుపెట్టింది వెంకట లక్ష్మి. హమ్మయ్య, తాను కూడ తెల్ల చీరే కట్టుకుంది. కాబట్టి నా తెల్ల చొక్కాకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అనుకుంటూ ఆమె చేతులు పట్టుకొని నడిపించుకుంటూ వచ్చి బెడ్ మీద కూర్చోపెట్టబోయాడు. “పాలు తీసుకోండి”అంటూ గ్లాసు చేతికి అందించింది. ఆహా నేనెంత అదృష్టవంతుణ్ణి ఇంత అందమైన భార్య దొరికింది అనుకుంటూ గాలిలో తేలిపోతున్నట్లు ఫీలైపోతూ ఉంటే, “ఏమండీ, ఏమైంది మీకు? ఆరోగ్యం బాగానే ఉందా? మూర్ఛ లాంటి జబ్బులేమీ లేవు కదా అంటూ పాల గ్లాసు పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి, వెంకటిని భుజాల్ని పట్టుకొని అటూ ఇటూ ఉపేసింది. ఆ ఊపులో వెంకటి వెళ్ళి టేబుల్ మీద పాల గ్లాసు మీద పడ్డాడు. ఒక్క క్షణం గుండె ఝల్లు మంది. విచిత్రంగా కదిలిన పాల గ్లాసు తన తెల్ల చొక్కా పాడు చేయడమే ధ్యేయమన్నట్లు ఎగిరి మరీ భుజంమీద పడింది.
గలగలా నవ్వుతున్న వెంకటలక్ష్మి, చూశారా మొదటి రోజే నేను మీకు పాలభిషేకం చేసేశాను అంటూ ముచ్చట పడింది. వెంకటికి పెళ్ళాం తెలివికి సమయస్పూర్తికి నవ్వాలో, బంగారంలాంటి తెల్ల చొక్కా పాడైయ్యిందని ఏడవాలో అర్థం కాలేదు. ఛీ.. ఈ జన్మలో ఇంక తెల్ల చొక్కా వేసుకొను గాక వేసుకొను అంటూ తన శపథాన్ని అప్పటికప్పుడే ప్రకటించేశాడు. ఇదేమీ అర్థం కాని వెంకట లక్ష్మి ఏదో అరవం సినిమా చూసినట్లు, బలవంతంగా ఆముదం తాగినట్లు, బస్సు తప్పిపోయిన వాడు ఏడవలేక నవ్వినట్లు ఒక నవ్వు బలవంతంగా మొహంమీదికి తెచ్చుకుంది. అదేంటండీ మన పెళ్లి రిసెప్షన్ కోసం మీకోసం స్పెషల్ గా తెల్ల కోటు, తెల్ల చొక్కా కుట్టించారు మా నాన్న అంది వెంకటలక్ష్మి. తెల్లకోటు, తెల్ల చొక్కా పేరు వినేసరికి వెంకటి మొహం లో సంతోషం మాయమైపోయి, “నాకు తెల్ల చొక్కా యోగమే లేదు. ఇంక తెల్ల కోటు యోగం ఎక్కడినుండి వస్తుంది వెంకటలక్ష్మీ” అంటూ నిస్త్రాణంగా బెడ్ మీద వాలిపోయాడు.
"అంత భయపడకండి. రేపు వాటికి ఏం కాకుండా నేను చూసుకుంటాను" అంది వెంకటలక్ష్మి ధైర్యం చెబుతూ. "అదే నా భయం..." అన్నాడు వెంకటి. ఆ మాటకి వెంకటలక్ష్మి ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది. వెంకటి మాత్రం పైకప్పు వైపు చూస్తూ, "ఓ దేవుడా... నాతో.... నా తెల్ల చొక్కా కోరికతో ఆడుకున్నది చాలు, ఇక నన్ను వదిలేయి!" అని మనసులో ప్రార్థించుకున్నాడు.
