తాతా-మనవడు
తాతా-మనవడు


ఆఫీస్ నుండి అప్పుడే వచ్చిన పద్మజ గది లో ఉన్న తండ్రి దగ్గర కు వెళ్లి "ఏం చేస్తున్నారు నాన్నా!' అంది.
"ఏముంది చేయడానికి, ఏవో పాత కాగితాలు తిరగేస్తున్నాను." అన్నాడు తండ్రి
"హాల్ లో కూర్చుని టివి చూడవచ్చు కదా నాన్నా.
సరే, రండి టీ చేస్తాను. మీ అల్లుడు కూడా వచ్చే
వేళ అయింది" అంటూ వంటింట్లోకి వెళ్ళింది.
'నెనెక్కడ కూర్చో వాలో మీరే చెప్పాలి మరి.'
ఆయన గొణుగుడు వినిపించినా విననట్లు గానే
వెళ్ళి పోయింది పద్మజ.
టీ పె ట్టి తండ్రి కి, భర్తకి ఇచ్చి తను తాగింది. ఇంతలో కొడుకు ట్యూషన్ నుండి రావడం తో వాడికి పాలు బిస్కెట్లు పెట్టి పంపింది. వాడు వెళ్ళి హాల్ లో తండ్రి తో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాడు. వంట చేస్తూండగా గతం కనులముందు కదలాడింది.
తండ్రి స్కూలు మాస్టర్. తనని, అన్నని కష్టపడి చదివించారు. అన్న పెద్ద చదువు కోసం అమెరికా వెళ్ళి అక్కడే స్థిర పడ్డాడు. నాన్న తనకి చదువు పూర్తయ్యాక పెళ్లి చేసారు. తన భర్త శేఖర్, అత్త మామలు చాలామంచి వాళ్ళు. పెళ్ళైన రెండు సంలత్సరాలకి బాబు ఉదయ్ పుట్టాడు. అమ్మే
అన్నీ చేసింది. వాడిని స్కూల్ లో వేశాక తను తిరిగి ఉద్యోగం లో జాయిన్ అయింది.
తర్వాత కొన్నాళ్లు అమ్మ, కొన్నాళ్ళు అత్తగారు తనతో ఉండి సహాయం చేసారు. మామగారు బిజినెస్ చేస్తుంటారు. ఆయన అది వైండప్ చేయాలంటే కొంచెం సమయం పడుతుంది. అందుకే ఇంకా పూర్తిగా వచ్చి తమతో ఉండాలంటే కుదరదు. నాన్న రిటైర్ అయ్యారు.
అందునా ఈమధ్య అమ్మ చనిపోయింది. అన్న వచ్చి నాన్నని తనతో రమ్మని ఎంతో చెప్పాడు.
కానీ ఆయన ఇష్ట పడలేదు. తనే ఇంక తండ్రి ని చూసుకుంటానని అన్నకి ధైర్యం చెప్పి పంపించింది. ఈ మూడు నెలల లో అయిదారు సార్లు తండ్రి ని చూసి వచ్చింది. అప్పుడే శేఖర్ సలహా ఇచ్చారు, ఆయన్ని ఇంటికి తీసుకు రమ్మని. అత్తమామలు అదే మాట చెప్పారు. శేఖర్ని, బాబుని వెంట బెట్టుకుని వెళ్ళి అతి కష్టమ్మీద ఆయన్ని ఒప్పించి తీసుకు వచ్చింది. అయినా ఆయన ఆనందంగా లేరు. ఏం చేస్తే ఆయనకి ఆనందం కలుగుతుందో అర్థం కావడం లేదు.
ఇంతలో బాబు వచ్చి "అమ్మా, ఆకలి" అనడం తో
ఇహం లోకి వచ్చి "అయిపోయింది నాన్నా, అన్నం పెట్టేస్తాను" అని గబగబా అందరికీ వడ్డించి బాబుకి తినిపించింది.
"అమ్మా, రేపటి నుండి ట్యూషన్ లేదు. టీచర్ ఊరెళ్తున్నారు." అన్నాడు
"అరే, ఆ విషయమే మర్చిపోయాను. ఆవిడ ఫోన్ చేసి చెప్పింది. తను అర్జెంటుగా ఊరెళ్తున్నానని
బాబుని పంపవద్దని. ఇప్పుడెలా అండీ." అంది
పద్మజ దిగులుగా.
"ఇప్పుడేమైంది, మామయ్య ఉన్నారుగా. ఏం మామయ్యా, మీ దగ్గర ఉంటాడు. మీరు పార్క్ కి
వెళ్ళినా మీతో వస్తాడు. ఏమంటారు?" అడిగాడు
శేఖర్.
"దానికే ముంది. మీరు వచ్చే వరకు నాతో ఉంటాడు. నాకేమీ ఇబ్బంది లేదు. ఏరా నాన్నా, తాతతో ఉంటావా" మనుమడిని అడిగారు తాతగారు.
"ఓ, ఉంటాను. మరి రోజూ నాకొక కధ చెప్తారా"
అడిగాడు బాబు.
"నువ్వడగడం, నేను చెప్పక పోవడం నా. తప్పకుండా చెప్తాను. మరి నేను చెప్పినట్లు చదువుకుంటావా." తాతగారు కండిషన్ పెట్టారు.
"ఓ, మీ దగ్గరే చదువుకుంటాను." వాడు తలూపాడు.
వారిద్దరి సంభాషణ శేఖర్, పద్మజ ఆనందంగా వింటూ ఉండిపోయారు.
మరునాడు బాబుని స్కూల్ కి రెడీ చేస్తూ తాతగార్ని విసిగించవద్దని, ఆయన చెప్పినట్లు వినమని పదే పదే చెప్పింది పద్మజ.
ఆ సాయంత్రం ఆఫీసు నుండి వచ్చే సరికి హాల్ లో నుండి వాళ్ళిద్దరి నవ్వులు గట్టిగా వినిపిస్తున్నాయి
లోపలికి వెళ్ళగానే బాబు పరుగెత్తుకొని వచ్చి "అమ్మా, నా హోం వర్క్ అయిపోయింది. తాతగారు చాలా బాగా చెప్పారు. నా చేత రీడింగ్ చేయించారు. ఇప్పుడు మేం కార్టూన్ చూస్తున్నాం"
ఆనందంగా చెప్తున్నాడు బాబు.
తండ్రి వైపు చూసి "నాన్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా" అని అడిగింది పద్మజ
"లేదమ్మా, మీలాగే తెలివైనవాడు. చెప్పింది చక్కగా గ్రహిస్తాడు. చెప్పినట్లు చదువుతాడు. నాకు ఏ ఇబ్బందీ లేదు. వాడికి చదువు చెప్పడం కూడా సరదాగానే ఉంది." అన్నారు.
ఇంతలో శేఖర్ కూడా వచ్చే సరికి టీ పెడతానని వెళ్ళింది పద్మజ.
రోజులు సాఫీగా గడుస్తున్నాయి. ఇంతలో టీచర్ తిరిగి వచ్చారని తెలిసింది. కానీ బాబు, తండ్రి ఇద్దరూ మళ్లీ ట్యూషన్ అంటే ఒప్పుకోలేదు.
శేఖర్ కూడా "పోనీ ఆయనకి కాలక్షేపం గా ఉందేమో, ఉండనీ. ఆయన చెప్పలేను అన్నప్పుడు ఆలోచిద్దాం" అన్నాడు.
పద్మజ కి కూడా ఆనందంగా అనిపించింది తండ్రి
మళ్లీ మామూలు గా అవడం. ఇప్పుడు ఆయన మాట్లాడితే విసుక్కోవడం లేదు. అందరితో సరదాగా ఉంటున్నారు. అది చాలు అనిపించింది పద్మజ కి. అదే మాట శేఖర్ తో అంది.
"ఇన్నాళ్లు ఆయనకు సరైన వ్యాపకం లేక అలా ఉన్నారు. ఇప్పుడు చూడు, ఎంత హుషారుగా ఉన్నారో. మన అందరికీ సహాయం చేస్తున్నారు. బాబు కి చదువులోను, నాకు బజారు పని లోను, నీకు కూడా టీ పెట్టి ఇవ్వడం లో సహాయం చేస్తున్నారు." అన్నాడు నవ్వుతూ.
నిజమే, ఒకొక్క సారి తామిద్దరూ వచ్చేసరికి టీ చేసి ఉంచుతారు. బాబు కి పాలు ఇస్తారు.
"ఐతే సరైన వ్యాపకం లేక ఆయన ఇన్నాళ్లు విసిగిపోయారన్నమాట. ఐతే మనం ఆ టీచర్ కి
శెలవు పెట్టినందుకు థాంక్స్ చెప్పుకోవాలేమో"
అని ఇద్దరూ నవ్వుకున్నారు