Parimala Pari

Drama

4  

Parimala Pari

Drama

సమానత్వం అంటే?!

సమానత్వం అంటే?!

3 mins
432


"చూడండి డాడీ, అమ్మ ఎప్పుడూ ఏదొకటి అంటూ ఉంటుంది. ఈ డ్రెస్ బాగోలేదు, ఇలా బయటకి వెళ్లకు, అలా మగవాడి లాగా పెత్తనాలు చేయకు అంటూ..." అంటూ తండ్రి పవన్ కి తన తల్లి మీద పితూరీలు చెప్తుంది పల్లవి.


"రమణీ! అది ఇంకా చిన్నపిల్ల కాదు, అయినా ఇప్పుడు అది ఏమైనా తప్పు చేసిందా? ఎదో ఫ్రెండ్స్ తో సరదాగా అలా టూర్ కి వెళ్తాను అంది అంతే కదా! 


వెళ్ళని, ఇప్పుడు కాకపోతే పెళ్ళిఅయ్యాక వెళ్తారా ఏంటి, అప్పుడు అస్సలు కుదరదు" అన్నాడు పవన్.


అప్పుడు దాని మొగుడే తీసుకువెళ్తాడు లెండి. అయినా మీరిలా అన్నిటికి వెనకేసుకుని వస్తూ ఉంటే దానికి నేను చెప్పేవి తలకి ఏం ఎక్కుతాయి అంటూ తలకొట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది రమణి.


పల్లవి పవన్, రమణి ల ఏకైక సంతానం. అందుకే పవన్ కి కూతురంటే అంత గారాబం. రమణికి కూతురి మీద ప్రేమ ఎక్కువే, కానీ తండ్రి గారాబం ఎక్కడ పాడుచేస్తుందో అన్న భయంతో అది వద్దు, ఇది వద్దు అంటూ ఉంటుంది.


పవన్ మాత్రం కూతురు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవాడు, చేసేవాడు. ఇదిగో ఇప్పుడు ఈ టూర్ కూడా పల్లవి ఇంకా తన ఫ్రెండ్స్ పదిమంది కలిసి అరకులోయ వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు. కూతురు ఇష్టాన్ని కాదనలేకపోయింది తల్లి రమణి.


నలుగురు అబ్బాయిలు ఆరుగురు అమ్మాయిలు మొత్తం కలిసి పది మంది ట్రావెల్ బస్ మాట్లాడుకుని అరకు బయలుదేరారు వైజాగ్ లో దిగి, అక్కడ రిసార్ట్లో రూమ్ తీసుకుని ఉన్నారు.


మర్నాడు ఉదయమే అల్పాహారం కానిచ్చి అరకు బయల్దేరారు. అరకు లోయ అందాలను చూస్తూ మైమర్చిపోయారు. వాటర్ ఫాల్స్ వరకు ట్రెకింగ్ చేసుకుంటూ వెళ్లారు. 


అక్కడ పారే జలపాతాన్ని చూసేసరికి, అందరికీ అందులో స్నానం చేయాలనిపించింది. అమ్మాయిలు ఐదుగురు సెలయేరు కింద తడుస్తూ నుంచున్నారు. ఒక అమ్మాయి మాత్రం గట్టు మీద కూర్చుంది.


అక్కడ తడుస్తున్న అమ్మాయిలను చూసి, వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకడు ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు. అలా ఒక్కొక్కరి ఫోటోలు తన ఫోన్లో తీసుకుని దాచుకున్నాడు. కానీ ఆ విషయం ఎవరికీ తెలీదు.


అలా తిరిగి తిరిగి సాయంత్రానికి రూంకి చేరుకున్నారు, రెండు రోజులు అరకు అందాలు చూసి వెళ్తూ వెళ్తూ సింహాచలం, అన్నవరం ఆలయాలను కూడా దర్శించుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు.


రెండు రోజుల తర్వాత పల్లవి ఫ్రెండ్ రాగిణీ కాలేజీ క్యాంపస్ లో ఏడుస్తూ కనబడింది. ఏమైంది అని అడిగింది పల్లవి. అప్పుడు ఏడుస్తూ జరిగింది ఇలా చెప్పింది.


మనం అరకు వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ లో తడిసామ్ కదా, అప్పుడు మన ఫొటోస్ తీసాడు సాకేత్. వాటిలో నా ఫొటోస్ ని ఎడిట్ చేసి పిచ్చి పిచ్చిగా తయారుచేసాడు. ఇప్పుడు ఆ ఫొటోస్ చూపించి నన్ను బెదిరిస్తున్నాడు. తన దగ్గరకు రాకపోతే ఈ ఫొటోస్ యూట్యూబ్ లో పెడతాను అని అంటున్నాడు. 


ఫ్రెండే కదా అని క్లోజ్గా ఉంటే తను ఇంకేదో ఊహించుకుని ఇప్పుడు నన్ను టార్చర్ చేస్తున్నాడు. తన దగ్గరనుంచి ఆ ఫొటోస్ ఎలా తీసుకోవాలో తెలియటం లేదు. అని ఏడుస్తుంది.


పల్లవి రాగిణీ ని ఊరుకోపెట్టి, బాగా ఆలోచించి ఏదొకటి చేద్దాం అని చెప్తుంది. నెమ్మదిగా సాకేత్ ఫోన్ అతనికి తెలియకుండా తీసుకుని అందులో ఉన్న వాళ్ళ ఫొటోస్ అన్నీ డిలీట్ చేసేసింది. అంతే కాకుండా వాళ్ళకామన్ ఫ్రెండ్ అయిన వినోద్ కి విషయం చెప్పి తన కంప్యూటర్ లో నుంచి కూడా వాళ్ళ ఫొటోస్ రెమూవ్ చేయిస్తుంది.


తర్వాత విషయం గమనించిన సాకేత్ ఫ్రెండ్స్ ని అడగలేక పోతాడు, కారణం ఎక్కడ తన పరువు పోతుందో అని లేదా కాలేజ్ లో తెలిస్తే తన చదువు పోతుంది అని భయపడతాడు.


ఇంటికి వచ్చిన పల్లవి డల్ గా ఉంటుంది. అది చూసిన తల్లి ఏమైంది అని అడుగుతుంది. జరిగింది అంత రమణి కి చెవుతుంది పల్లవి. 


రమణి బాగా ఆలోచించి ఇదే మంచి సమయం అనుకుని పల్లవికి తన మనసులో మాట చెప్తుంది.


"పల్లవి, చూసావా అమ్మాయిలు అబ్బాయిలకి ఏమాత్రం తీసిపోము అని వాళ్ళతో సమానంగా పోటీ పడుతూ, కొన్ని చేయకూడని పనులు కూడా చేస్తున్నారు. లేట్నైట్ పార్టీలు, పబ్లు తిరగటం, డ్రింక్ చేయటం అలా చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు.


స్వేచ్ఛ సమానత్వం అంటే నచ్చిన బట్టలు వేసుకోవడం, ఇష్టం వచ్చినట్టు ఉండటం మాత్రమే కాదు. సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదిరించి పోరాడగలగటం. గమ్యాన్ని చేరే మార్గంలో వచ్చే అవరోధాలను అధిరోహించటం.  


కష్టమైన పనిని కూడా మేము చేయగలం అని చూపించటం. అందుకే ఆడపిల్లవి అయినా కూడా నీకు నచ్చిన చదువు చదివిస్తున్నాం. నీ కాళ్ళమీద నువ్వు నిలబడాలి. అవసరం అయినప్పుడు ఇలా ధైర్యంగా ఉండాలి. 


నువ్వు చేసింది చాలా మంచిపని పల్లవి. ఇలాగే నీ భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకోవాలి. దాంట్లో చూపించాలి మన సమానత్వం అంటే" అని పల్లవి బ్రెయిన్ వాష్ చేసింది. 


తల్లి చెప్పిన మాటలు నిజమే అని తెలుసుకున్న పల్లవి అప్పటి నుంచి హద్దుల్లో ఉండటం ఎలాగో తెలుసుకుంది. కాలేజ్ ఫస్ట్ నిలిచి మంచి ఉద్యోగం సంపాదించింది. 
Rate this content
Log in

Similar telugu story from Drama